Sunday, September 15, 2024

కేంద్ర ప్రభుత్వం పట్ల రైతుల అవిశ్వాసం

కె. రామచంద్రమూర్తి

సన్నకారు రైతులకూ, మధ్యతరగతి రైతులకూ మేలు చేస్తున్నట్లు బుకాయించే బిల్లులను ఆదివారంనాడు రాజ్యసభ ఆమోదించింది. రైతులకు లాభదాయకమైన చట్టాలు చేస్తున్నామంటూ ఎన్ డీ ఏ ప్రభుత్వం చెప్పుకుంటుంటే ఆ బిల్లులపైన సంతకం చేయవద్దంటూ రాష్ట్రపతి కోవిద్ కు 18 ప్రతిపక్షాలు సోమవారంనాడు విజ్ఞప్తి చేశాయి. ‘ప్రభుత్వ విధానం పార్లమెంట్ లో ప్రజాస్వామ్యాన్ని నిలువుగా హతమార్చినట్టు ఉన్నది’ అంటూ విపక్షాలు రాష్ట్రపతికి మనస్తాపంతో నివేదించాయి. వివాదాస్పదమైన బిల్లులను ఘర్షణాత్మకమైన వాతావరణంలో బలవంతంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా ఆమోదించడం విచారకరమైన విషయం. ఎన్ డీ  ఏ ప్రభుత్వానికి పార్లమెంటు సంప్రదాయాల పట్లా, రైతు సంఘాలతో, ప్రతిపక్షాలతో చర్చలు జరపడం పట్లా ఏ మాత్రం విశ్వాసం లేదని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ.

‘చీకటి రోజు’

మూడు వ్యవసాయ బిల్లులూ పైకి రైతులకు మేలు చేసేవిగానే కనిపిస్తాయి. తరచి చూస్తే ‘మోసం గురూ’ అనిపిస్తుంది. బిల్లులపైన అభ్యంతరాలు ఉన్నాయి. అంతకంటే బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందిన తీరు పట్ల ఎక్కువ నిరసన వ్యక్తం అవుతున్నది. నిజానికి వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉన్నది. ఈ రంగంపైన ఏమైనా చర్యలు తీసుకోవడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించినట్లయితే రాష్ట్రాలనూ, వ్యవసాయ సంఘాలనూ సంప్రదించి బిల్లుల రూపకల్పన చేయాలి. ప్రతిపక్ష సభ్యుల సూచనలనూ, సలహాలనూ స్వీకరించి, వాటిని బిల్లులలో చేర్చిన తర్వాత లోక్ సభలో ఆమోదానికి పెట్టాలి. అటువంటి మర్యాదలు ఏవీ కేంద్ర ప్రభుత్వం పాటించలేదు. పైగా, రాజ్యసభలో ఆదివారంనాడు ప్రతిపక్షాలు ఓటింగ్ జరగాలని పట్టుపట్టినా వినకుండా మూజువాణీ ఓటుతో బిల్లులకు సభ ఆమోదం లభించిందంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ దబాయించడం, ప్రతిపక్ష నాయకులను మార్షల్స్ చేత సభ నుంచి బయటికి గెంటివేయడం పార్లమెంటు సంప్రదాయాలను తుంగలో తొక్కినట్టుగానే భావించాలి. సభలో ఇంత గొడవ జరుగుతున్నా, పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యంపాలు అవుతున్నా ప్రధాని ట్విట్టర్ సందేశానికే పరిమితం కావడం, సభకు హాజరై సభ్యుల భయసందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించకపోవడం శోచనీయం. పెద్దల సభలో అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా బిల్లులకు ఆమోదం పొందడం ప్రజాస్వామ్యానికి కళంకం. అందుకే ప్రతిపక్షాలు ఆదివారాన్ని ప్రజాస్వామ్య భారతంలో ‘చీకటి రోజు’ అంటూ అభివర్ణించడం సమంజసమే అనిపిస్తున్నది. అప్రజాస్వామికంగా వ్యవహరించిన డిప్యూటీ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానానికి 12 ప్రతిపక్షాలు నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నోటీసు నిభందనలకు అనుకూలంగా లేదంటూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొట్టివేయడం అన్యాయం. ఆదివారం రాజ్యసభలో సంభవించిన పరిణామాలకు 8 మంది ప్రతిపక్ష సభ్యులను కారకులుగా చెబుతూ వారిని సభలు ముగిసే వరకూ సస్పెండ్ చేయడం చోచనీయం. వ్యవసాయరంగంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులను వ్యవసాయదారులే వ్యతిరేకించడం వెనుక ఉన్న వారి భయాలనూ, అనుమానాలనూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం పట్ల విశ్వాసరాహిత్యానికి ఈ బిల్లుల పట్ల రైతుల వైఖరి అద్దం పడుతున్నది. కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్- ఎంఎస్ పీ) కొనసాగుతుందని ప్రధానమంత్రి, వ్యవసాయమంత్రి చెప్పినప్పటికీ రైతులకు విశ్వాసం కలగకపోవడం విశేషం. మద్దతు ధర కొనసాగుతుందని బిల్లులలో స్పష్టం చేసి ఉంటే వ్యవసాయదారులు ఇంతగా ఆగ్రహించేవారు కాదు. ఈ బిల్లులను కాంగ్రెస్, డీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, తదితర ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వైఎస్ ఆర్ సీపీ, బిజూ జనతాదళ్  బిల్లులను బలపరిచాయి.

ప్రభుత్వం పట్ల విశ్వాసరాహిత్యం

రెండు బిల్లులకూ ఆమోదం పొందిన తర్వాత సోమవారంనాడు కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రకటన చేసింది. గోధుమల మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 50 లు పెంచింది. అంటే అక్టోబర్ ఒకటి నుంచి ఆరంభమయ్యే పంటల కొనుగోలు సంవత్సరంలో రబీ పంటలో క్వింటాల్ గోధుమలకు రూ. 1975 లు చెల్లిస్తారు. గోధుమలు ప్రధానంగా పండించే పంజాబ్, హరియాణలో రైతులు ఆగ్రహోదగ్రులై స్వైరవిహారం చేస్తున్నారు కనుక వారిని శాంతింపజేయాలనే ఉద్దేశంతో కనీస మద్దతు ధర పెంచినట్టు అనుకోవాలి. ఎన్ డీ ఏ ప్రభుత్వంపట్ల రైతులు విశ్వాసరాహిత్యానికి కారణం లేకపోలేదు. ఒక రాష్ట్రంలో పండిన పంటలో 40 శాతం పంటను కనీస మద్దతు ధర చెల్లించి కొనాలనీ, అందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే విధానం రెండేళ్ళ కిందటి వరకూ అమలులో ఉంది. ఆ పరిమితిని మోదీ ప్రభుత్వం నిరుడు 25 శాతానికి తగ్గించింది. కడచిన అయిదేళ్ళలో తొలిసారిగా 2019-20లో వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహరోత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల మండలి లెక్కల ప్రకారం 2018-19లో రూ. 1.30 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు కాగా నిరుడు (2019-20) ఎగుమతులు రూ. 15 కోట్లు తగ్గాయి. బియ్యం ఎగుమతులే 25 లక్షల టన్నులు తగ్గిపోయాయి. ఇందుకు భిన్నంగా ఎన్ డీఏ హయాంలో వ్యవసాయం అద్భుతంగా ఉన్నదంటూ చెప్పుకునే రాజకీయ నాయకుల సంగతి, ప్రభుత్వాన్ని పొగిడే మీడియాల ముచ్చట వేరే విషయం.  మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ రంగానికి లాభించే చర్యలు మాత్రమే తీకుంటున్నారనే అభిప్రాయం జనంలో ఉంది. అంబానీ, అదానీలదే రాజ్యమనే మాట చెలామణిలో ఉంది. వ్యవసాయ పంటల స్వేచ్ఛావాణిజ్యం పేరుతో వ్యవసాయ మార్కెట్లకు పాతరేసి, ప్రైవేటు వ్యాపారులకు పెద్దపీట వేస్తారనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు పంట ఎక్కడ లాభదాయకంగా ఉంటే అక్కడ అమ్ముకోవచ్చుననే విధానం వినడానికి బాగానే ఉంటుంది. ఈ విధానం కొత్తగా వచ్చిందేమీ కాదు. లోగడ కూడా అమలులో ఉంది. కానీ కార్యాచరణకు వచ్చే సరికి సన్నకారు, చిన్న రైతులు తమ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు రవాణా చేసి అక్కడ విక్రయించగలరా? తమకు తోడూనీడగా నిలిచి ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడ ఇచ్చే స్థానిక వ్యాపారులకూ, మధ్యదళారులకే వారు తమ ఉత్పత్తులను విక్రయిస్తారు.

ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండటం వల్ల రైతుల పంటలను వ్యాపారులు కొనుగోలు చేయడానికి ఒక వేదిక ఉంది. రైతులకు వ్యాపారులు ఎంత చెల్లిస్తున్నారో అందరికీ తెలిసే అవకాశం ఉంది. పార్లమెంటు ఆమోదించిన బిల్లలు చట్టాలై వస్తే వ్యాపారులూ, కార్పొరేషన్ల ప్రతినిధులూ  నేరుగా పొలాలకు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేస్తారు. వారికీ, రైతుకూ మధ్య లావాదేవీలు వారి మధ్యనే ఉంటాయి. బయటికి పొక్కవు. అంతేకాదు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో కార్పొరేట్ వ్యవసాయానికి రంగం సిద్ధం చేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు ఏ పంట పండించాలో, ఏ పంట పండిస్తే తాము ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తామోనని కార్పోరేట్ రంగం చెప్పే అవకాశం ఉంది. కొంతకాలం తర్వాత రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని వారి కమతాలను కార్పొరేట్ సంస్థలే కౌలుకు తీసుకొని యంత్రాల సహకారంతో కార్పొరేట్ వ్యవసాయం చేసి సంవత్సరానికి కొంత ఆదాయం రైతులకు చెల్లించే పరిస్థితులు రావచ్చు. అప్పుడు రైతులు కూలీలుగా మారతారు లేదా వ్యవసాయం రంగానికి దూరం అవుతారు. ప్రభుత్వ నియంత్రణ ఉన్న మార్కెట్ లోనే ఆహారోత్పత్తుల అక్రమ నిల్వలు సాగి కృత్రిమ కొరతలు ఏర్పడుతుంటే, ఆహారధాన్యాల నిల్వలపైన పరిమితులు ఎత్తివేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

మార్కెంటింగ్ వ్యవస్థకు ముప్పు

కొత్త చట్టాల ఫలితంగా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సంపన్న వ్యాపారుల, కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపైన రైతులు ఆధారపడవలసిన రోజులు వస్తాయి. రైతుల పని పెనం నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారవుతుంది. రైతులకు సహాయం పేరుతో వారి ఖాతాలలో ప్రభుత్వాలు కొద్ది మొత్తాలు జమ చేయడం కంటే మౌలిక సదుపాయాలు కల్పించి పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెరిగే మార్గాన్ని సుగమం చేయడం ఉత్తమం.

జూన్ లోనే మూడు ఆర్డినెన్సులు జారీ చేశారు. వాటి స్థానే మూడు బిల్లులను – ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రొమోషన్ అండ్ ఫెసిలిటేషన్ )బిల్లు, 2020, ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అంగ్రిమెంట్ ఆఫ్ ప్రైసె అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు, 2020, ఎసన్షియల్ కమాడిటీస్ (ఎమెండ్ మెంట్) బిల్లు – లోక్ సభ గత వారం ఆమోదించింది. మొదటి రెండు బిల్లులనూ రాజ్యసభ ఆదివారం ఆమోదించిందని డిప్యూటీ చైర్మన్  ప్రకటించారు.  ఈ చట్టాలు అమలు జరిగిన తర్వాత అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల (ఏపీఎంసీలు) కు ప్రాధాన్యం ఉండదు. ఏపీఎంసీల సంస్కరణ అన్నది పార్టీలకు అతీతంగా రెండు దశాబ్దాలుగా అనుకుంటూ ఉన్నదే. మండీలలో (వ్యవసాయ మార్కెట్ యార్డులలో) ప్రభుత్వజోక్యం ఎక్కువగా ఉన్నదనే విమర్శ వ్యవసాయదారుల సంఘాలు కూడా చేస్తూనే ఉన్నాయి. లోగడ కేంద్ర ప్రభుత్వం స్థాయిలోనూ, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను సంస్కరించేందుకు చేసిన ప్రయత్నాలను వ్యవసాయదారుల సంఘాలు స్వాగతించాయి. ఈ సారి బిల్లులు ప్రవేశపెట్టిన పద్ధతి అభ్యంతరకరంగా ఉన్నదనే కారణంపైనే  బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్  ఎన్ డీ ఏ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు అనుబంధమైన వ్యవసాయదారుల సంఘాలు సైతం ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయంటే ఈ వ్యతిరేకత, భయాందోళనలు రాజకీయాలకు అతీతంగా వ్యక్తం అవుతున్నాయని గ్రహించాలి.

ప్రభుత్వ ప్రమేయం కొనసాగాలి

ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వ సహాయాన్ని కూడా తగ్గించుకుంటుందనే అనుమానం, కార్పొరేట్ వ్యవసాయానికి రంగం సిద్ధం చేస్తున్నారనే సందేహం రైతులోకంలో ఉంది. మధ్యదళారులను విమర్శించడం, వారిని రైతు వ్యతిరేకులుగా అభివర్ణించడం కూడా వ్యవసాయదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యదళారులతోనే రైతులు వ్యవహారం చేస్తుంటారు. వారి అండదండలతో జీవితాలు వెళ్ళదీస్తుంటారు. మార్కెట్ యార్డులలో వ్యవసాయ దిగుబడులు విక్రయించడానికి తోడ్పడేది వారే. మధ్యదళారులూ, మండీలు లేని వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని రైతులు ఊహించుకోలేకపోతున్నారు.

బిహార్ లో ఏపీఎంసీలను 2006లోనే రద్దు చేశారు. మండీలను రద్దు చేసి స్వేచ్ఛావ్యాపారాన్ని ప్రోత్సహించిన తర్వాత బిహార్ రైతులకు ఇతర రాష్ట్రాల రైతులకు లభించే కనీస మద్దతు దర కూడా లభించడం లేదు. ఉదాహరణకు, జొన్నలు క్వింటాల్ కు రూ. 1,800 కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటిస్తే బిహార్ లో ఎక్కువమంది రైతులు తమ జొన్న పంటను క్వింటాల్ కు  రూ. 1000లకే విక్రయించారు. ఏపీఎంసీలు ఉంటేనే ప్రభుత్వం ప్రమేయం ఉంటుందనీ, ప్రభుత్వ ప్రమేయం ఉంటేనే కనీస మద్దతు ధరలు కొనసాగుతాయనీ రైతులు నమ్ముతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయకపోతే ధాన్యం ధరలు విపరీతంగా పడిపోతాయి. రైతు కుదేలవుతాడు. స్వేచ్ఛావాణిజ్యం పేరుతో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించే బాధ్యత నుంచి ఎక్కడ తప్పుకుంటుందోనని రైతులు భయపడుతున్నారు.  అందుకే ప్రధానమంత్రి స్వయంగా చెప్పినా రైతుల అనుమానాలు వైదొలగడం లేదు. కొన్ని సంవత్సరాలుగా రైతుల పట్ల ఎన్ డీ ఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా ఏర్పడిన విశ్వాసరాహిత్యం హరియాణా, పంజాబ్ రైతుల ఉద్యమానికి ప్రధాన కారణం.

‘మా రాజ్యం, మా ఇష్టం’

రైతులలో విశ్వాసం కలిగించాలంటే వ్యవసాయదారుల సంఘాలతో, ప్రతిపక్ష నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడాలి. ‘మా రాజ్యం, మా ఇష్టం’ అన్నట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తే  ప్రజలు సహించరు. బిహార్ ఎన్నికల ముందు రైతులను దూరం చేసుకోవడం అవివేకమని ప్రధాని నరేంద్రమోదీకి తెలియదా? ఆ రాష్ట్రంలో ఈ సంస్కరణ ఇదివరకే ప్రవేశపెట్టారు కనుక ఈ కొత్త చట్టాల వల్ల బీహార్ ప్రజలలో వ్యతిరేకత రాదనే నమ్మకమా? రైతుల సమస్యను అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా బిల్లులు రూపొందించడం వివేకవంతుల లక్షణం. ఎన్నికలలో గెలుపు సాధించడం వేరు, జనరంజకంగా పాలించడం వేరు. మొదటి అంశంలో మోదీ సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు దాటినా రెండో అంశం అర్థం చేసుకోవడంలో సఫలీకృతుడైనట్టు కనిపించడం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles