Saturday, April 27, 2024

సిరినోము కాత్యాయనీ వ్రతమే

శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య విశ్లేషణాత్మక పరిశోధన


తిరుప్పావై గోదాదేవి స్వానుభవ మాధుర్యస్రోతస్సు అని వర్ణించారు శ్రీ కోవెల సుప్రసన్నాచార్యుల వారు. డాక్టర్ శ్రీపాద జయప్రకాశ్ రచించిన తిరుప్పావై శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం తిరుపతి 2015లో ప్రచురించిన గ్రంధానికి శ్రీ కోవెల సుప్రసన్న అద్భుతమైన ముందుమాట రచించారు. డాక్టర్ శ్రీ పాద జయప్రకాశ్ రచించిన ఈ వ్యాఖ్యాన గ్రంథానికి ఆచార్య కా ఇ దేవనాథన్, విశ్వవిద్యాలయ కులపతులు, ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఈ ముందుమాటలో శ్రీ కోవెల వారు తిరుప్పావైలో కనిపించిన శ్రీవిద్యా మంత్రోపాసన రహస్యాలను వివరించారు. తిరుప్పావై గురించి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు శ్రీ కోవెల సుప్రసన్న. శ్రీ కోవెల సుప్రసన్న గారికి వందనాలతో, ఆ లోతైన అంశాలను ఇక్కడ మనందరికోసం ఇస్తున్నాను, వారి సౌజన్యంతో.

కోవెల సుప్రసన్నాచార్యులు

గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుని ఇంట్లో తులసి తోటలో జనక మహారాజునకు లభించిన బిడ్డ. మంటిగడ్డ. అందువల్ల ఆమెయే భూదేవి. భూమిపుత్రి. ఈ చిదచిద్రూపమైన ప్రకృతి పరివారమంతా ఈ పృథ్వియే. పృథ్వి అనాదిగా ఈశ్వర విరహంతో నిత్యవేదన పడుతున్నది.

శ్రీ విల్లి పుత్తూరులో అన్నవయల్ పుదువై తనియన్ లో సస్యసమృద్ధమైన పొలాలూ పంటలూ విలసిల్లుననీ, ఆ పొలాలలో హంసలు క్రీడిస్తూ వున్నాయనీ వర్ణింపబడింది. శ్రీ విల్లిపుత్తూరు బిడ్డ గోదాదేవి ఐహికమైన పరిపూర్ణత సస్యముల వలన, ఆముష్మికమైన అభీప్స-ఈశ్వర కామన- హంస విలాసం వలన వ్యక్త మవుతూ వున్నవి. ఈ రెండు స్తరాలలో ఆమె శ్రీకృష్ణానుభవాన్ని పొందేందుకు ఎంతటి తగిన పరిపక్వ స్థితిలో వున్నదో వ్యక్త మవుతున్నదీ చిత్రణం వలన.

తిరుప్పావై ఒక వ్రతం నోము. ద్వాపర యుగంలో గోపికలు బృందావనంలో ఇది వర్షము కురిసే నేల సస్యశ్యామల మయ్యేందుకు లౌకికంగా ఆముష్మికంగా మేఘ వర్ణుడైన శ్రీ కృష్ణ ప్రాప్తికోసం నిష్ఠతో చేసిన కాత్యాయనీ వ్రతం. సర్వజీవులకూ ఉపాయభూతమైన ఈ వ్రతం అంతర్ముఖి బహిర్ముఖాలు కలిగింది.

తిరుప్పావై కాత్యాయని వ్రతం అని చెప్పడానికి సుప్రసన్న మహాభాగవత పురాణం దశమస్కందంలోని 22 వఅధ్యాయాన్ని, తిరుప్పావైలో మాయన్ మామాయన్ పాశురాలను, శ్రీ విద్యాసంప్రదాయాన్ని, లలితాసహస్రనామాన్ని, త్రిపురారహస్య మహాత్మ్యఖండాన్నిప్రస్తావించారు. ఈ విశేషాన్ని ఇదివరకెవరూ ప్రతిపాదించలేదు. భాగవతం 22వ అధ్యాయంలో వ్రతాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు.

హేమన్తే ప్రథమే మాసి నందగోపకుమారికాః
చేరుర్హవిష్యభుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్
ఆప్లుత్యాంభసి కాళింద్యా జలాంతే చోదితే2రుణే
కృతా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృప సైకతీమ్
గంధైర్మాల్యైః సురభిర్బహులైధూపదీపకైః
ఉచ్చావైశ్చోపచారైః ప్రవాళ ఫల తండులైః
కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః
ఇతి మంత్రం జపన్త్యస్తాః పూజాం చక్రుః కుమారికాః
ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యః కృష్ణ చేతసః
భద్రకాళీం సమానార్చాః భూయాన్నంద సుతః పతిః
ఉషస్యుత్థాయ గత్రైః స్వైరన్యోన్యాబద్ధబాహవః
కృష్ణముచ్చైః జగుర్యాంత్యః కాళింద్యాం స్నాతుమన్వహం (1-6)

మార్గశీర్షమాసము, ఉషఃస్నానము, సహగోపికల ఉత్థాపనము,  హవిష్యభోజనము,  కృష్ణ నామ కీర్తనగానము- ఏకమాసదీక్ష ఇవన్నీ గోదాదేవి ప్రసక్తం చేసిన విషయాలే. కాత్యాయని సైకత ప్రతిమా పూజ ప్రసక్తి ఈ ప్రబంధంలో రాలేదు. కొంచెం జాగ్రత్తగా విచారించి చూస్తే ఈ దివ్యప్రబంధ హృదయంలో శ్రీకృష్ణునకు ఆయన సహోదరియైన కాత్యాయనికి అభేదాన్ని భావించి శ్రీకృష్ణోపాసనము చేసినట్లుగా కానవస్తున్నది. భగవంతుడు యోగమాయను యశోదాగర్భంలో ప్రవేశించమని ఆదేశించినట్లున్నది. ఆమెను వసుదేవుడు గోకులంనుంచి తెచ్చినాడు. కంసుడాశిశువును ఆడపిల్లయైనా సంహరించబోగా ఆకాశముదాకా ఎగిరింది.

అదృశ్యతానుజావిష్ణోఃసాయుధాష్టమహాభుజా దివ్యప్రగంబరాలేప

రత్నాభరణ భూషితా ధనుఃశూలేషు చర్మాసి శంఖచక్రగదాధరా

ఆమె సాక్షాద్దుర్గయే. లోకం ఆమెను దుర్గ, భద్రకాళి,  విజయ,  వైష్ణవి,  కుముద,  చండిక,  కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణ, ఈశానీ, శారద, అంబిక అనే పేర్లతో వ్యవహరి స్తుందని  మహావిష్ణువు పేర్కొన్నాడు. అనుజావిష్ణోః అని చెప్పబడ్డ తల్లి కాత్యాయనీ వ్రతానికి అధిష్ఠాత్రి. ఆమె గోపికలు అర్చించిన భద్రకాళి. లలితాష్టోత్తరశతనామాలలో శ్రీనాథ సోదరీభూత శోభిత అని పేర్కొనబడింది. లలితా సహస్రనామం అమ్మవారిని గోవిందరూపిణిగా కూడా భావన చేసింది.

ఈ కాత్యాయనీ వ్రతమే కించిద్భేదంగా త్రిపురా రహస్య మహాత్మ్యఖండంలోనూ ప్రస్తావితమైంది.
 శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణుని వర్ణిస్తూ మాయన్ (5-15) మామాయన్ (9) అని సంబోధించింది. కృష్ణ సహోదరియైన దుర్గా నామాలలో మాయాశబ్దం భాగవతం చెప్పుతున్నది. ఈ మాయ అద్వైతతత్వంలోని వివర్తవాద తాత్పర్యం కాదు. భగవద్గీత పేర్కొన్న మమ మాయాదురత్యయా అని వర్ణించబడిందది. అది ఈశ్వరుని శక్తి విశేషం. ఆశ్చరయకరమైన చేష్టితం. ఆ ఘటనాఘటనా ఘటీయసియైన స్వామి లక్షణం. సప్తశతి మహావిద్యామహామాయా మహామేధా మహాస్మృతిః జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బాలాకృప్యమోహాయ మహామాయా ప్రయచ్ఛతి ఇత్యాదిగా అనేక స్థలాలలో మమామాయ గా పేర్కొంటున్నది. లలితానామాలలోనూ ‘మాయా’ ‘మహామాయా’ నామాలు రెండూ కనిపిస్తున్నాయి. గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతాన్ని అనుకరించిన శ్రీగోదాదేవి తానూ ఆడబిడ్డయైన కాత్యాయనిని అర్చించటం తన వ్రతనియమాలను ఆ వ్రత విధానంలోనే ఆవిర్భవింపచేయడం విలక్షనమైన దేవీ భావ సంయోజనం.

తొలి పాశురంలో పూర్ణిమతో ధనుర్మాసం ఆరంభం అయినట్టు గోచరిస్తుంది. ‘మది నిఱైన్ద నన్నాళాల్’ వెన్నెలలు విరిసినవి. పూర్ణిమతో ఆరంభించి ధనుర్మాసం రెండు తిథి మండలాలను పూర్తి చేసుకుంది. శ్రీదేవి – ‘ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజితా’. ఆమె ‘మనువిద్యాచంద్ర మను విద్యాచంద్రమండల మధ్యగా’…ఉపాసకులు చంద్రమండలంలో అమ్మవారిని దర్శించడం ఈనాటికీ సాధనలో ఉన్న పద్ధతి.

అయితే కంఠోక్తిగా ఉపాస్యముగా పేర్కొనబడ్డది నారాయణి కాదు. నారాయణుడు, శ్రీమన్నారాయణఉడు సూర్యమండల మధ్యగతుడు. నారాయణీ నారాయణుల నడుమ అభేదాన్ని పాటించేందుకు కీలకవాక్యం మొదటి పాశురంలోనే ఉన్నది. ‘కదిర్ మదియంబోల్ ముగత్తాన్’ సూర్యుని చంద్రుని పోలిన ముఖం కలవాడు. ఈ మాటవల్ల ఇక్కడ నారాయణి నారాయణుల ఇద్దరూ సూచింపబడుతున్నారు. ఈ ఉపాసకులే మునులు యోగులూ, చంద్రమండలం శ్రీ చక్రాభిన్నమూ, సూర్యమండలము అంతరాదిత్య విద్యా స్థానమూ, తిరుప్పావై – శ్రీవ్రతమూ ఈ రెండు మార్గాలకు ఒక సమన్వయ మార్గం నిర్దేశిస్తున్నది.

శ్రీ కృష్ణోపాసకులకు ముఖ్యముగా కాత్యాయనీ వ్రత పారాయణులకు మానవ యోగ్యమైన మహామంత్రము శ్రీకృష్ణ అష్ట దశాక్షరి. ఈ మంత్రంలోని మూడు దళాలలో కృష్ణుడు గోవిందుడుగోపీజనవల్లభుడు పేర్కొన బడ్డారు. లలితాదేవికి అభిన్నమైనది గోవిందనామము. మంత్రోపాసకులైన గోపీజనులు ఈ మంత్రంలో ప్రస్తావించబడటం ఈ వ్రతానికి దీనికీ ఉన్న అవిభాజ్యబంధాన్ని వ్యక్తం చేస్తున్నది. దీనితో మూడు దళాలకు మూడు ఖండాలుగా పంచరశీ మంత్రాన్ని సంపుటీకరించే పద్థతి ఒకటి ఉన్నది. ఆ మంత్రము ‘గోపాలసుందరీ’ మంత్రముగా పేర్కొనబడుతుంది. ఈ మంత్ర ప్రసక్తి సాధక గ్రంధమండలి ప్రచురించిన ఆమ్నాయ మందారంలో ఉన్నది. నోరి నరసింహశాస్త్రి తమ ‘కవిద్వయము’ అన్న నవలలో ఈ మంత్రాన్ని పేర్కొనడం జరిగింది. వంగదేశంలో ఈ మంత్రోపాసన అధికమని వారొకసారి చెప్పారు.

తిరుప్పావై లో ఈ ఉభయోపాసనా విధాన సమన్వయాన్ని సూచించే చోట్లు ఎన్నో ఉన్నాయి. మొదటనే ‘నందగోపన్ కుమరన్’, ‘యశోదై ఇళమ్ ఞ్చిజ్ఞమ్’ అని వర్ణిస్తున్నది. నందభవనం చేరిన తరువాత యశోదానందులను మేల్కొలుపటం, నీళా కృష్ణులను మేల్కొలుపటం ఈ ద్వంద్వ సంపుటీకరణాన్ని సూచిస్తున్నది. ‘అజ్ఞణ్ మాఞాలత్తర్ శర్’ అనే పాశురంలో మరొక అత్యంతమూ ఆశ్చర్యం కలిగించే శ్రీ విద్యా రహస్యంఉన్నది. ఇది శ్రీకృష్ణ పర్యంక వర్ణనము. మహాపృథ్వి యందుగల రాజులు- జగత్పాలకులు- అభిమానము తొలగి వచ్చి నీ పర్యంకము పాదభాగములో నిలచి ఉన్నారని ఓడిపోయిన రాజులు దూరదూరంగా భక్తి సంభ్రమాలతో నిలచి ఉండడం ఔచిత్యం. ఇట్లా పర్యంకసాన్నిధ్యంలోనూ నిలచి ఉండడం సమన్వయం కావడం లేదు. వ్యాఖ్యానాలన్నింటిలోనూ ఈ చిక్కు విడిపోవడం లేదు. శ్రీకృష్ణుని పర్యంకమును ‘పంచశయన’ మని శ్రీగోదాదేవి పేర్కొన్నది. ఈ మాటకు అర్థం సామాన్య రీతిలో సరిపోవటంలేదు. సరియైన అన్వయం కావాలంటే శ్రీవిద్యాసంప్రదాయంలోనికి వెళ్లవలసిందే. శ్రీ రాజరాజేశ్వరి పంచప్రేతమంచాధిశాయిని అని వర్ణింపబడింది.

దీనికింకా పుష్టి కలిగించే అంశం తరువాతి పాశురంలో ఉన్నది. ఉత్తమ సింహమైన స్వామిని ఉత్తమమైన సింహాసనం మీద కూర్చొనేందుకురమ్మని ఆహ్వానిస్తున్నది. శ్రీ ఆండాళ్. ఇక్కడ శ్రీ మహారాజ్ఞీ లక్షణము, శ్రీమత్సింహాసనేశ్వరీ లక్షణమూ స్పష్టంగా చిత్రితమవుతూ వున్నది. శ్రీ విష్ణు చిత్తులు విజయం పొందింది మధురానగరంలో. ఈ నగరం మీనాక్షిదేవికి ఆస్థానం. శైవ వైష్ణవ శాక్త సంప్రదాయాలకు మేలైన సమన్వయం కుదిరిన చోటు. ఆ క్షేత్రానికి అత్యంత సమీపంలో పుట్టి పెరిగిన శ్రీ గోదాదేవి భావుకత్వంలో ఈ సమన్వయం వ్యక్తమవటంలో ఆశ్చర్యం లేదు.. అని శ్రీ కోవెల సుప్రసన్నా చార్యుల వారు శ్రీవిద్యోపాసనకు తిరుప్పావైకు మధ్య ఉన్న సామ్యాన్ని సామాన్యులకు కూడా బోధపడే విధంగా పరిశోధనా వ్యాసం రచించారు. వారి అసమాన పరిశోధనా విశ్లేషణా ప్రతిభకు ఇదొక చిన్న ఉదాహరణ.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles