Friday, April 26, 2024

లాక్ డౌన్ ఎత్తివేసినా అజాగ్రత్త ప్రమాదకరం

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను వివిధ రాష్ట్రాలు ఇప్పటికే సడలించాయి. కొన్ని చోట్ల సంపూర్ణంగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతోంది. తెలుగురాష్ట్రాల్లోనూ సడలింపులు జరిగాయి. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారు.ఆంధ్రప్రదేశ్ లో సాయంకాలం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతోంది. త్వరలో పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులే ఉన్నాయి. బతుకు – బతుకుదెరువు మధ్య సాగుతున్న ఈ పోరులో రెండూ అవసరమే. జీవించడం అన్నింటి కంటే ముఖ్యం. ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూనే ప్రభుత్వాలు, ప్రజలు కలిసి సాగాల్సివుంది. లాక్ డౌన్ /కర్ఫ్యూ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే, ఈ సడలింపుల వల్ల ప్రజలు ఇష్టమొచ్చినట్లు తిరిగితే కారోనా వ్యాప్తి మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉంది.

Also read: ‘సత్య’మేవ జయతే!

నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాం

గతంలో లాక్ డౌన్ పాక్షికంగా సడలించినప్పుడే  కొందరు నిబంధనలను గాలికొదిలేశారు. పూర్తిగా ఎత్తివేసిన తర్వాత రెచ్చిపోయారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దాని ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తే, భారీమూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిబంధనలను పర్యవేక్షిస్తూ, వ్యాక్సినేషన్ ను వేగవంతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులోనే 13 లక్షల 59 వేల 300 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ దిశగా నడిపించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించి తీరాల్సిందే. గతంలో ఒక్కరోజులోనే 6.32లక్షల డోసుల వ్యాక్సిన్లు వేశారు. తాజాగా, ఆ రికార్డును కూడా అధిగమించింది. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. రోజుకు 20 లక్షలమందికి వ్యాక్సిన్లు అందించగలిగిన మౌలిక వసతుల సామర్ధ్యం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఒకసారి తెలిపింది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల దాన్ని అందుకోలేకపోయింది. వ్యాక్సినేషన్ లో వెనుకబాటుపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈ ప్రక్రియను వేగవంతం చెయ్యాలని భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం మంచి పరిణామమే. జూన్ 21 నుంచి మరింత సమర్ధవంతంగా అన్ని వయస్సులవారికి అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు మాట ఇచ్చారు. అదే సమయంలో,  వైరస్ వేరియంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచించారు. అక్టోబర్ లో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనే మాటలు ప్రజలను భయపెడుతున్నాయి.

Also read: దేశమంతటా రాజకీయాలాట!

పొంచి ఉంది మూడో ముప్పు

రానున్న రోజుల్లో అది తప్పదనే నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ – అక్టోబర్ మధ్యకాలంలో మూడో వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు అంచనా వేశారు. జులై 15 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే, మూడో వేవ్ పరిణామాలు మూడు దశల్లో సాగుతాయాని వారు చెబుతున్నారు. (1) అక్టోబర్ నాటికి పతాక స్థాయికి చేరడం. ఐతే, సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే తీవ్రత తక్కువగా ఉంటుంది (2) సెకండ్ వేవ్ ఉధృతి పెరిగితే, థర్డ్ వేవ్ సెప్టెంబర్ లోనే కనిపించవచ్చు (3) భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం మొదలైన నిబంధనలను సక్రమంగా పాటిస్తే మూడో వేవ్ ప్రభావం అక్టోబర్ చివరలోనే ఉండవచ్చు. మొత్తంమీద  వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడో దశ తప్పదని, జాగ్రత్తలు పాటిస్తే ముప్పు తప్పుతుందని అంటున్నారు. మిజోరాం, మణిపూర్, సిక్కింలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ బాగా క్షీణించిందని ఐఐఎం కాన్పూర్ ప్రొఫెసర్ రాజేష్ రంజన్, మహేంద్ర వర్మ బృందం అంటోంది. కోవిడ్ పాజిటివిటీ రేటు చాలా రాష్ట్రాల్లో 5 శాతం కంటే తక్కువే ఉంది. కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయలో మాత్రం 10 శాతం పైనే ఉంది. దీనికి సమాంతరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకొని ఉండి ఉంటే బాగుండేది. దేశంలో అలా జరగలేదు. అదే మన ప్రభుత్వాల వైఫల్యం. ఈ తరుణంలో  డెల్టా ప్లస్ వేరియంట్ పై చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం భారీగా నష్టపోయాం. దీనికి కారణం డెల్టా వేరియంట్ అని నిపుణులు చెబుతున్నారు.

Also read: పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు

కలవర పెడుతున్న కొత్త వేరియంట్

ఇప్పుడు కొత్తగా, డెల్టా ప్లస్ అంశం అందరినీ కలవరపెడుతోంది. దీని విషయంలో ఆందోళన పడొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నా ఎవరు ఉండాల్సిన జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే. గతంలో ఇటువంటి విషయాలను తేలికగా తీసుకోవడం వల్లనే ఈ వ్యధ ఇంతదూరం వచ్చింది.   జాగ్రత్తలు పాటించడం ప్రజల వంతు, పర్యవేక్షించడం ప్రభుత్వాల బాధ్యత. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఫైజర్, ఆస్ట్రాజెనికా మొదలైన కొత్త వ్యాక్సిన్లను త్వరగా దేశానికి తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వం మరింత చురుకుగా ముందుకు కదలాలి. ఇప్పటికే ఎంతోమంది ఉపాధిని కోల్పోయాం. పనిచేస్తున్నవారిలోనూ చాలామందికి జీతాలు అందడం లేదు. పోయిన సంవత్సరం వేసిన చావుదెబ్బ నుంచి బయటపడకముందే ఈ సంవత్సరం అంతకు మించిన దెబ్బలు ఎదురయ్యాయి. వీటన్నిటిని అధిగమించేంత వరకు అన్ని రంగాలను ఎట్లా ఆదుకోవాలి, ఆదుకోవడంలో సమతుల్యతను ఎట్లా పాటించాలి, ఆరోగ్య,ఆర్ధిక, సామాజిక రథాలను ఎట్లా నడిపించాలన్నది ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. తోటి రాష్ట్రాల పట్ల ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కూడా చాలా అవసరం. విద్యాలయాలు తెరుస్తామంటున్నారు. పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. వ్యాక్సినేషన్ పెరిగి, వైరస్ వ్యాప్తి తగ్గేంత వరకూ ఈ చర్యలను ఆపడమే శ్రేయస్కరం. అతివిశ్వాసంతో వెళ్లడం క్షేమకరం కాదు. పిల్లల విషయంలో ప్రభుత్వాలు మరింత సున్నితంగా వ్యవహరించాలి. పునః సమీక్ష చేసుకోవాలి. తాళాలు తీశారని సంబరపడకుండా, అత్యంత జాగ్రత్తగా మెసలడం అన్నింటికంటే ముఖ్యం.

Also read: యూపీలో ఏమి జరుగుతోంది?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles