Thursday, May 23, 2024

ఈ దేశ పునర్వికాసానికి ఒక వారధి

పునరవ్ పద్మజగారి  చిరు పరిచయం !

(మన్యం ప్రజలకోసం పనిచేస్తోన్న ఓ మానవి)

పేరు పద్మజ , ఉండే ఊరు పార్వతీపురం. సేవ జట్టు, పునరవ్ సంస్థల్లో. కర్ణాటక నుండి ఉత్తరాంధ్ర వరకూ అనేకమంది ఆలోచనా పరులకు తెలిసిన పేరది. ఎంతోమంది కార్యకర్తలకు కార్యక్షేత్రం అయిన ప్రదేశ మది. గాంధేయవాదైన పారి నాయుడు మాష్టారు ఏర్పాటు చేసిన జట్టు సంస్థతో కలిసి పని చేసిన పద్మజగారు ప్రాథమికంగా మానవతా వాది. పునర్వ/పునర్వి సంస్థల వ్యవస్థాపకురాలు. సమాజానికి మంచి చేయడంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో, ఎన్నిరకాల మోసాలు మోయాలో, మరెన్ని విధాల వ్యక్తులతో యుద్ధాలు చేయాలో ఇన్నేళ్ళ ప్రయాణంలో తెల్సిన వ్యక్తి. సంపాదించుకునే ఉద్యోగాన్ని కాదని, మనస్సాక్షి మాట విని, సేవా మార్గంలో ఉన్న సంవేదనాత్మక స్పందనల్ని అనేకమంది అభాగ్యులకు పంచుతున్న వ్యక్తి. అక్కడంతా అమ్మా అని పిల్చుకునే ఆశయశీలి!

ఆచరణకు మించిన ఆద్యాత్మికం లేదు

అందుకే, నమ్మిన విలువలకి కట్టుబడి ప్రజాపక్ష పనులకోసం నడుం బిగించారు. గ్రామాల్లో పేట్రేగుతున్న మద్యం సమస్య పై పోరాడారు. పౌరసమాజంలోని అక్రమాల్ని ప్రశ్నించారు. చెత్త సమస్య పై నిర్మాణాత్మక వైఖరితో పని చేస్తున్నారు. అంతేకాదు, సాధికారికత దిశగా అడుగులు వేస్తూ సమష్టిగా కృషి చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం మొదలుకొని, ‘మనం’ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వరకూ, కాగితం తయారీ నుండి కాయగూరలు పండించడం దాకా ఎన్నో ప్రయోగాలు, అన్నే అనుభ వాలు, మరెన్నో మమకారాలు. ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలు ఈ దేశంలోని యువతకు తిరుగులేని స్పూర్తి. సొంతంగా ఆత్మగౌరవంతో జీవించడానికి కావలసిన అన్ని పనులూ వాళ్ళకి వచ్చంటే అది అతిశయోక్తి కాదు!

పకీరు శాంతమ్మ దంపతులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న కోనవలస అనే ఆదివాసీ గ్రామంలో ఉన్న దళిత కుటుంబం. ఐదెకరాల పొలం, ముగ్గురు కూతుర్లు. కష్టం చేయడం తప్పా కల్మషం లేని మనుషులు వాళ్ళు. ఇంతలో ఆ భూమి పై ఇద్దరు బడా  భూస్వాముల కన్ను పడింది. ఉభయ గోదావరి జిల్లాలకి చెందిన ఇరువురూ చెరోవైపూ ఆక్రమించుకున్నారు. అరడజను మందికి పైగా కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఇతర అధికారులు మారారు కానీ భూమి రాలేదు. ఎందరి దగ్గరకో ఎన్నోసార్లు,  పదుల మైళ్ళు తిరిగిన రోడ్లు, న్యాయం మాత్రం జరగలేదు. ఇంతలో పునర్వి పద్మజ గార్ని కలిసారు. ఇప్పటికైతే ఆవిడ చేసిన పోరాటం కారణంగా మూడొంతుల పొలం చేతి కొచ్చింది. ఇంకా రావాల్సుంది. ఇలాంటి కథలు ఎన్నో!

శ్రీకాకుళం దగ్గర గ్రామంలో చదూతున్న తమ్ముడు హేమంత్. తన ప్రతి పుట్టిన రోజుకి ఏదో రకంగా మంచి పనో, సేవో చేద్దామనే మనసు. అలా ఒకసారి ఆశ్రమానికి వచ్చి అక్కడ పరిస్థితి చూసి స్వచ్ఛందంగా గత రెండేళ్ళుగా అక్కడే ఉండి కార్యాచరణలో భాగమయ్యాడు. ఉత్తరాంధ్ర మొదలుకొని ఒరిస్సా వరకూ, అద్దంకి నుండి కోస్తా ప్రాంతాల దాకా పరిమితుల్లో ఏ ఆధారం లేని పిల్లల్ని చేరదీసి వాళ్ళని చదివిస్తూన్న తీరు చూసి అభినందించకుండా ఉండలేం. అక్కడితో పద్మజ గారి కృషి ఐపోలేదు. నిజానికి ఇక్కడే మొదలైంది. అత్యుత్తమ ప్రభుత్వ అధికారిగా పనిచేసినామె వ్యవస్థ లోని లోపాలకు ప్రత్యక్ష సాక్షి. స్త్రీలపై బాల్యంలోనే జరిగే ఉన్మాదపు లైంగిక హింసకు వ్యతిరేకంగా నియమ బద్దమైన పోరాటాన్ని మల్చుకున్న ఒక వ్యక్తిత్వానికి సంబంధించి ఇదో చిన్న పరిచయం మాత్రమే!

పునర్వు కార్యాలయం

మానవతా మిత్రమండలి మొదటి సమావేశం నుండి మద్యపాన వ్యతిరేక ఉద్యమం వరకూ గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు మొదలు ప్రత్యామ్నాయ విద్యావిధానం వరకూ ఎన్నో కార్యక్రమాల్లో ఆశ్రమంతోనూ, పద్మజగారి తోనూ అనుబంధం. ఐదారు సంవత్సరాల సుదీర్ఘమైన కాలం తర్వాత మొన్నీ మధ్యన అకస్మాత్తుగా నేను ఆశ్రమానికి  వెళ్ళడం జరిగింది. అంతకు ముందు వరకు ఉన్న ప్రేమాభిమానాలు ఆమెలో రెట్టింపు అయ్యాయి కానీ ఏమాత్రం తగ్గలేదు. ప్రకృతి ఒడిలో పచ్చదనం కప్పుకుని అణువణువూ విరబూసినట్లుండే ఆ స్థలం అంటే నాకెందుకో ప్రత్యేక గౌరవం!

ఈ దేశంలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానాలపై ఒక బలమైన నిరసన అక్కడి పిల్లల కార్యాచరణ. ఈ సమాజంలో అమలవుతున్న అసమానతలపై ఎక్కుపెట్టిన ధిక్కారం పునర్వ పద్మజ గారి ఆచరణ. పెద్దగా ఆర్భాటమేదీ లేకుండా మౌనంగా పని చేసుకుంటూ నిరాడంబరంగా జీవించడం ఆమె నిబద్దతకి ఒక ప్రతీక మాత్రమే. ఆమె వల్ల స్పూర్తి పొందిన ఎందరో యువత ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. మరెందరో సామాజిక సేవ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు.ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయని పద్మజ గారి ముందు ఎందుకనో పైపై కబుర్లు చెప్పే చాలా మంది పెద్దమనుషులు నాకు మరుగుజ్జుల్లా కనబడుతూ ఉంటారు. ఎందుకనేది స్పష్టమే, ఆచరణను మించిన ఆధ్యాత్మికత నా దృష్టిలో వేరేదీ లేదు మరి!

(పార్వతీపురం నానమ్మ ఊరు. బాల్యం నుండి ఆ ప్రాంతంతో ఎన్నో జ్ఞాపకాలు. నాన్న ఊర్లో బంధువులు లేని లోటు పద్మజ గారి ప్రేమతో తీరిపోయింది. ద్వేషించడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ, మనుషుల్ని ప్రేమించడానికి ధైర్యం కావాలి. మనసుల్ని చదవగ లిగేంత హృదయం కావాలి. మమతల్ని పంచగ లిగేంత వైశాల్యం ఉండాలి. ఊర్లో దిగిన దగ్గర్నుండీ మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకూ అద్భుతమైన అభిమానాన్ని మాకు పంచిన ఆశ్రమ సైన్యానికి, ఎప్పట్లాగే మా ప్రశ్నల్ని, భావాల్ని భరించిన పద్మజ గారికి, ‘పునర్వి’ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని ఫొటోలతో  ఆలస్యంగా ఈ చిన్న రైటప్ !)

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles