Tuesday, April 23, 2024

రాజకీయాలు మనకు అవసరమా?              

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

మనం వోట్లు వేసి గెలిపించిన పార్టీకి, పన్నులుగా మనం కట్టిన కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అధికారం ఇస్తున్నాం. ఆ డబ్బు నాయకులు ఎలా ఖర్చు పెడుతున్నారో చూడకుండా వదిలేయడం కరెక్టేనా. మీ డబ్బు మీరు ఖర్చు చేసేటప్పుడు కూడా వృధా కాకుండా జాగ్రత్త పడతారుగా. మరి పన్నుల డబ్బు మన అందరిదే కదా. అది అందరి మేలు కోసం ఖర్చవుతుందా లేదా చూడవలసిన బాధ్యత మనదేగా. జండాలు పట్టుకుని, కేకలు వేస్తూ ఊరేగకపోయినా  పరవాలేదు. కాని రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో చూడకపోతే వారి అవినీతికి మనమే అవకాశమిస్తాం. మన డబ్బు మనకు దక్కకుండా పోతుంది.

“మనకెందుకండీ రాజకీయాలు? అదో పెంట. దానికి తగ్గ వాళ్ళు వేరే ఉన్నారుగా”. ఇదీ ఒక సామాన్యుడి భావన. రాజకీయం గురించి పట్టించుకోవడం, ఆలోచించడం అనవసరం అనే భావన పాతుకు పోయింది మన సమాజంలో. కొంతమంది వోటు కూడా వెయ్యరు. తమ వోటును ఎవరో దుర్మార్గుడు దొంగవోటు వేసుకునే అవకాశం ఇస్తున్నారు. అలా దుర్మార్గులు ఎన్నికవడానికి వీలు కల్పిస్తున్నారు. అలా ఎన్నికైన కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ల ఇష్టం వచ్చినట్లు అందరి మీద పెత్తనం చెలాయిన్నారు. కాలక్రమంలో వాళ్ల పిల్లలే అధికారంలోకి వస్తున్నారు. రాజకీయ నాయకులకు ఏమీ తెలియక పోయినా నాయకులుగా చలామణి ఐపోతున్నారు.

మనం ఎన్నుకునే రాజకీయ నాయకుడికి చట్ట సభల్లో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియాలి. ప్రజల అవసరాలు, సౌకర్యాలకోసం ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో అక్కడ చర్చ జరుగుతుంది. అక్కడ చర్చించే విషయాలమీద కొంతైనా జ్ఞానం ఉండి అక్కడ మాట్లాడ గలగాలి. అది తెలియకపోతే అతను పనికిరానివాడు. అసలు ప్రజల సమస్యలేమిటో వాటిని ఏవిధంగా పరిష్కరిoచవచ్చో ఆలోచన చేయలేని వాడిని ఎన్నుకోవడం మన బుద్ధి తక్కువ. తెలివి, జ్ఞానం, నీతి, సేవా లక్షణం ఉన్న వాణ్ణే ఎన్నుకోవాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి.  

రాజకీయం అంటే ప్రజా సేవ. కానీ ఈ రోజుల్లో అది ఎన్నికల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, గెలిచిన తరువాత దానికి అనేక రెట్లు డబ్బు సంపాదించే వ్యాపారంగా మారిపోయింది. గెలవడానికి డబ్బు, సారా, దౌర్జన్యం, కుట్ర, కుతంత్రం ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది. కులం వద్దని ప్రతి నాయకుడు వేదికల మీద మాట్లాడుతాడు. కానీ ఎన్నికలన్నీ కులం ఆధారంగానే జరుగుతున్నాయి. పేదరికo తరిమేస్తాం, కావలసినవన్నీ ఇంటికి తెచ్చిస్తాo అంటున్నారు. ఎవడి డబ్బు ఎవడు దానం చేస్తున్నాడో చూడండి. అంటే మనం పన్నులు కట్టిన డబ్బు ప్రజలకు అవసరమయిన సౌకర్యాలు కల్పించకుండా అందులో పిసరంత మనకే లంచంగా ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. కుక్క బిస్కెట్లు మనకు వేస్తే తీసుకుని, మన కోటాను కోట్ల డబ్బును వాళ్లు ఏం చేస్తున్నారో చూడకుండా వదిలేస్తున్నాం. ఏవరో దీన్ని చూస్తారని, బాగు చేస్తారని అనుకోవద్దు. మీ డబ్బును మీరు పట్టించుకోక పోతే ఎవరు పట్టించుకుంటారు. కులాలు, మతాలు, పరిచయాలు, ఉచితాలు చూసి వోట్లు వేయకండి. మనోడిని కాదు మంచోడిని గెలిపించండి. మనకందరికి మేలు జరుగుతుంది.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles