Friday, April 26, 2024

ఆదివారం అహ్మదాబాద్ ఫైనల్ లో గుజరాత్ టైటన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ

  • శుక్రవారం మ్యాచ్ లో రాయల్ ఛాలంజర్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
  • ఆదివారం ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై పోరు
  • అహ్మదాబాద్ నరేంద్రమోదీ  స్టేడియంలో ఆఖరి పోరాటం

జోస్ బట్లర్ శతకంతో రాజస్థాన్ రాయల్స్ మొట్టమొదటిసారి ఫైనల్ లో ప్రవేశించింది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభమైన తర్వాత రాజస్థాన్ జట్టు ఫైనల్ లో ప్రవేశించడం ఇదే ప్రథమం. ఆదివారంనాడు అహ్మదాబాద్ మైదానంలో జరిగే ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ తో తలబడుతుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు బుధవారంనాడు లక్నో సూపర్ కింగ్స్ పై గెలుపొంది ఫైనల్ కు మొదటే చేరుకున్నది.  శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలంజర్స్ బెంగళూరు జట్టుపైన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పేస్ బౌలర్ పరిషద్ కృష్ణ మంచి ఫామ్ లోకి వచ్చి రాజస్థాన్ కి సకాలంలో సాయం చేశాడు. 22 పరుగులకు మూడు వికెట్లు తీసుకొని బెంగళూరు జట్టును మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. రాజస్థాన్ రాయల్స్ బాగా బౌలింగ్ చేయడం వల్ల బెంగళూరు ఇన్నింగ్స్ 157 పరుగులకే ముగిసింది. ఆ మాత్రమైనా రజత్ పాటిదార్ 42 బంతుల్లో 58 పరుగులు చేయబట్టి సాధ్యమైంది. రాజస్థాన్ తరఫున ఓపెనర్ బట్లర్ తో యశశ్వి జైశ్వాల్ నిలకడగా ఆడి 13 బంతుల్లో 21 పరుగులు సాధించి మంచి పునాది వేశాడు.

రాయల్స్ టాస్ గెలిచి రాయల్ చాలంజర్స్ ని బ్యాటింగ్ చేయమన్నారు. ఆ జట్టు సభ్యలు అనేక తప్పిదాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ ఒక్క వికెట్టు కూడా తీసుకోకుండా 31 పరుగులు ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ విజయానికి దోహదం చేశాడు. జైశ్వాల్ సిరాజ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టాడు. బెంగుళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి అయిదు ఓవర్లలో అయిదు వికెట్లు తీసుకొని 34 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ ఆధిక్యం ప్రదర్శించారు. గుజరాత్ టైటన్స్ పై జరిగిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన కృష్ణ బెంగళూరుపై మాత్రం విజృంభించాడు. కొహ్లీ తన ఆటను అద్భుతమైన సిక్సర్ తో ప్రారంభించి కృష్ణ బౌలింగ్ లో బంతిని సవ్యంగా ఆడకుండా అవుటైపోయాడు.

బట్లర్ 106 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో 18.1 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్  లక్ష్యం ఛేదించారు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో పద్దెనిమిదవ ఓవర్ లోని మొదటి బంతిని అద్భుతమైన సిక్సర్ కు లేపి బట్లర్ ఘనవిజయంతో ఆట ముగించారు. ఈ సీజన్ లో బట్లర్ అయిదు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. విరాట్ కొహ్లీ 2016 సీజన్ లో అయిదు శతకాలు సాధించాడు. బట్లర్ ఈ సీజన్ లో ఇంతవరకూ మొత్తం 800లకు పైగా పరుగులు చేశాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles