- సఫారీ ఆల్ రౌండర్ మోరిస్ కు 16 కోట్ల 25 లక్షలు
- ఢిల్లీకి స్మిత్, బెంగళూరుకు మాక్స్ వెల్
- 14 కోట్ల 25 లక్షల ధర పలికిన మాక్స్ వెల్
ఐపీఎల్ 14వసీజన్ మినీ వేలంలో విదేశీ క్రికెటర్లు కోట్ల రూపాయల పంట పండించుకొన్నారు. 75 లక్షల రూపాయల కనీస వేలం ధరతో బరిలో నిలిచిన సఫారీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రికార్డు స్థాయిలో 16 కోట్ల 25 లక్షల రూపాయల ధరను అందుకొన్నాడు. గత సీజన్ వరకూ బెంగళూరు ఫ్రాంచైజీకి ఆడిన మోరిస్ ను ప్రస్తుత 14వ సీజన్ కోసం జైపూర్ ఫ్రాంచైజీ దక్కించుకొంది. ఓ విదేశీ క్రికెటర్ దక్కించుకొన్న అత్యధిక వేలం ధర మోరిస్ దే కావడం విశేషం. కంగారూ స్టార్ ప్లేయర్లు గ్లెన్ మాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ సైతం వేలంలో మెరిశారు. 2 కోట్ల రూపాయల కనీస ధరతో ప్రారంభమైన వేలంలో….ఆస్ట్ర్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్స్ అత్యధికంగా 14 కోట్ల 25 లక్షల రూపాయలు దక్కించుకొన్నాడు.
గత సీజన్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ కు 10 కోట్ల ధరకు ఆడినా దారుణంగా విఫలమైన మాక్స్ వెల్ ను ఫ్రాంచైజీ యాజమాన్యం విడిచిపెట్టింది. దీంతో 2 కోట్ల రూపాయల ధరతో వేలంలో మాక్స్ వెల్ ను ఉంచారు. వేలంలో 14 కోట్ల 20 లక్షల రూపాయల ధరకు బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకొంది.
Also Read: భారత్ తో టీ-20 సిరీస్ కు ఇంగ్లండ్ జట్టు
షకీబుల్ కు కేకేఆర్ సలామ్ :
బంగ్లాదేశ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ను కోల్ కతా ఫ్రాంచైజీ మరోసారి దక్కించుకొంది. గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన షకీబుల్ ఏడాది నిషేధం కారణంగా ఆటకు దూరమయ్యాడు. దీంతో మరోసారి 2 కోట్ల రూపాయల వేలం ధరతో షకీబుల్ వేలం బరిలో నిలిచాడు. కోల్ కతా జట్టు 3 కోట్ల 20 లక్షల రూపాయలకు షకీబుల్ ను సొంతం చేసుకొంది.
ఢిల్లీ గూటిలో స్టీవ్ స్మిత్ :
గత సీజన్ వరకూ జైపూర్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా వ్యవహరించిన ఆస్ట్ర్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ను 2 కోట్ల 20 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకొంది. ఇంగ్లండ్ స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని చెన్నై ఫ్రాంచైజీ 7 కోట్ల రూపాయలకు ఖాయం చేసుకొంది. హర్భజన్ సింగ్ స్థానంలో మోయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ తన జట్టులోకి తీసుకొంది.
Also Read: ఐపీఎల్ కు వీవో గుడ్ బై
శివం దూబేకు 4 కోట్ల 40 లక్షలు :
ముంబై యువఆటగాడు , పేస్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను జైపూర్ ఫ్రాంచైజీ 4 కోట్ల 40 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. గత సీజన్ వరకూ బెంగళూరు కు ఆడిన శివమ్ దూబే అంచనాల మేరకు రాణించినా యాజమాన్యం అతనిని వదిలించుకొంది.