Monday, November 4, 2024

రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక!

జాన్ సన్ చోరగుడి

డా. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2014 జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను భారత ప్రభుత్వం వేరుచేసింది. మరో ఏడాదిన్నరలోనే 23 డిసెంబర్ 2015న కేంద్ర ప్రభుత్వం- ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ప్రకటించింది. అయితే, ఐదేళ్లు ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశలో చర్యలు మొదలెట్టింది. ఫిబ్రవరి 2023లో- “విశాఖపట్టణం ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా కాబోతున్నది, త్వరలో నేను అక్కణ్ణించి పనిచేయబోతున్నాను” అని ఢిల్లీలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.ఇది జరిగిన నెలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విశాఖ వచ్చి ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొని చేసిన ప్రసంగంలో-కేంద్రప్రభుత్వం దృష్టి నుంచిరాష్ట్ర విభజనకు కారణాలు విషయంలో మరింత స్పష్టత వచ్చింది.

Also read: ‘క్రిస్మస్’ తోనే సరళీకరణ మొదలయింది…

యూ ట్యూమర్స్

దేశ సార్వభౌమత్వం విషయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల గురించి, ప్రతివాళ్లూ ‘యూ ట్యూబ్’ల్లో మాట్లాడుతున్న రోజులివి. ఈ ధోరణిలో ఉన్న అనారోగ్యం తొలుత వెల్లడి కావాలి. ఒక దేశ విస్తృత ప్రయోజనాలు కాపాడే విషయంలో ప్రభుత్వ యంత్రాంగాల దృష్టి ఎటువంటిదో విశాఖ సదస్సులో వెల్లడి అయ్యాక, దానికి ఒక కొనసాగింపు అవసరం. పౌరులకు రాజ్యాంగ స్పృహ కలిగించే సామాజిక శాస్త్రం- ‘పొలిటిల్ సైన్స్’  అని తెలిసిందే. దాని ‘అకడమిక్’ ప్రాశస్త్యం మీద, యూ-‘ట్యూమర్’ విశ్లేషకులు ‘పాలిటిక్స్’ ముసుగు కప్పి,  ప్రజాస్వామ్యం అంటే ఫక్తు రాజకీయాలే అని  పౌరుల్ని నిత్యం నిరక్షరాస్యులుగా ఉంచే ప్రయత్నాన్ని నియంత్రించాల్సిన  సమయమిది.

  

నితిన్ గడ్కరీ విశాఖ ప్రసంగంలో-21వ శతాబ్ది ఆధునిక దక్షణ భారతదేశ చరిత్ర రచనకు దోహదం చేసే రెండు ప్రధానమైన- ‘డాట్స్’ను కలిపినట్లయింది. వాటిలో మొదటిది- పదేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం అమలు. రెండవది విశాఖ ప్రపంచ పెట్టుబడుల సదస్సు. వాటిలో మొదటిది పదేళ్ల క్రితం పూర్తికావడంతో, ఇప్పుడు రెండవదానికి మార్గం సుగమం కావడం కనిపిస్తున్నదే. అయితే, ఈ రెండు ‘డాట్స్’ మధ్య గడ్కరీ కొత్తగా ఒక ‘లైన్’ గీయడానికి చేసిన ప్రయత్నమే ఇకముందు ఏ.పి.కి కీలకం.

విభజన విషయంలో యు.పి.ఏ. ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మూల్యాన్ని చెల్లించడానికైనా అప్పట్లో వెనకాడలేదు. ఆ విషయాన్నిఇప్పుడు ‘రెండు డాట్స్’ను కలిపే క్రమంలో, గడ్కరీ ఎన్.డి.ఏ. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ అంగీకరించారు. దేశ సమగ్రత పరిరక్షణ విషయంలో మన దృష్టిలో ఉండాల్సిన విస్తృతి ముందు, రాజకీయ పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలు చాలా చిన్నవని వెల్లడించేది ఇటువంటి సందర్భాలే!

విభజన జరిగిన పదేళ్ల తర్వాత మంత్రి గడ్కరీ మాటలను బట్టి చూసినప్పుడు, 2014కు ముందు వెల్లడి చేయలేని విభజన కారణాలను, కేంద్రం క్రమంగా ఒక్కటొక్కటిగా ఇలా బయట పెడుతున్నట్టుగా ఉంది. గడచిన దశాబ్ద కాలంలో మన తూర్పుతీరంలో బహిర్గతమైన అంతర్జాతీయ పరిణామాలు, మన విదేశాంగ, రక్షణ శాఖల విధానాల మార్పుకు కారణం అయ్యుంటే, అందుకే కేంద్రం ఇప్పుడిలా ‘ఓపెన్’ అయ్యుండాలి. అంతేకాదు, దేశరక్షణ, సరిహద్దు భద్రత, వంటి కీలకమైనవే కాకుండా; ఆగ్నేయ-ఆసియా దేశాలతో వాణిజ్య అవసరాలకు ఏ.పి.వంటి ప్రశాంతంగా ఉండే రాష్ట్రాలను వాడుకోవడం ఉత్తమం అని అనుకుని ఉండాలి. 

Also read: ఐదేళ్ల ఆలస్యంగా మనమూ ఆరు రాష్ట్రాల సరసన!

పదేళ్లు పూర్తి అవుతున్నప్పుడు, ఎన్.డి.ఏ. ప్రాధాన్యతలలో కొత్తగా వచ్చిన ఇటువంటి మార్పు తర్వాతనే, గడ్కరీ విశాఖలో ఆలా మాట్లాడి ఉండవచ్చు. అయితే ఈ మొత్తం ‘సినేరియో’లో రాజకీయంగా ఇక్కడ ప్రయోజనం ఎవరు పొందారు, మూల్యం ఎవరు  చెల్లించారు? అని అంత మేరకే మన విశ్లేషకులు పరిమితం అవుతున్నారు. వారి దృష్టి రానున్న 2024 ఎన్నికలు మించి మరేమీ చూడడం లేదు. నిజానికి వారిది ప్రాధమిక దశ. పదిమందికి చెప్పేవాళ్ళే అక్కడ ఆగిపోతే, ఇక వినేవాళ్ళ పరిస్థితి ఊహించడం కష్టం.

దేశచరిత్ర రచనకు ప్రాతిపదిక ఏమిటి? అన్నప్పుడు, మొదటిది- మారే ప్రజల ప్రాధాన్యతలు, రెండవది- భౌగోళికంగా రాజకీయాలు ఎక్కడ కేంద్రీకృతం అవుతున్నాయి?ఈ రెండు అంశాలు కీలకం. అందుకే అంతర్జాతీయంగా- ‘జియో-పాలిటిక్స్’ దృక్పథం 21వ శతాబ్దిలో ప్రాధాన్యత అంశమైంది. ప్రాచీన భారత చరిత్రలో అందుకు మంచి ఉదాహరణ ‘కళింగ’.  ఇప్పుడు అందరూ దాన్ని మర్చిపోయినా, భూమిలో పాతిన సరిహద్దు రాళ్ల మాదిరిగా,గత కాలపు సమీక్ష సందర్భం వచ్చిన ప్రతిసారీ మనం దాన్ని తవ్వి బయటకు తీసి మరీ గుర్తుచేసుకోక తప్పదు.

విశాఖలో గడ్కరీ ఏమన్నారు?

గడ్కరీ విశాఖ ప్రసంగం విన్నప్పుడు ఈ ఉపరితల రవాణాశాఖ మంత్రి చూపు ఒక- ‘డ్రోన్’  ముందుగానే నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరడానికి ‘నావిగేట్’ అవుతున్నట్టుగా అనిపించింది. అయితే చివరికది తూర్పుతీరానికి చేరింది. చిత్రం- ఈ శాఖ కంటే ముందు గడ్కరీ 2014-19 మధ్య పోర్టులు-షిప్పింగ్ శాఖల మంత్రిగా పనిచేసారు. కీలకం ఏమంటే, ఇప్పుడు ఆయన దృష్టి ఆసాంతం దేశం ఢిల్లీ నుంచి క్రిందికి దక్షిణాది వైపుకు దిగడం. ఆ దిగే క్రమంలో,’రాజ్యం’ యంత్రాంగాన్ని తూర్పు తీరానికి చేర్చడం పైన కేంద్రీకృతం అయింది. ఆయన అంటారు- ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి, అక్కణ్ణించి నాగపూర్ వచ్చి, అక్కణ్ణించి దక్షణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని జాప్యాన్ని గడ్కరీ సుదీర్ఘంగా ఏకరువు పెట్టారు.

గుజరాత్ తర్వాత మనది 974 కి.మీ. సుదీర్ఘ తీరం కనుక, ఇక్కడ రాష్ట్రంలోని అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో జాతీయ రహదారులను అనుసంధానం చేస్తాము అంటున్నారు. తన శాఖ పరిధిలో నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ అన్నీ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయని అవి పూర్తి అయితే, వాటిలో ఒకటైన రాయపూర్-విశాఖపట్టణం రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు వున్న ఛత్తీస్ ఘడ్ కు ఏ.పి. పోర్టులు అందుబాటులోకి వస్తాయని అంటారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ.33.540 కోట్ల వ్యయంతో తమ శాఖ నిర్మిస్తున్నది అన్నారు. 

Also read: ‘సీన్’ ఇండియా మ్యాప్ క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

ఇలా ఒక్క ఢిల్లీ నుంచి మాత్రమే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి కూడా దక్షణాన మన రాష్ట్ర సముద్ర తీరానికి, రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరడానికి తమ శాఖ ముమ్మరంగా పనిచేస్తున్నదని గడ్కరీ వెల్లడించారు. సరిగ్గా ఇక్కడే మన వైపు నుంచి- ‘ఎందుకు?’అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది!

ఐఎన్ఎస్ విక్రాంత్ పైన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

విశాఖ వేదిక మీద వక్తలు అందరూ మన రాష్ట్ర సముద్ర తీరం కొలతలు గురించి మాట్లాడారు. ఐదేళ్లు ఆలస్యంగా అయినా అదొకటి ఉందన్న స్పృహ అయితే అందరికీ మొదలయింది. దీనికి కొనసాగింపు అన్నట్టుగా విశాఖ సదస్సు ముగిసిన ఒక రోజు తర్వాత మార్చి 6న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ హిందూ మహాసముద్రంలో ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ యుద్ధనౌక మీద-పరిస్థితి ‘డిమాండ్’ చేస్తే, మన నౌకాదళాలు, వాయుసేన, ఆర్మీ రంగంలోకి దిగడానికి ఎంతమేర సిద్ధంగా ఉన్నది అని త్రివిధ దళాల అధిపతులతో సమీక్షించారు.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ముందు ఉన్న తరుణంలో, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెనక్కి 2022 కేలండర్ లోకి కూడా వెళుతూ, విశాఖ సదస్సు కంటే ముందు మన రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు మన తీరప్రాంత పట్టణాల్లోజరిపిన పర్యటనలు, సమీక్షలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగాయో చూద్దాం.

Also read: ఏ. పి.లో మొదలైన ‘గ్రీన్ పాలిటిక్స్’

యాక్ట్ ఈస్ట్

నిజానికి ఇది పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన- ‘లుక్ ఈస్ట్’ విదేశీ విధానానికి తదుపరి దశ. కేంద్రం23 డిసెంబర్ 2015 న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ని ప్రకటించింది. గత ఏడాది మే 23 న జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జోసఫ్ బైడెన్ ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో12 దేశాలు- ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేం వర్క్ ఫర్ ప్రాస్పరిటీ’ ఒప్పదం చేసుకున్నాయి. బైడెన్ ఈ ఒప్పందాన్ని- ‘రైటింగ్ న్యూ రూల్స్ ఫర్ 21  సెంచరీ ఎకానమీ’ అంటూ అభివర్ణించారు.

ఇది జరిగి నెల కూడా కాకుండానే, 2022 జూన్ 12 న మన విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ విశాఖపట్టణంలో జరిపిన మేధావుల సదస్సులో- ‘ఈస్ట్రన్ ఇండియా నీడ్స్ ఎవల్యూషన్’ అన్నారు. ‘తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందని, అప్పుడే ప్రపంచ మార్కెట్ తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది’ అని ఆ సదస్సులో జై శంకర్ అన్నారు.

ఇది జరిగిన నాలుగు నెలలకు అక్టోబర్ 28న కాకినాడలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభిస్తే, కేంద్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిధిగా పాల్గొని ఇక్కడ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసారు “రాజకీయ సుస్థిరత, తీవ్రమైన పోటీ తత్త్వం, సమిష్టి కృషి, అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కనుక ఉంటే, ఇండియా ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక శక్తిగా నిలబడగలదు” (With political stability, high competitiveness, collective efforts and developing economic system, India will become an economic force in the world to reckon with)అన్నారు.

కాకినాడ సభలో మాట్లాడుతున్న పీయూష్ గోయెల్

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ-“రాష్ట్రాలు తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఎగుమతి అవకాశాల కోసం విదేశీ ఎంబసీలలో- ‘ఎక్స్ పోర్ట్ ప్రమోషన్’ ఆఫీసుల ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారని అన్నారు. ‘ట్రేడ్ హబ్‌’గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమని, ఈ ప్రాంత ఎంటర్ ప్రెన్యూర్లు అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందు వరసలో నిలిపారని మంత్రి ప్రశసించారు. ఫార్మాస్యూటికల్స్, ఆటో, టెక్స్ టైల్, రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, పళ్లు, కూరగాయల వాణిజ్యానికి ఏ.పీ.లో అపార సామర్థ్యం ఉందని” ఆమె అన్నారు.

వాయిదా

ఈ పర్యటనల వరస చూసినప్పుడు, గడచిన పదేళ్లలో మన తూర్పున పెరుగుతున్న చైనా కవ్వింపు చర్యల్ని ఇంక ఎంతమాత్రం ఢిల్లీలో కూర్చుని ఎదుర్కోవడం కుదరదని కేంద్రానికి అర్ధమయ్యాక; తమ పార్టీ ప్రభుత్వం కాకపోయినా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన అనుమతులు విషయంలో వేగం పెంచక తప్పలేదు. అంతేకాదు, సరిహద్దు భద్రత దృష్ట్యా ఎన్.డి.ఏ. ప్రభుత్వ ప్రతినిధులకు మన తీరంలో- ‘బయో మెట్రిక్’  హాజరు ‘రికార్డు’ చేసుకోవడం తప్పనిసరి అయింది!

విశాఖలో బస చేసిన ప్రధాని నరేంద్రమోదీ

ఈ మాట అనడం ఎంతమేర సబబు అనేదానికి విశాఖపట్టణంలో జరిగిందే రుజువు. వాస్తవానికి 2022 నవంబర్ 10-11 తేదీల మధ్య ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి మనదేశం బంగాళాఖాతం వైపు క్షిపణి ప్రయోగం చేయాలి. అందుకోసం అప్పటికే శ్రీలంక ఇండోనేషియా మధ్య 2,200 కి.మీ. మేర మనదేశం ‘నో ఫ్లయ్ జోన్’గా ప్రకటించింది. ఇక విశాఖలో బసకుఅదే 11వ తేదీరాత్రి చేరిన మన ప్రధాని ఆ మర్నాడు ఉదయం (క్షిపణి ప్రయోగం జరిగి ఉంటే…) విశాఖపట్టణం నేవల్ కమాండ్ నుంచి దానిపై స్పందించి ఉండేవారేమో?

కానీ చివరి నిముషంలో అది వాయిదా పడింది. కారణం- షెడ్యూల్ ప్రకారం మన క్షిపణి ప్రయోగం జరిగి ఉంటే, దాని ఆనుపానులు ‘రికార్డ్’ చేయడానికి అప్పటికే  హిందూ మహాసముద్రం జలాల్లో బాలి దీవులవద్ద బస చేసిన చైనా స్పై షిప్ ‘యువాన్ వాంగ్-6’ ‘రాడార్’ లోకి మన రహస్య సమాచారం వెళ్లి ఉండేది! 

Also read: ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యతతోనైనా ఏపీ పట్ల ఢిల్లీ వైఖరి మారేనా?

అప్పులిచ్చి ఆర్ధికంగా ఆక్రమించి, తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న శ్రీలంక పోర్టుల దన్నుతో మనకు దక్షణాన తిష్టవేసి చైనా మనతో ఇటువంటి ప్రత్యక్ష చర్యలకు దిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మన క్షిపణి ప్రయోగం జరగడం అది వేరే విషయం. ఏదేమైనా ఇండియా వంటి అగ్ర రాజ్యం ‘ఇమేజి’ని కాపాడ్డానికి పొడవైన సముద్ర తీరమున్న ఏ.పి. అవసరం ఈ  రోజున ఎంత ఉందో, విభజన జరిగిన తొలి దశాబ్దిలోనే దేశం గుర్తించింది.

చివరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా 2022 నవంబర్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రూ.10.500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం ప్రారంభిస్తున్నట్టుగా ప్రధాని ఆ రోజు చెప్పారు. ఆ రోజు రైల్వే, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రధాని వెంట వున్నారు.

ఇద్దరు

చివరిగా మిగిలిన ‘డాట్స్’ను మీరే కలుపుకోవడానికి, ఇరువురి ప్రస్తావనతో ఈ వ్యాసం ముగిస్తాను. వారిలో మొదటి వ్యక్తి ఎస్. సురేష్ కుమార్ ఐ.ఏ.ఎస్. హోం శాఖలో జాయింట్ సెక్రటరీ. ఈ ఏ.పి.కేడర్ అధికారి 13 డిసెంబర్ 2013 సాయంత్రం ప్రత్యేక విమానంలో రాష్ట్ర పునర్విభజన చట్టం ముసాయిదా బిల్లు కాపీలు 8 సీల్డ్ సంచుల్లో తెచ్చి అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పి.కె. మహంతికి అందచేశారు. మర్నాడు ఉదయం అసెంబ్లీలో రాష్ట్ర విభజనబిల్లుపై చర్చ మొదలయింది.

రెండవ ఏ.పి.కేడర్ అధికారి గిరిధర్ అర్మానే ఐ.ఏ.ఎస్. భారత రక్షణ శాఖ సెక్రటరీ. ఈయన 2022 నవంబర్ 26న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ కలయికతో కాబోయే కొత్త చీఫ్ సెక్రటరీ ఈయనే అని మన పత్రికలు రాశాయి. ఆయన మాత్రం ఇక్కణ్ణించి మచిలీపట్టణం వెళ్లి, అక్కడ రక్షణ శాఖ వినియోగించే ఉపకరణాల ఉత్పత్తి ఫ్యాక్టరీ భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థను సందర్శించి ఢిల్లీ వెళ్లిపోయారు. కాగా ఈ జూన్ లో రిటైర్ కావలసిన ఈ అధికారికి కేంద్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ వరకు అదే పోస్టులో సర్వీస్ పొడిగించింది. తొలుత కేంద్ర హోమ్ శాఖలో మొదలైన విభజన బంతి, చివరికి రక్షణ శాఖ కోర్టులో పడిందా? అంటే అందుకు కాలమే సమాధానం చెప్పాలి.

Also read: యూనివర్సిటీ పేరులో- ‘నేముంది’?

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

1 COMMENT

  1. జాన్సన్ చొరగుడి గారి విశ్లేషనలు బాగుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles