Thursday, November 30, 2023

తిరుమల కొండ అంజనాద్రిపై హనుమ జననం

  • టీటీడీ స్పష్టీకరణ, పుస్తక ప్రచురణకు సమాయత్తం
  • కర్ణాటక అభ్యంతరం, ముఖ్యమంత్రి యడ్యూరప్ప హనుమభక్తుడు
  • కిష్కింధ హనుమంతుడి జన్మస్థలమని వాదన

హనుమంతుడు తిరుమల కొండలలో ఒకటైన అంజనాద్రిపైన జన్మించాడని ధ్రువీకరిస్తూ తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) వారు ఏప్రిల్ 21న శ్రీరామనవమినాడు ప్రకటించారు. పురాణాలకు సంబంధించిన, భౌగోళిక అంశాలకు సంబంధించిన, ప్రాచీన శాసనాలకు సంబంధించిన అంశాలను ఉటంకిస్తూ సాక్ష్యాధారాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. హనుమంతుడు జన్మించింది ఆ కొండపైనే అని వాదించారు. టీటీడీ ఎనిమిదిమంది పండితులలో ఒక సంఘాన్ని నియమించింది. ఇందులో సంస్కృత, వేద పండితులతో పాటు ఇస్రోకు చెందిన ఒక శాస్త్రవేత్తను కూడా సభ్యులుగా తీసుకున్నారు. 2020 డిసెంబర్ లో నియమించిన ఈ కమిటీకి హనుమంతుడు అంజనాద్రిపైన పుట్టినట్టు తిరుగులేని సాక్ష్యాధారాలు సేకరించే బాధ్యత అప్పగించారు. నిరుడు జూన్ లో తిరుమలలో జరిగిన ప్రత్యేక సమాలోచనలో ఆంజనేయస్వామి జన్మస్థలంపైన ఇంకా సందిగ్థం ఎందుకని కొందరు ప్రశ్నించారు.

ఏడు కొండలలో ఒకటైన అంజనాద్రిపైనే హనుమంతుడు జన్మించాడని టీటీడీ ప్రకటించింది. పురాణేతిహాసాలను పరిశీలించి, సాక్ష్యాధారాలను జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత టీటీడీ చేసిన ప్రకటన ఇది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి వి. మురళీధరశర్మ నాయకత్వంలోని ఈ కమిటీ ఒక ప్రకటన చేసింది. అంజనాదేవి ఈ కొండమీదే తపస్సు చేసి ఆంజనేయ స్వామిని కన్నదని వాల్మీకి రామాయణంలో 81 నుంచి 83వ శ్లొకంలో పేర్కొన్నట్టు పండితులు ప్రకటించారు. అంజనీదేవికి పుట్టాడు కనుక స్వామి ఆంజనేయుడనే పేరు వచ్చిందనీ, ఆయన పుట్టిన కొండకు అంజనాద్రి అనే పేరు స్థిరపడిందనీ వారు చెప్పారు. మహాభారతంలో భీమసేనుడితో ఆంజనేయస్వామి అన్న మాటలను కూడా వారు ఉటంకించారు. పుంజీకాస్థల అనే అప్సరస శాపవశాత్తు వానర కన్యగా అంజనీదేవి నామంతో జన్మించిందనీ, వాయుదేవుడి అనుగ్రహంతో తనను కన్నదనీ హనుమ మరో వాయునందనుడు భీముడితో అన్నాడు. హిందూధర్మశాస్త్రాలను ఉటంకిస్తూ పండితులు అంజనీదేవి ఆకాశగంగలో స్నానమాచరించి, తపస్సు చేసి వాయునందనుడిని కన్నదని చెప్పారు. తిరుమల దేవాలయం దగ్గర 1491లోనూ, 1545 లోనూ కనిపించిన శిలాశాసనాలలో కూడా అంజనాద్రి గురించి ప్రస్తావన ఉన్నదనీ, ఇక్కడే హనుమంతుడు జన్మించాడని కూడా శిలాఫలకాలపైన ఉన్నదనీ స్పష్టం చేశారు.

అయిదే, భారతదేశం అంతటా హనుమంతుడు తమ ప్రాంతంలో జన్మించాడని విశ్వసించేవారు ఉన్నారు. భారతీయ సాహిత్యంలో అనేక దృష్టాంతాలు చెబుతారు. అంజనాద్రి మహత్మ్యం అనే పుస్తకం డిజిటల్ రూపంలో బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నది. ఆంజనేయుడి జన్మస్థానం అంజనాద్రి అని ఆ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్య పురాణాలలో ఈ విషయం ఉన్నదని వారు నొక్కి చెబుతున్నారు. వెంకటాచల మహత్మ్యం, వరాహమిహురుడు రచించిన బృహతసంహితలో కూడా అంజనాద్రి, ఆంజనేయుడి ప్రస్తావన ఉన్నాయని, కమిటీ సకల విషయాలనూ సాకల్యంగా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిందనీ మురళీధర శర్మ వివరించారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్నట్టు గానే పవిత్రమైన అంజనాద్రిపైన ఆంజనేయస్వామి క్షేత్రాన్ని ప్రభుత్వం, టీటీడీ కలసి నిర్మించాలని హనుమజననంపైన 1972 నుంచి విస్తారమైన పరిశోధన చేసిన అన్నదానం చిదంబరశాస్త్రి అన్నారు.

అయితే, హనుమంతుడి జన్మస్థలం గురించి కొందరు చరిత్రకారులు కొన్ని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. కర్ణాటకలో హంపి దగ్గర ఆంజనేయాద్రి అనే గుట్ట ఉంది. జార్ఖండ్ లో గుంలాకి 21 కిలోమీటర్ల దూరంలో అంజన అనే గ్రామం ఉంది. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రియంబకేశ్వర్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆంజనేరి అనే గుట్ట ఒకటుంది. ఈ ప్రదేశాలలో కూడా హనుమంతుడు జన్మించాడని వాదించేవారు ఉన్నారు. తిరుమల ప్రకటనను కర్ణాటక ఇప్పటికే తప్పు పట్టింది. హనుమంతుడు కిష్కింధలో పుట్టాడని, కొప్పాల్ జిల్లాలోని అనేగుండి దగ్గర కిష్కింధ ఉన్నదనీ కన్నడిగుల వాదన. హంపికి దగ్గరలో కిష్కింధ గురించి రామయణంలో ప్రస్తావన ఉన్నదని వారు గట్టిగా చెబుతున్నారు. ఆంజనేయాద్రి గుట్టపైన హనుమంతుడి గుడి కూడా ఉన్నది. ఆ గుడి ప్రాంతంలోనే రాతితో చెక్కిన రాముడు, సీతా, అంజనాదేవి విగ్రహాలతో గుళ్ళు ఉన్నాయి.

అంజనాద్రిపైన అధ్యయనానికి టీటీడీ కమిటీని నియమించిన వెంటనే కర్ణాటక టూరిజంశాఖ ఆంజనేయాద్రిని టూరిజం కేంద్రంలో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ప్రకటించింది. దానికి హనుమాన్ జన్మస్థల అని నామకరణం చేసింది కూడా.  పైగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హనుమంతుడి భక్తుడు. రూ. 50 కోట్లు ఖర్చు చేయడానికి ఉద్దేశించిన ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నదని కర్ణాటక టూరిజంమంత్రి యోగేశ్వర్ అంటున్నారు. కోస్తా కర్ణాటకలోని గోకర్ణం దగ్గర హనుమంతుడి నిజమైన జన్మస్థలం ఉన్నదని శివమొగ్గ జిల్లాలోని రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేంద్ర భారతి అభిప్రాయం. వచ్చే శ్రీరామనవమి వరకూ గోకర్ణంలోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఎత్తయిన స్వామి విగ్రహం ఉంటుందని మఠాధిపతి వక్కాణించారు.

హిందూ ధర్మానికి తిరుమల గొప్ప క్షేత్రం కనుక ఈ విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం మన బాధ్యత అంటూ శ్రీవెంకటేశ్వర ఉన్నత వేదిక విద్యా ప్రాజెక్టు డైరెక్టర్, ఆంజనేయ జన్మస్థల కమిటీ కన్వీనర్ ఆకెళ్ళ విభీషణశర్మ వివరించారు. తాము పరిశోధన చేసి సేకరించిన సమస్త సమాచారంతో ఒక గ్రంధాన్ని ప్రచురించాలని సంకల్పించినట్టు ఆయన ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles