Monday, April 29, 2024

సహచరి సహకారంతోనే ఇన్ని శిఖరాలు అధిరోహించాను

(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)

ఇంటర్వ్యూ: సుప్రసిద్ధ కవయిత్రి మందరపు హైమావతి

(ఇంటర్వ్యూ మూడవ, చివరి భాగం)

11. ప్ర. టెలివిజన్ కార్యక్రమాలపైనా, పత్రికారంగం పైనా  విశ్లేషిస్తూ రాసేవారు కదా,  ఆ వివరాలు చెప్తారా?

జ. ఇదివరకు ప్రస్తావించినట్టు హైస్కూలు దశలోనే పత్రికారచనపట్ల, జర్నలిజం పట్ల గౌరవం కలిగింది. దానికి కారణం ఇంటర్మీడియట్ కోర్సు హిందూపురంలోని ఎస్.డి.జి.ఎస్. కాలేజీలో చదివే రోజుల్లో నాకు తారసపడిన రచనలు నవమేధావి నార్ల, మూడు దశాబ్దాలు, జాబాలి, సీత జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు, మా వూరు, జగన్నాటకం, నార్లమాట వంటివాటి  కారణంగా తెలుగు పట్ల, సైన్సు పట్ల, జర్నలిజం పట్ల మక్కువ, గౌరవం బాగా పెరిగి భవిష్యత్తుకు దార్లు వేశాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఈ మూడూ ప్రధాన పాయలుగా నేను నిరంతరం చదువుతున్నాను,  రాస్తున్నాను.

ఇప్పుడిలా దాపురించింది కానీ పత్రికారంగమంటే మూడు నాలుగు దశాబ్దాల క్రితం దాకా స్ఫూర్తివంతంగా సాగే త్యాగమయమయిన జీవనవాహిని!! అత్యున్నత ప్రతిభ, అమోఘమైన పాండిత్యం, అవధుల్లేని సామాజిక ప్రయోజనం త్రివేణి సంగమంగా మేళవించి జర్నలిజాన్ని నడిపేవి. ఇప్పుడు రాజకీయ కాంక్ష, ధనాపేక్ష, ప్రచార ఆర్భాటం వాటి స్థానంలో ఆక్రమించేశాయి. టెక్నాలజీ ఎన్నోరెట్లు పెరిగింది కానీ అసలు సరుకు కుళ్ళిపోయి దుర్గంధాన్ని తారాస్థాయిలో వెదజల్లుతోంది. దీనికి కేవలం సోషల్ మీడియాను హాండిల్ చేస్తున్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చెయ్యడం కనబడుతుంది. ఈ బురదప్రాయమైన పరిస్థితికి యాభై ఏళ్ళుగా ప్రాధాన్యత పెరిగిన మీడియా కుటిలత్వమూ దానికితోడైన రాజకీయ, పారిశ్రామిక వర్గాల లాలూచీతో గుంటపూలు పూస్తున్న ప్రధానస్రవంతి మీడియా ధోరణులు అంతర్గత కారణాలు. ఈ మొత్తం పతనాన్ని నాలాంటి తరం కళ్ళారా చూడగలగడం ఒక మహావిషాదం! 

1996లో విజయవాడ రాగానే తొలుత పరిచయం అయిన మీడియా వ్యక్తి తెలకపల్లి రవి. ఈ సాన్నిహిత్యానికి సదా కలిసిపోయే ధోరణిలో కనబడే తెలకపల్లి రవి స్నేహపూర్వక స్వభావం ఒక కారణం కాగా; ఆయన సంపాదకుడుగా పనిచేసిన ‘ప్రజాశక్తి’ డైలీ కార్యాలయం నాకు ఐదారు నిమిషాల నడకదూరంలో ఉండటం మరో కారణం.  1997-1998 ప్రాంతంలో ప్రజాశక్తి దినపత్రికలో పత్రికారంగ ధోరణులపై కొన్ని వ్యాసాలు రాశాను. 1997 సెప్టెంబరులో ఆంధ్రభూమి దినపత్రికలో వారం, వారం టివి కార్యక్రమాలపై  సమీక్షా వ్యాఖ్యాన వ్యాసాలను ప్రారంభించాను. ఈ వారంవారీ కాలమ్ ‘టీవీక్షణం’1997 నుంచి 2010 దాకా కొనసాగింది. అది విజయవాడ, అనంతపురం, విశాఖపట్టణం, హైదరాబాదు వంటి చోట్లకు బదిలీ అయినా సుమారు దశాబ్దన్నర నడిచింది. అంత సుదీర్ఘకాలం పాటు, అంత సమగ్రంగా మరొకరు తెలుగులో రాయలేదనేది నిర్వివాదాంశం. కొంతకాలం ఆంధ్రభూమితోపాటు,  వార్త దినపత్రికలో కూడా ‘టీవీంద్రజాలం’ శీర్షికను నిర్వహించాను. ఇలా రాసిన వ్యాసాలు ఎనిమిది పుస్తకాలుగా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో అధ్యయనానికి పరిశోధనకు అందుబాటులో ఉన్నాయి. నాలుగేళ్ళలో వచ్చిన ఈ ఎనిమిది పుస్తకాలు 1999-2015 మధ్యకాలంలో వెలువడ్డాయి.

Also read: నాగసూరి కలంకత్తికి నలువైపులా పదును!

అపుడే ప్రవేశిస్తున్న టెలివిజన్ మాధ్యమం గురించి విమర్శలకు అవకాశం కల్పించిన పత్రికారంగం తనపట్ల వచ్చే విమర్శలకు వేదిక కల్పించడానికి కొంతవ్యవధి తీసుకుంది.  ఇక్కడ విజయం సాధించడానికి వైయక్తికమైన నా ప్రణాళిక కూడా వుంది. చివరకు 2007లో ‘ఈవారం’ అనే వారపత్రికలో ప్రధానంగా తెలుగు పత్రికల పోకడలనూ మరీ ముఖ్యంగా బి.సి.వర్గాల గొంతుకలకు రంగస్థలమైన ‘సూర్య’ పత్రిక మొదలైనప్పుడు; అలాగే ప్రత్యామ్నాయ వేదికగా ‘సాక్షి దినపత్రిక మొదలైనప్పుడు;  ఇతర తెలుగు మీడియా సంస్థల ధోరణుల తీరుతెన్నులను నా ‘మీడియా నాడి’ కాలమ్ తేటతెల్లం చేస్తూ డాక్యుమెంట్ చేసింది. నాలుగేళ్ళలో వచ్చిన ఈ వ్యాసాలన్నీ మూడు పుస్తకాలుగా వచ్చాయి.

మళ్ళీ 2013 నుంచి 2016 దాకా ‘ప్రజాశక్తి’ దినపత్రికలో వారం విడిచి వారం రాశాను.  2017 చివర నుంచి న్యూస్ ఆర్బిట్, న్యూవేవ్స్ న్యూస్ సైట్స్ లోను, ‘సూర్య ‘దినపత్రికలలో మీడియా , సోషల్ మీడియా గురించి రాశాను. కరోనా తొలి నెలల ప్రభావం దాకా సాగిన ఈ వ్యాసాలతో ‘మీడియా సోషల్ మీడియా’ అనే ఇ-బుక్ కూడా వెలువడింది. మొత్తం 20కి మించిన పుస్తకాలు ఈ విభాగంలో వెలువడి చాలా విశ్వవిద్యాలయాల్లో అధ్యయన, పరిశోధనా ఆకరాలుగా దోహదపడుతున్నాయి.

12. ప్ర. గాంధీ అంటే ప్రత్యేకాభిమానం మీకు. గాంధీ మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఇతర రచయితలతో కూడా రచనలు చేయించారు. ఇప్పటికీ వారం వారం ‘గాంధేయం ఓ గాండీవం’ శీర్షికతో ‘ఆంధ్రప్రభ’లో రాస్తున్నారు గదా! వీటి ప్రత్యేకత తెలపండి.

జ. వాస్తవానికి ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన కాలమ్ రాయడానికి  కృషి చేస్తున్న సమయంలో పరిష్కారమార్గంగా గాంధీజీ కనబడడం మహాశ్చర్యానికి గురిచేసింది. అది 1999 విషయం. దాదాపు అదే కాలంలో ‘మాన్ ఆఫ్ ది మిలీనియం’గా గాంధీజీని కొనియాడుతూ కొన్ని విషయాలు వెలికి వచ్చాయి. ఉద్యోగంలో ఉన్న వత్తిడి కారణంగా దృష్టి పెట్టే అవకాశం లేకపోయింది. సుమారు రెండు దశాబ్దాల తరువాత 2019 నుంచి గాంధీజీకి సంబంధించిన, వర్తమాన సమాజానికి దోహదపడే సిద్ధాంతాలను, పరిష్కారమార్గాలను, సంబంధించిన విస్మృత కోణాలను ఎప్పటికప్పుడు పరిచయం చెయ్యాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అలా మొదలైన గాంధీజీ ఆలోచనలతో ప్రయాణం ఇంకా విజయవంతంగా కొనసాగుతూ ఏడెనిమిది పుస్తకాలు వెలువరించడానికి దోహదపడింది. 2019 అక్టోబరు 2వ తేదీ గాంధీజీ విషయంగా ఐదు పార్శ్వాలలో ఐదు తెలుగు దినపత్రికలలో విభిన్నమైన వ్యాసాలు నేను రాయగలగడం నా రైటింగ్ కెరీర్ లో ఘనంగా గుర్తించుకోదగ్గ సందర్భం!

2019లో గాంధీజీ గురించి నార్ల వెంకటేశ్వరరావు రాసిన వ్యాసాలను ఒక సంకలనంగా వచ్చాయి రావెల సోమయ్య‌‌‌ గారి తోడ్పాటుతో! 2020 మొదట్లో గాంధీజీ గురించి రాసిన నేను వ్యాసాలను మిత్రులు కోదాటి రంగారావు చిన్న పుస్తకంగా వెలువరించారు. ఆ పుస్తకం ఆరు నెలల తర్వాత రెండో ఎడిషన్ గా, తర్వాత సంవత్సరానికి మూడో ఎడిషన్ గా, తర్వాత 2022 డిసెంబరులో నాలుగవ ఎడిషన్ కావడం విశేషం.  ఇలా ప్రవర్ధమానమవుతూ వెలువడి అభిమానపాత్రమయింది. ఆ పుస్తకం పేరు ‘అసలైనవిప్లవవాది సిసలైన సిద్ధాంతకర్త గాంధీజీ’!

కరోనా సమయంతోపాటు తోడైన పదవీ విరమణను దృష్టిలో పెట్టుకుని 2020 జులై నుంచి ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో గాంధీజీ మీద ఒక వినూత్నమయిన పరిశోధనతో కూడిన ధారావాహిక కాలమ్ ప్రచురించడానకి ఎడిటర్ శ్రీ వై.యస్.ఆర్. శర్మ వేదికనిచ్చారు. ఆ శీర్షిక మూడేళ్ళు దాటి ఒక యాభైమంది గత తరాల, వర్తమాన రచయితల  విశ్లేషణలతో సాగుతోంది. ఇందులో వెలువడిన ఒక యాభై వ్యాసాలు ఇప్పటికి ‘గాంధీయే మార్గం’ పేరున రెండు సంకలనాలను నేనే వెలువరించాను. మరో రెండింటికి మించిన వ్యాస సముచ్ఛయం సిద్ధంగా వుంది. ఈ రెండు సంకలనాలు మరో సంవత్సరం వ్యవధి లోపు వెలువడతాయి. అలాగే ప్రముఖ రచయిత కాటా చంద్రహాస్ గాంధీజీ, కస్తూరిబా జీవిత కథలు రచించడానికి, ప్రచురింపబడడానికి నా పాత్ర గణనీయంగా ఉంది. అలాగే డా.కాళ్ళకూరి శైలజ గాంధీజీ గురించి రాసిన రెండు పుస్తకాలుకూడా!   మౌఢ్యాన్ని ప్రోది చెయ్యకుండా,  గౌరవనీయమైన హేతుబద్ధతతో సాగే సమన్వయ వాదం ఈ శీర్షికా వ్యాసాలలో కనబడుతుంది. ఈ కృషి  నాకు గౌరవాన్ని, తృప్తిని ఇస్తోంది. ఈ కృషి ఇంకొంతకాలం కొనసాగాల్సిన అవసరం వుంది.

తన లైబ్రరీలో పుస్తకాల మధ్య నాగసూరి వేణుగోపాల్

13. ప్ర. మీరు రాసిన సైన్సు రచనలను యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా పెట్టారుగదా! వాటి వివరాలు వివరించండి.

జ.  1999-2000 సమయంలో ‘ప్రజాశక్తి’ దినపత్రిక వారి ఉద్యోగార్థుల అనుబంధం దీపిక కోసం మిత్రులు అన్నవరపు బ్రహ్మయ్య ఆలోచనగా తెలకపల్లి రవి గారి ప్రోత్సాహంతో ‘ప్రపంచ వైజ్ఞానిక వైతాళికుల’ను ఒక సంవత్సరం పాటు పరిచయం చేశాను. ఈ వ్యాసాలే ‘సైన్స్ వైతాళికులు’గా మధులతా పబ్లికేషన్స్ పుస్తకాన్ని 2002లో వెలువరించింది. ఈ చిన్న పుస్తకం 2003 నుంచి 2014లో తెలంగాణ విడిపోయే దాకా పన్నెండేళ్ళపాటు తెలుగు ప్రాంతంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నిర్వహించే బి.ఇడి కోర్సు ఫిజికల్ సైన్సెస్ రిఫరెన్స్ పుస్తకంగా ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు చదివారు. అలాగే పర్యావరణం సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా విభాగంలో నిర్వహించే బి.ఏ. కోర్సుకు పాఠ్యాంశ పుస్తకాన్ని రచించాను. ట్రిపుల్ ఐటి కోర్సులో తెలుగు గురించిన నా వ్యాసాన్ని పిల్లలు చదువుకున్నారు. ఇంకా 2014 నుంచి ఐదారేళ్లు ఆంధ్ర ప్రదేశ్ లోని 9వ తరగతి పిల్లలు శాస్త్రవేత్త సర్దేశాయి తిరుమలరావు గురించి నా వ్యాసాన్ని పాఠ్యాంశంగా చదువుకున్నారు. అయితే మన అధికారుల, 9వ తరగతి తెలుగు వాచకం సంపాదకుల మెరుపు సామర్థ్యం ఏమిటంటే ఆ పాఠ్యాంశ రచయతగా నా పేరును అదృశ్యం చెయ్యడం!  ఆ విషయం గురించి పోరాడే తీరిక నాకు లేకపోవడం కూడా వుంది. ప్రస్తుతం 8వ తరగతి ఫిజికల్ సైన్సెస్ తెలుగు- ఇంగ్లీషు ఉభయ మాధ్యమాల పాఠ్య పుస్తకం నేను కూడా సభ్యుడిగా ఉన్న సంపాదక వర్గం ద్వారా వెలువడింది.

14. ప్ర. ఇప్పటివరకు మీ వయసుకంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురించారు. ఎన్నో పుస్తకాలు రాయడమే కాకుండా అడివి బాపిరాజుగారు, యద్దనపూడి సులోచనారాణి గారి పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. మీరు సంపాదకులుగా ఉన్న మిగిలిన పుస్తకాల వివరాలు చెప్పగలరా?

జ. మొత్తం 1999 నుంచి ఈ పాతికేళ్ళలో వచ్చిన పుస్తకాల సంఖ్య మూడు పాతికలకు కొంచెం లోపల ఉండవచ్చు. వీటిలో మూడింట రెండు వంతులు నా రచనలు కాగా;  మూడోవంతు సంపాదకత్వం వహించినవి. ఈ సంపాదకత్వం వహించిన వాటికి సంబంధించిన  తొలి పుస్తకం ‘శతవసంత సాహితీ మంజీరాలు’:  ఇటీవలి పుస్తకం ‘అఖిల కళా వైభవశ్రీ అడివి బాపిరాజు’. సుమారు ఈ పాతిక సంకలనాలకు పాతిక మంది మించిన మిత్రులు సహ సంపాదకులుగానూ,  350 మందికి పైగా ఈ సంకలనాలలో చేర్చబడిన రచనల కర్తలుగానూ కనబడతారు. విద్వాన్ విశ్వం, సర్దేశాయి తిరుమలరావు, తాపీ ధర్మారావు, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, అడివి బాపిరాజు, యద్దనపూడి సులోచనారాణి, పొట్టి శ్రీరాములు, గాంధీజీ వంటివారి గురించిన విమర్శనాత్మక సంకలనాలు ఒక తరహా కాగా; వైజ్ఞానిక కథలు, పర్యావరణ కథలు, మదరాసు బదుకులు, సైన్స్ ఎందుకు రాస్తున్నాం?,  తెలుగు భాష,ప్రసార భాషగా తెలుగు వంటి అంశాలకు సంబంధించి మిగతా సంకలనాలు వెలువడ్డాయి. ఈ పాతికేళ్ళలో సుమారు పాతిక సంస్థలు లేదా వ్యక్తులు వీటిని ప్రచురించారని చెప్పవచ్చు. సులోచనారాణి, అన్నమయ్య వంటి వార్ల సంకలనాలు త్వరలో రావలసి వుంది.

15. ప్ర. సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్ ట్రస్ట్ వంటి సంస్థలకు కూడా కొన్ని పుస్తకాలు రాస్తారు కదా… ఆ పుస్తకాల వివరాలు…

జ. సాహిత్య అకాడమీ ద్వారా ‘విద్వాన్ విశ్వం’ గురించి నా మోనోగ్రాఫ్  2011లో వెలువడింది. విద్వాన్ విశ్వం శతజయంతి సంవత్సరానికి రెండేళ్ళు ముందు ఈ పుస్తకం రావడంతో చాలా గుర్తింపు,  గౌరవాన్ని పొందగలిగింది. మళ్ళీ విద్వాన్ విశ్వం రచనలు రెండు రాష్ట్రాల విద్యా ప్రణాళికలో అంతర్భాగం అవడం మళ్ళీ మొదలైంది. 1928లో తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ కథను హైదరాబాదు నుంచి వెలువడే ‘సుజాత’ మాసపత్రిక, ప్రచురించింది. ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సైన్స్ ఫిక్షన్ కథలతో సంకలనం చెయ్యమని సాహిత్య అకాడమీ 2012లో కోరింది. డా నామిని సుధాకరనాయుడు తోడ్పాటుతో ఈ నాలుగు వందల పేజీల, 27 కథల సంకలనం పని 2013కి పూర్తి అయిపోయినా ఈ ‘వైజ్ఞానిక కథలు’ పుస్తకం మాత్రం 2017 సంవత్సరంలో వెలువడింది. ఈ పుస్తకం కూడా ఎంతో గుర్తింపు పొందడం, గౌరవాన్ని సంపాదించి పెట్టడం ఆనందదాయకం. స్వాతంత్ర్య సమరయోధులు, సాహిత్యవేత్త, ‘శ్రీ సాధన’ పత్రికా సంపాదకులు, పూర్వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ఇంగ్లీషు బోధించిన గురువుగారు అయిన  పప్పూరు రామాచార్యుల గురించి మోనోగ్రాఫును కూడా పూర్తి చేసి అకాడమీకి అందజేసి సంవత్సరం దాటింది. రేపో మాపో ఈ పుస్తకం కాపీలు చేతికి రావచ్చు.  ఇవి కాకుండా తెలుగులో పాపులర్ సైన్స్ రచనా తీరుతెన్నులు, తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనల తీరు గురించి రెండు సుదీర్ఘమైన వ్యాసాలను సాహిత్య అకాడమీ ప్రచురించే సంకలనాల కోసం పంపివున్నాను. నేషనల్ బుక్ ట్రస్ట్ వారికోసం 2010లో ‘సామాజిక మార్పు కోసం విద్య’ అనే పుస్తకాన్ని అనువాదం చేశాను. గత సంవత్సరం ‘సర్వేపల్లి రాధాకృష్ణ’ గురించి రాసిన 120 పేజీల మోనోగ్రాఫ్ అతి త్వరలో చేతికందుతుంది. ఇవే కాకుండా ద్రావిడ విశ్వవిద్యాలయం 2010లో ‘ద్రావిడ శాస్త్రవేత్తలు’ పుస్తకాన్ని ప్రచురించగా;  ఆ మరుసటి సంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రాన్ని బి ఏ విద్యార్థులకోసం ప్రచురించింది.

16. ప్ర. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. విరామెరుగని మీ రచనా జీవితంలో మీకు అండగా ఉంటున్న మీ సహచరి హంసవర్ధిని గారి గురించి మీ మనసులో మాట చెప్పండి.

జ.  నా జీవితంలోకి ఆకాశవాణి 1988లో ప్రవేశిస్తే, హంస వర్ధిని 1991లో తోడైంది. అంతకు ముందు కేవలం ఒక గోవాలోనే నేను ఉద్యోగం చేశాను. ఆమె తోడుగా అనంతపురం, విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాదు, కడప, మదరాసు, తిరుపతి నగరాలలో సుమారు మూడు దశాబ్దాలపాటు ఆకాశవాణి ఉద్యోగంతో మిళితమై ఈ సహచర్యం నడిచింది. ఈ బదిలీలన్నిటిలోనూ సద్దుకుపోవడం, కొత్త పరిస్థితులకు ఒదిగిపోవడం, సమస్యాత్మక పరిస్థితిని సమన్వయంతో అధిగమించడం  గమనించవచ్చు. తొలి రోజుల నుంచి ఇంటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను ఆమే చూసుకుంటున్నారు గనుకనే నా శక్తి సామర్థ్యాలన్నీ ఆకాశవాణి ఉద్యోగానికీ రచనా వ్యాసంగానికి కేటాయించగలుగుతున్నాను.  ఆమె రచయిత్రి కాకపోయినా,;  సాహిత్యకారులు, పండితుడు, మేథావి, ఎటువంటి పాత్ర పోషించగలరో ఆమెకు బాగా తెలుసు. మా ఇంటికి బంధువులు కన్నా మిత్రులే ఎక్కువ మంది వస్తారు. ఇద్దరం కలిసి సభలు, సమావేశాలతో పాటు ఇంకా నెలకో ఒకటో రెండు టూర్లు వెళ్లి వస్తుంటాం!

పెళ్ళికాకముందు సాహిత్యాభిలాషతో ఆమె కొనుక్కుని దాచుకున్న అమృతం కురిసిన రాత్రి, తిలక్ కథలు, ఖడ్గసృష్టి, మహాప్రస్థానం, సినీవాలి వంటి పుస్తకాలు ఇప్పటికీ మా ఇంటి గ్రంథాలయంలో ఉపయోగ పడుతున్నాయి. ప్రాంతీయమైన తెలుగు భాషా వైవిధ్యం గురించి, సంస్కృతి గురించి, వంటల గురించి ఆమెకి ఆసక్తి చాలా ఎక్కువ. వంటలకు సంబంధించిన పుస్తకాలు కూడా మా గ్రంథాలయంలో బాగానే వుంటాయి. నా ప్రతి బదిలీలోనూ మొత్తం గృహ సంబంధమైన లగేజీ కన్నా పుస్తకాల పెట్టెలే ఎక్కువ ఆక్రమించేవి. ఇప్పటికీ ఎనిమిది, పదివేల పుస్తకాలు దాకా నా వద్ద ఉన్నాయి. 15 ఏళ్ళ క్రితం కారు కొనకుండా నాలుగైదు లక్షలు వెచ్చించి మంచి బుక్ షెల్ఫ్ పర్మనెంటుగా ఉండేట్టు చేయించుకున్నాం. నేటికీ ప్రతి దినం నేను ఏడెనిమిది దినపత్రికలు, ఎన్నో ఇతర పత్రికలు, అలాగే పుస్తకాలు కొంటూనే వుంటాను. అదే సమయంలో నా పుస్తకాలు, నేను చదివేసిన పుస్తకాలు ఎన్నింటినో ఆసక్తిగల చదువరులకు క్రమం తప్పకుండా పంపిస్తుంటాను. ఇన్ని పనులు చేస్తూ, ఇన్ని రచనలు చేస్తూ ఇలా ముందుకు వెళ్తున్నానంటే ఆమె పాత్ర చాలా అమోఘమైంది అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.  పదవీ విరమణ పొందిన తర్వాత ఒక రకంగా నా శక్తి సామర్థ్యాలు పూర్తిగా రచనా వ్యాసంగం వైపే మళ్ళాయి. ఈ ధోరణిని ఆమె గౌరవిస్తూ ప్రోత్సహిస్తోంది.

మూఢనమ్మకాలన్నా, హేతురహితమైన పనులన్నా, అర్థంలేని మతాచారాలన్నా ఆమెకు వళ్ళుమంట. సగటు మహిళ పట్టణ ప్రాంతంలో ఎటువంటి ఆలోచనా రహితమైన రీతిలో ప్రవర్తిస్తుంది అనే ఆమె పరిశీలనలు ఆధారంగా కొన్ని వ్యాసాలు రాయమని 2005 ప్రాంతంలో ఆమె కోరారు. ఆ విషయాల ఆధారంగా ‘ప్రజాశక్తి’ ఆదివారం సంచికలో ‘సెన్స్ కామన్ సెన్స్’ పేరున కొన్ని వ్యాసాలు మా ఇద్దరి పేరున వెలువడ్డాయి. ఆ ఆలోచనాత్మక వ్యాసాలు అదే పేరుతో ఓల్గా గారి ముందుమాటతో పుస్తకంగా వెలువడి ఐదేళ్ళవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె తోడ్పాటు ఆ స్థాయిలో లేకపోతే నా ఆకాశవాణి ఉద్యోగమైనా,  నా రచనా వ్యాసంగమైనా ఇంత మోతాదులో ఇంత గుణాత్మకంగా సాగివుండేది కాదేమో!

మా ఇద్దరి శక్తి సామర్థ్యాలు, ఆసక్తి, ఆర్థిక వనరులు ఎంతో కొంత నలుగురికి ఉపయోగపడాలనే మా ప్రయత్నాలు కలిసి సాగుతున్నాయి. ఇందులో ఆమె మౌనంగా కనబడే పాత్ర ఎంతో కీలకమైనది కూడా!

చదువు విలువ తెలిసిన నాగసూరి వేణుగోపాల్ తల్లిదండ్రులు

17.  ప్ర. ఇప్పుడు ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగింది. 24 గంటలు టీ.వీ.లో ప్రసారమయ్యే సీరియళ్ళు, రొడ్డ కొట్టుడు కార్యక్రమాలు, శబ్ద కాలుష్యం ఇలా భరించాల్సిందేనంటారా? ఆకాశవాణి మళ్ళీ పూర్వవైభవం పొందలేదా…? ఆకాశవాణి ఉద్యోగిగా, సంచాలకులుగా మీరేమంటారు?

జ. మనిషి ఈ భూమండలం మీదికి వచ్చి ఎంతకాలమైనా రేడియో, సినిమా, టి.వి. టెలిఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్,  మొబైల్ వంటివి మనిషిని చుట్టుముట్టి వందేళ్ళు మించి పైబడలేదు. కనుక  ఇప్పుడు 60-80 వయసున్న వ్యక్తులు చాలా పెద్ద స్థాయిలో ఒకదాని తరవాత ఒకటి సంభవించిన సమాచార సాంకేతిక విప్లవాలను  చవిచూస్తున్నారు. కొంతకాలం పత్రికలు, రేడియో, సినిమా, టివి, సోషల్ మీడియా ఇలాంటివి మనిషి మీద ఒకదాని తర్వాత ఒకటి స్వారీ చేస్తూనే వున్నాయి. ఒక తరానికి నచ్చనిది కాలుష్యప్రాయంగా కనబడేది, తరువాతి తరానికి బహు పసందుగా,  మీదుమిక్కిలి తీపిగా కనబడటం మారిపోవడం మనం చూస్తూనే వున్నాం. కనుక గతించిన వైభవాలు గతించినవే!  రేపు తెరతీయబడే కొత్త అద్భుతం సరికొత్తగానే వుంటుంది. ఇదివరకటి అనుభవాల మేళవింపుగానో, వాటికన్నా మేలైనదిగానో వుంటుంది. కనుక కొత్తదంతా రోత, పాతదంతా పసిడి అంటే ఒక తరానికి నచ్చినా మరో తరం విభేదిస్తుంది. పత్రికలూ, సినిమాలూ, టీవి, కంప్యూటర్ అందుబాటులో లేని రెండు మూడు దశాబ్దాల కాలం ఇతర ప్రాంతాలలాగా తెలుగు ప్రాంతాన్ని కూడా ఆకాశవాణి ఏలింది; హరిత విప్లవం,  శ్వేత విప్లవం, చిన్న కుటుంబం,  పోషకాహారం వంటి పెద్ద మార్పులలో కీలక పాత్రను పోషించింది. మళ్ళీ అలాంటి పాత్ర పోషించగలదా అంటే అది ముందు ముందు మానవ జీవితంలో అంత ప్రధాన పాత్ర వహిస్తుందా  అనే దాని మీద ఉంటుంది. ఈ పరిణామాలను గుర్తించకుండా,  అధ్యయనం చెయ్యకుండా అర్థరహితంగా ఖేదించడం కూడా అనవసరమేమో!  ఇలా కాకుండా ఎప్పటికప్పుడు నిత్య స్పృహతో టెక్నాలజీ పట్ల మనిషి మసలుకోవాలి. లేకపోతే ఐదారు దశాబ్దాలలో ప్లాస్టిక్ భూతం ఎలా భూమండలాన్ని నాశనం చేస్తున్నదో అలా మరోటి మరింత దారుణంగా మన సంస్కృతిని, సంస్కారాన్ని దెబ్బ తీయవచ్చు. నిత్యస్పృహ, స్వయం ఎరుక ఒకటే తరుణోపాయం! దీనికి వేరే షార్ట్ కట్ లేదు.

18. ప్ర. ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు పొందారు గదా! చాలా పత్రికలు తెలుగు మాటల బదులు ఇంగ్లీషు శీర్షికలు పెడుతున్నారు. పత్రికలలో తెలుగుదనం ఉట్టిపడే భాష మళ్ళీ వస్తుందంటారా?

జ. ఇది కూడా సతతం మనలను ఆందోళన పెట్టే అంశం! నిజానికి సంస్కృతమో, ఉర్దూనో లేదా  ఇప్పటి ఇంగ్లీషు భాష లాగానో ఏదో ఒక భాష తెలుగు వంటి స్థానిక ప్రజల భాషలను గద్దిస్తున్నాయి,  గద్దెనెక్కుతున్నాయి. పశ్చిమగోదావరి.. ఈ మాటను ఎందుకంత శ్రమపడుతూ పలకాలి? హాయిగా పడమటి గోదారి అని అంటే ఇటు పలికేవాళ్ళకీ, అటు వినేవాళ్ళకి, ఇంకోవైపు అర్థం చేసుకునే వారికి సులువుగా వుంటుందికదా… నిజానికి ఈ విషయం గురించి కనీసం మనలాంటి వాళ్ళం అయినా ఎపుడయినా ఆలోచన చేశామా? ఒకవైపు ఇంగ్లీషు సంకరమవుతోంది అని మన తరం లేదా ఈ రకం ఆలోచనలున్నవారు భావిస్తున్నా అది మనకెంతో సౌలభ్యం, సదుపాయం అనే వ్యక్తులు, వర్గాలు మనకు పెద్ద సమూహాలుగా కనబడుతున్నాయి.  ఇలాంటి చర్చే తెలుగు మీడియం,  ఇంగ్లీషు మీడియం గురించి చేస్తూ వుంటాం!  అసలు సమస్య ఏమిటంటే మనం ఏ భాషలోనూ నైపుణ్యం సాధించలేకపోవచ్చు!   ప్రపంచ వ్యాప్తంగా అన్ని అభివృద్ధికి సంబంధించిన పార్వశ్వాలు అనాదరణకు గురవుతున్నాయి. వినోదాత్మకంగా వాణిజ్యాత్మకంగా ఈ సీరియస్ విషయాలు మారిపోతున్నాయి. కాబట్టి కొన్ని విషయాలకు కాలమే తీర్పు చెప్పాలి. అట్లని ఎవరికి వారు చేతులు ముడుచుకుని కూచోనక్కరలేదు. ప్రజాస్వామ్యంలో వైవిధ్యమే  కీలకమైన శోభ అని గమనించి ఏస్థాయిలో వ్యక్తులు, సంస్థలు ఆ స్థాయిలో కృషి చేయాలి. ఇందులో అస్పష్టత ఉన్నా అది తప్పదేమో!

Also read: అలవోకగా ఆత్మకథా రచన

(ఇప్పటికింతే)

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి

Hymavathi Mandarapu
Hymavathi Mandarapu
మందరపు హైమవతి ప్రఖ్యాత కవయిత్రి. ఆమె కవితా ముద్ర స్త్రీవాద కవిత్వంలో చెరిగిపోనిది. ఆమె కవిత ‘సర్పపరిష్వంగం’ తనను చాలాకాలం వెంటాడిందని చేరాతలలో చేకూరి రామారావు రాసుకున్నారు. అంతకు మించిన యోగ్యతాపత్రం అక్కరలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles