Wednesday, September 27, 2023

కథలకొండ ‘ధనికొండ’

అక్షర తపస్వి ధనికొండ హనుమంతరావు. బహుముఖీన సాహిత్య వ్యక్తిత్వం ఆయన సొంతం. లబ్ధప్రతిష్ఠుడైన కథానవలా నాటక రచయిత. పత్రికా సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు. మద్రాసులో ఆయన నెలకొల్పిన  `క్రాంతిప్రెస్`తెలుగు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులకు చిరునామా. ఎన్నో పుస్తకాలను అందంగా,గడువులోగానే ముద్రించి ఇచ్చేవారని ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు చెబుతారు. సామాజిక ప్రయోజనాన్ని ఆశించి సాహిత్య సృజన చేసే శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి కుటుంబరావు లాంటివారి రెండోతరం సాహిత్యకారుల కోవకు చెందినవారు ధనికొండ. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ కూడా ధనికొండ వల్లనే  ఇంతవాడినయ్యా  అని చెప్పేవారు.

మౌలికంగా రచయితైన ధనకొండ  కథ, నవల, నాటకం, వ్యాసం మొదలైన ప్రక్రియలను తన సాహితీ సృజనకు  ఉపయోగించుకున్నారు. సాహిత్యం సమాజాన్ని ఉద్ధరించకున్నా ఇబ్బందిలేదు కానీ హాని చేయకపోతే చాలని నమ్మిన తరం వ్యక్తి. తండ్రి నరసింహారావులోని సృజనాత్మకత, నిశితపరిశీలన, విమర్శనాత్మక దృక్పథం తనయడికీ అబ్బిందని అంటారు. పదేళ్లప్రాయంలో తల్లిని కోల్పోయిన ఆయన తండ్రికి మరింత దగ్గరయ్యారు. తండ్రి తాలూకు కార్యాలయ ఉద్యోగి. సంస్కృతాంధ్ర, ఆంగ్లభాషల్లో మంచి ప్రవేశం కలవారు. ఉద్యోగరీత్యా ఆయనకు బదిలీల కారణంగా హనుమంతరావు చదువు  సాఫీగా సాగకపోయినా లోకజ్ఞానం గడించారు. క్రమశిక్షణ, రాజీలేని తత్వం, స్వేచ్ఛాజీవితం, మానవతను తెలిసిన వారని హనుమంతరావును ఎరిగిన వారు గుర్తుచేసుకుంటుంటారు. జీవితంలోనూ పాత్రికేయవృత్తిలోనూ, రచనా వ్యాసంగంలోనూ రాజీ పడలేదు. తమ సిద్ధాంతాలను వదులుకోలేదు. తన భావాలను ఎదుటివారికి అన్వయించే ప్రయత్నం చేయలేదు. ఆయన నాస్తిక వాదాన్నిఅనుసరించినా దానిని ప్రచారం చేయలేదు.ఆస్తికత్వాన్ని నిరసించలేదు. టుంబసభ్యులను కూడా తమ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించలేదు. అదీ ధనికొండవ్యక్తిత్వం.

ధనికొండ రచనలు

గుంటూరు జిల్లా  ఇంటూరులో 1919వ సంవత్సరంలో సామాన్య కుటుంబంలో  జన్మించిన ధనికొండ బీఏ చదువును మధ్యలో ఆపేసి రచనలపై దృష్టి సారించారు. ఆయన రచనా వ్యాసంగం కళాశాల మేగ్ జైన్ తో మొదలైనప్పటికీ ఆయన వాస్తవ సాహిత్య ప్రస్థానం 1939లో ప్రారంభమైంది. బహుముఖీన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నా సాహిత్యసేవను కొనసాగించారు. సుమారు 150 కథలు, మూడు నవలలు, తొమ్మిది నవలికలు, రెండు నాటకాలు, పన్నెండు నాటికలు రాశారు .మొపాసా కథల రుతోపాటు అనేక గ్రంథాలను అనువదించా. 15 కథా సంపుటాలు వెలువరించారు .`ఇంద్రజిత్`, ’శేషుబాబు`, `క్రాంతినాథ్` కలం పేర్లతోనూ చేసిన  రచనలు` ఆంధ్రప్రభ, యువ, అభిసారిక, పుస్తకం,జ్యోతి, సుభాషిణి, వాణి, ఆహ్వానం,  ఆంధ్రజ్యోతి, ప్రజాబంధు, భారతి, చిత్రగుప్త, నీలిమ, కథాంజలి,  ఆనందవాణి  పత్రిక తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి. `

పత్రికా వ్యవస్థాపకుడిగా..

తెనాలిలో ఆలపాటి రవీంద్రనాథ్ ప్రారంభించిన రేరాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తల్లి కన్నుమూసిస అయిదేళ్లకే అంటే పదహారో ఏట  వివాహమైంది.బాల్యంలో తల్లినో పోగొట్టుకున్నఆయన పెద్దయ్యాక కుమారుడు( పెద్దకుమారుడు శేషు పన్నెండేళ్లకే కాలం చేశారు) దూరంకావడతో మరోసారి  మానసిక వేదన అనుభవించారు. స్థలం మార్పడితో పాటు ఉపాధి కోసం  ప్రముఖ నిర్మాత చక్రపాణి సాహచర్యంతో  నాటి మద్రాసు చేరుకున్నారు. `చందమామ`లో సుమారు ఏడాది పాటు పనిచేశారు. అటు తర్వాత `జ్యోతి` మాస పత్రిక, చిత్రసీమ,అభిసారిక పత్రికలను నెలకొల్పారు.కొన్నేళ్లకు  సొంత  ముద్రణసంస్థ ` క్రాంతిప్రెస్`వ్యవహారాలతో తీరికదొరక్క  `జ్యోతి`ని  వేమూరి రాఘవయ్యకి,  `అభిసారిక`ని  రాంషాకి, చిత్రసీమ`ని  కొలను బ్రహ్మానందనరావుకు అప్పగిం చేశారు.  `జ్యోతి`ని రాఘవయ్య ఆధ్వర్యంలో నడిచినా ధనికొండ పేరునే సంపాదకుడిగా  కొంత కాలం కొనసాగించారు.

`అభిసారిక`

ధనికొండ వారు  ఎన్ని పత్రికలు నిర్వహించినా `అభిసారిక` పత్రిక ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. లైగింక విజ్ఞానం గురించి తెలియచెప్పి లైగింక అంశాలపై అపోహ తొలగించాలన్నది లక్ష్యంతో  ఆ పత్రికను నిర్వహించారు.తమ అభిరుచికి తగినట్లుగా దీనిని నిర్వహించారు.`నిర్ణీత ప్ర‌దేశం వ‌లెనే, నిర్ణీత కాలంలో ఈ `అభిసారిక‌` లైంగిక జీవ‌న ప్రాధాన్య‌త‌ను చ‌ర్చిస్తూ  లైంగిక  విజ్ఞానాన్ని  ఇచ్చేం దుకు ప్ర‌య‌త్నిస్తుంది`అని తొలి సంచిక‌లోనే స్ప‌ష్టం చేశారు.`అభిసారిక` సంపాద కీయాలలో వివిధ సమస్యలపై సమాజానికి స్పష్టమైన  సందేశాన్ని ఇచ్చారు. ` లైంగిక జీవనానికి,సాంఘిక జీవనానికి చాలా దగ్గరి సంబంధం ఉంది… శృంగార మంటే కేవలం లైంగిక జీవనం కాదని, దానికి  శాస్త్రీయ దృక్పథం ఉంది` అని మొదటి సంపాదకీయంలో పేర్కొన్నారు. తన పత్రిక శృంగారరస వ్యాప్తికి జన్మించ లేదని, సెక్స్ పత్రిక అనగానే  బెదరిపోవలసిన అవసరం  లేదని,  శాస్త్రీయ దృక్పథంతో, లైంగిక విజ్ఞానాన్ని ఇవ్వడానికి  మొదలైన తన పత్రికలో వ్యాసాలు,  సమాధానాలు,  కథలు… అన్నీ శాస్త్రబద్దమై, మనస్తత్వ ప్రాధాన్యతతో  సాంఘిక  సమస్యలు  చర్చిస్తాయని అన్నారు.  ఆ పత్రికలో వెలువడిన  సంపాదకీయాలను  ఆయన కుమారులు  సంపుటిగా తీసుకువచ్చారు.

ప్రత్యేక సంపుటాలుగా రచనలు

ధనికొండ శతజయంతి (2019) సందర్భంగా ఆయన రచనలన్నిటిని 21 సంపుటాలుగా తీసుకువచ్చారు.మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వా ధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ సంపాదకత్వంలో వెలువడిన వాటిని మద్రాసుతో పాటు హైదరాబాద్, విజయవాడల్లో పుస్తక ప్రదర్శనల్లో ఆవిష్క రించారు.ధనికొండ `పత్రికా సంపాదకుడిగా,ముద్రణాలయ అధిపతిగా ఉంటూ ఇంతటి సాహిత్యాన్ని ఎప్పుడు,ఎలా సృష్టించ గలిగారు?`అని ఆశ్చర్యం వ్యక్తం చేసేవారూ ఉన్నారు.

చిన్నతనంలోనే  తల్లిని కోల్పోయి కుంగిపోయినా జీవన్మరణాల మధ్య జీవితాన్ని కొనసాగించడంప అవగాహన పెంచుకున్నారు. స్థిరచిత్తులయ్యారు. దానిని జీవితాంతం పాటించారు. `నేను 1990వ సంవత్సరాన్నిచూడను`అని  స్నేహితులతో యధాలాపంగా అన్నమాటలు నిజమైనట్లు 1989 డిసెంబర్  21న కన్నుమూశారు.

(ఈ నెల 21న.. సోమవారం ధనికొండ వర్ధంతి)

Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles