Wednesday, February 1, 2023

ఎన్ డీటీవీ నుంచి వైదొలిగిన ప్రణయ్, రాధికారాయ్, రవీష్ కుమార్

  • స్వతంత్ర టీవీ న్యూస్ లో ఒక సముజ్జ్వల శకం ముగిసింది
  • అగ్రశ్రేణి వ్యాపారి అదానీ చేతుల్లోకి అత్యున్నత స్థాయి మీడియా సంస్థ

దేశంలో మిగిలిన ఒకే ఒక స్వతంత్ర టెలివిజన్ సంస్థ న్యూడిల్లీ టెలివిజన్ (ఎన్ డీ టీ వీ) బిలియనీర్ అదానీ చేతుల్లోకి పోతోంది. జాతీయ స్థాయిలో టెలివిజన్ న్యూస్ కు వైతాళికుడు అనదగిన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికారాయ్ ప్రొమోటర్ గ్రూప్ వెహికిల్ ఆర్ఆర్పీఆర్ హెచ్ నుంచి డైరెక్టర్లుగా  రాజీనామా చేశారు. బుధవారంనాడు వారు సమర్పించిన రాజీనామా వెనువెంటనే అమలులోకి వస్తుంది. సుదిప్త భట్టాచార్య, సెంథి సిన్నయ్య చెంగల్వరాయన్, సంజయ్ పుగాలియాలను డైరెక్టర్లుగా నియమించినట్టు ఎన్ బీటీవీ యాజమాన్యం ప్రకటించింది.

ఈ గ్రూప్ షేర్లను అదానీ కంపెనీ వీసీపీఎల్ కి బదిలీ చేశారనీ, ఎన్ డీటీవీ ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అదానీ మరో అడుగు ముందుకు వేశారనీ ఎన్ డీటీవీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీకి ఉన్న 29.2 శాతం షేర్లలో 99.5 శాతం షేర్లను అదానీ కంపెనీకి బదిలీ చేసింది. ఇంకా షేర్లు కొంటామంటూ అదానీ కంపెనీ ఓపెన్ ఆఫర్  ప్రకటించింది.

వీసీపీఎల్ దశాబ్దం కిందట ప్రణయ్, రాధికారాయ్ లకు రూ. 400 కోట్లు రుణంగా ఇచ్చింది. రుణం తిరిగి చెల్లించకపోతే షేర్లు ఇవ్వాలనే షరతుకు రాయ్ దంపతులు అంగీకరించారు. ఆ కంపెనీని అదానీ కొనుగోలు చేశాడు. తద్వారా పరోక్షంగా 29.18 శాతం షేర్లను సొంతం చేసుకున్నాడు. మరి 26 శాతం షేర్లు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో అదానీ కంపెనీ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇది డిసెంబర్ల 5 వరకూ ఉన్నది. ఇంతవరకూ వీసీపీఎల్ కొనుగోలు  ద్వారానూ, ఓపెన్ఆఫర్ ద్వారాను అదానీ సంస్థ సేకరించిన షేర్ల మొత్తం  37.29 శాతం.

సంస్థను స్థాపించిన తమతో సమాలోచనలు అదానీ సంస్థ జరపలేదనీ, తమకు ఎటువంటి సమాచారం లేకుండా మాకు అప్పు ఇచ్చిన కంపెనీని కొనుగోలు చేసి రంగంలోకి దిగారనీ ప్రణయ్ రాయ్,రాధికారాయ్ లు లోగడ స్పష్టం చేశారు. ఎన్ డీటీవీని 1984లో నాటి ఆర్థిక ప్రవీణుడు ప్రణయ్ రాయ్, జర్నలిస్టు రాధికారాయ్ నెలకొల్పారు. ఆ సంస్థ తరఫున ఎన్ డీటీవీ న్యూస్ చానల్ పుట్టింది. స్టార్ ఇండియా భాగస్వామ్యంతో 1998లో మొదటి న్యూస్ చానల్ అవతరించింది. 2003లో స్టార్ తో ఒప్పందం అయిపోయింది. స్వతంత్ర చానెల్ గా అవతరించింది. తర్వాత లైఫ్ స్టయిల్ చానెల్ తెచ్చారు. అనంతరం హిందీలో పెట్టారు. డిజిటల్ డివిజన్ కూడా బలమైన అంగంగా రూపొందింది. హిందీ చానెల్ ను ఎన్ డీటీవీ ఇండియా అనీ, ఇంగ్లీషు చానెల్ ను ఎన్ డీటీవీ 24X7 అనీ పిలుస్తున్నారు.  ఎన్ డీటీవీ ప్రాఫిట్ అనే పేరుతో బిజినెస్ చానల్ ని కూడా నెలకొల్పారు. ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ అని లైఫ్ స్టయిల్ చానెల్ స్థాపించారు. నిస్పాక్షికంగా, నిర్భయంగా వాస్తవాలు ప్రజలకు తెలియజేయడమే పరమావధిగా ఈ చానెళ్ళు పని చేస్తూ వచ్చాయి. ప్రణయ్ రాయ్, వినోద్ దువా ప్రధానంగా తెరమీద కనిపించి నడిపించారు. ముందుగా ఎన్నికల వార్తలూ, వ్యాఖ్యాలూ ఇచ్చారు. ఈ వారం ప్రపంచం (వరల్డ్ దిస్ వీక్) అనే శీర్షికతో వారాంతపు సమాచారం ఇచ్చేవారు. దాన్ని ముందు దూరదర్శన్ లో ప్రదర్శించారు. తర్వాత ఎన్డీటీవీలో ప్రసారం చేశారు. భాస్కర్ ఘోష్ తెరవెనుక ఉండి సాయం చేశారు. జర్నలిజంలో మహోన్నత ప్రమాణాలు పాటించినవారికి ఇచ్చే రామ్ నాథ్ గోయెంకా అవార్డును ఈ చానెల్స్ రెండు విడతల స్వీకరించాయి.

అత్యంత ప్రతిభాశాలి, అనుభవశాలి అయిన యాంకర్ రవీష్ కుమార్ కూడా ఎన్ డీటీవీ నుంచి తప్పుకున్నారు. ప్రమోటర్ గ్రూప్ నుంచి 99.5 వాటాను అదానీ కొనుక్కున్నాడని తెలిసిన తర్వాత రవీష్ రాజీనామా చేశారు. రవీష్ కు మెగ్ సేసే అవార్డు వచ్చిన సంగతి విదితమే. మోదీ ప్రభుత్వాన్ని హేతుబద్ధంగా విమర్శించడం ఆయన ప్రత్యేకత.

ఎందరో ప్రతిభావంతులైన జర్నలిస్టులకు శిక్షణ కేంద్రంగా ఎన్డీటీవీ పని చేసింది. బర్ఖాదత్, రాజదీప్ సర్దేశాయ్,       అర్ణబ్ గోస్వామి వంటి మెగా యాంకర్లు ఇప్పుడు బయటికి వెళ్ళి వెలుగుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles