Tuesday, September 26, 2023

మనీ పర్స్ చూశారా!

సంపద సృష్టిద్దాం -06

మనం ఉండడానికి సౌకర్యవంతమైన ఇంటిని నిర్మించాలనుకుంటాం. అన్ని వసతులూ ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. సొంత ఇంటి పని పూర్తయ్యేవరకు అద్దె ఇంట్లో ఉండాల్సివస్తే అక్కడ కూడా వసతుల విషయంలో రాజీ పడం. హాయిగా గాలీ వెలుతురూ ఇంటిలోనికి వచ్చేందుకు వీలుగా ఎక్కడ కిటికీలు, తలుపులు ఉండాలో ముందే డిజైన్ చేసుకుంటాం. వాడుకలో ఉన్న వస్తువులు, ఎప్పుడో వాడే వస్తువులు, ఎప్పుడూ వాడని వస్తువులు వేటిని ఎక్కడ అమర్చాలో నిదానంగా ఆలోచించుకుని అమర్చుకుంటాం. అంటే ప్రతి ఇల్లూ ఒక నందనవనంగా ఉండేలా తీర్చుదిద్దుకుంటాం. అంతెందుకు, కాస్త విశ్రాంతి కోసం ఒక గుడికో, పార్కుకో వెళ్లినప్పుడు కూడా అక్కడ పరిసరాలు మనకు అహ్లాదకరంగా ఉండేందుకు పరితపిస్తాం. లేదంటే అక్కడ నుంచి – వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాం. మన పరిసరాలు మనకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటాం.

Also read: ఈజీమనీకి స్వాగతం!

మరి మనకు ప్రాణాధారమైన డబ్బుకు మీరు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మన విన్నపం మేరకు విశ్వం మనకు అందిస్తున్న డబ్బును ఎక్కడ దాస్తున్నారు? డబ్బుకు మీరు చూపించే చోటుబట్టే డబ్బుకు మీరిచ్చే ప్రాధాన్యత, విలువ తెలిసిపోతాయి. కోట్లాది రూపాయలు సంపాదించాలనుకుంటున్న సాహసవీరులకు ఒక పజిల్. తడుముకోకుండా ఇప్పుడు మీ బట్టల్లో ఎంత డబ్బు ఉంది? దాని డినామినేషన్ ఎంత? మీ పర్స్ లో ఎంత డబ్బు ఉంది? చెప్పగలిగితే సరే. చెప్పలేకున్నా సరే.

మన పల్స్ మనీపర్స్

మన ఇంటిలో డబ్బు స్థానాలపైన దృష్టి కేంద్రీకరించండి. ఏ స్థలంలో డబ్బు దాస్తున్నారు? ఆ ప్రదేశం సువాసన భరితంగా ఉన్నట్టు చేస్తున్నారా? వారానికి ఒక పర్యాయం సాంబ్రాణి ధూపం వేస్తున్నట్లయితే సంతోషం. (అది ఏ వారమైనా ఫరవాలేదు. ఇష్టదైవ ఆరాధనబట్టి ఎవరికి వారు ఎంచుకోవచ్చు). అక్కడ దీపావళి లాంటి పర్వదినపు పూజానంతర అక్షతలు చల్లి, అప్పుడు డబ్బు దాస్తుంటే భేషుగ్గా ఉన్నట్టే. ఇవి మూఢనమ్మకాలు మాదిరి కనిపించినప్పటికీ మనం క్రమం తప్పక పాటించాల్సిన ఒక క్రతువు. ఈ ప్రపంచాన్ని ఒక పటిష్ట బంధంలో కలిపి నిలిపివుంచే డబ్బుకు మనందరం ఇవ్వాల్సిన ఒక కనీస మర్యాద. ఒకే ఇంటిలో డబ్బుకు కేటాయించే ప్రదేశాలు కొందరు ఒకటికి మించి ఏర్పాటు చేసుకుంటారు. దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు. వివిధ బ్యాంకులలో డిపాజిట్లు దాచుకునే మాదిరిగా, వివిధ పథకాలలో పెట్టుబడుల ద్వారా డబ్బును పెంచేటట్లుగా పలు ప్రదేశాలలో డబ్బును నిల్వ చేయవచ్చు. మరికొంతమంది డబ్బు, బంగారం, ఇతర లోహాలను సైతం ఒకచోట భద్రపరుస్తారు. ఇది పూర్తిగా వ్యక్తిగతం.

Also read: ఆకర్షణ సిద్ధాంతమా!

మీ మనీపర్సుపై దృష్టి కేంద్రీకరించండి. చిరుగులున్నా, చిల్లులున్నా, పైన లెదర్ కవరుపై పగుళ్లు, మడతలు పడినా వెంటనే పర్సును మార్చే ప్రయత్నం చేయండి. పర్సుకు సెంటిమెంట్ ముడి పెట్టకండి. పర్స్ మరణించిన మన బంధువులు ఇచ్చారని. ఇచ్చిన వ్యక్తికి జ్ఞాపకంగా పదిలపరుచుకోవాలని, పాతపర్సుతో సెంటిమెంటు కుదిరిందని, పర్సు వచ్చిన వేళా విశేషం మంచిదని.. ఇతరత్రా మొహమాటాలను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టండి. పాత పర్సును వదిలించుకోండి. కొత్త పర్సును సిద్ధం చేసుకోండి. పర్సులో బస్సు టికెట్లు, పరిచితుల ఫోన్ నెంబర్ల కాగితాలు, సినిమా టికెట్ల ముక్కలు, డబ్బుకు సంబంధించనిది ఏదైనా గిరాటేయండి. పాత వస్తువులు పర్సులో పదిలపరుచుకోవడం మానేయండి. డబ్బు మాత్రమే మనీపర్స్ చిరునామా. పర్స్ ను పదిలంగా చూడడమే కాదు, పర్స్ లో మనీని అంతే నిమ్మళంగా ఆదరించాలి.

Also read: కృతజ్ఞత చెప్తున్నారా!?

అడుగు – నమ్ము – పొందు

చాలామందికి మనీ పర్సులో డబ్బును సర్దడం కూడా రాదు. అంటే వారికి తెలియకుండానే డబ్బు పట్ల నిర్లక్ష్యం ఉందన్నమాట. ఐదు వందల నోట్లు ఒక అరలో, వంద నోట్లు మరో అరలో, అంతకంటే తక్కువ విలువ నోట్లు ఇంకో అరలో సర్దుకోవాలి. ప్రతిరోజూ తెల్లవారగానే మీ అన్ని జేబుల్లో, పర్సులో మొత్తంగా వ్యక్తిగతంగా ఎంత డబ్బుందో సరిచూసుకోవాలి. నిన్నటికి, ఈరోజుకు డబ్బులో వ్యత్యాసం చెక్ చేసుకోవాలి. మన ఇంటిలో డబ్బును రోజూ లెక్కపెట్టకపోయినా వారాంతంలో, మాసాంతంలో డబ్బు పెరుగుదలను బేరీజు వేసుకోవాలి. పెరిగిన మొత్తం ఏయే రహదారుల్లో మన వద్దకు చేరిందో రూఢి పరుచుకుని వారందరికీ ధన్యవాదాలు తెలపాలి. తరిగిన మొత్తం ఏయే దారుల్లో మననుంచి తప్పిపోయిందో చెక్ చేసుకోవాలి. ఆ డబ్బును ఎందుకు వెచ్చించామో విచికిత్స జరపాలి. ఆ డబ్బు వినియోగంతో మనకు అందిన వస్తువుల లేదా సేవలవల్ల మన జీవితంలో చేరిన అదనపు విలువను తెలుసుకోవాలి. అది పాజిటివ్ గా ఉంటే మన ఖర్చును అభినందించాలి. లేదంటే మాత్రం మరోసారి అటువంటి ఖర్చులు చేయమని గట్టిగా తీర్మానించుకోవాలి. మన జేబులోంచి వెళ్లిపోయే ప్రతి రూపాయి చేర్చే అదనపు విలువ చాలా ముఖ్యమైనది. దానిని అర్థం చేసుకోగలితేనే డబ్బు దుర్వినియోగాన్ని అరికట్టగలుగుతాం. జీవితంలో దుబారా తగ్గించడానికి ఇదే సరైన మార్గం. అమెరికా అలనాటి అధ్యక్షుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్లు “రూపాయి ఆదా చేయడమంటే రూపాయి సంపాదించినట్లే”. మనీ పర్స్ కు గౌరవ మర్యాదలు ఇవ్వనివారు డబ్బును ఆదా చేయలేరు.

Also read: పోరాటంలోనే విజయం

తప్పక చేయండి: భూమి మాదిరిగానే మనిషికూడా ఒక పెద్ద అయస్కాంత క్షేత్రం. డబ్బు, సంపద, ఐశ్వర్యాలను ఆకర్షించాలనుకునే వారంతా మనలోని అయస్కాంత క్షేత్రం సుదృఢంగా చేయడానికి ప్రయత్నించాలి. అందుకోసం రాత్రిపూట పడుకునేటప్పుడు తూర్పువైపు లేదా దక్షిణంవైపు తలపెట్టి నిద్రపోవాలి.

Also read: అంతా మన మనసులోనే…

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles