Thursday, May 2, 2024

‘బపూన్స్’ గా మిగలడం మనకు అంత అవసరమా?

జాన్ సన్ చోరగుడి   

గత అదివారం ‘హిందూ’ డిప్యూటీ ఎడిటర్ శోభా కే నాయర్ ‘ప్రొఫైల్’ కాలంలో అరవింద్ కేజ్రీవాల్ గురించి రాస్తూ, అన్నా హజారే పై ‘షాకింగ్’ వ్యాఖ్య చేసారు. ‘భారతీయ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వొక- ‘మస్కట్’ అవసరమై అందుకు అన్నా హజారేని అప్పట్లో ఇందులోకి లాక్కొచ్చారు’ అందామె! మనం బ్రతికి ఉండగానే ‘కాలం’ మన గురించి చేసే వ్యాఖ్యల్లోని భాషలో వస్తున్న మార్పును చూసాక, మనకొక ఒక సామూహిక హెచ్చరిక అవసరమైంది.

కావడానికి వీళ్ళు ప్రముఖులుగా చలామణి అయ్యే బాపతు అయినప్పటికీ, వీళ్ల ‘కన్ఫ్యూజన్’ చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లోని ఆంతర్యం ఏమిటో మనకు ఇట్టే తెలిసిపోతుంది. అయినా సోయ లేకుండా కళ్ళార్పకుండా మైకుల ముందు వీరు ప్రవచనాలు మాట్లాడుతూ వుంటారు! తాము పౌరసమాజ ప్రతినిధులుగా మాట్లాడుతున్నాము అనేది వీరి- ‘క్లెయిము’. అయితే, ఆ పేరుతో నిర్లక్షిత వర్గాలకు అందే వనరుల లభ్యత మీద వీరు నిరంతరం వుంచే నిఘా అమలుచేసే నియంత్రణను చూసినప్పుడు, మనకు ఆక్రోశం  కలుగుతుంది.

ప్రధానంగా ఎన్నికల వేళ అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు వీళ్ళు ఎక్కడవున్నారో ఏమిచేస్తున్నారో మనకు తెలియదు. కానీ సామాజిక ఆధిపత్య తూకంలో తమ కులం బరువు తగ్గే సూచనలు కనిపిస్తే చాలు, ధృవప్రాంతపు భల్లూకాలు (Polar bears) వలె ఉరులు దిగిన కాళ్ళతో నెమ్మదిగా కలుగుల్లో నుంచి బయటకొచ్చి ‘కులం’ తమకు అప్పగించిన పనిని పూర్తిచేసుకుని, మళ్లీ తమ కలుగుల్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు.

ఒదిగిపోతున్నారు

అయితే వీరి సమస్య అంతా వీరు తమ కలుగుల్లో ఉండడమే! బయట జరుగుతున్నది ఏమిటో వీళ్లకు తెలియదు. కావడానికి ‘బ్యూరోక్రాట్లు’గా సీనియర్లు అయినప్పటికీ, వీరి జీవిత కాలంలో ఏదో ఒక పరాకాష్ట (‘పీక్’) దశ వీరి మస్తిష్కాల్లో ‘రిజిస్టర్’ అయిపోయి ఉంటుంది. ఇక అంతే, మిగతా జీవితాన్ని అక్కణ్ణించే వీళ్ళు చూస్తారు. అన్ని కాలాలకు అవే పాత విషయాలు ‘అప్లయ్’ అవుతాయని, వాటినే మళ్ళీ కొత్తగా వీళ్ళు మనకు చెబుతారు.

నేరుగా విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో తలపడుతున్న రాజకీయ పక్షాలు ఏవైనా అవి రాజ్యాంగ చట్రం పరిధులకు లోబడి గెలుపు ఓటములు తేల్చుకోవడం అనేది మొదటి నుంచి మనకు తెలుసు. కానీ నలభై ఏళ్ళు దాటిన ‘తెలుగుదేశం’ పార్టీ కోసం పనిచేస్తున్న ‘మీడియా’కు అదనం ‘ఎన్జీవో’ తరహా రాజకీయేతర ప్రత్యామ్నాయాలు సిద్దం అవుతున్నాయి. ‘ప్రజాస్వామ్యం’, ‘చట్టబద్ద పాలన’ అంటూ మాజీ ‘బ్యూరోక్రాట్లు’ కొందరు ఈ ‘ఎన్జీవో’ పాత్రలోకి ఒదిగిపోతున్నారు.  

అయితే ఇదేదో ఒక్కరోజులో మొదలైంది కాదు. దీని చరిత్ర అది ఎలా మొదలైందో మనకు తెలియడం అవసరం. తొంభై దశకం మొదట్లో ‘మండల్ కమీషన్’ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల రాజకీయాల్లో తెచ్చిన మార్పులు తర్వాత, దేశవ్యాప్తంగా మనవద్ద- ‘ఫూలే’- ‘అంబేడ్కరిజం’ రాజకీయాలతో కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి.

అన్ని వ్యవస్థల్లోకి… 

అయితే మన రాష్ట్రంలో కారంచేడు సంఘటన 1985లో జరిగాక, సాంఘిక ఉద్యమం కోసం  ఏర్పడిన ‘దళిత మహాసభ’ కార్యకలాపాలను- ‘ఎలక్షన్ పాలిటిక్స్’ గా మార్చడానికి, బహుజన సమాజ్ పార్టి అధ్యక్షుడు కాన్షీరాం 1994 అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడాదిపాటు మన రాష్ట్రంలో ‘క్యాంప్’ చేసారు. ఆ కాలంలో ఎన్టీఆర్ – కాన్షీరాంతో చేసిన పొత్తు చర్చలు విఫలమయ్యాయి.  

అయితే 1994లో ఎన్నికయిన ఏడాదికే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబు చేతికి వొచ్చాక, మొదటిసారి టిడిపి రాజకీయాల్లోకి అనైతికత ఒక ‘బగ్’ రూపంలో అన్ని వ్యవస్థల్లోకి  ప్రవేశిస్తూ, అప్రహతిహతంగా అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈ ‘పొలిటికల్ స్కూల్’ వెనుక టిడిపికి వొక ‘రాజగురువు’ ఉన్నాడని అంటారు.

‘డిల్లీ కిరీటం’

అయితే, అప్పట్లో ఈ ‘రాజగురువు’తో ఎన్టీఆర్ కు ఉన్న కొద్దిపాటి ‘మిస్ మ్యాచ్’, చంద్రబాబు సిఎం అయ్యాక సరి అయింది. ఇక అంతే అ వెంటనే అప్పటికి ఐదేళ్ళ క్రితం మన దేశంలో మొదలయిన ఆర్ధిక సంస్కరణలు- ‘ప్రపంచీకరణ’ ’సరళీకరణ’ ప్రైవేటీకరణ’ల అమలుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయింది. దాన్ని- ‘మీడియా’ విస్తృతంగా ప్రచారం చేసింది.

కానీ ‘సరళీకరణ’ కారణంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అస్తిత్వ ఉద్యమాలు, ఆధిపత్య వర్గాలను కలవరానికి గురిచేశాయి. దాంతో 1996 నాటికి ‘రాజగురు’ టి.డి.పి. రాజకీయాలకు మరొక ప్రత్యామ్నాయాన్ని వెతికారు. ఆ పాత్రలోకి ‘లోక్ సత్తా’ పేరుతొ జయప్రకాశ్ నారాయణ్ గంభీరంగా ప్రవేశించారు.

జయప్రకాష్ నారాయణ్ కు ‘గురు’ నుంచి అందిన ‘మీడియా ఫోకస్’తో, ఆయన డిల్లీకి సరికొత్తగా పరిచయం అయ్యారు. దాంతో కేంద్రంలో 2004 నాటికి కాంగ్రెస్ ‘బ్యూరోక్రాట్’ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన పలుకొత్త చట్టాల ముసాయిదా తయారీ కమిటీలలో నార్త్ ఇండియా వాళ్ళతోపాటు ఏపి మాజీ బ్యూరోక్రాట్ హోదాలో జయప్రకాశ్ నారాయణ్ చేరగలిగారు. అప్పటినుంచి రాష్ట్రంలో ఆయన ప్రవచనాలకు- ‘డిల్లీ కిరీటం’ అదనపు అర్హత అయింది.  

‘న్యూట్రలైజ్’ చేయడానికి

సరిగ్గా ఇదే కాలంలో ‘రాజగురువు’ తన ‘టివి’ వ్యాపార సామ్రాజ్యాన్ని ‘పాన్ ఇండియా’ స్థాయికి విస్తరించారు. అలా అప్పట్లో వీరు ఆర్ధిక సంస్కరణల అమలు వేగం పెంచడం వెనుక ఉన్న ‘స్కీం’ స్వీయ సామాజికవర్గం వాణిజ్య ప్రయోజనం. అయితే, ‘ప్రపంచీకరణ’ కోసం ఆర్ధిక సంస్కరణల ‘డ్రాఫ్ట్’ రూపొందించిన దేశాల్లో ‘కులం’ లేదు. దాంతో- ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ వినియోగం ఈ సంస్కరణలలో వేరు చేయలేని ఒక అనివార్య (‘ఇన్బిల్ట్’) అంశం అయింది.

అది- తెలుగు సమాజంలో అన్ని ఆర్ధిక, సామాజిక శ్రేణులను ఎంతో కొంత మేర బలంగానే తాకింది. ఆధిపత్య వర్గాలకు అది ఊహించని విపత్తు. స్వీయ ప్రయోజనాలు కోసం వీరు అందరికంటే ముందు రాష్ట్రానికి తెచ్చుకున్న ‘సరళీకరణ’ కు ‘అంబేడ్కరిజం’ కూడా తోడైతే, వేగంగా మారే దేశం సాంఘిక ముఖచిత్రం తమ ఆధిపత్య మూలాలకు ప్రమాదమని, వీరు కలవరానికి గురయ్యారు. ఫలితంగా ‘అంబేడ్కరిజం’ రాజకీయాలను- ‘న్యూట్రలైజ్’ చేయడానికి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు మొదలయ్యాయి.    

అందుకు- ‘అన్నా ఆందోళన్’ పేరుతో 2010 నవంబర్లో మొదలైన- ‘ఇండియన్ యాంటీ కరేప్షన్ మూవ్మెంట్’ ను ముందుగా ఇక్కడ మనం గుర్తుచేసుకోవాలి. “కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు పాటు అధికారంలో ఉంటూ అవినీతి మయం అయింది, దాన్ని ఓడించడానికి ఈ ఉద్యమం” అనేది వీరి వ్యూహానికి సాకు అయింది. అప్పట్లో ‘మీడియా’ కెమెరాల ముందు దీక్షా వేదికలపై హజారే పక్కన కేజ్రీవాల్, కిరణ్ బేడి ‘ఫోకస్ద్’గా కనిపించేవారు.

కిరణ్ బేడీ, అన్నా హజారే, కేజ్రీవాల్

దుమారం రేగింది!

ఫలితంగా 2012 నవంబర్ నాటికీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ రాజకీయ పార్టీగా ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ సిఎం, కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ అయ్యారు. కానీ, అన్నాహాజరేతో పాటు యోగేంద్ర యాదవ్ వంటి ప్రముఖులు కనుమరుగయ్యారు. జరుగుతున్నది దృష్టిలో ఉంచుకునే కావొచ్చు, 2013 జనవరిలో జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో ఆశిష్ నంది ఒక సంచలన ప్రకటన చేసారు.

“సభ్యత మరిచి చేస్తున్న ప్రకటనగా అనిపించవచ్చు గానీ వాస్తవం ఏమంటే, అవినీతిపరుల్లో ఎక్కువమంది- ఓబిసి, ఎస్సీ, ఇటీవల ఎస్టీల నుండి ఉంటున్నారు. అయితే, ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం భారత రిపబ్లిక్ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది” అని ఆశిష్ నంది అన్నారు. ఈ ప్రకటనతో అప్పట్లో రేగిన దుమారం ఇంకా కొందరికి గుర్తు ఉండొచ్చు. అయితే, అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో ఇప్పుడు అరెస్ట్ అయ్యారు.

మరి ఆశిష్ నంది అంటున్నట్టుగా కులీన వర్గాల అవినీతిలో నిర్లక్షిత వర్గాలకు వాటా ఇవ్వడం సాధ్యమా? వాళ్ళు అస్సలు దాన్ని అవినీతి అనరు కదా, దానికి వేర్వేరు పేర్లు ఉంటాయి, అందుకు వారికోసం అంగీకృత మార్గాలు కూడా ఉంటాయి. అయితే, నిజమైన రాజ్యాంగ స్పూర్తితో పనిచేసే నాయకుడి ప్రభుత్వంలో వనరుల పంపిణీ ఎలా ఉండాలి?

ఆశిష్ నంది

రద్దు అంతిమ లక్ష్యం

సంక్షేమ పధకాల ద్వారా అర్హులు అందరికీ అందేట్టుగా చూడడం, అందుకు అవసరమైన పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం సంక్షేమ ప్రభుత్వాలు పాటించే పద్దతి. కానీ ఇదేదో కొత్త విషయం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మేధోవర్గాల్లో ఈ అంశం మీదనే ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతున్నది. అంటే, అస్సలు ‘సంక్షేమం’ అనేది ఉండాలా? లేక అభివృద్ధి ఉంటె చాలా? అనే మౌలిక ప్రశ్న వైపు చర్చను తీసుకెళ్లడం వీరి అంతిమ లక్ష్యంగా కనిపిస్తున్నది. 

జాతీయ పార్టీలో చేరిన ఏపి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు ఇటీవల ఒక ‘సోషల్ మీడియా ఛానల్’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో- “జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోతే అదృష్టవంతుడు, మా (కేంద్ర) ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో అతడు అప్పులు తెచ్చిమరీ సంక్షేమ పధకాలు ప్రజలకు పంచి తన ఓటు బ్యాంకును పెంచుకున్నాడు” అన్నారు. బహుశా ఇకముందు దాన్ని మా పార్టీ అనుమతించదు కనుక, అతను ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఒడ్డున పడతాడు అనేది ఆయన ఉద్దేశ్యంకావొచ్చు. ఆయన మాటల్లో ‘మా పార్టీ’ – ‘మీ పార్టీ’ తప్ప ‘ప్రజలు’ ఎక్కడా లేరు! 

గెస్ట్ ఆర్టిస్టులుగా

ఎన్నికల తూకంలో అధికార పార్టీ ఓటు బ్యాంకు బరువును తగ్గించడానికి, ప్రతిపక్షం త్రాసు వైపు- ఇటువంటి ‘హెవీ వెయిట్స్’ అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. వీళ్ళ ‘విజువల్స్’తో మధ్య తరగతిని ప్రభావితం చేయడానికి ‘మీడియా’ ఎటూ ఉంది. ఇవి విస్తృత ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేవి కనుక, పై పైన వెతికితే తూకంలో ఈ- ‘హెవీ వెయిట్స్’ ఎక్కడా పైకి కనిపించవు. కారణం ఇవి కంటికి కనిపించకుండా తూకం పళ్ళానికి అడుగున అంటుకుని ఉండే అయిస్కాంతం ముక్కలు. ‘రాజ గురు’ భాషలో వాటిని- ‘రౌండ్ టేబుల్’ సభల్లో చేసే-‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పెంచే ‘ఓటరు చైతన్యం’ అంటారు. సహజసిద్దమైన స్వంత బరువు లేక పైకి తేలిపోతున్న వైపు, తూకాన్ని ఎలాగోలా క్రిందికి దించడం వీరి పని.  

అటువంటప్పుడు ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మరి సామాన్య ప్రజలు ఐదేళ్లుగా ఇటుకా ఇటుకా పేర్చినట్టుగా కట్టుకున్న ప్రజాభిప్రాయాన్ని కేవలం ‘గెస్ట్ ఆర్టిస్టులు’గా బయటనుంచి వచ్చే వారు ఎన్నికల పేరుతో ‘బులోడ్జ్’ చేయడాన్ని ఏమంటారు? అది- ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్టు’ కాదా? మరి స్థానిక ప్రజల మనోగతానికి మనమిచ్చే విలువేది? ఏదేమైనా ఈ ‘సోషల్ మీడియా’ రోజుల్లో, జీవించి ఉండగానే మనల్ని విదూషకులు అని ‘కాలం’ కాలరాయకుండా చూసుకోవడం ఇప్పుడు కేవలం మన చేతిలోనే ఉంది. 

రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles