Thursday, May 2, 2024

ఎన్టీఆర్ అసలు కథ విశ్లేషించిన ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి

శ్రీ కొండుభట్ల రామచంద్రమూర్తి 75వ సంవత్సరం వేడుక ఇటీవలేజరిగింది. 27.5.2023న ఒక చరిత్రాత్మక రచన ‘ఎన్ టి ఆర్ రాజకీయ జీవిత చిత్రం -అసలు కథ’’ ఆవిష్కరించారు. వర్తమానంలో ఉభయరాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే పూర్వపు అవిభక్త ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీఆర్ రంగస్థలం.  

1. పరిశోధన.

రెండు కనీసం పి హెచ్ డి ధీసిస్లు రాసినంత సమానమైన రచన ఇది. కాల్పనిక కావ్యం కాదు. రచయిత ప్రకటించిన అసలు కథ. నిజం, థ్రిల్లర్, కావ్యం, నవల, లేదా పెద్ద డ్రామా. అన్నింటికన్నా మించినది ఒక సాహసం, అద్భుతమైన  ధైర్యం.

2. ధైర్యం.

ఎన్టీఆర్ జీవితంతోపాటు, పోరాటాలు, ఎన్నికల సమరం, గెలుపు, ఓటములు, కేంద్ర రాష్ట్ర రాజకీయాలను, నట, నాటకీయాలు, కుట్రలను, దాని వెనుక ఉన్న పెద్దలు, సొంత కుటుంబపు సభ్యులు, కుల పెద్దలు, పత్రికలు, (పత్రికలనే అందామా) పెద్ద పాత్రికేయులు, వారి వ్యాపారులు, మూములు మనుషులు, ఓటర్లు, వారి సమష్టి నిర్ణయాలు, ప్రజాస్వామ్యం, అన్నిటికీ మించి రాజ్యాంగం, జడ్జీలు, జడ్జిమెంట్లు వాటికి సంబంధించిన లోపాలు, దుర్మార్గాలు, న్యాయాన్యాయాలు తెలుస్తాయి, అర్థమవుతాయి, అనుభవిస్తారు, ఆవేశానికి గురవుతారు.

3. సంక్షిప్తత.

పత్రికా రచయితగా రామచంద్రమూర్తికి ఉన్న దశాబ్దాల అనుభవాలన్ని రంగళించి, రగిలించిన అపారమైన రచనాసామర్థ్యం లేకపోతే ఈ రచన నాలుగైదు భాగాలుగా ప్రింట్ కావలసిది. కేవలం 450  పేజీల్లో బహుముఖీన కోణాలను సందర్శించజేయడం మామూలుగా సాధ్యం కాదు. ఒక్క అక్షరం కూడా పనికిరానిది లేదు. ఒక పాత్రికేయుడు పాత్రికేయతను నేర్వడానికి ఇదొక సిలబస్. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కచ్చితంగా జర్నలిస్టు, కమ్యూనికేషన్ నిపుణులు, ప్రొఫెసర్లు చదవాల్సిన సిలబస్. రచయిత వందల పుస్తకాలు చదివారు. ఉంటకించారు. వదిలేయడానికి ఎన్నో వదిలేయాల్సిన వాటి లెక్కలు ఎవరూ చెప్పలేరు.  కొన్ని గంటలు చదివి ఉండి ఉండవచ్చు, ఉండకపోవచ్చు.  అందులో వచ్చిన ఒక్క వాక్యం పిండడానికి ఎంత కష్టపడ్డారో. ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ప్రస్తావించారో తెలుస్తుంది. ఉదాహరణకు నేను రాసిన ఎన్నో న్యాయాన్యాయాల అంశాలు చదివిన తరువాత కేవలం ఒక్క రెండు పేరాగ్రాఫ్ లకు అంత లోతుగా వాడుకోగలిగారో అర్థమవుతుంది. (ఇష్టమైన వాళ్లు అవి తెలుసుకోని కొని చదువుకోవాలి. దాచుకొని పేజీనెంబర్లు రాసుకోవచ్చు)ఒక్క వ్యక్తి గురించి కూడా అనవసరంగా రాయలేదు. అవసరంమైనవి వదలలేదు.

4. ఎన్టీఆర్ రెండొ పెళ్లి

మొదటి పెళ్లి, రెండో పెళ్లి, కుటుంబ సభ్యుల సంఘర్షణ, లక్ష్మీపార్వతి, ఆమెను తిట్టిన వాళ్లు, రాజకీయాలకు వాడుకున్నవారు, అల్లుళ్లు- ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, కొడుకులు-ముఖ్యంగా హరికృష్ణ, బాలకృష్ణ, కూతుళ్లు, నాయకులు, వారికీ ఏదీ తెలియని కొందరు ఎంఎల్యేలు, పాత్రికేయులు, సంపాదకులు ముఖ్యంగా ఈనాడు అధినేతల కు సంబంధించిన విశ్లేషణ జరిగిందేమిటో కళ్లముందు కనిపించే రచన ఇది. ఇది కాదనడానికి వీల్లేని విశ్లేషణ. వారం వారం కొన్ని 40 ఏళ్ల సకలం అనీ సందర్భంపేరుమీద కాచి వడపోసిన రాసిన అనుభవం ఈ విశ్లేషణ. చాలామంది రాస్తున్నారు. వారం వారం రాస్తున్నారు. స్వార్థం, స్వప్రయోజనాలు, వ్యాపార అవసరాలు అన్నీ చాలా గొప్పగా దాచడానికి ప్రదర్శిస్తారు. కాని రామచంద్రమూర్తి ఉన్నది ఉన్నట్టు, ధైర్యంగా, సాహసంగా రాశారు. ఎవ్వరినీ తిట్టలేదు. నిందించలేదు. పుకార్లు వాడలేదు. ఉటంకించిన గ్రంధాలు, రాసిన వ్యాసాలు ఇంగ్లీష్ తెలుగు వ్యాసాలు, ప్రసంగాలు, ప్రకటనలు వాటిని సాక్ష్యాలుగా ఆధారాలుగా ఈ రచయిత విశ్లేషించి, నిర్ణాయకమైన ముగింపులను వదలకుండా ధైర్యంగా వివరించారు.కనీసం చదవడానికి కూడా దమ్ముండాలి. నా వంటి ఉదయం, సహపాత్రికేయుడిగా, ఎన్టీఆర్ ప్రెస్ మీట్ లను, ఇంటర్వ్యూలు రాసి, ఆ తరువాత కాలమిస్ట్ గా, పరిశోధక వ్యాసాలు రాసి, ఒక చిన్నస్థాయిలో ఆలోచించిన, రాసిన, రచించిన, రచయితను పరిశీలించి, మాట్లాడి, ఈ 450 పేజీలు చదివి అర్థం చేసుకుని ఇంత పనులు జరిగాయా అని ఆశ్చర్యపోయే అంచనాలను వివరించారు రామచంద్రమూర్తి.

6. హీరో కథానాయకుడు

ఎన్టీఆర్ ని కథానాయకుడు అనకుండా ఉండలేము. కేవలం ఈ రచనే కాదు, ఆ వాస్తవిక కథ కూడా అదే విధంగా ఉంది. అర్థం అవుతుంది. విలన్ ఎవరో, రెండో లెవల్, ఇంకా కింద జారిపడిపోయిన విలన్లు ఎవరోకూడా రచయిత వివరించారు. ఒక్కో అక్షరం, పేరాగ్రాఫ్ లు, పేజీలు, అధ్యాయాలు, మొత్తం పుస్తకం కదిలిస్తుంది, చదివిస్తుంది, వివరిస్తుంది, విశ్లేషిస్తుంది.

7. రెండు తిరుగుబాటులు

నాదెండ్ల భాస్కర్రావ్, చంద్రబాబు పోలికలు, నిజానిజాలు, దుర్మార్గాలు వివరంగా దొరుకుతాయి. 15వ అధ్యాయంలో నెత్తురు చిందని తిరుగుబాటు, తరువాత రెండు అధ్యాయాలు ఎన్టీఆర్ మంచి, లోపాలు, తప్పులు, కోపాలు, ఆవేశాలు, గుణాలు, అవలక్షణాలు, అన్నీ నిష్పాక్షికంగా ముందు పెట్టారు. చంద్రబాబు, లక్ష్మీపార్వతి, పత్రికా యజమాని అయిన సంపాదకులవారు, మరో అల్లుడు, కూతుళ్లు అర్థం చేసుకోవలసిన, చాలామంది సిగ్గుపడవలసిన అధ్యాయాలు ఇవి, మనసు (ఉంటే) అంతర్వాణి (ఉంటే) చదువుకోవాలి. నెత్తురు చేతికి అంటకుండా చంపేయవచ్చు. కేసుల్లో దొరకరు. న్యాయమూర్తులు, వాదులు (న్యాయం ఉంటే) వీరికి దొరకరు. హంతకులు అనొచ్చు, అనవలసిన  అవసరం కూడా లేదు. ఈ రాజకీయాన్ని, కుట్రలను, ఏ మాత్రం పట్టించుకోకుండా ఫేస్ బుక్ లో తెలుసుకోకుండా మాట్లాడే సమాజానికి, వోటర్లకు అర్థం కాదు. ఈ రచన ఒక్కో అధ్యాయంలో వివరంగా చదువుకుంటే బాగుంటుంది.

9. పుకారుల శక్తి

అడుగడుగునా కనపడని, కనపడిన అనేకమైన అపార్థాలు, పుకార్లలను ఎవరెవరు ఎంత వరకు వాడుకున్నారో, ఫేక్ న్యూస్ అబద్ధాలు వాడుకుని వండి వడ్డించి వార్చిన వారు ఇవ్వాళ్ల కూడా దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయి అని లేకుండా ఏమీ పట్టని జనం కూడా కొంతవరకు నేరస్తులే అని వారనిపిస్తాయి.

ఇది చిక్కగా చక్కని నిర్మించిన ఇతివృత్తం రచించింది కాదు. జరిగింది

1. చరిత్ర రెండు పార్శ్వాలు వివరించే ఘట్టాలు

17వ అధ్యాయాల్లో ఒక కథానాయకుడి చరిత్ర రెండు పార్శ్వాలను దర్శింపజేయడం అసాధ్యం. సాధ్యం చేసారు రచయిత. మొదటి ‘చారిత్రక ప్రయాణం’ లో (చలన చిత్ర) కళ కళకోసం మాత్రమే కాదు, నమ్మి, ఆచరించినది ఆయన నటరత్న. దేశ రక్షణ, రాష్ట్రానికి విపత్తు సమయంలో తన బాధ్యత నిర్వర్తించినారు. నాదెండ్ల భాస్కరరావు కావలసిన నాందీ ప్రస్తావనలకు ఏర్పాటు చేసారు. ఒక కొత్త రాజకీయ సంచలన రంగానికి తెరదీసారు. దక్షిణాన, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ తోపాటు కర్నాటకలోనూ కాంగ్రెస్ పార్టీను ఓడించడమే గొప్ప చరిత్ర. ఆయన త్వరలో జాతీయ నాయకుడై నిలిచాడు.

2. నిమ్మకూరు పల్లెటూరు బైతు

రెండో అధ్యాయం 500 జనాభాలేని నిమ్మకూరు నుంచి భారత రాజకీయాలలో ప్రముఖుడైనాడు. సైకిల్ మీద అర్థరాత్రి రెండున్నర నుంచి పాలు సరఫరా చేయడంతో ఆయన జీవితం ప్రారంభించింది. మూడు ప్రయత్నాల తరువాత తారకం (ఎన్టీఆర్) ఇంటర్మీడియట్ పాస్ అయినారు. పాలు పంపింణీ చేస్తూనే చదువుకుంటున్నాడు. చదువు మీద ప్రేమతో కీలుగుర్రం హీరో పాత్ర వదులుకున్నాడు. అది హీరో నాగేశ్వర్ రావుకు సూపర్ హిట్ అయిపోయింది. 1947లో డిగ్రీ పాస్ అయ్యారు. మొదటి ఉద్యోగం మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చింది. కాని 11 రోజుల్లో ఉద్యోగం వదిలే పరిస్థితి వచ్చింది సినిమా అవకాశాలవల్ల. 90 రూపాయల జీతం ఉంటే లంచం 100 ఇవ్వడానికి జేబులో పెట్టడం తెలిసి మండిపోయారు. భద్రత వదిలేసి, అద్భుతమైన భవిష్యత్తు కోసం అని ముందే తెలియదు కదా. తారకం ఈ సారి రైలు మిస్ కాలేదు అని రచయిత కథనాన్ని ముందుకు నడిపారు. 

3. తెలుగు తెర మహాతార

మూడో అధ్యాయం తెలుగుతార మహాతార డూప్ లతో కాక వాస్తవంతో పెరిగిన వాడు ఎన్టీఆర్. తిండి లేకపోతే కప్పుటీతో మహాతార కడుపు మాడ్చుకోవడం అనూహ్యం. పస్తులున్నాడని మిత్రులకు తెలిసి బాధపడ్డారు. మిత్రులకు మన కథానాయకుడు సాయం చేసారు. వారిని అడగడానికి మొహమాటం అడ్డువచ్చింది. పస్తులున్నారు. తొలి సినిమా ఫెయిల్ అయినని సరదాగా మిత్రులు అంటే, దాంతో పారిపోను అని ధైర్యంగా చెప్పుకోవడం ఆయన కారెక్టర్ అని రచయిత వివరించారు. ఏ పాత్రలోనైనా శక్తివంచన పనిచేస్తానన్నది మరో గుణం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమా అని నడిచే దేవుడైన శంకరాచార్య చేసిన సంభోధన నిజజీవితంలో నిజమైంది. 35 సంవత్సరాలు రాముడై కృష్ణుడై కథానాయకుడై మెరిసిపోయాడు.

4. ఒక ప్రబలమైన జాతి

నాలుగో అధ్యాయం ‘ఒక ప్రబలమైన జాతి’ అంటూ తెలుగు జాతి చరిత్రను రచయిత సంక్షిప్తంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అధికారం స్థాపించడంనుంచి చివరిదాకా తెలియజేసారు. కమ్మ, రెడ్డి వంటి సామాజిక వర్గాల ఉన్నతీకరణ అంటూ రచయిత పేర్కొన్నారు. (జర్నలిస్టులు ఇటువంటి పదాలను గుర్తుంచుకోవాలి, రచయితలు భాషాసంపదను పెంచుకోవాలి.)  గొప్ప జర్నలిస్ట్ ఎం చలపతిరావు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావ్,  భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, భారత విదేశాంగ మంత్రి పివి నరసింహారావు (తరువాత ప్రధానిగా) ఎన్టీఆర్ తెలుగు తేజాన్ని వెలిగించారు. ముఖ్యమంత్రి అయినా, పోయినా, చరితార్థులైనా, చరిత్రహీనులైనా, ఎన్టీఆర్ మహానుభావుడుగా మిగిలిపోతాడని ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది.

5. అంజయ్యకు జరిగిన అవమానం

అయిదో అధ్యాయం ‘ఒక పెద్ద ముందడుగు’ లో అంజయ్య జరిగిన అవమానం వివరిస్తూ తెలుగు ఆత్మగౌరవాన్ని రేపిన వాడు ఎన్టీఆర్. అంతకుముందు రాజకీయాన్ని ఆరంభించే రోజున ఎన్టీఆర్ భార్య బసవతారకం ఎదురు రావాలి, కాని కనబడలేదనీ, కాని అప్పడికే ఆమె కారులో కూర్చుని ఉన్నారనే అంశం వారి జీవితంలో ముఖ్యమని అర్థమైంది.

6. వెండితెర దేవుడు

ఆరో అధ్యాయం ‘జనం హృదయాల్లో వెండితెర దేవుడు’ పార్టీ నిర్మాణం గురించి వివరిస్తుంది. ఎన్టీఆర్ కు 5 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాబోవని చంద్రబాబు అన్నారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారట. మరో విశేషం…తిరుపతి ఎన్టీఆర్ వస్తున్నారన్న మాట వినగానే జనం ఇందిరాగాంధీ ఉన్న కాంగ్రెస్ సభాస్థలం వదిలేసి పోయారు. ప్రధాని మాటలు వినాలని  ఆనాటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబు ఎంతగా అభ్యర్థించినా వినకుండా, వారిని భౌతికంగా అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. జనం వెళ్లిపోయారు, పలచబడిన సభ చూసిన ఆమెకు గుండె బరువెక్కిందని రచయిత రాశారు.

7 హీరో తప్పటడుగులు

ఏడో అధ్యాయం  ‘పరిపాలనలో హీరో తప్పటడుగులు’ హిందూ పత్రికలో జికె రెడ్డి సబబైన ముఖ్యమంత్రిగా ప్రధానికి ఎన్టీఆర్ కనిపించారని రాసారు. అనేకానేక జర్నలిస్టు పెద్దలు ఎన్టీఆర్ కోసం డిల్లీ  ఎదురుచూస్తుందనడం  గొప్పమాట. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును తగ్గించడం పెద్ద తప్పిదం అని ఆ తరువాత అర్థమవుతుంది. పట్వారీలు మునసబులు తొలగించినారు కాని ఏర్పడిన అవ్యవస్థ నిరాశపరచిందనే, అపరిపక్వంగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించలేమన్నది సరైన విమర్శలే. ఐ ఎ ఎస్ యాగా వేణుగోపాల (వైవి) రెడ్డి, కేఆర్ వేణుగోపాల్, పివి ఆర్ కె ప్రసాద్ వంటి చాలా మంది మంచి అధికారులను రక్షించుకోవడానికి ఎన్టీఆర్ ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేయడం గొప్ప విషయం. ‘అనుమానించినప్పుడు మొరటుగా వ్యవహరించినా, నిజం తెలిసిన తరువాత క్షమాపణం చెప్పడానికి, మరిచిపోవడానికి సిద్దంగా ఉండేవారు’ ఎన్టీఆర్ అని విశ్లేషించారు.

8. ఎన్టీఆర్ పునరుత్థానం

ఎనిమిదో అధ్యాయం ‘ఎన్టీఆర్ పునరుత్థానం’లో, అదేపనిగా ఏకుతున్న ఎన్టీఆర్ ను ఎలా వదిలించుకునే రిస్కు ప్రధాని కార్యాలయం పెద్దలు తీసుకున్నారనీ, సింహాన్ని బోనులో పెట్టారని ఇందిరాగాంధీ ఏ విధంగా నిర్ణయించుకున్నారో  రచయిత వివరిస్తారు. నాదెండ్ల తిరుగుబాటులో 91 మంది ఎంఎల్యేలు తెలుగుదేశంనుంచి వెళ్లిపోతారని అంచనావేసినా, అది 45నంబర్ దగ్గరే ఆగిపొయింది. మరోవైపు తెలుగుదేశం వారు 145 మందిని రక్షించుకున్నారు. అప్పుడు ఇందిరాగాంధీకి హైదరాబాద్ లో క్షేత్రవాస్తవికతను తెలిపారు. నెలరోజుల ప్రజాస్వామ్య పునరుద్ధరణ మహోద్యమం తర్వాత పదవిని మళ్లీ ఎన్టీఆర్ 1984 సెప్టెంబర్ లో గెలుచుకున్నారు.  ఇందిరపై ఎన్టీఆర్ అదొక చారిత్రకమైన విజయం. రాజశక్తిపైన లోక్ శక్తి విజయం అది అని వాజపేయి అన్నది విలువైన మాట.

9. మళ్లీ ఎన్నికలు

ప్రజాస్వామ్య పునరుద్ధరణ తరువాత పూర్తిగా చంద్రబాబుపైన ఆధారపడ్డారు. అదన్నమాట.  ప్రజాస్వామ్యం, బసవతారకం కాన్సర్ తో మరణించడం, ఆయన రెండో పెళ్లి కారణం కాకపోవచ్చు.  తిరుగుబాటు, ఆ తరువాత పరిణామాలు ప్రధానం. ఆయన ఇచ్చిపుచ్చుకునే ధోరణి ముఖ్యమంత్రి పనిచేయడంలో కొంత కనిపించింది.   కొన్నాళ్లకే మితిమీరిన ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. రద్దు చేయకుండా తనకు మరో అవకాశం ఇవ్వాలని భాస్కర్ రావు అడిగారు. కాని గవర్నర్ రద్దుకు సంతకం చేశారు. ఆ మధ్యలో తరువాత వంద ప్రింటులతో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా విడుదల చేశారు. 1984 లోక్ సభ ఎన్నికలలో తుపాను వలె టిడిపి ఘనవిజయం సాధించింది.  తమిళనాడు తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలు జరిపించి ఉన్నట్లయితే ఎన్టీఆర్ పవనాలను ఇందిరాగాంధీ పవనాలు ఓడించేవని రాజీవ్ గాంధీ అభిప్రాయం అని రచయిత, జాస్తి చలమేశ్వర్ కూడా విశ్లేషించారు.  (మధ్యలో పాఠకులు రచయిత విశేషం కూడా తెలియాలి. ‘ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీపై వ్యక్తిగతంగా దూషించడం మానుకోవాలని నిగ్రహం ప్రదర్శించాలని సూక్తిముక్తావళి చెప్పారు’ అన్నారు. జర్నలిస్టులు ఇటువంటి సమయోచిత భాష వాడే నేర్పు నేర్చుకోవాలి)

ఎన్టీఆర్ పాలన, నిర్మాణం, పార్టీ రాజకీయాలు, న్యాయపరమైన కేసులు వంటి రకాల చాలా ఇబ్బందులు వచ్చాయి. ‘అవినీతి పరుడని నిరూపించడానికి కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ ఎన్టీఆర్ పై చేసిన పోరాటం అత్యంత జటిలమైనది. ఇందులో న్యాయం కన్నా రాజకీయం అధికం….అవినీతికి అతీతమైన ముఖ్యమంత్రి అని పేరున్న ఎన్టీఆర్ ని అప్రతిష్ఠపాలు చేయడం, ఆయన వెలుగును మసకబారించడం కాంగ్రెస్ నాయకుల ఉద్దేశం.  తమ లక్ష్యాన్ని వారు దాదాపుగా సాధించారు. ఇందుకు న్యాయవ్యవస్థ నుంచి ఉదారంగా సహాయసహకారాలు అందాయి…. తనపైన అభిశంసన రాకుండా ముందు జాగ్రత్త పడుతూ న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని రాంజేత్మలానీ ప్రకటించారు’ అని రచయిత వివరించారు. ఎన్టీఆర్ పై పడిన కేసుల్లో వందపైన ఆరోపణలో ఏడు అంశాలలో మరింత ప్రాధమిక విచారణ జరిపించాలన్నారే గాని తప్పుచేసినారనే నిరూపణ జరిగిందనే నిర్ణయానికి రాలేదు. ఇప్పటి వరకూ ఏ కేసుపైనా ఆ విధమైన తీర్పు రాలేదు. ద్రోణంరాజు తరఫున వాదించిన న్యాయవాది ఎస్ రాంచందర్ రావు, చాలాకాలం వేధించిన కేసుల తరువాత ఎన్టీఆర్ 1994లో గెలిచిన దశలో అడ్వకేట్ జనరల్ గా అదే రామచంద్రరావును నియమించుకున్నారు. ఆ తరువాత అసెంబ్లీ రద్దు చేయించడం కోసమని ఢిల్లీ వెళ్ళిన  రామచంద్రరావ్ మరునాడు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా వైస్రాయ్ హోటల్ కు వెళ్ళి చంద్రబాబునాయుడు శిబిరంలోకి ఫిరాయించారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపడానికి ఆయన ఈ విధంగా సాయం చేసారని విశ్లేషించారు.

10. తొలి ఓటమి

‘మూకుమ్మడి 31 మంది మంత్రులను బర్తరఫ్ చేయడం ఒక విచిత్ర స్వయంకృత పరిణామం. అది తీవ్ర సమస్యలు సృష్టించింది. మండల్ కమిషన్ నివేదిక ద్వారా వీపీ సింగ్ ప్రభుత్వం సమాజాన్ని చీల్చివేసిందనీ, మండల్ కి కమండల్ తో సమాధానం చెప్పాలని బీజేపీ యోచన’ అని రచయిత ప్రస్తావించారు.

రాజీవ్ గాంధీ హత్య తరువాత రామకృష్ణ ధియేటర్లు తగులబెట్టారు. ఆ సమయంలో విశాఖపట్టణంలో ఉన్నఎన్టీఆర్ ను షిప్ యార్డ్ గెస్టుహౌస్ కి  భద్రంగా తరలించాలని విశాఖ పోలీసు కమిషనర్ అన్నారు. ‘నేను దాక్కోలేను. రేపు పత్రికలన్నీ రాజీవ్ హత్య వార్తతో పాటు నేను దాక్కున్న వార్తను కూడా ప్రముఖంగా ప్రచురిస్తాయి. నేను పిరికిపందను కాదు. చావాల్సి ఉంటే ఇక్కడే చచ్చిపోతా. చావు ఒకేసారి వస్తుంది. చావు గురించి నేను భయపడను’ అని మొండిధైర్యంతో అన్నాడు. ఇది ఆయన కారెక్టర్.

విమర్శించే విషయంలో కూడా రచయిత ఈ హీరోని వదల్లేదు. ‘ఎన్టీఆర్ సినిమా మోజు తలకెక్కి రాజకీయాలకు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు’ అని విమర్శించారు.  ఒకనాటి స్వేహితుడూ, హితైషీ అయిన రామోజీరావ్ తన ఈనాడు 16 మే 1991నాడు మొదటి పేజీలో తన సంతకంతో సంపాదకీయం రాశారు. ‘యువనాయకుడిని పార్టీ పగ్గాలు అప్పగించారని సూచించారు’ అని రచయిత రాబోయే తిరుగుబాటు సూచన (హింట్) అందింది.

11. శృంగారం

‘‘ఆమె పేరు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ హృదయం దోచుకొని ఆయన జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి ఎవరో సినీమా రచయిత రాసిన స్క్రిప్టును అనుసరించినట్టు నడుచుకున్న మహిళ…’’ అంటూ చాలా జాగ్రత్తగా రచయిత రాసారు. వెంటనే అనుమానానికి ఒక జవాబు కూడా దొరుకుతుంది. ‘ఎన్టీఆర్ కుటుంబం పెద్ద వ్యూహమే ఉన్నదని నమ్మింది. కానీ వ్యూహం ఉండే అవకాశమే లేదు’’ అని కూడా రచయిత తేల్చారు.

12. చరిత్ర తిరగరాసిన హీరో.

సెప్టెంబర్ 27, 1994న  ఎన్నికల 2 దశల షెడ్యూల్ ప్రకటన తరువాత మరో రాజకీయ  చరిత్ర సృష్టించారు కథానాయకుడు. ఎన్టీఆర్ ప్రసంగం ప్రారంభిస్తారు.  కాని కొనసాగించడం ఆయన వల్ల కాదు, 10 నిమిషాల తరువాత లక్ష్మీపార్వతి మైకు అందుకొని తన ప్రసంగాన్ని చాలాసేపు కొనసాగిస్తాడు. తనని భార్యగా, ఇతరులు వదినగారిగా ఆమెను గౌరవించాలని ఎన్టీఆర్ కోరుకున్నాడు. ప్రజలు అందుకు ఒప్పుకున్నారు.  ప్రజాగర్జన సభలు జయప్రదమైనాయి. అటు పక్కన బుల్లెట్ ప్రూఫ్ అద్దాల చాటున ప్రధాని పి వి ప్రసంగిస్తున్నారు. మరో టర్మ్ ఇచ్చి భిక్ష పెట్టండినని అడుగుతున్నాడు పి వి. చైతన్యరథం మీద ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి.  ప్రధాని భిక్ష అడగడం తగదని ఎన్టీఆర్ అదే పనిగా తిడుతున్నాడు.

రామోజీ గారు ఇతర ఏ వార్తపత్రిక యజమానీ వేయనంతగా రాజకీయాలమీద తీవ్ర ప్రభావం చేశారు, 1983లో గెలిచి తీరతామని చెప్పిన వారాయన. 1994 ఎన్నికలలో బొటాబొటిగా మెజారిటీ వస్తుందని ఎన్టీఆర్, లక్ష్మీపార్వతికి చెప్పిన రామోజీ అంచనాలు తలకిందులైనాయి. ఎన్టీఆర్ అఖండ మెజారిటీ సాధించారు.

రామోజీరావు భయపడవలసిన ప్రత్యర్థి. విశ్వసించదగిన మిత్రుడూ. కాని ఎప్పుడూ తన మాటే నెగ్గాలనీ, తన మార్గమే సరైనదనే అభిప్రాయం ఆయనది. ఈ వైఖరి ఇప్పటికీ కొనసాగుతోంది’ అన్నది రచయిత మాట. ఎన్టీఆర్ ఏక పక్ష నిర్ణయాలని రామోజీ విమర్శించేవారు. రెండో భార్య పట్ల రామోజీకి సదభిప్రాయం లేదు. చంద్రబాబునాయుడికి ఆయన ప్రేరణ. …అహంకారం ముర్తీభవించిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి చేయాలని అమాయకురాలైన ఆమె (లక్ష్మీపార్వతి) పూనుకున్నారు. తనకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నప్పడికీ ఎన్టీఆర్ ఆమెతో బేగంపేటలోని చికోటీగార్డెన్ లో రామోజీ నివాసానికి నవంబర్ లో తెలవారుజామున ఎముకల కొరికే చలిలో వెళ్లారు….గేటు దానంతట అదే తెరుచుకున్నది. కాని ఇంటి ప్రధాన ద్వారం తెరవడానికి అక్కడ ఎవ్వరూ లేరు…వారు జీవితాలలో అత్యంత సుదీర్ఘమైన నిరీక్షణ పది నిమిషాల పాటు తప్పలేదు. ‘ఆగ్రహంతో ఆయన (ఎన్టీఆర్) మోహం కందగడ్డలాగా ఎర్రగా తయారైంది’ అని లక్ష్మీపర్వాతి తర్వాత ఒక విలేఖరితో అన్నారు. చిట్టచివరికి రామోజీ రావు తలుపు తీశారు. ‘‘మేడమీద నడుస్తూ ఉన్నాను. అందుకని ఆలస్యమైంది’’ అని క్షమాపణ చెప్పకుండా, అపరాధభావన లేకుండా పొడిపొడిగా అన్నారు. ‘ఎన్టీఆర్ ని అవమానించాలని ఆయన (రామోజీ) అనుకున్నారు’  అని ‘కారవాన్’  ప్రతినిధి ప్రవీణ్ దొంతితో లక్ష్మీపార్వతి అన్నారు.  20 నిమిషాలు ఇద్దరూ (ఎన్టీఆర్, రామోజీ) మాట్లాడుకున్నారు. మద్దతు కావాలని పార్వతి రామోజీరావును అడిగితే పొడిగా మాట్లాడుతూ మెజారిటీ అత్తెసరుగా వస్తుందన్నారు. ఏ భావాలను వ్యక్తం చేయకుండా ఎన్టీఆర్ నిశ్శబ్దంగా తల ఊపి బయటకు నడిచారు.’

కొంత సంక్షిప్తంగా ఈ సంఘటనను రచయిత రామచంద్రమూర్తి ఎంత జాగ్రతగా ఎవ్వరినీ కొట్టకుండా తిట్టకుండా అసలు చెప్పవలసిన సంగతి వివరించడం జర్నలిస్టులు నేర్చుకోవలసిన మరొక పాఠం.  తరువాత ఎన్నికల్లో అఖండమైన విజయం కైవసం కావడం, ఆనక ఎవరేవరేం చేసారో తెలిసిందే కదా. విశాఖపట్టణంలో నాలుగువేలకు మించిన ప్రింట్ ఆర్డరుతో 1974లో ప్రారంభమైన ఈనాడు 2020 సంవత్సరం నాటికి 18 లక్షల కాపీలు అమ్మింది.  1994 ఎన్నికలకు ముందు సారా వ్యతిరేక ఉద్యమాన్ని బలపర్చుతూ ఈనాడు మొదటి పేజీలో 21 సంపాదకీయాలు ప్రచురించారు. ఎన్టీఆర్ ను కట్టడి చేయడంతో రామోజీ చంద్రబాబును ప్రొత్సహించడం ప్రారంభించారు. పదవినుంచి టిడిపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన 1995 తిరుగుబాటులో రామోజీరావుది ప్రధానపాత్ర.  ఈ క్రమంలో ఆయనకు ‘రాజగురువు’ అనే బిరుదు వచ్చింది. ఆ బిరుదుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు ప్రతి శనివారం రామోజీరావు నివాసానికి వెళ్లి ప్రభుత్వం లో ఏమి జరుగుతున్నదో ఏమేమి చేయాలో అడిగి తెలుసుకొని, నోట్సు రాసుకునే వారని ప్రతిపక్షం ఆరోపించేది… అని రచయిత విశ్లేషించారు. అసలు కథ అని రచయిత అనడం దానికి ఆధారాలివి.

13. అర్థాంగి పట్ల విశ్వాసం

ఈ అధ్యాయంలో ఎన్టీఆర్ పదవిని దింపడానికి జరుగుతున్న రాజీకీయాలు, రహస్యంగా కుట్రలు సాగుతున్న సంగతులు ప్రస్తావించి ముఖ్యమంత్రికి అర్థాంగికి రాజకీయాలు పెద్దగా తెలియవని వివరిస్తారు. లక్ష్మీపార్వతి చేసిన పొరబాట్లు ఏమిటో చెబుతారు.

14, 15. కీలకమైన రెండు అధ్యాయాలు – ‘వైస్రాయ్ హైడ్రామా, నెత్తురి చిందని తిరుగుబాటు’

అసలు జరిగిన కథ ఇక్కడే. ఎన్టీఆర్ మళ్లీ గెలిచిన తరువాత తిరుగుబాటు జయప్రదం కావడానికి చాలామంది పనిచేసారు. నిజానిజాల సంగతి పట్టకుండా ఈనాడు పత్రికతో పాటు దాదాపు అన్ని పత్రికలు చంద్రబాబువెంట పూర్తిగా నిలబడడ్డాయని 14, 15 రెండు అధ్యాయాలు చెబుతాయి. రాజకీయ శాస్త్ర విద్యార్థులు, టీచర్లు, జర్నలిస్టులు చదువుకోవచ్చు. 99శాతం పత్రికల ఎడిటర్లు, బ్యూరోల చీఫ్ లు, టిడిపి బీట్ గురించి రాసే వారు మహోత్సాహంతో చంద్రబాబుగారి వెంటతో ఉన్నారు. నిష్పాక్షికం అనేమాట ఉంటుందా అని కూడా వారికి తెలియదు. అప్పుడు ఉదయం పత్రిక లేదు. అనుమానాస్పద పరిస్థితులలో ఆ పత్రిక మూతపడింది.  ఈ పుస్తకంలో 374, 345 పేజీల్లో ‘‘దహిందూ ఆగస్టు 25వ తేదీ సంచిక తన సంప్రదాయాలకు విరుద్ధంగా ఒక ఊహాజనిత కథనాన్ని (స్పెక్యులేటీవ్ స్టోరీ) మొదటి పేజీలో ప్రధాన వార్తగా (బ్యానర్) గా ప్రచురించారు’’ అని రచయిత సాధికారికంగా వివరించారు. అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్ణయించబోతున్నారు అని ప్రచురించారు. ఏ పత్రికా ఈ విధంగా రాయలేదు. అది ఒక్క హిందూ ప్రత్యేక కథనం అని రచయిత రాశారు. హిందూ ఊహాజనిత కథనం తరువాత ఎన్టీఆర్ ఆవేశపూరితమైన ఆలోచనలకు అనుగుణంగా మరికొన్ని ఘటనలు చంద్రబాబు వెంట ఎంఎల్యేలు నడవడానికి ఉపయోగపడ్డాయి. వారికి నమ్మపలికిన ఆనాటి అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు చేసిన పని కూడా ఉపయోగపడింది. ‘‘ఈ పెద్దమనిషి (రామచంద్రరావు)ను నమ్మాం… అదే ఘోరమైన తప్పిదం’’ అని లక్ష్మీపార్వతి అన్నారని ఈ పుస్తకంలో వివరించారు. అనేక వివరాలతో రచయిత తిరుగుబాటు లేదా పదవీచ్యుతి చేయడం గురించిన తరువాత లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ 6 సెప్టెంబర్ 1995న ‘దహిందూ’లోఫార్స్ అండ్ ఫ్రాడ్ ఇన్ ఏపీ (ఆంధ్రప్రదేశ్ లో హాస్యాస్పదం, అక్రమం) అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని ప్రచురించారు.

‘అదంతా కుటుంబ వ్యవహారమని ప్రజలు భావించే విధంగా చంద్రబాబు చాలా చాకచక్యంగా కథ నడిపించారు’ అని రచయిత వివరించారు. ‘చంద్రబాబు తిరుగుబాటు అన్యాయం అని ప్రజలకు అనిపించలేదు. ప్రధాని పివికి, గవర్నర్ కృష్ణకాంత్ కి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, టిడిపి శాసనసభ్యులలో అత్యధికలకు, పత్రిక సంపాదకులకు, యజమానులకు అనిపించలేదు’ అని రచయిత విమర్శించారు.

రచయిత అన్నట్టు రాజకీయ వ్యూహరచనా వ్యాసంగంలో బోధనాంశమైన పాఠం కావడానికి అర్హమైనది. ‘లక్ష్మీపార్యతిని అనుమానంగా చూస్తూ, ద్వేషించే పరిస్థితులు కల్పించారు….ఎప్పరిని ఎప్పుడు ఎంతతరకు ఎట్లా ఉపయోగించుకోవాలో, ఎప్పుడు వదిలించుకోవాలో బాగా తెలిసిన రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు’ అని రచయిత స్పష్టంగా రాసారు.

16. నాటకం ముగిసింది నిష్క్రమించాడు

తిరుగుబాటు తరువాత కూడా ఎన్టీఆర్ సహజంగా గంభీరంగా ఉన్నాడు. కాని బ్యాంక్ ఖాతాను స్తంభింపజేయడాన్ని ఎన్టీఆర్ అవమానంగా భావించారు. పరుష పదజాలంతో దూషించారు. అంతలో బీవీ మోహన్ రెడ్డి మాట్లాడితే పగులబడి నవ్వుతారు. తరువాత నాగేశ్వర్ రావ్ గారితో సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సీరియస్ జబ్బు ఏదీ లేదు. కడుపు నొప్పి అన్నారు. పడుకునేందుకు పక్క గదిలోకి వెళ్లారు. తెల్లవారుజామున లేచారు. కసరత్తు చేసారు. గడ్డం చేసుకున్నారు. తరువాత మళ్లీ  నిద్రపోయారు. గుర్రుపెట్టడం విన్నానని లక్ష్మీపార్వతి అన్నారు. కాని గుర్రు క్రమంగా పెద్దదైపోయింది. డాక్టర్లు చూశారు. మరణించారని చెప్పారు. ఎన్టీఆర్ జీవితం గురించి రాసిన అనేక మంది రచయితలు కొన్ని ఘట్టాలను ఉటంకిస్తూ రామచంద్రమూర్తిగారు వివరంగా ఇచ్చారు.

17. స్వానురాగం

స్వానురాగం అనే ఒక సైకాలజీని, యుగపురుషుడి ఆంతర్యాన్నివాడుకునే వివరం కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ తనను తాను పొగుడుకునే వారని ఇతరులు కూడా పొగడారని కోరుకునే వారని వైవీ రెడ్డి అంటారు. స్వానురాగం కలిగిన వ్యక్తి నార్సిసిస్ట్ ..తన ఆకారం, తన దుస్తులు, తన శరీరం, తన అవసరాలు,తన స్వీయ అనుభవాలు ముఖ్యం. తనకు సంబంధం లేనిది ఏదైనా అప్రధానమే.

‘రాజకీయాలలో చేరటం ద్వారా మరో సామ్రాజ్యాన్ని జయించారు. అసాధారణ వ్యక్తి, ఒక లెజెండ్. ఆయనతో పోల్చదగిన వ్యక్తి మరొకరు లేరు’ అని రచయిత అన్నారు.

చివరకు, ఈ పుస్తకం చదివి, తెలుసుకునేవీ, ఉపయోగించవలసినవీ, గుర్తుంచుకునేవీ అనేకం ఉన్నాయనీ, 75 సంవత్సరాల  అనుభవం రంగరించిన రచయిత రామచంద్రమూర్తి  తెలుగు, ఇంగ్లీష్ లో సమర్థుడైన జర్నలిస్టు అనీ అర్థమవుతుంది.

మాడభూషి శ్రీధర్ 14.6.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles