Wednesday, April 24, 2024

తమిళ రాజకీయాలను రసమయం చేస్తున్న సినీప్రముఖులు

దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తోంది. అక్కడ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. పార్టీ స్థాపించి, తమిళ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేస్తానని ‘తలైవర్’ రజినీకాంత్ కొన్ని రోజుల క్రితమే సుస్పష్టమైన  ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. తాజాగా, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్  ఒవైసీ తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. త్వరలో అక్కడ  జరుగబోయే ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్థులను దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హసన్ తో కలిసి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజినీ స్థాపించబోయే పార్టీ పేరు, గుర్తు ఎలా ఉండబోతుందో అనే ఊహాగానానాలూ ఎప్పుడో  మొదలయ్యాయి. పార్టీ పేరు, గుర్తు ఇవేనంటూ తాజాగా  వస్తున్న వార్తలు మరింత వేడి పుట్టిస్తున్నాయి.పార్టీ పేరు “మక్కల్ సేవై కట్చి” గానూ, పార్టీ గుర్తు “ఆటో” గానూ ఎన్నికల సంఘంలో నమోదైనట్లు, వాటికి ఆమోదం లభించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

అధికార ప్రకటనకోసం నిరీక్షణ

ఈ దిశగా, రజినీకాంత్ వైపు నుండి అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి ప్రకటన రాలేదు. మక్కల్ సేవై కట్చి అంటే ప్రజా సేవా పార్టీ అని అర్థం చెప్పుకోవాలి. రజనీకాంత్ పేరుతోనే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్లినట్లు తెలుస్తోంది. తొలి ప్రాధాన్యంగా “హస్తం” గుర్తు, రెండవ ప్రాధాన్యంగా “ఆటోరిక్షా” గుర్తును ఎంపిక చేయాలని     ఈసిని కోరినట్లు సమాచారం. అదే విధంగా, పార్టీ పేరు  “మక్కల్ సేవై కట్చి”ని కోరినట్లుగానూ ఉంది. హస్తం ముద్ర కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్న నేపథ్యంలో, రెండవ ప్రాధామ్యమైన  “ఆటో”ను ఎన్నికల సంఘం కేటాయించింది. గతంలో ” అనైతిందియా మక్కల్ శక్తి కజగమ్” గా పార్టీ పేరు నమోదైంది. 2019మార్చిలో ఈసి విడుదల చేసిన కొత్త రాజకీయ పార్టీల జాబితాలో కూడా ఈ పేరు ఉంది. తాజాగా పార్టీ పేరును “మక్కల్ సేవై కట్చి”గా దరఖాస్తుదారుడు మార్చుకున్నాడు.

రజినీని సూపర్ స్టార్ గా మార్చిన సినిమా

రజినీకాంత్ ను తమిళనాట సూపర్ స్టార్ గా మార్చిన సినిమా “భాషా”. అందులో రజినీ పోషించిన పాత్ర ఆటోడ్రైవర్. ఇది బ్లాక్ బస్టర్  మూవీ. కేవలం తమిళనాడులోనే కాక రజినీకాంత్ కు భారతదేశ సినిమాలోకంలోనే పెద్ద పేరు తెచ్చి పెట్టింది. భాషా సినిమా విజయోత్సవ సభలోనే మొట్టమొదటిసారిగా  రజనీకాంత్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ కాలంలో రజినీకాంత్ తెచ్చుకున్న క్రేజ్ తో అతని మాటలు తమిళ ఓటర్లపై పెద్ద ప్రభావం చూపించి, జయలలితను గద్దె దించి, కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కించాయి. రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ కూడా అప్పుడే వచ్చింది. వస్తాడని  అనుకున్నా, ఎందుకో అది జరుగలేదు. అలా, రాజకీయాల్లోకి రాకుండానే రెండు దశాబ్దాలపైన కాలం గడిచిపోయింది.

దిగ్గజాల నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యం

కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేని, నేటి సమయంలో రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతాడా? లేడా? భావికాలంలో తేలిపోతుంది. పార్టీ పేరు, గుర్తుపై రజనీకాంత్ వర్గాల  వైపు నుండి అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ, ఈ గందరగోళం ఇలాగే సాగుతుంది. ఇది ఇలా ఉండగా, కమల్ హసన్ పార్టీతో కలిసి సాగుతానంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా చేసిన ప్రకటన కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కమల్ పార్టీ పేరు “మక్కల్ నీది మయ్యమ్”. కమల్ హసన్ పూర్తిగా నాస్తికుడు. మొదటి నుండీ బిజెపిని, మోదీ విధానాలను వ్యతిరేకిస్తూనే వున్నాడు. తాజాగా బిజెపి ప్రభుత్వం చేపట్టిన పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంపై కూడా వ్యతిరేకంగా మాట్లాడారు.

రజినిది దేశభక్తి, ఆధ్యాత్మిక చింతన

రజినీకాంత్ దీనికి పూర్తిగా విరుద్ధం. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. ఆధ్యాత్మికత, సెక్యూలర్ విధానాల కలబోతగా తన పార్టీ విధానాలు ఉంటాయని రజినీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. బిజెపిపై ఇంతవరకూ ఎటువంటి వ్యతిరేక విమర్శలు చెయ్యలేదు. రేపటి ఎన్నికల సమయంలో లేదా ఫలితాల తర్వాత ఫలితాలను బట్టి రజినీ, బిజెపి కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచనలను కూడా కొట్టి పారేయలేము. వ్యక్తిగత స్నేహం ఉన్నా, భిన్న ధ్రువాలైన కమల్, రజనీకాంత్ రాజకీయాల్లో ఎలా ఉండబోతారో, వేచి చూడాల్సిందే. ప్రస్తుత ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరుసెల్వం… రజనీకాంత్ తో కలిసి నడుస్తానని ఇప్పటికే  ప్రకటించారు.

ప్రాంతీయ అభిమానం, సామాజిక ప్రభావం జోడింపు

తమిళనాడులో ప్రాంతీయ అభిమానంతో పాటు, సామాజిక ప్రభావాలు కూడా చాలా ఎక్కువ. పన్నీరుసెల్వం సామాజికవర్గం కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా, అసదుద్దీన్ ప్రకటనతో తమిళనాట కొత్త కోణం ఆవిష్కారమైంది. వరుస గెలుపులతో ఏఐఎంఐఎం మంచి ఊపులో ఉంది. తమిళనాడులో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కనీసం 25 అసెంబ్లీ స్థానాలకు తక్కువ కాకుండా పోటీచేయనున్నట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన ముస్లిం నేతలతో సోమవారంనాడు తమ హైదరాబాద్ కార్యాలయంలో భేటీ అయ్యారు.

జోరుమీదున్న ఏఐఎంఐఎం

ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి కొన్ని స్థానాలను దక్కించుకున్న ఏఐఎంఐఎం ఇప్పుడు తమిళనాడుపై కన్నేసింది. తమిళనాడులో కొన్ని ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ అవి పెద్ద ప్రభావాన్ని చూపించలేక పోతున్నాయి. ఇదే అదనుగా  అసదుద్దీన్ రంగంలోకి దుమికారు. వెల్లూరు, రాణీపేట, తిరుపత్తూరు, కృష్ణగిరి, త్రిచ్చీ, తిరునెల్వేలి జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ పట్టుబిగించే వ్యూహంలో అసదుద్దీన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ దిశలో కమల్ హసన్ ప్రభావాన్నీ వాడుకుంటారు.

Also Read : తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్, అసదుద్దీన్ ఒవైసీ పొత్తు?

కమల్ , రజిని భిన్న ధృవాలు

ఇదంతా నిజంగా రూపం దాల్చుకుంటే, ఇటువంటి వాతావరణంలో రజినీకాంత్, కమల్ హసన్ కలవడం కష్టమే అవుతుంది. తమిళ ప్రజలు ముఖ్యమంత్రిగా తమిళీయుడి వైపే మొగ్గు చూపిస్తారని, రజినీకాంత్ ను పరాయివాడిగానే చూస్తున్నారనే మాటలు తమిళనాడులో అక్కడక్కడా వినిపిస్తున్నాయి. చరిత్రను గమనిస్తే,ముఖ్యమంత్రులుగా పనిచేసి, పెద్దపేరు, క్రేజ్  తెచ్చుకుని, తమిళ రాజకీయాలపై తిరుగులేని ఆధిపత్యం చాటుకున్న   ఎంజిఆర్, కరుణానిధి, జయలలిత  తమిళులు కానేకారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూలాలు ప్రధానంగా కలిగిన నాయకులు. ముగ్గురూ సినిమారంగం నుండి వచ్చినవారే. వీరు  తమిళులను పూర్తిగా  సొంతం చేసుకున్నారు. తమిళప్రజలు కూడా వీరి మూలలను మరచి, తమ బిడ్డలుగా అక్కున చేర్చుకొని, అందలమెక్కించారు.

రజినీకి మూడు రాష్ట్రాలతో అనుబంధం

రజినీకాంత్ మహారాష్ట్ర మూలాలు కలిగి, కర్ణాటకలో నివసించి, తమిళనాడుతో అనుబంధం పెనవేసుకున్నారు. ఎంజిఆర్, శివాజీగణేష్ తర్వాత అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న అగ్రనటుడు రజినీకాంత్ మాత్రమే. రజినీ అనే మూడక్షరాలకు అక్కడ జనం పిచ్చెక్కిపోతారు. తలైవర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తలైవర్ అంటే అధిపతి/దళపతి అని అర్ధం. ఈ అధిపతిని ముఖ్యమంత్రిగా అందలం ఎక్కించుకుంటారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

తలరాత మారుస్తామంటున్న నాయకులు

తమిళనాడు తలరాత మారుస్తానంటూ   బయలుదేరిన ఈ నాయకులు, ఈ పార్టీలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెరపై చూడాల్సిందే. ఇప్పటికే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న పళనిస్వామి, అధికారంపై బోలెడు ఆశలు పెట్టుకున్న శశికళ, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ముఖ్యమంత్రి సింహాసనాన్ని అధిరోహించాలని ఎదురుచూపులు చూస్తున్న స్టాలిన్, దక్షిణాదిలో పాగా వేయాలనే వ్యూహంలో ఉన్న  బిజెపిల మధ్య తమిళనాట రాజకీయాలు కుతకుతమంటున్నాయి.కొత్త కూతలు వినపడుతున్నాయి.

Also Read : తమిళనాడు రాజకీయాలలో మూడుముక్కలాట

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles