Saturday, October 5, 2024

విభజనతో సరళమైన కమ్మతెమ్మెరలు!

జాన్ సన్ చోరగుడి

భూమి విలువ అత్యధికం అయిన ప్రాంతంలో ఉండే భూస్వామ్య లక్షణాలు వజ్ర సమానమైన కఠినత్వంతో ఉంటాయి. అయితే అవి పుట్టిన చోటు నుంచి రూపాంతరం చెందుతూ బయటకు విస్తరిస్తూ ఆ కఠినత్వం గుల్లబారే క్రమం, పాతది తీసి కొత్తది పెట్టినట్టు ఒక్కసారిగా అవదు. అది అంచెలంచెలుగా ఉంటుంది. అయితే, ఆ మార్పును ఆపాలని, లేదా దాని వేగాన్ని నెమ్మది చేయాలని జరుగుతున్న విఫలయత్నం, గడచిన వందేళ్లలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క తీరుగా దాన్ని దాయడం కుదరక, అది బయట పడుతున్నది.

ఎందుకిది?

విషయం లోపలికి వెళ్ళడానికి ముందు ఎందుకిది? అనే ప్రశ్న వేసుకోవడం అవసరం. 75 ఏళ్ళ స్వాత్యంత్ర దేశంలో, 60 ఏళ్ళ తెలుగు సమాజం రెండుగా విడిపోయి అప్పుడే తొమ్మిదేళ్ళు అయింది. మరి ఆ సమాజాన్ని బలీయంగా ప్రభావితం చేసిన కమ్మ కులం ‘కాట్రిబ్యూషన్’ ఎటువంటిది?

Also read: ఆ సంస్కారం మనకు అలవడినప్పుడు…

తూకానికి మధ్యన నిలబడి చూసి, ఇప్పుడు దాన్ని ‘రికార్డు’ చేయకపోతే; రేపు బరువును బట్టి అది ఏదో ఒక పక్కకు ఒరిగిపోవచ్చు. అలా కాకుండా చూడ్డానికి గాను, ముందుగా- ‘డాట్స్’ను కలపాలి. అంతేగాని, వాటి మధ్య ఉన్న ఖాళీలను మరింత వెడల్పు చేయకూడదు.   

ఈ విషయం మాట్లాడ్డానికి తెలుగునాట- ‘గుడివాడ’ సరైన ప్రాంతమని ముందుగా గుర్తించడం అవసరం. కారణం, మొదటి నుంచి ఆ ప్రాంతానికి ఉన్న- ‘రాడార్’ శక్తి అటువంటిది. ఇప్పటికీ ఆ ప్రాంతం మూలాలు ఉన్నవారు, ఎక్కడ ఉన్నప్పటికీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పట్ల వారు తమ సహజ స్పందనలను వ్యక్తం చేస్తున్నారు.

రెండవది

తెలుగు సమాజం పురోగమనంలో ‘కమ్మ’ సమాజం భాగస్వామ్యం ఎటువంటిదో- ‘బి.బి.సి.’ (తెలుగు) కోసం ఈ రచయిత ఐదేళ్ల క్రితం రాసిన వ్యాసానికి ఇది కొనసాగింపు. కర్ణాటక సి.ఎం.గా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు 8 నవంబర్ 2018న బెంగుళూరు వెళ్లి, వేదిక మీద రాహుల్ గాంధీతో కరచాలనం చేశాక– ‘కాంగ్రెస్టిడిపి కలయికతో కోస్తాంధ్ర సమాజానికి ముగిసిన ప్రాంతీయ పరిమితులు శీర్షికతో రాసిన సుదీర్ఘమైన వ్యాసం అది.

అప్పట్లో దాని ముగింపులో-

ఒకనాటి అభివృద్ధి ఇప్పుడువృద్దిగా మారాక, ‘తెలుగుదేశంపార్టీని మొదటి నుంచి ఆశ్రయించి ఉన్న సామాజిక వర్గం ప్రయోజనాలు ప్రాంతీయం నుంచి జాతీయమై, ఇప్పుడు అవి అంతర్జాతీయం అయ్యాయి. ఆధిపత్య కులాలకు ఒక స్థాయి దాటాక, కేవలం– ‘పొలిటికల్ పవర్కాపాడుకోవడానికి వారు తమ వనరులు, కాలము, ఖర్చు పెట్టడం ఒక వృధా వ్యయం. అందునాజాతి, ప్రాంతం, భాష, కులం.. ఇవన్నీ ఒకకల్ట్వంటివి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలకు కాల పరిమితి ఉందిఅంటూ అది ముగిసింది. అయితే, విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఇప్పటి ‘స్టేటస్’ ఏమిటి? అనే సమీక్ష కోసం ఆ వరసలో ఇది రెండవది.

ప్లాట్ ఫారం

నాలుగు దశాబ్దాలకు చేరువ అవుతున్న ప్రాంతీయ పార్టీ టి.డి.పి. పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్ తో కరచాలనం చేసినట్టుగా, అందరు దాన్నొక చంద్రబాబు రాజకీయ వ్యూహంగా చూశారు. అయితే అది నిజం కాదు. ‘కమ్మ’ సామాజిక వర్గం విషయంలో- ‘పొలిటికల్ పవర్’ అనేది, మూడు దశాబ్దాలు పైగా అది తన విస్తరణ కోసం వినియోగించుకున్న ఒక- ‘ప్లాట్ ఫారం’ మాత్రమే.

Also read: నీలం అడుగుజాడలు ఇంకా కొనసాగుతున్నాయి…

ఇజ్రాయేల్ దేశపు యూదు సమాజం మాదిరిగా, గడచిన వందేళ్లలో ఆ ‘కమ్యూనిటీ’ అన్ని రంగాల్లోనూ అంచులు వరకు కుదురుకుంది. ‘పాలిటిక్స్’ అందుకు ఉపయోగపడే ‘టూల్’ కనుక అయ్యుంటే కావొచ్చు. ఆ మాటకొస్తే, ‘రాజకీయాలు’ ఆ కులం ప్రవేశించిన చివరి రంగం! వారు ప్రవేశించిన రంగాలలో కుదురుకుని మరింత స్థిరపడడానికి, విస్తరించడానికి అది వారికి ఉపయోగపడింది. 

బ్రాహ్మణ సమాజం తర్వాత, ఆ స్థాయిలో సార్వజనీన లక్షణాలను కమ్మ సమాజం ఏనాడో పుణికి పుచ్చుకొంది. సామాజిక పురోగమనానికి జరిగే జ్ఞాన సంబంధమైన కసరత్తు, ఈ సామాజిక వర్గాల మధ్య ఒకరి నుంచి మరొకరికి జరిగిన బదిలీ (షిఫ్ట్)  గుడివాడ ప్రాంతం నుంచే, మనం గుర్తించలేనంత నిశబ్దంగా జరిగింది! నౌకా రేవు పట్టణమైన బందరులో 1602 నాటికి ఏర్పడ్డ- ‘డచ్ సెటిల్మెంట్’కు అతి సమీపాన, మాగాణి పొలాల మధ్య ఉన్న ఊరు కావడం, గుడివాడకున్న భౌగోళిక వెసులుబాటు అయితే కావొచ్చు.  

గుడివాడ నుంచే

ఇప్పుడు మన దృష్టి అటుగా వెళ్ళడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడ పట్టణంలో 2023 జూన్ 15న 77 ఎకరాల్లో రూ. 799.9 కోట్లతో  నిర్మించిన 8,912 నివాస గృహాలను లబ్ధిదారులకు అందచేశారు.

నిజానికి ఇటువంటిది రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు. అదేమంత పెద్ద విశేషం కూడా కాదు. తొమ్మిది వేల ఇళ్ళు అనేసరికి, ఆ కాలనీల్లో ఎన్ని రకాల కులాలు వారు ఇకముందు అక్కడ కలిసి జీవిస్తారు అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అనవసరం.

Also read: వానపాముల కదలికలు, వారి ఉక్కపోతకు కారణం!

అయితే చిత్రం ఏమంటే, అదేదో విభజన తర్వాత మనకొచ్చిన కొత్త సమస్య అన్నట్టుగా, దాని అర్ధం తెలిసి అన్నా తెలియక అన్నా- ‘డెమోగ్రఫ్రీక్ ఇంబ్యాలెన్స్’ అనే మాట ఈ రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఉన్నవారే అనడం ఈ మధ్య ఇక్కడ వింటున్నాము. దాని నిజఅర్ధాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు అదొక ప్రతిపాదిత రాజధాని ప్రాంతానికి వచ్చిన సమస్య అన్నట్టుగా అంటున్నారు.

డెమోగ్రఫ్రీక్ ఇంబ్యాలెన్స్

ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, ఆంధ్ర ప్రాంతం నుంచి తుంగభద్ర డ్యాం వద్దకు, తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాకు వలస వెళ్లిన కమ్మ వారి ఊళ్ళల్లో, ఇప్పుడు వారి ఇళ్ళు కొనుక్కుని వాటిలో కాపురం ఉంటున్నది ఎవరు? ‘తూర్పోళ్ళు’ అని పిలవబడే ఉత్తరాంధ్ర నుంచి కోస్తాకు వలస వచ్చిన వారు కదా? మరి దాన్ని- ‘డెమోగ్రఫ్రీక్ ఇంబ్యాలెన్స్’ అనరా?  

ఇప్పుడు జగన్- ‘హౌసింగ్ ప్రోగ్రామ్’ పనిమాలా కృష్ణాజిల్లా గుడివాడలో జరగడంతో, ఎందుకు గుడివాడ? ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి గడచిన వందేళ్లలో ‘గుడివాడ’ ఏమి చేసింది, గతానికి భిన్నంగా ఇప్పుడు అది ఏమి చేస్తున్నది? అనే లోతైన సమీక్ష తప్పడం లేదు. అలా ఈ ప్రాంత భౌగోళిక-చారిత్రిక మూలాల్లోకి చూసినప్పుడు, అది తెలిసి జరిగినా తెలియక జరిగినా, సరైన చోటు నుంచే అది మొదలయింది అనేది మాత్రం సత్యం.

ఆంధ్రోళ్ల హుషారు

చదువుకోవడానికి ఊరు విడిచి వచ్చే పిల్లల కొరకు 1914 నాటికి హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ ఏర్పాటు అయింది, అక్కడి వెలమ హాస్టల్ కూడా అంతే పాతది. తొలుత కమ్మ కులస్తులకు ఇటువంటి ఏర్పాటు అక్కడ లేక, వీరి ప్రస్థానం కొంత ఆలస్యంగానే మొదలయింది. అయినా ‘లేట్ కవర్’ చేస్తూ… ఈ రోజున సామాజిక గౌరవం పొందే విషయంలో- క్షత్రియ, రెడ్డి, వెలమ, సరసన కమ్మ కులం నిలబడగలిగింది. ఇప్పుడు వారి పని శైలి తెలంగాణలో- ‘ఆంధ్రోళ్ల హుషారు’ అనే నానుడి స్థాయికి ఎదిగింది!

దీని మూలాల కోసం, ఈ ప్రాంత ప్రాపంచిక దృక్పథం ఎటువంటిది? అనే మౌలిక ప్రశ్న ఎదురవుతున్నది. అయితే అందుకు గుడివాడ సమీపాన అంగలూరు నుంచి వచ్చిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి (1887-1943) ప్రస్తావన, సరైన సమాధానం అవుతుంది. ఆ తర్వాత కాలంలో త్రిపురనేని గోపీచంద్ (1910-1962) ఇంకా ఈ ప్రాంతంలోని ఆయన సమకాలికులు ఏ కాలంలోనూ ఆ దీపాన్ని ఏమాత్రం ఆరిపోనివ్వ లేదు.

బ్రిటిష్ ప్రభుత్వంలో 1935-40 మధ్య మాక్సిం గోర్కీ నవల ‘అమ్మ’ పై నిషేధం ఉంది. గుడివాడ తాలూకా యలమర్రుకు చెందిన గద్దె లింగయ్య దాని తెలుగు అనువాదం బెజవాడ ప్రెస్ ఓనర్లుకు అదేమిటో తెలియనీయకుండా ఒక్కొక్క భాగం వేర్వేరు చోట్ల ప్రింట్ చేయించి, ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని బందరు కాల్వ మీది పడవలో బైండింగ్ చేయిస్తూ మంటాడ – యలమర్రు మధ్య పడవ నడుపుతూ…  పుస్తకం తెచ్చి, నెల రోజుల్లో వెయ్యి కాపీలు అమ్మిన సాహసి! 

మిక్సీలో గిలకొట్టిన

నందివాడ సమీప గ్రామం లింగవరం నివాసి నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య (1914-2002) ది మరొక దారి. అది- ఆ ప్రాంతం నుంచి వేరు చేసి చూసే పరిణామం కాదు. ఇంకా- వీరిలో నార్ల వెంకటేశ్వర రావు (1908-1985) పూర్వీకులది గుడివాడ సమీప గ్రామం కౌతవరం అని గానీ; ఉస్మానియా కేంపస్ లోని 80-90 దశకం నాటి కుల రాజకీయాలను, తన ‘అనుక్షణికం’ నవలలో- ‘మిక్సీ’లో వేసి మరీ గిలకొట్టిన వడ్డెర చండీదాస్ (1937-2005) అస్సలు పేరు చెరుకూరి సుబ్రమణ్యేశ్వర రావు అని, ఆయన ఊరు గుడివాడ పక్కన పెరిశేపల్లి అని ఇప్పుడు ఎందరికి తెలుసు?!

ఇక తెలుగు సమాజ ప్రాపంచిక దృక్పథానికి ఒక రూపు ఇవ్వడానికి చలనచిత్ర పరిశ్రమ ద్వారా గుడివాడ ప్రాంతం చేసింది ఏమిటని దాని విస్తృతి పరిమితులు గురించి మళ్ళీ ఇక్కడ చెప్పడం ‘రిపిటీషన్’ అవుతుంది. వెండితెర వెలుగులకు ఉండే మెరుపులు ఎక్కువ కనుక- ఏఎన్నార్, ఎన్ఠీఆర్, ఈ ప్రాంతానికి- ‘ఆల్ టైం ఐకాన్స్’ అయ్యారు!

నేల విడిచి సాగు

కానీ, ఈ ప్రాంత మట్టిమనుషుల కోసం 1936 నాటికే- కె.సి.పి. వంటి చెక్కర మిల్లులు ఇక్కడ ఆరంభించినది ఎవరో, ఆ కంపెనీ ఈ రోజున వియత్నాం వంటి ఆగ్నేయ-ఆసియా దేశాలకు విస్తరించడం ఏమిటో- ఇప్పటి తరాలకు తెలియదు. ఎందుకంటే, ఇదే గుడివాడ పరిసర గ్రామాల నుంచి నేల విడిచి సాగు చేసిన ఫక్తు వడ్డీ వ్యాపార వేత్తలు కూడా రాష్ట్ర స్థాయి దాటి మరీ ఎదిగారు; వివాదాస్పదం అయ్యారు.

అయినా ఈ ప్రాంతం సహజ వాసనల్ని ఇప్పటికీ మర్చిపోకుండా, చిత్రసీమ కార్మికుల సమస్యలు పట్టించుకునే ముదినేపల్లికి చెందిన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి కుమారుడు ఫిలిం ఛాంబర్ నాయకుడు తమ్మారెడ్డి భరద్వాజ వంటివారు రెండు రాష్ట్రాల పక్షంగా ఇంకా చురుగ్గా ఉన్నారు. 

ఇవ్వలేకపోయాడు   

‘తెలంగాణ’ కోసం పోరాటం చేసి మరీ విడిపోయిన వాడికి తర్వాత ఏమిటి? అనే ‘క్లారిటీ’ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే, పోరాటం జరిగే చోట అటువంటి   ‘ప్రిపరేషన్’ ఉంటుంది. కానీ, మరో మార్గం లేక తప్పనిసరై విడిపోయిన వానికి అటువంటి ఏర్పాటు ఉండదు.

అయితే విడిపోయాక, ఆయా సమాజంలోని ఆలోచనాపరులతో జరిపే మేధో మథనంలో అయినా ఆ దృష్టి కలగాలి. అందుకు అవసరమైన ‘పేపర్ వర్క్’ జరగాలి. తొలి ఐదేళ్లలోనే అటువంటి స్పష్టతతో ప్రభుత్వం కార్యరంగంలోకి దిగాలి.

Also read: రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక!

విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అటువంటి ‘చూపు’ కొరవడి వెనకబడి పోయాడు. హైదరాబాద్ లో 22 జూన్ 2023న అంగరంగ వైభవంగా జరిగిన తెలంగాణ తొలి దశాబ్ది ఉత్సవాలు చూస్తూ మౌనంగా ఉండడం తప్ప, చేయగలిగింది మరేమీ లేకపోయింది.

అలా కాకుండా- భంగపడినప్పటికీ మన రాష్ట్రానికి కూడా ఒక ‘డ్రాఫ్ట్ ప్లాన్’ ఉంది, అది ఫలానా సంవత్సరానికి పూర్తి చేయాలని అనుకున్నాము, కనిపెట్టండి అవుతుంది అని… అది నిరీక్షణ (హోప్) అయినా పర్వాలేదు, చివరికి అది కూడా తొలి ఐదేళ్ళలో ఆయన ఇవ్వలేకపోయాడు. 

 బెజవాడలో

నిజానికి ఆయన బెజవాడ వచ్చాక మాత్రమే, ఆయన్ని ఆ సామాజిక వర్గం దగ్గరగా చూసింది. ఫిబ్రవరి 2021లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి ఆయన వచ్చినప్పుడు, “మీరంతా ఇళ్లల్లో ఉంటే, మీకోసం నేను వీధుల్లో తిరగాలా?” అంటూ చంద్రబాబు వాపోవలసి వచ్చింది.

రాజకీయాలు చేయడానికి ఉన్న స్థానిక సంస్థలు చాలవన్నట్లు, సాగునీటి సంఘాలకు కూడా ప్రతినిధులను ఎంపిక చేసిన చరిత్ర ఆయనది! అటువంటిది, అస్సలు ఎన్నికలనే వాయిదా వేయించాలని చేసిన విఫల యత్నం, కోస్తా ఆంధ్రలో తమ సామాజిక గౌరవాన్ని దెబ్బతీసింది అనుకునేవారి మనోభావాల్ని ఆయన అస్సలు పట్టించుకోలేదు

ఈయనతో కాదు

వ్యక్తిగా రూపొందే క్రమంలో స్వతహాగా ‘ఫ్యూడల్’ కుటుంబ నేపధ్యం లేకపోవడం ‘లీడర్’గా చంద్రబాబుకున్న ప్రధాన లోపం. ఆయన నేరుగా ‘కేపిటలిస్ట్’ అయినవాడు, అక్కణ్ణించి అది కాస్తా అనతి కాలంలోనే ‘నియో-కేపిటలిస్ట్’ రూపం సంతరించుకుంది. అందుకే కృష్ణా మండలంలోని కమ్మ సమాజానికున్న నిగ్రహ మనస్తత్వ లక్షణం, ఆయనకు ఇప్పటికీ అర్ధం కాదు.

‘ఈయనతో కాదు…’ అనే ఎంతో మంది ముందు చూపు వున్న ఆ కులం పెద్దలు విభజన తర్వాత కొత్త (‘మ్యాప్’) రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు విషయంలో మౌనంగా ఉండిపోయారు. ఈ వ్యాసం ఆరంభంలో ప్రస్తావించిన గుడివాడ కేంద్రంగా మొదలైన తెలుగు సమాజం రూపాంతర ప్రక్రియ, దానికున్న సార్వజనీనతను తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మింగేశాయి అనడం సత్యం. 

 దీపధారులకు 

బొగ్గును మండించి నీళ్లు మరిగించి ఆవిరి ఇంజన్ మోటారు బళ్ళు మొదటిసారి పట్టణపు వీధుల్లో నడిపిన ఊరు గుడివాడ. అంతేకాదు, దాన్ని- ‘పబ్లిక్ ట్రాన్స్ పోర్టు’ కోసం కూడా మొదటిగా ఇక్కడే వాడారు. ఆ తర్వాత, దేశంలో ‘హరిత విప్లవం’ మొదలైనప్పుడు, ప్రతి వ్యవసాయ అవసరానికి అనువైన యంత్ర ఉపకరణాలు గుడివాడ నుంచి ‘డిజైన్’ చేయబడ్డాయి.

రాష్ట్రంలో ‘నీలి విప్లవం’ తొలి రోజుల్లో- ‘ఆక్వా కల్చర్’ రవాణా అవసరాలు అన్ని తీర్చింది గుడివాడ. ఇదెలా సాధ్యమయింది? అని చూసినప్పుడు, ప్రపంచంలో జరుగుతున్న మార్పులతో పాటుగా ఈ ప్రాంత ‘సైకాలజీ’లోకి ఇంకిన ప్రజాస్వామ్య-వామపక్ష రాజకీయ తాత్వికతకు, అందుకు దోహదం చేసిన దీపధారులకు ముందుగా మనం కృతఙ్ఞతలు చెప్పాలి. 

కోడెల ఫ్యాక్టర్

అందుకే, టి.డి.పి. 1982 -1994 మధ్య ఎన్ఠీఆర్ పార్టీగా ఒక తీరుగా ఉంటే, 1991 లో దేశంలో అమల్లోకి వచ్చిన ఆర్ధిక సంస్కరణలు తర్వాత, 1995 నాటికి చంద్రబాబు టి.డి.పి.గా దాని ‘లైన్’ పూర్తిగా మారిపోయింది. దాంతో కృష్ణా మండలం నుంచి డా. యలమంచిలి శివాజి వెంటనే ఆగిపోతే, వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటివారు కొంత ఆలస్యంగా తమ రాజకీయ ప్రస్థానంలో మధ్యలో ఆగిపోయారు.

వీరిలో ఒక్క డా. కోడెల శివప్రసాద్ మాత్రమే రెండు శిబిరాల రాజకీయాలు చూసింది. కారణం 1991-2001 మధ్య గుంటూరు జిల్లా నుంచి కోడెల క్రియాశీల పాత్ర వల్లనే- కమ్మ ఎన్.ఆర్.ఐ ‘నెట్ వర్క్’ బలీయమైన శక్తిగా మారింది. అయితే. విభజన తర్వాత, చంద్రబాబు తీసుకున్న అస్పష్ట వైఖరితో, మారిన సామాజిక చట్రంలో కోడెలకు తన ‘ప్లేస్’ ఏమిటో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ పగుళ్లు మధ్యనుంచి మళ్ళీ ఇదే గుడివాడ ప్రాంతం నుంచి ఈ పదేళ్లలో బయటకు వచ్చినవాడు- కొడాలి నాని!   

మౌనం

కాలం తెచ్చే మార్పులో ఉండే వైవిధ్యం కనుక సకాలంలో గుర్తించకపోతే మిగిలేది గందరగోళమే. ఏదీ వజ్రంలా కఠినంగా ఎల్లకాలం ఉండడం ఉంచడం సాధ్యం కాదు. అది- ఎటువంటిదైనా గుల్లబారడం అనేది ప్రకృతి ధర్మం. కమ్మ సమాజం విషయంలో ఆ సమాజం అంచెలంచెలుగా స్వంతం చేసుకున్న జ్ఞాన సౌరభాల వ్యాప్తికి, నలభై ఏళ్ళ టి.డి.పి. ‘ఎలక్ట్రోల్ పాలిటిక్స్’ ఇప్పుడు అడ్డు తొలిగించుకోలేని అవరోధమయింది. వేర్వేరు అయిన ఈ రెండింటి మధ్య ఉన్న తేడా తెలియని, ‘సోషల్ మీడియా’ తరం ఇస్తున్న తీర్పుల మధ్య, ఒకప్పటి బ్రాహ్మణ సమాజపు మౌనాన్నే మళ్ళీ ఇప్పుడు కమ్మ సమాజం కూడా పాటిస్తున్నది.

Also read: ‘క్రిస్మస్’ తోనే సరళీకరణ మొదలయింది… 

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles