Friday, April 26, 2024

ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్.వేణుగోపాల్

కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్ని నింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని ‘వీక్షణం’ పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ మీడియాగా ప్రఖ్యాతి పొందిన  ‘వీక్షణం’ పత్రికను వేణుగోపాల్ నిర్వహిస్తున్నారు.

మార్క్సిస్టు భావజాల వ్యాప్తి ధ్యేయంగా పెట్టుకున్న ‘దారిదీపం’ మాసపత్రికను శనివారం (అక్టోబర్ 1, 2022) సాయంత్రం జూమ్ సమావేశంలో వేణుగోపాల్ ఆవిష్కరించి ప్రసంగించారు. ‘పత్రికలు-సామాజిక చైతన్యం’ అనే అంశంపై అయన మాట్లాడారు. ఈ శీర్షికలో ఉన్న రెండు పదాలూ (పత్రికలూ, సామాజిక చైతన్యం) దుష్ట సమాసంగా, విరోధ భాసలా ఇప్పుడున్నాయని అయన ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే అని స్పష్టం చేశారు.

 1984లో తను జర్నలిజం లోకి అడుగుపెట్టినప్పుడు ‘ఆబ్జెక్టివ్ న్యూట్రాలిటీ’ ముఖ్యమని జర్నలిజం మొదటి క్లాసులో హితవుగా చెప్పేవారని, ఇప్పుడు అది ఆవిరైపోయింది వేణుగోపాల్ చెప్పారు. వార్త లో ఉండాల్సిన 5 డబ్ల్యూ, 1 హెచ్ సూత్రం (what, where, when, who, why and how) లో ముఖ్యమైన ‘ఎందుకు’ అన్న ప్రశ్నకు తావులేకుండా పత్రికలు వార్తలు నింపుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. 1955 ఉప ఎన్నికల్లో రెండు ప్రధాన తెలుగు పత్రికల వైఖరి చూసి ‘పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు-పత్రికలు’ అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని అయన గుర్తుచేశారు. 1960 నుంచి 80 వరకూ సామాజిక చైతన్యం కొద్దోగొప్పో ఉన్నా, 1990 నుంచి మూడు దశాబ్దాలుగా తిరోగమన పథంలో పత్రికలు పయనిస్తున్నాయని చెప్పారు.

ప్రపంచీకరణ తర్వాత తిరోగమనం 

ప్రపంచీకరణ తర్వాత తిరోగమనంలో పత్రికల ప్రయాణం సాగుతున్నదని, ప్రగతిశీలభావాలు ఉండడం చాదస్తంగా పరిగణింపబడుతున్నదని చెప్పారు. ‘న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్రోడక్ట్, నాట్ ఏ సోషల్ సర్వీస్’ అని వక్కాణించిన తాను పనిచేసిన పత్రిక యజమాని మాటలు ఉటంకిస్తూ-రెండు రాష్ట్రాల్లో తెలుగు పత్రికల ధోరణులను ప్రస్తావించారు. “ఏదైనా ఒక పత్రిక చదివితే వాస్తవం తెలియదు. ప్రతి ఒక్కరు రెండో మూడో పత్రికలు చదివి బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. ఇందువల్ల కొందరు పత్రికలు చదవడం మానేశారు,” అని వేణుగోపాల్ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన టెలివిజన్ ఒక ‘మాదక ద్రవ్యం’ అనీ, తర్వాత విజృంభించిన సాంకేతిక పరిజ్ఞానం మేలు-కీడుల కలయిక అన్నారు. “టెక్నాలజీ వచ్చి రచనను ప్రజాస్వామీకరించి మేలు చేసింది. కానీ అనియంత్రిత వ్యక్తీకరణ వల్ల కీడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వెబ్ లో అబద్ధాలపై బాగా వెచ్చిస్తూ పెద్ద పెద్ద కార్యాలయాలను నెలకొల్పడంతో మహా సముద్రంలో గుక్కెడు మంచినీళ్లు దొరకని  నావికుడికిలా పాఠకుడయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ నిరంతర వార్తా స్రవంతిలో మొత్తం మురికినీరేనన్నారు. 

రెండు దశాబ్దాలుగా తాము ఎన్నో ఒడిదొడుకుల మధ్య నిర్వహిస్తున్న ‘వీక్షణం’ పత్రికకు ఉన్న  మూడు లక్ష్యాలను (1. ప్రధాన వార్తా స్రవంతి లో వస్తున్న వార్తల వెనుక ప్రజా కోణాలు ప్రస్తావించడం 2. ప్రచార సాధనాల మౌనం వహిస్తున్న, విస్మరిస్తున్న ప్రజాకోణాలు చర్చించడం 3) సామాజిక ఘటనలను అర్థం చేసుకోనేలా ప్రజలకు  దృక్పథం ఇవ్వడం) వివరించారు.  “A good newspaper is a nation talking to itself” అన్న Arthur Miller ను ఉటంకిస్తూ- తప్పుడు చైతన్యాన్ని ప్రతిఘటించడం ఎలా? అన్నది సత్యానంతర యుగంలో పెద్ద సవాలన్నారు.

90 శాతం మీడియా నలుగురు ధనిక పారిశ్రామికవేత్తల చేతుల్లో…

యాజమాన్యపు కేంద్రీకరణ దుష్ప్రభావాన్ని వివరిస్తూ–90 శాతం మీడియా కేవలంనలుగురు ధనిక పారిశ్రామికవేత్తల చేతిలో ఉందని వేణుగోపాల్ చెప్పారు. విష విద్వేష భావజాలాన్ని పెంచుతున్న, పంచుతున్న సంఘ్ పరివార్ కమ్మేస్తున్న కారుచీకటిలో ‘దారిదీపం’ వెలుగు దివ్వె కావాలన్న అభిలాషను వెలిబుచ్చారు.

కార్ల్ మర్క్స్  ఫ్రీ ప్రెస్ గురించి చెప్పిన ఈ కింది ఒక మంచి మాటతో వేణుగోపాల్ ప్రసంగం ముగిసింది.

‘‘The free Press is the ubiquitous vigilant eye of a people’s soul, the embodiment of a people’s faith in itself, the eloquent link that connects the individual with the State and the world, the embodied culture that transforms material struggles into intellectual struggles and idealises their crude material form. It is a people’s frank confession to itself… It is the spiritual mirror in which a people can see itself… It is the spirit of the State, which can be delivered into every cottage, cheaper than coal gas. It is all-sided, ubiquitous, omniscient.”

విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు మాట్లాడుతూ సమాచారానికి, వ్యాఖ్యకు మధ్య రేఖ చెరిగిపోయింది చెప్పారు. గతంలో ‘జాతీయ స్ఫూర్తి’ అనే పత్రికను విజయవంతంగా నడిపి, ఇప్పుడు ‘దారిదీపం’ సంపాదకుడిగా ఉన్న డీవీవీఎస్ వర్మ ప్రసంగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles