Thursday, April 25, 2024

జాతీయవాద ప్రవక్త…మానవతా ప్రేమికుడు

‘అదిగో చందమామ!’ అంటూ దృష్టిని నింగికి చేర్చే వరకే చూపుడువేలి పాత్ర. కళ్లు ఆకాశపు అనంతత్త్వాన్ని గమనించాక తర్జని ఇక అనామిక. ఎక్కడైనా అంధకారంలో మగ్గుతున్న వారికి స్వేచ్ఛ అనే చంద్రోదయాన్ని దర్శింపచేసే తర్జని వంటి ఒక తరం ఉన్నట్టే, భారత స్వాతంత్య్ర సమరంలోనూ ఉంది. నిజమే, కొన్ని శతాబ్దాలుగా స్వీయ విస్మృతిలో ఉన్న భారత సమూహాన్ని తాము ఎవరం? ఈ దుస్థితి మనకెందుకు? కోల్పోయినది సాధించవద్దా? అన్న ప్రశ్నలు వేసుకుని స్వేచ్ఛా పోరాటం వైపు నడిపించిన తాత్త్వికత ఆ తరం అందించినదే. ఆ తరపు ధ్రువతార అరవింద్‌ ఘోష్‌. జాతిని విస్మృతి నుంచి బయటకు తెచ్చిన వీరు కూడా విస్మృతికి గురికావడం మరొక చారిత్రక వైచిత్రి.

అరవిందుని జీవితం (15 ఆగస్ట్‌ 1872 – 5 డిసెంబర్‌ 1950) చిత్రమైన మలుపులు తిరిగింది. శిక్షాభూమి ఇంగ్లండ్‌. కర్మభూమి బరోడా. క్రాంతిభూమి కలకత్తా. తపోభూమి పుదుచ్చేరి. ఉద్యమ జీవితం సాయుధ సమరాన్ని సమర్ధిస్తూ  ఆరంభమైంది. దాదాపు సన్యాసాశ్రమాన్ని చివరి మజిలీ చేసుకుంది. దివ్యత్వం కలిగిన దేశమాతను (భవానీ భారతి) సృషించుకున్న అరవిందుల ఆలోచన, అధిభౌతిక మానవ సమూహం కోసమూ ఆరాటపడిరది. ఆయన కవిత్వ భాషలోనే చెప్పాలంటే, విప్లవకవి అరవిందుని కల, పసిడి నది పాట చేరుకునే తీరం.

పుదుచ్ఛేరిలో అరవిందుడి ఆశ్రమం

ఇంగ్లండ్ లో చదువు

అరవిందుడి అక్షరాభ్యాసం ఆంగ్ల వర్ణమాలతో జరిగిందని చెప్పాలి. తండ్రి కృష్ణధన్‌ ఘోష్‌ బ్రహ్మ సమాజికుడు. బ్రిటిష్‌ ఇండియాలో అసిస్టెంట్‌ సర్జన్‌. ఆయన చదువవంతా ఇంగ్లండ్‌లోనే. తన ముగ్గురు కొడుకులను చదువుల కోసం  అక్కడికే పంపించారు. మొదట బెంగాలీ భాష, భారతీయ సంస్కృతి జాడ కూడా పడని లోరెటో కాన్వెంట్‌ పాఠశాలలో (డార్జిలింగ్‌) కొడుకులను చేర్చారు. అక్కడ నుంచి ఇంగ్లండ్‌లోని సెయింట్‌ పాల్స్‌ పాఠశాలకీ (1879), ఆపై కేంబ్రిడ్జ్‌ కింగ్స్‌ కళాశాలకు పంపించారాయన. మాంచెస్టర్‌లో రెవరెండ్‌ డబ్ల్యు హెచ్‌ డ్వ్రెట్‌కు తనయుల బాధ్యతను అప్పగించారు. ఘోష్‌ సోదరులు అరవిందుడు, బారీన్‌, వినయ్‌భూషణ్‌లకు మొదట లాటిన్‌ నేర్పి, అక్కడే గ్రామర్‌ స్కూల్‌లో చేర్చాడు డ్వ్రెట్‌. ఆంగ్లంతో పాటు ఫ్రెంచ్‌, లాటిన్‌, గ్రీక్‌, ఇటాలియన్‌, జర్మన్‌, స్పానిష్‌ భాషలు అక్కడే నేర్చారు అరవిందులు. తండ్రి కోరిక మేరకు ఐసీఎస్‌ పరీక్షకు వెళ్లారు. రాత పరీక్షకు 250 హాజరుకాగా, అరవిందుడిది 11వ స్థానం. కానీ గుర్రపు స్వారీ పరీక్షలో విఫలమయ్యారు. ఐసీఎస్‌ అంటే బ్రిటిష్‌ ఇండియాలో ఆంగ్లేయుల కొలువు. ఆ ఐచ్ఛిక వైఫల్యం అది ఇష్టం లేకే. పద్నాలుగేళ్ల తరువాత 1893లో బరోడా మహారాజు దగ్గర పనిచేయడానికి భారతగడ్డ మీద అడుగు పెట్టారు అరవిందుడు. ఇదొక అనూహ్యమైన మలుపు. ఆ తండ్రి తలంపులన్నింటినీ తలకిందులు చేసిన మలుపు. కానీ అది చూడడానికి ఆయన జీవించిలేరు. అరవిందులు ప్రయాణిస్తున్న నౌక పోర్చుగల్‌ తీరంలో మునిగిపోయిందని ఆ నౌకాయాన సంస్థ బొంబాయి ఏజెంట్‌ కృష్ణధన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చాడు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న ఆ డాక్టర్‌ ఈ వార్త తట్టుకోలేక కన్ను మూశారు. అప్పుడే అమ్మ స్వర్ణలత కొంత భారతీయ తత్త్వం గురించి చెప్పింది. తండ్రి ఎక్కించదలిచిన పాశ్చాత్య సంస్కృతి కంటే ఈ ప్రాచ్య చింతనే ఆయన మీద గాఢంగా, వేగంగా పడిరది.

ఎగసిపడిన జాతీయజ్వాల

బరోడాలో అడుగు పెట్టడంతోనే అరవిందునిలోని జాతీయతా జ్వాల ఒక్కసారి ఎగసిపడిరది. జాతీయవాదం పిలుపులోని ఆర్ద్రత,గాఢత ఎలా ఉంటాయో ఆయన అప్పటికే ఇంగ్లండ్‌లో అనుభవించారు. ఐర్లండ్‌, ఇటాలియన్‌ జాతీయవాదులతో పరిచయాల ఫలితమది.ఐర్లండ్‌లో చాల్స్‌ పార్నెల్‌,ఈమెన్‌ డివెలారా నడిపిన సీన్‌`ఫీన్‌ (స్వదేశీ) ఉద్యమం అరవిందులను నాడే కదిలించింది. అసలు స్వదేశీ, విదేశీ పాలన బహిష్కరణే దేశానికి శాశ్వత రక్షలని భావించారాయన. నాటి చాలామంది భారతీయుల మాదిరే అరవిందులు కూడా ఇటలీ ఏకీకరణ కాంక్షతో, అందుకు తపించిన మేజినీ, గారిబాల్డ్‌ల ఉద్యమంతో తాదాత్మ్యం పొందారు. అందరికీ తెలిసి భారతీయ విద్యార్థుల సంఘం కేంబ్రిడ్జ్‌ మజ్లిస్‌లో  సభ్యుడు. రహస్య సంస్థ ‘ది లోటస్‌ అండ్‌ డాగర్‌’లోనూ పనిచేశారు. ‘ఆవలించిన వేయి గాయాలు’తో తన శరీరం బాధపడుతున్న భావన దీనితోనే కాబోలు. ఇంగ్లండ్‌లో నేర్చిన ఆరుభాషలు మారిన మనసుతో సంఘర్షించాయి. బరోడాలోనే సంస్కృతం, బెంగాలీ, గుజరాతీ భాషలు నేర్చుకున్నారు. భయంతో కొట్టుకుంటున్న ఈ మూగపుడమి గుండె చప్పుడు అప్పుడే వినిపించింది.

బరోడాలో మొదట రెవెన్యూ విభాగంలో పనిచేసినా, తరువాత ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌ బోధకునిగా మహారాజా కళాశాలకు బదలీ అయ్యారు. సంప్రదాయ బోధనా రీతులు పాటించలేదు. 1901లో మృణాళినిదేవితో వివాహం అయింది. ఇన్‌ఫ్లుయెంజాతో 1918లో ఆమె చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

మనకు శత్రువు ఎక్కడో లేడు, మనలోని భయం, స్వార్ధం వంటివే మన  శత్రువులు అంటారు అరవిందులు. బొంబాయి నుంచి వెలువడే ఆంగ్లో-మరాఠా పత్రిక ‘ఇందుప్రకాశ్‌’ ఆయనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇంగ్లండ్‌లో తన సహాధ్యాయి కేజీ దేశ్‌పాండే నడుపుతున్న పత్రిక ఇది. ‘గతం కోసం కొత్తదీపాలు’ శీర్షికతో ఇందులోనే అరవిందులు వ్యాసాలు రాశారు. ఆంగ్ల ప్రభుత్వాన్నే కాదు, భారత జాతీయ కాంగ్రెస్‌ మీద కూడా నిప్పులు కురిపించేవారాయన. పత్రిక నిషేధానికి గురి అవుతుందేమోనని సంపాదకుడు భయపడి నిలిపివేశాడు. బిపిన్‌చంద్రపాల్‌ ‘బందేమాతరం’ పత్రికను అరవిందులే నిర్వహించారు. ఇది రహస్యం. అందుకే ఒకసారి అరెస్టు చేసినా ఆధారాల దొరక్క వదిలిపెట్టవలసి వచ్చింది.

 

పుదుచ్ఛేరి ఆశ్రమంలో అరవిందుని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

స్వామి వివేకానందుడి స్వరం

1902 నుంచి అరవిందులు భారత జాతీయ కాంగ్రెస్‌ సభలకు హాజరయ్యారు.  బెంగాల్‌ విభజన తరువాత ఆయన తిరిగి బెంగాల్‌లో అడుగుపెట్టారు. 1907లో జాతీయ కాంగ్రెస్‌ రెండుగా చీలినప్పుడు అతి జాతీయవాదుల పక్షంలో చేరారు. దీనికి వేదికైన సూరత్‌ కాంగ్రెస్‌ సభలకు అధ్యక్షుడు కూడా ఆయనే. ఆపై బాలగంగాధర తిలక్‌ అభిమానిగా మారిపోయారు. వందేమాతరం ఉద్యమ వేళ మళ్లీ కలకత్తాను శాశ్వత నివాసం చేసుకోవాలని వెళ్లారాయన. ఆ సమయంలోనే తమ్ముడు బారీన్‌ తీవ్ర జాతీయవాదులతో కలసి విప్లవ సంస్థ అనుశీలన్‌ సమితిని నెలకొల్పారు. అందులో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సంపూర్ణ స్వాతంత్య్రమే మన ఆశయం కావాలని ప్రబోధించారు. ఇక్కడే జీవితం మరొక మలుపు తిరిగింది.

అనుశీలన్‌ సమితి ఆధ్వర్యంలో జరిగిన 1908 నాటి అలీపూర్‌ బాంబ్‌ కేసులో అరవిందుడిని అరెస్టు చేశారు. ఆ కుట్ర ఖుదీరాం బోస్‌, ప్రఫుల్ల చాకి, బారీన్‌ ఘోష్‌లది. 40 మంది అరెస్టు కాగా, వారిలో అరవిందుడు ఒకరు.  నిజానికి అనుశీలన్‌ సమితి సభ్యులు భాగా జతీన్‌, జతీన్‌ ముఖర్జీ, సురేంద్రనాథ్‌ టాగోర్‌లతో అరవిందుడికి మంచి బంధమే ఏర్పడిరది. ‘ఈనాడు దేశంలోకెల్లా అత్యంత ప్రమాదకారి అయిన వ్యక్తి’ అని అరవిందుల గురించి నాటి గవర్నర్‌ జనరల్‌ మింటో ఇంగ్లండ్‌లోని భారత కార్యదర్శి మోర్లేకు లేఖ రాశాడు. ఆ కేసును చిత్తరంజన్‌దాస్‌ వాదించడంలో 1909లో అరవిందులు అలీపూర్‌ కారాగారం నుంచి విడుదలయ్యారు. ఆ జైలులోనే ఆయన అతివాదం నుంచి ఆధ్యాత్మికత వైపు మరలారు. నిజానికి ఇవేమీ జరగక ముందే 1907లో తమ్ముడు బారీన్‌ పరిచయం చేసిన మహారాష్ట్ర యోగి విష్ణుభాస్కర్‌ లేలే బోధనలతోనే ఆయనలో మార్పు మొదలయిందని చెబుతారు. నీకు బయటి గురువు అక్కరలేదు. నీలోనే గురువును అన్వేషించుకోమని లేలే చెప్పారట.  యోగసాధనలో ఉన్నప్పుడే ఆయనకు ఒక గొంతు వినిపించేదని, అది స్వామి వివేకానందులదని అరవిందులు నమ్మారు.

కలకత్తాలో స్వాతంత్ర్య సమర యోధుడిగా అరవిందో

పుదుచ్ఛేరిలో అరవిందాశ్రమం

ఆధ్యాత్మికపథంలోకి మళ్లినా ఏదో ఒక కేసు పెట్టి ద్వీపాంతరం పంపించాలన్న కుట్ర సాగింది. ఇది తెలిసిన సిస్టర్‌ నివేదిత రహస్య జీవితంలోకి వెళ్లిపొమ్మని వర్తమానం పంపారు. దీనితో  ఫిబ్రవరి 10, 1910న మొదట ఫ్రెంచ్‌ అధీనంలో ఉన్న చంద్రనగోర్‌కు వెళ్లారాయన. అక్కడా రక్షణ లేదనిపించి ఏప్రిల్‌ 2న కలకత్తా రేవు నుంచి రహస్యంగా నౌక ఎక్కి 4వ తేదీన పుదుచ్చేరి చేరుకున్నారు. ఆపై కొద్దికాలం విప్లవ సంస్థలతో మంతనాలు జరిపారు. 1902 నుంచి 1910 వరకు మొత్తం ఎనిమిదేళ్లు ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. తరువాత  యోగ సాధనకు పరిమితమయ్యారు. తిలక్‌, లాలా లాజ్‌పతిరాయ్‌, చిత్తరంజన్‌ వంటి వారంతా కోరినా బ్రిటిష్‌ ఇండియాకు రాలేదు. గాంధీ మార్గంలోకి పోలేదు. 1926లో పుదుచ్చేరి అరవిందాశ్రమం ఆవిర్భవించింది.

అరవిందుడిలోని యోగి, రచయిత పుదుచ్చేరిలో విశ్వరూపమెత్తారు.  యోగా చేయడానికి ముందు నెలకు రెండు వందల వ్యాక్యాలు రాసేవారు. అలాంటిది అరగంటలో రెండువందల వాక్యాలు రాసే శక్తి యోగాతో ఆయన సాధించారు. ఆ అద్భుత అక్షర రాశికి 1914లో ప్రారంభించిన ‘ఆర్య’ పత్రికే వేదిక. ‘ది సీక్రెట్‌ ఆఫ్‌ వేదా’, ‘ఎస్సేస్‌ ఆన్‌ గీత’, ‘ది సింథసిస్‌ ఆఫ్‌ యోగ’ వంటి అసమాన రచనలు అందులోనే వెలువడినాయి. వ్యాసుడు, వాల్మీకి రచనలకు భాష్యాలూ, కాళిదాసు రచనల అనువాదాలూ వెలయించారు. ఎనిమిది ఉపనిషత్తులు, గీత అనువాదం వంటివాటితో, షేక్‌స్పియర్‌, గెథేల సాహిత్యం మీద వ్యాఖ్యానం రాసి విశ్వసాహిత్యానికి గొప్ప సేవ చేశారు. వీటికి మించి ఖ్యాతిగాంచినవి పుస్తకాలు` ‘ది లైఫ్‌ డివైన్‌’, ‘సావిత్రి’.  మహాభారతంలోని సావిత్రి, సత్యవంతుల కథకు గొప్ప పునర్‌ నిర్మాణం ‘సావిత్రి’. 23,814 పంక్తుల మహాకావ్యం. అరవిందులు తన తాత్త్వికతకు జన్మస్థానం ఉపనిషత్తులు, భగవద్గీతేనని చెప్పుకున్నారు. ‘సావిత్రి’ ఆధునిక విశ్వసాహిత్యంలో అరవిందుని మహోన్నత వచన కవిగా నిలిపింది. ఎప్పటికైనా మానవజాతి మనోదశ (మెంటల్‌ స్టేట్‌)ను దాటి, అతిమనో (సూపర్‌ మెంటల్‌) దశను అందుకుంటుంది. అదే దివ్య చైతన్యదశ. ఆ దశను చేరుకున్న మానవుడు అధిమానవుడవుతాడు. క్రమంగా ఒక అధిమానవ జాతి అవతరించినా ఆశ్చర్యం లేదు. అయితే ఆ పరిణామం అనివార్యమే అయినా దానిని త్వరితం చేయడానికి కృషి చేయాలి. సాధన చేయాలి. ఇలాంటి ఒక వినూత్న పరిణామవాదాన్నీ, దానిని పురస్కరించుకుని ఒక విలక్షణ తత్త్వచింతననూ ప్రవచించిన మహనీయుడు అరవిందుడు. 20వ శతాబ్దపు గొప్ప తాత్త్వికులలో ఒకరు. దీనికే ఇంటిగ్రల్‌ యోగా అని పేరు. ఆయన రచనలు 36 సంపుటాలలో వెలువరించారు.

బరోడాలో అధ్యాపకుడిగా ఉన్న దశలో అరబిందో

బ్రిటిష్ విద్య జాతి వ్యతిరేకం

బ్రిటిష్‌ ఇండియా విద్య మనసును తాకలేనిదే కాకుండా, జాతి వ్యతిరేకమైనదని అరవిందులు చెప్పారు. మనసు ఆధారంగా, భారతీయతను ప్రతిబింబించే విద్య కావాలని ఆకాంక్షించారు. తన వారపత్రిక ‘కర్మయోగిన్‌’లో వీటి గురించి రాసేవారు. వాస్తవికమైన విద్య అంటే  స్వేచ్ఛ, సృజనాత్మక వాతావరణంలో చిన్నారులు ఉండాలని అన్నారు. అలాగే విద్య నైతిక విలువలు నేర్పాలి. ఇదే విద్యార్థికి అతడి జీవితంతో, ఆత్మతో, వీటితో పాటు దేశంతో సరైన బంధాన్ని ఏర్పరుస్తుందని చెప్పారు.  మతం అంటే తన కోసం జీవించడం ఒక్కటే కాదు, దేవుని కోసం, మానవత్వం కోసం, దేశం కోసం, ఇతరుల కోసం జీవించడం కూడా అని విశ్వసించారు. బోధన పేరుతో విద్యార్థి మీద ఏదీ రుద్దడం సరికాదని చెప్పారు.

మాతృభూమి సంకెళ్లు తెంచడానికి ముందు హృదయాలకు ఉన్న సంకెళ్లు తొలగించుకోవాలని అరవిందలు అన్నారు. ఒక సమూహం ఏకత్వం సాధించే క్రమంలో అంతస్సూత్రంగా పనిచేసేదే జాతీయవాదమని, అది ఆ మట్టి నుంచి జనించాలని చెప్పారు. అంటే పాశ్చాత్యుల జాతీయవాదం, అరవిందుల జాతీయవాదం వేర్వేరు. అరవిందులు ‘దేశభక్త కవి, జాతీయవాద ప్రవక్త, మానవతా ప్రేమికుడు’ అంటారు చిత్తరంజన్‌దాస్‌. భారతీయ నాగరికత, సంస్కృతులకు విముక్తినిచ్చినవాడని రవీంద్రనాథ్‌ టాగోర్‌ శ్లాఘించారు.

(ఆగస్ట్‌ 15, అరవింద్‌ ఘోష్‌ 150వ జయంతి సందర్భంగా)

Dr. Narayana Rao Goparaju
Dr. Narayana Rao Goparaju
డాక్టర్ గోపరాజు నారాయణరావు వరిష్ఠ పాత్రికేయులు. బహుగ్రంధ రచయిత. వర్తమాన పరిణామాలపైన వ్యాసాలు కొన్ని దశాబ్దాలుగా రాస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర రచించారు. ప్రస్తుతం ‘జాగృతి’ పత్రిక సంపాదకులుగా పని చేస్తున్నారు.

Related Articles

1 COMMENT

  1. That photo is not Asram it is meditation hall in Auroville of international community. The artical presented is good and poetic too.
    Po

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles