Sunday, June 16, 2024

హైదరాబాద్ తొలి మేయర్ మాస్టర్ ప్లానర్.. కొర్వి కృష్ణస్వామి

కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌. ఈ పేరు చాలామంది విని ఉండక పోవచ్చు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు సంబంధించి ఈ రంగం గురించి చెప్పి, మిగిలిన వాటిని చులకన చేస్తే అది ఆత్మద్రోహం అవుతుంది. ఆయన స్పృశించని అంశం లేదు. కాలూనని రంగం లేదు. ఏ అంశంలో లోతుగా అధ్యయనం చేసినా, అది పి. హెచ్. డి. సంపాదించి పెడుతుంది. రాజకీయ నాయకునిగా, హైదరాబాద్ మేయర్ గా, సిటీ మాస్టర్ ప్లానర్ గా, బి.సి. సంఘాల స్తాపకునిగా, జర్నలిస్టుగా, సంపాదకునిగా, ముదిరాజ్ కుల బాందవునిగా, పాఠశాలల స్థాపకునిగా, హిందీ భాష ప్రోత్సాహకునిగా, యాదగిరి దేవస్థానం ధర్మకర్తగా, నిజాం రాష్ట్ర విద్యాసలహాదారు బోర్డు సభ్యునిగా, ఇలా ఒక్కటేమిటి అడుగిడిన ప్రతి చోటా తనదైన ముద్ర వేసి, ఆయన అందించిన బహుముఖ సేవలు చిరస్మరణీయమైనవి.

స్వాతంత్య్ర సమరయోధుడిగా, రచయితగా, విద్యావేత్తగా, ప్రభుత్వోద్యోగిగా హైదారబాద్‌ మేయర్‌గా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, ముదిరాజ్‌ మహాసభ నిర్మాతగా, బహుజన వైతాళికుడిగా, పరిపాలనా దక్షుడిగా ప్రజల మన్ననలందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి.

తెలంగాణ ఖ్యాతిని, ముఖ్యంగా హైదరాబాద్‌ ఉన్నతిని, ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కృష్ణస్వామి ముదిరాజ్‌ జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడిగా తనదంటూ ఒక ముద్రవేసిన హైదరాబాద్‌లో సామాజిక, రాజకీయ ఉద్యమాలకు ఒకనాడు కేంద్ర బిందువుగా ఉన్నారు. దేశ ‘స్వాతంత్ర్యోద్యమ చరిత్ర’ రాసే  ప్యానెల్‌లో కృష్ణస్వామి కూడా సభ్యుడిగా ఉన్నారు.

25 ఏళ్ళకుపైగా కౌన్సిలర్‌, మేయర్‌

డిప్యుటి మేయర్‌గా 1955లో ఎన్నికయ్యారు. ఈ హోదాలో అనేక కమిటీలకు సహాదారుగా పని చేశాడు. 1957లో మేయర్‌గాఎన్నికైనారు. కృష్ణస్వామి స్వాతంత్య్రానంతర హైద్రాబాద్‌కు మొదటి మేయర్‌ గా పని చేశారు. 1957లో హైదరాబాద్‌ నాలుగో మేయర్‌గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసిన దీర్ఘ దృష్టి ఆయనది.1950లో కొత్తగా హై దరాబాద్‌ మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించడంలో కృష్ణస్వామి కీలక పాత్ర పోషించారు.1957లో ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది,  స్వయంగా ‘చంద్రకాంత ప్రెస్‌’ను నెలకొల్పి, ‘దక్కన్‌ స్టార్‌’ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించడమే గాకుండా సమర్థ స్వీయ సంపాదకత్వంలలో  నడిపించారు. కొద్ది కాంలోనే దక్షిణ భారత ప్రెస్‌లల్లో ప్రముఖ ప్రెస్‌గా పేరు సంపాదించింది. అయన ‘సంపాదకత్వంలో వెలువడిన ‘దక్కన్‌ స్టార్‌’, ఆర్యసమాజ్‌ పత్రిక ‘మసావత్‌’, ‘న్యూ ఎరా’ పత్రికలు కూడా చంద్రకాంత ప్రెస్‌లోనే ముద్రించే బాధ్యత తీసుకున్నారు. 1939లో ‘మసావత్‌’ అనే ఉర్దూ వార పత్రికకు కూడా సంపాదకుడిగా ఉన్నారు. హైద్రాబాద్‌లో మతసామరస్యం కాపాడడానికి ఆయన చేసిన కృషికి, నాటి ముస్లిం నేతలు కృష్ణస్వామిని ‘ఎంబాడిమెంట్‌ ఆఫ్‌ సెక్యురిజం’ అని కొనియాడేవారు.

కె.కృష్ణస్వామి, ఆర్‌.కేశమ్‌ సంయుక్త కృషి తో 30.9.1922న ‘ముదిరాజ్‌ (ముక్తరాజ) మహా సంఘము`దక్షిణ హైద్రాబాద్‌’ అనే పేరుతో ముదిరాజ్‌  సంఘం స్థాపించగా, 1941లో తుల్జాభవన్‌లో జరిగిన ముదిరాజ్‌ మహా సమ్మేళనంలో కె.కృష్ణస్వామి ముదిరాజ్‌ అధ్య క్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అప్పటి నుండి 1961 వరకు నిర్వరామంగా ఈ సంఘానికి అధ్యక్షు నిగా పనిచేశారు.  1954లో కృష్ణస్వామి ‘అఖిల భారత ముదిరాజ్‌ మహాసభ’కు అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. దీని తర్వాతనే ముదిరాజ్‌ సంఘం ‘ముదిరాజ్‌ మహాసభ’గా మార్చ బడినట్లు చెపుతారు.

సంపాదన పై ఆశ లేక,  ప్రజాసేవే పరమార్థంగా, ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ప్రజా జీవితంలో మచ్చలేని జీవితం గడిపాడు.  హైద్రాబాద్‌ నగర నిర్మాణ చరిత్ర, గోవారాష్ట్ర స్వాతంత్య్ర ఉద్యమం, ముదిరాజు జాతి చరిత్ర,  హైద్రాబాద్‌ రాష్ట్ర 30 సంవత్సరా రాజకీయ పోరాటం,  హైద్రాబాద్‌ మున్సిపల్‌ పరిపాన వ్యవస్థ చరిత్ర (1280 ఫసలి / క్రీ.శ. 1871 నుండి), నవాబ్ దీన్‌ దయాల్‌ జంగ్‌ బహదూర్‌ జీవిత చరిత్ర,  పిక్టోరియల్‌ హైద్రాబాద్‌ (హైద్రాబాద్‌ రాజవంశ, నవాఋ, జాగిర్దారు చరిత్ర) తదితరాలను వివిధ భాషల్లో రాశారు. ఆయన రాసిన చరిత్ర గ్రంథాల్లో ఒక్కొక్కటి ఒక్కో పిహెచ్‌.డి.పట్టా పొందే అర్హత కలిగి ఉన్నాయి. ఆయన పట్టా లేని పరిశోధకునిగా మిగిలి పోయారు..

(డిసెంబర్ 19.. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌ వర్థంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles