Friday, April 26, 2024

భారీ వానలు, వరదలపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలు

  • 16 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
  • ప్రగతి భవన్ వేదికగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొనసాగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తక్షణమే అమలవుతున్న వరద సహాయ, రక్షణ చర్యలు
  • వరదలను ముందస్తుగా అంచనావేసి దార్శనికతతో నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్
  • సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగం
  • ప్రజాసంక్షేమం పట్ల ఆర్తి ఉన్న సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ తో, అదుపులో వున్న పరిస్థితులు
  • ప్రకృతి విపత్తు వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలనే పట్టుదలతో పనిచేస్తున్న సీఎంఓ కార్యాలయం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి సహా ఇరిగేషన్,రోడ్లు భవనాలు, విద్యుత్తు, వైద్యం, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో రేయింపగల్లు  నిరంతర పర్యవేక్షణలో సీఎం కేసిఆర్
  • ఊహించని రీతిలో తలెత్తిన భారీ వానలు వరదల నేపథ్యంలో ప్రజల్లో భరోసా నింపుతున్న సీఎం కేసీఆర్ వరస సమీక్షలు సహాయక చర్యలు
  • సీఎం పర్యవేక్షణతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం
  • సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో స్వీయ నియంత్రణలో పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు తగ్గుతున్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం
  • ప్రజారక్షణ చర్యల్లో తక్షణ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పాల్గొనేలా  నాలుగు రోజులపాటు స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం

క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికార అధికారులతో స్వయంగా మాట్లాడి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రెస్క్యూ టీంలు హెలికాప్టర్లను సిద్దం చేయాలని సీఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. విద్యుత్తు, రోడ్లు, తాగునీరు వైద్యము తదితర ప్రజా నిత్యావసర రంగాలపై వానలు వరదలు ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అప్రమత్తమై క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల  మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిత్యం పర్యటిస్తున్నారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు రిజర్వాయర్లు నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో.,తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ.. వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు.

ఇప్పటికే రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో  వానలు వరదల పై  ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా ఇటు గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలుదాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో నదిమీది ఎస్సారెస్పీ వంటి  పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.  ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన చర్యలకు ఫోన్లో అదేశాలిస్తున్నారు. వరదల వల్ల రవాణా విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా  సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలను ఆరా తీస్తున్నారు.

కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించిన అధికారులు

గోదావరి నది మీది కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా ఇంకా వరద పెరుగుతున్నదని అధికారులు సిఎం కు వివరించారు. ఈమేరకు ముంపు  కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించారు. అక్కడే వుండి రక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్న స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఫోన్లో సిఎం తగు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ మరియు ఇతర వరదముంపుకు గురౌతున్న పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అరవింద్ కుమార్ ను సిఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సిఎం ఆదేశించారు. ఎక్కడకూడా ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సిఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు సిఎం ఆదేశాలిచ్చారు.

భద్రాచలంలో పెరుగుతున్న వరద ఉధృతి

భద్రాచలం లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే వుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్తితిని చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో సిఎం కెసిఆర్ సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే  కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సిఎం ఆదేశించారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు

రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్  ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సిఎండీ లు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండీ శ్రీధర్ లను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్థంభాలు కూలిపోతే 1600  వరకు పునరుద్దరణ చేపట్టామని,మిగతా పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట  తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్దరిస్తున్నట్టు సిఎండీ రఘురామారెడ్డి సిఎం కు వివరించారు.

 ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను పట్టి  అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని సిఎం అన్నారు. దేవాదుల ప్రాజెక్టుల పనులు పురోగతి లో ఉన్న నేపథ్యంలో   వరదనీరు చేరుకోవడం తో తక్షణ చర్యలు చేపట్టి వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్ రావుకు సిఎం కెసిఆర్ ఆదేశించారు.

నిధుల విడుదలకు ఆదేశాలు

వానలు వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎస్ డిజిపిలను సిఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే ప్రజలెవరూ కూడా బయటకు వెల్లవద్దని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు.

సమీక్షా సమావేశం నుంచే  వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్లో అడిగి తెలుసుకుని ఆదేశాలు జారీచేశారు. ఎట్టిపరిస్థితుల్లో పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజకవర్గాలు జిల్లాలు విడిచి వెల్లరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను ఎమ్మెల్యేలను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

సెలవులు పొడిగింపు

భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులను ఉత్తర్వులు జారీ చేయాలని సమీక్ష సమావేశం నించే సీఎం కేసిఆర్ ఆదేశించారు.సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి,  ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి అధికారులు,  సీఎంఓ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్ సి మురళీధర్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, జిహెచ్ ఎంసి, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles