Wednesday, April 24, 2024

‘జైైభీమ్’ సినిమా మన ఆలోచనను మారుస్తుందా!

ఈ ఏడాది దీపావళినాడు ఆమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫారంపై విడుదలయిన ‘జై భీమ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి కారణాలలో పలు కోణాలున్నాయి. పలు దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఒకే రోజు విడుదల కావడంతో దాదాపు దేశమంతటా పెద్దఎత్తున ఆమెజాన్ ప్రైమ్ తో పాటు, వివిధ అడ్డగోలు మార్గాలలో పైరసీ కాపీ ద్వారా కూడా సినిమా చూసి అంతే భారీస్థాయిలో చర్చ జరిగేటట్లు చేశారు. సినిమా నిర్మాతలు జ్యోతిక-సూర్య దంపతులు, దర్శకుడు జ్ఞానవేల్ తో కలిసి సరిగ్గా సినిమా విడుదలకు ఏడాది ముందు జైభీమ్ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. సినిమాపట్ల ఈ దేశపు బహుజనులలో ఒక ఉత్సుకత రేకెత్తించారు. సినిమా విడుదలకు నెలరోజుల ముందు మాత్రమే సినిమా ఆదివాసుల సమస్యకు సంబంధించిన సినిమాగా లీకులిచ్చారు. సినిమా కథాంశం ఏమై ఉండొచ్చన్న క్యూరియాసిటీని ఎక్కువ చేయడానికి ఒక క్రమపద్ధతిలో ప్రచారం చేపట్టారు. ఏమి చేసినా సినిమా విడుదల వరకే. సినిమా విడుదలయిన తరువాత సినిమాయే అనేక విషయాలను చర్చకు పెట్టింది.

సూర్య, జస్టిస్ చంద్రుడు

ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు కమర్షియల్ సినిమా పేరుమీద కొన్ని మూస, నమూనా చిత్రాలు వండివారుస్తూ వారి అభిరుచులను నియంత్రిస్తూ కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమ ఒకట్రెండు కుటుంబాల చేతుల్లో బందీగా మారిపోవడం ఒక విషాద వాస్తవం. తాజాగా థియేటర్ల మీద కూడా ఆ కుటుంబాలు గుత్తాధిపత్యం తీసుకున్నాక, ప్రయోగాత్మకంగా తీసిన సినిమాలకు వేదిక కరువైన రోజుల్లో ఓటిటి వచ్చి కొత్త సినిమా దర్శకులకు, కథకులకు, నటులకు కొత్త ఊపిరినిచ్చింది. అన్నిటికంటే ముఖ్యగా ఓటిటి ద్వారా ఇతర భాషా చిత్రాలను, వాటి అనువాదాలను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు చూడడం ద్వారా తమ అభిరుచులకు అనుగుణమైన సినిమాలను భాషాపరమైన ఇబ్బందులు అధిగమించి చూడగలుగుతున్నారు. తెలుగు సినిమా రెండున్నర కులాల, రెండున్నర కుటుంబాల పరిమితమైన సినిమాగా మారిపోవడానికి మనకు ఒక చారిత్రక క్రమమున్నది. దానివల్ల ఒనగూడిన సాంస్కృతిక ఆధిపత్యం వల్లనే కళింగాంధ్ర ప్రాంతపు భాషపట్ల చులకన భావం, ఇక్కడి ప్రజలను పనివాళ్లుగా, హాస్యగాళ్లుగా చూపించడం, రాయలసీమ ప్రజలను క్రూరమైన రక్తపిపాసులుగా, విలన్లుగా చూపించడం, గోదావరి జిల్లాలను అపర స్వర్గంతో పోల్చడం లాంటి అన్ని రకాల అవలక్షణాల విషాన్ని మన మెదళ్లలోకి విజయవంతంగా ఎక్కించగలిగారు.

Also read: మూడు రాజధానులు లేనట్టేనా!

న్యాయపోరాటం

ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ చంద్రు, యువ న్యాయవాదిగా ఉన్నప్పడు 1993లో తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటనపై ఆయన జరిపిన న్యాయపోరాటాన్ని సినిమాగా మలిచింది టుడి నిర్మాణ సంస్థ. వరుసగా నాలుగు సినిమాలు ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి చేసుకున్న ఒప్పందంలో భాగంగా తీసిన మొదటి సినిమా ఇది. ఈ దేశంలో అంబేడ్కరైట్ల నినాదమైన జై భీమ్ ను సినిమా టైటిల్ గా ఎంచుకోవడంతో సినిమా దళితులకు సంబంధించినదనీ, అంబేడ్కర్ ఆలోచనకు సంబంధించిందనీ ఊహాగానాలు వచ్చాయి. కాని సినిమా చూసాక మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇందులో దళిత ఇతివృత్తం లేదని, గిరిజన ప్రాంత సమస్యను పరిష్కరించడానికి కొందరు కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసిన ప్రయత్నం ద్వారా ఆ కేసు చంద్రు అనే యువ న్యాయవాదిని చేరడం, తాను చేసిన న్యాయపోరాటమే సినిమా అని కొందరు అంబేడ్కరువాదులు అనుకున్నారు. కాని, సినిమా తీసిన పద్ధతి అందరి ఆలోచనలను మార్చింది. మనమున్న వ్యవస్థకు బయట గిరిజనులు ఎలా నివశిస్తున్నారో, కులం ప్రాతిపదికగా మన దొంతర్ల సమాజంలో పోలీసు-న్యాయ వ్యవస్థలు ఎలా వ్యవహరిస్తాయో చాలా వాస్తవిక దృక్పథంతో తీసిన సినిమాగా అందరూ ప్రశంసించారు. కాని తమిళనాడులో అప్పటికే బలమైన కులవ్యతిరేక పోరాటాలు, పెరియార్, జ్యోతిబా ఫూలేల వారసత్వంగా ఇప్పటి తరపు రాజకీయ నాయకుల వరకూ మార్క్సిస్టు, అంబేడ్కర్ఆలోచన ధోరణులను అలవర్చుకుని నాస్తిక, ద్రవిడ స్వాభిమాన, రాజకీయ ఉద్యమాలు పెద్ద ఎత్తున నడిపిస్తున్న రోజులవి. వాటి కారణంగా అక్కడ సాహిత్యం , ప్రజాకళలు, నాటకం, సినిమా అనేక కొత్త పుంతలు తొక్కింది. దాని ఫలితంగానే అక్కడి సినిమా వాస్తవికతను నెత్తికెత్తుకుని మెకానిక్ షెడ్డులో పనిచేసే కుర్రవాడి ప్రేమకథ, స్మశానంలో సంచరించే యువకుడి కథను సైతం సూపర్ హిట్టు సినిమాలుగా అందించగలిగింది. తమిళ సినిమా కొత్త ఎత్తులు ఎక్కగలిగింది. ఈ సినిమాలో దర్శకుడికి బుద్ధుడు, అంబేడ్కర్ భావధారను మార్క్సిస్టు ఆలోచన సరళితో (లాల్-నీల్) మిశ్రమం చేయడానికి తోడ్పడాలన్న ఆలోచన ఉన్నట్టు మరికొందరు విమర్శకులు భావించారు. అదే సమయంలో సినిమాను అత్యంత వాస్తవికంగా చిత్రించినందుకు నటీనటులతో పాటు దర్శకుడిని కూడా ప్రశంసించారు. అంబెడ్కర్ రచనలను శ్రద్ధగా చదవడం తన వృత్తిలో తనకెంతో సహకరించిందని జస్టిస్ చంద్రు స్వయంగా చెప్పడం విశేషం.

ప్రకాశ్ రాజ్, లిజో మోల్ జోస్

సినిమాలో స్థానిక భాష మాట్లాడకుండా హిందీలో మాట్లాడే ఒక వ్యాపారి చెంప చెళ్లుమనిపించిన నటుడు ప్రకాష్ రాజ్ పై వివాదం ముదరక ముందే సమసిపోయింది. తరువాత రాసకన్నును కొట్టి చంపిన పోలీసు అధికారిని వన్నియార్ కులస్తుడిగా ఆ సినిమా చిత్రించిందని ఆ కుల సంఘం, పిఎంకె రాజకీయ పార్టీ భావించాయి. సూర్యను కొట్టినవారికి బహుమానం కూడా ప్రకటించాయి. దాంతో పోలీసులు సూర్యకు రక్షణ పెంచారు. ఈ రెండవ సంఘటన ఇప్పటికీ కులాధిపత్యం మనల్ని వెంటాడుతుందని నిరూపిస్తే, మొదటి సంఘటన మౌనంగా ఉండడం ద్వారా, నిర్లక్ష్యం చేయడం ద్వారా, పట్టించుకోకుండా ఉండడం ద్వారా బలంగా ప్రభావం చూపించగల ఇలాంటి సినిమాలపై చర్చ జరగకుండా చేసే ఆధిపత్య ధోరణిని నిరూపించింది. ఈ దేశంలో మెజారిటీగా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కథను తాము ఓన్ చేసుకోవడం ద్వారా ఐఎండిబి అనే సినిమా ర్యాంకింగుల వెబ్ సైట్ లో ఈ ఏటి అత్యుత్తమ చిత్రంగా ఓటింగ్ ఇచ్చారు. ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. సినిమా బిగువైన, బరువైన సంభాషణల ద్వారా అంబేడ్కర్ అభిమానులందరూ జై భీమ్ నినాదం బిగ్గరగా ఇవ్వగలిగే గొప్ప ఆత్మవిశ్వాసం అందించింది.

Also read: రోజురోజుకూ అడుగు కిందకు…

స్టాలిన్ ట్వీట్

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సినిమా చూసినరోజు రాత్రంతా నిద్రపట్టలేదని చేసిన ట్వీట్ ఆ రాష్ట్రంలో అందరూ సినిమా గురించి చర్చించుకునేట్టు చేసింది. దానికితోడు సినిమా విడుదలైన పది రోజులకు తమిళనాడులో పలన్ కుడి ఇరులార్ గిరిజన జాతి (మన చెంచులు, యానాదుల లాంటిది) జనుల విద్యావసరాల కోసం నిర్మాతలు ఒక కోటి రూపాయలను ముఖ్యమంత్రి ద్వారా విరాళంగా అందించారు. నిజానికి మన తెలుగు రాష్ట్రాలలో హక్కుల ఉద్యమకారులను పోలీసులు శాంతి భద్రతలకు భంగకరంగా భావించి హతమార్చినపుడు కెజి కన్న బీరన్, కె బాలగోపాల్, బొజ్జా తారకం తదితర న్యాయవాదులు చేసిన న్యాయపోరాటాలు జై భీమ్ సినిమా మాదిరిగానే తెరకు ఎక్కించగలిగితే మన నేలమీద నడిచిన జీవిత పోరాటాలు, బతుకువెతలు ఇప్పటి ప్రజలకు తెలుస్తాయి. హక్కులకోసం అసువులు బాసిన వీరుల వారసత్వాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటి యువతరానికి కొత్త సిలబస్ అందించగలం.

Also read: వైకాపా కార్యకర్తల నిరాశ నిజమేనా?

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles