Saturday, May 18, 2024

ద్రావిడ పార్టీలకే మళ్ళీ అధికారమా?

  • కమల్ రాజకీయ వ్యూహాం ఫలించేనా?
  • రజనీ వెనుకంజ తో  ద్రావిడ పార్టీల సంబరం
  • తమిళ నాడులో రసవత్తర రాజకీయం

చెన్నై సముద్ర తీరం తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. మరో ఐదు నెలల్లో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ద్రవిడ పార్టీలనూ, సినిమా హీరోలు పెట్టే పార్టీలనూ తమిళ ప్రజలు ఆసక్తి గా గమనిస్తున్నారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి లు కూడా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. జయలలిత వదిలి వెళ్ళిన వారసత్వ పోరు , కరుణానిధి వారసుల పోరు, సినీ నటుడు విజయకాంత్, యువ హీరో విజయ్, ఇలా  చిన్నాచితకా సినిమా నటులు కూడా పోటీ చేయనున్న తమిళ రంగంలో, కమల్ పార్టీ నేనున్నానని రంగ ప్రవేశం చేసింది. కమల్‌హాసన్‌ నేతృత్వంలోని “మక్కల్‌ నీది మయ్యమ్‌కు” ఇప్పటికే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన అత్యంత సన్నిహితులు బిజెపి తీర్థం పుచ్చుకోవడం, విజయ్ తన తండ్రి పెట్టిన పార్టీ తో తనకు సంబంధం లేదనడం… ఇలా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో జరుగుతున్న తమిళ రాజకీయాల్లో రజనీ ఉప్పెన ఆగడం తో ముఖ్యంగా ద్రవిడ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.

కమల్ హాసన్ ప్రాబల్యం పరిమితం

కమల్ హాసన్ దక్షిణాది సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు. పలు భాషలు నేర్చినవాడు. అత్యుత్తమ నటుడు 21 ఫిబ్రవరి 2018 లో మధురై లో  పార్టీ స్థాపించిన కమల్ 2019 లో 37 లోక్ సభ సీట్లలో పోటీ చేసి ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. కమల్ పార్టీ మొత్తం 3.72 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. ఎన్నో అవార్డులు  పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు తీసుకున్న కమల్ తాను నిర్మించిన పది సినిమాల వల్ల పెద్ద వివాదాలు కొని తెచ్చుకున్నాడు. ఈయన  మొదటి భార్య వాణి గణపతి, రెండో భార్య సారిక, విడిపోగా గౌతమి అనే సినీ నటితో చాలా కాలం సహజీవనం చేశారు. తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్. తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కమల్ హసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.

కమల్ –ఒవైసీ పొత్తు

కమల్ హాసన్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చలు జరిపారు. ఆ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో రజిని అభిమానులు కూడా తనకు ఓటు వేస్తారని కమల్ భావిస్తున్నారు. రంగంలో ఉన్న నాయకులలో తనకున్నంత జనాకర్షణ శక్తి మరెవ్వరికీ లేదని ఆయన అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల పలితాలు వెల్లడైన తర్వాత కానీ తెలియదు.

ఇది చదవండి: తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్, అసదుద్దీన్ ఒవైసీ పొత్తు?

ప్రాంతీయ పార్టీలదే హవా

2005లో కమల్ హసన్, రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది. ఇంతటి ఘన చరిత్ర గల నటుడు రజనీ కాంత్ పార్టీ కార్యరూపం  దాల్చక పోవడం వల్ల అందరూ అభిమానుల లాగానే తాను నిరాశకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఎదో పార్టీతో పొత్తు పెట్టుకునే స్థితిలో కమల్ చొరవ చూపకుంటే కనీసం ఆయన పార్టీకి ఒక్క సీట్ కూడా దక్కదని విమర్శకుల అభిప్రాయం!! ఈ దశలో తమిళ రాజకీయాలు సినీ దిగ్గజాల పోరులో కమల్ ఏకాకి అయ్యాడు. 1967 నుండి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని వహిస్తున్నాయి.

ద్రవిడనాడు ఉద్యమం

1916లో ఏర్పడిన దక్షిణ భారత సంక్షేమ సంఘం క్రమంగా ‘జస్టిస్ పార్టీ’ గా అవతరించింది. 1944లో ఇ.వి. రామస్వామి నాయకర్ నాయకత్వంలో ఇది ‘ద్రవిడకజగం’ పార్టీ అయ్యింది. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్ర ‘ద్రవిడనాడు’ సాధన వారి లక్ష్యం. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్ ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది.

ఇది చదవండి: తమిళ రాజకీయాలను రసమయం చేస్తున్న సినీప్రముఖులు

హిందీ వ్యతిరేక ఉద్యమం

అన్నాదురై నాయకత్వంలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (డి.ఎం.కె, DMK) పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.ఎం.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు.

ఎంజీఆర్ నుంచి జయలలిత దాకా

కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( ఎమ్.జి.ఆర్, MGR) 1972లో పార్టీనుండి విడిపోయి ‘అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం’ (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్. జి. ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని వర్గం నిలబడలేకపోయింది. జయలలిత నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.

ఇది చదవండి: రజినీకాంత్ రాజకీయ వైరాగ్యం మతలబు ఏమిటి?

ద్రవిడ పార్టీల ఆధిక్యం

మొత్తంమీద 1967 నుండి డి.ఎమ్.కె, ఎ.ఐ.డి.ఎమ్.కె. ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది. అయినా, తమిళనాడులో కాంగ్రెస్, బి.జె.పి, కమ్యూనిస్టులు వంటి జాతీయ పార్టీలు, పి.ఎమ్.కె., ఎమ్.డి.ఎమ్.కె వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది.

రజినీలేని రాజకీయం

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలలో రజినీకాంత్ పెట్టబోయే పార్టీ పోటీ చేస్తుందనీ, కరుణానిధి, జయలలిత మరణం కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేస్తాడనీ పరిశీలకులు ఊహించారు. కమల్ హాసన్ మంచి నాయకుడే కానీ ఆయనకు క్లాస్ ఫాలొయింగ్ ఉంది కానీ మాస్ ఫాలోయింగ్ లేదు. రజినీకి మాస్ ఫాలోయింగ్ ఉన్నది. రజినీకాంత్ అస్త్రసన్యాసం చేయడంతో డిఎంకె నాయకుడు స్టాలిన్ కు అవకాశాలు పెరిగాయి. బీజేపీ, ఏఐఏడిఎంకె పొత్తు పెట్టుకొని మెజారిటీ స్థానాలు సాధించగలిగితే బీజేపీకి దక్షిణాదిలో రెండో రాష్ట్రం కైవసం అవుతుంది. బీజేపీ నాయకురాలు ఖుష్బూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణన పొందినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ప్రచారానికి ఖుష్బూ నాయకత్వం వహిస్తారని అంటున్నారు. ఆమెను కాంగ్రెస్ లో కూడా ఎదగనీయలేదనే ఫిర్యాదు ఉంది. బీజేపీలో ఎంత అవకాశం ఇస్తారో చూడాలి.

ఇది చదవండి:రజనీ నిర్ణయంతో ఆనందంలో తమిళ పార్టీలు

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles