Wednesday, May 25, 2022

పత్రిక పేరే ఇంటిపేరుగా ప్రసిద్ధి చెందిన ‘రేపు’ నరసింహారావు

  • భయమెరుగని ప్రజామేధావి
  • మనోవైజ్ఞానిక రంగంలో అగ్రగామి
  • రాజకీయ విశ్లేషణలో తనదైన శైలి

‘రేపు’ నరసింహారావుగా ప్రసిద్ధుడైన మిత్రుడు చల్లగుళ్ళ నరసింహారావు నవ్వు ఇక కనిపించదు, వినిపించదు. నవ్వులేని, నవ్వలేని నరసింహారావును ఊహించుకోవడం కష్టం. మనోవైజ్ఞానిక శాస్త్రంలో, రాజకీయ విశ్లేషణలో అగ్రగణ్యుడు ఆయన. అన్నిటికంటే మించి మంచి మిత్రుడు. ఎవరికైనా రాజకీయ అభిప్రాయాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. ‘నువ్వు నలభై పడిలో ప్రవేశించేవరకూ కమ్యూనిస్టువి కాకపోతే, నీలో ఏదో లోపం ఉంది. నలభయ్యో పడి తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్టుగా కొనసాగితే నీలో ఏదో లోపం ఉంది,’ అని మాజీ రక్షణ మంత్రి యశ్వంత్ రావ్ బల్వంతరావ్ చవాన్ అనేవారు. పరిస్థితులను బట్టి, అనుభవాన్ని బట్టి అభిప్రాయాలు మారతాయి. అధ్యయనశీలురైనవారు కార్యకారణ సంబంధాలను పరిగణలోకి తీసుకొని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అదే ప్రాతిపదికపైన అభిప్రాయాలు మార్చుకుంటారు. అటువంటివారిలో నరసింహారావు ఒకరు. తెలుగుదేశం పార్టీ విమర్శకుడుగా పరిచయమైన వ్యక్తి ఆ పార్టీ సమర్థకుడిగా మారారంటే ఆయన జీవితంలో తారసబడిన వ్యక్తులూ, ఎదురైన అనుభవాలూ, ఏర్పడిన అవగాహనా కారణం. ఎప్పుడైన తన అభిప్రాయాలను సాకల్యంగా, సాధికారికంగా, సాహసోపేతంగా వెల్లడించే మనస్తత్వం ఆయనది. ఒకరు ఒప్పుకుంటారా లేదా అన్నది ఆయన సమస్య కానేకాదు. తనకు తోచినది చెప్పడమే స్వభావం. ‘ఈనాడు’ రామోజీరావు లాగా పత్రిక కొద్ది కాలమే నడిచినా ‘రేపు’ ఇంటి పేరుగా మార్చుకున్న పాత్రికేయుడు నరసింహారావు.

కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని పెదపాలపర్రులో రైతు కుటుంబంలో పుట్టిన నరసింహారావు రైతుకు సహజంగా ఉండే స్పష్టత, ముక్కుసూటిదనం, నిర్బీతి, నిజాయితీ పుణికిపుచ్చుకున్న మేధావి. పట్టాపుచ్చుకున్న తర్వాత వినుకొండ నాగరాజు అధ్వర్యంలో వెలువడే ‘కమాండో’ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నారు.  మనో వైజ్ఞానిక మాసపత్రిక ‘రేపు’ ను కొన్ని సంవత్సరాలపాటు జయప్రదంగా నడిపించి సంచలనం సృష్టించి, ప్రజల హృదయాలలో దానికి శాశ్వత స్థానం ప్రసాదించిన కారణంగా ఆయన ఇంటిపేరు చల్లగుళ్ళ బదులు ‘రేపు’ స్థిరమైంది. నిన్నటి విషయాలు చెబుతూ, ఈ రోజు పరిణామాలు ప్రస్తావిస్తూ రేపటి గురించి శాస్త్రీయంగా, గతితార్కికంగా చెప్పడం ‘రేపు’ పత్రిక ప్రత్యేకత. ప్రతి వెల రెండు రూపాయలు ఉండేది. వ్యాపార ప్రకటనలు ఉండేవి కావు. విశేష పాఠకాదరణ ఉండేది. ఆర్థిక కారణాల వల్ల ‘రేపు’ పత్రిక మూతబడింది. అయినా ఆయన పాత్రికేయ వ్యాసంగానికి స్వస్తి చెప్పలేదు. ‘నూతన ప్రపంచం,’ ‘చెలిమి’ అనే తెలుగు వారపత్రికలనూ, ‘ఇండియన్’ అనే ఇంగ్లీషు వారపత్రికనూ కొంతకాలం నిర్వహించి చేతులు కాల్చుకున్నారు. తర్వాత పత్రికలు నడపలేదు. పత్రికలద్వారా, పుస్తకాల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించడమే పనిగా పెట్టుకున్నారు.   

కమ్యూనిస్టు ఉద్యమం ఎదిగిన గ్రామంలో పుట్టిన నరసింహారావుకు మొదట్లో వామపక్షాలపట్ల సానుభూతి ఉండేది. తర్వాత సోషలిస్టులతో సాహచర్యం చేశారు. మనోవైజ్ఞానికరంగంలో నరసింహారావు ప్రావీణ్యం తెలుసుకున్న ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు నండూరి రామమోహన్ రావు ఆయన చేత ప్రత్యేక విశ్లేషణలు రాయించేవారు. ‘భారత దేశంలో విప్లవం సాధ్యమా?’అనే శీర్షికతో ఆలోచనాత్మకమైన పుస్తకం రాశారు. ఆచార్య ఎన్. జి. రంగా, రాజగోపాలనాయుడు, ఎన్ సత్యనారాయణరెడ్డి (జనతా ప్రభుత్వ హయాంలో యూపీ గవర్నర్), సుంకర సత్యనారాయణ వంటి మిత్రులు ఉండేవారు. ఆత్యయిక పరిస్థితిని ఎదిరించి పోరాడినవారిలో ఒకరు. మనిషిలో నిరాశను పారదోలడమే లక్ష్యంగా, ఆశావాదాన్ని ప్రోదిచేయడమే ధ్యేయంగా ఆయన రచనలూ, మాటలూ, వాదనలూ సాగేవి. వీటన్నిటికీ మాధ్యమం మనోవిశ్లేషణే. వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యం, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి, మావన చరిత్ర మనకు నేర్పే గుణపాఠాలేంటి? (ద లెసెన్స్ ఆఫ్ హిస్టరీకి స్వేచ్ఛానువాదం), మానసిక ఆరోగ్యం, తదితర శీర్షికలతో రెండు పదులకు పైగా పుస్తకాలు ప్రచురించారు. వ్యక్తిత్వ వికాసంపైన పుస్తకాలు ప్రచురించి వేల సంఖ్యలో ప్రతులను విక్రయించి వాటి మీద జీవిక సాగించిన రచయిత ఆయన. ‘వ్యక్తిత్వ వికాసం’ అనే గ్రంథాన్ని ఇంతవరకూ 58 ముద్రణలు ప్రచురించారు. ‘విజయీభవ,’ ‘విజయపథం,’ ‘అన్యోన్య దాంపత్యం,’ ‘పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?’ వంటి పుస్తకాలకు పాఠకాదరణ దండిగా ఉండేది. యండమూడి వీరేంద్రనాథ్, డాక్టర్ పట్టాభిరాం కంటే చాలా ముందుగానే వ్యక్తిత్వ వికాసంపైన వ్యాసాలూ, పుస్తకాలూ రాసిన మనోవిజ్ఞాన ప్రవీణుడు.  

వ్యక్తిత్వ వికాసం పేరుతో టీవీ సీరియల్ నిర్మించారు. ‘ఆంధ్రజ్యోతి’లోనే నరేంద్రమోదీ, సోనియాగాంధీ, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రముఖుల వ్యక్తిత్వ విశ్లేషణ రాశారు. నేను ‘వార్త’ సంపాదకుడిగా ఉన్న కాలంలో ఆ పత్రికకు తరచుగా వ్యాసాలు రాసేవారు. హెచ్ఎంటీవీ నిర్వాహకుడిగా పని చేసిన రోజుల్లో టీవీ చర్చాకార్యక్రమాలలో క్రమం తప్పకుండా హాజరయ్యేవారు.

‘రేపు’ మాసపత్రిక ప్రారంభించిన 1979లోనే ‘హరిజన్’ పేరుతో రోవింగ్  కరెస్పాండెంట్ కె. రవీంద్రన్ దర్శకత్వంలో ఒక కళాత్మక చిత్రం నిర్మించిన ప్రయోగశీలి నరసింహారావు. అవార్డులు రాకపోయినప్పటికీ చలనచిత్ర పరిశీలకుల ప్రశంసలు అందుకున్నది. మరుసటి సంవత్సరం (1980) నిర్మించిన ‘శంకరాభరణం’ నాలుగు అవార్డులు గెలుచుకున్నది. ‘హరిజన్’ కపిలేశ్వరపురం చుట్టుపక్కల గ్రామాలలో చిత్రీకరించారు. కోస్తాగ్రామీణ జీవితానికి అద్దం పట్టిన మంచి చిత్రం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మధు అంబట్ ఇష్టపడి పని చేసిన సినిమా ఇది. దీని ప్రింట్లు ఇప్పుడు దొరకడం లేదు. 1981లో హైదరాబాద్ దూరదర్శన్ ఈ సినిమాని ప్రసారం చేసింది. వారి దగ్గర ఉండవచ్చు. ఫిలిం సొసైటీ ప్రదర్శనల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా గురించి అమితా మాలిక్ వంటి సినిమా విమర్వకులు ఇండియన్ ఎక్స్ ప్రెస్, స్టేట్స్ మన్ లో వ్యాఖ్యాలు రాసినట్టు డాక్టర్ తుమ్మల నళిని గుర్తు చేశారు.

నేను విజయవాడలో 1979 నుంచి 1989 వరకూ ‘ఆంధ్రప్రభ’లో, ‘ఉదయం’లో పని చేసిన పదేళ్ళలో క్రమం తప్పకుండా కలుసుకోవడమో. ఫోన్ లో మాట్లాడటమో నిత్యకృత్యం. బందరులో ప్రఖ్యాత సంపాదకులు ముట్నూరి కృష్ణారావు ‘కృష్ణాపత్రిక’  సంపాదకుడిగా గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తూనే సాయంకాలాలలో ‘దర్బారు’ నిర్వహించేవారు. ఆ దర్బారుకు పట్టాభిసీతారామయ్య వంటి ప్రసిద్ధులు కూడా హాజరై మాటకచేరీలో పాల్గొని ఆనందించేవారు. దాదాపు అదే పంథాలో సి. నరసింహారావు విజయవాడలోని ఏలూరు రోడ్డులో మొదటి అంతస్తులోని తన నివాసంలో  దర్బారు నిర్వహించేవారు. నిత్యం సాయంకాలం చర్చోపచర్చలు సాగుతూ ఉండేవి. అప్పుడప్పుడు ఆయన, ఆయనతో పాటు ఇతరులూ పెద్దగా నవ్వుతూ ఉండేవారు. ఛణుకులు విసురుతూ ఉండేవారు. ఫ్రాయిడ్ నూ, ఎరిక్ సన్ నూ ఉటంకిస్తూ ఉండేవారు. సెలవు రోజులలో నేను చాలా సేపు నరసింహారావు దర్బార్ లో కూర్చొనేవాడిని. మిగతా రోజుల్లో వీలైనప్పుడల్లా ఆఫీసుకు వెడుతూ దారిలో ఏలూరు రోడ్డులో ఆగి కొద్ది సేపైనా కూర్చొని వెళ్ళేవాడిని. ‘ఉదయం’ విజయవాడ ఎడిషన్ లో నేను పని చేసిన అయిదు సంవత్సరాలూ ఆయనే తరచుగా వచ్చి కబుర్లు చెప్పేవారు. తాజా రాజకీయ పరిణామాలపైన, రాజకీయ నాయకులపైన వ్యంగ్యాస్త్రాలు సంధించడం, వారి మనోవిశ్లేషణ చేయడం, కొత్త విషయాలు ప్రస్తావించడంతో చాలా విజ్ఞానదాయకంగా చర్చ జరిగేది. నా సహచరులు కూడా ఆసక్తిగా గమనించేవవారు.

నరసింహారావుది ఓపెన్ డోర్ పాలసీ. ఎవరెవరో వస్తూ  ఉంటారు. వింటూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళిపోతారు. కొత్తవారు వస్తారు. అట్లా దర్బార్ సాగుతూనే ఉంటేది. నరసింహారావు వ్యాఖ్యానాలు చేస్తూనే ఉండేవారు. మాటకచేరీలో పాల్గొనేవారికి  కాఫీలూ, టీలూ అందుతూ ఉండేవి. నరసింహారావు ఇంటికి అయిదు నిమిషాల ప్రయాణంలో బస్ స్టాండ్, పది నిమిషాల దూరంలో రైల్వేస్టేషన్. గుంటూరు నుంచో, విశాఖ నుంచీ, కర్నూలు నుంచో, హైదరాబాద్ నుంచో పనిమీద వచ్చినవారు తమ పని పూర్తయిన తర్వాత బస్ కు కానీ రైలుకు కానీ సమయం మిగిలి ఉంటే నరసింహారావు దర్బార్ లో కాసేపైనా కాలక్షేపం చేసి, యోగక్షేమాలు తెలుసుకొని, కబుర్లు కలబోసుకొని వెళ్ళేవారు. కొంతమంది స్థానికి మేధావులు క్రమం తప్పకుండా దర్బారులో హాజరయ్యేవారు.

నరసింహారావు ఎవ్వరికీ భయపడే ప్రశ్న లేదు. ‘ఇంత కటువుగా మాట్లాడుతున్నారు. అతగాడు ఏమైనా చేస్తాడేమో,’ అని ఎవరైనా హితైషి అంటే ‘వాడి బూడిది. వాడేం చేస్తాడు మనల్ని. మనం తప్పు మాట్లాడుతున్నామా? అబద్ధాలు చెబుతున్నామా?’ అని ఎదురు ప్రశ్నించేవారు. తెల్లప్యాంటు, తెల్లషర్టు వేసుకొని, పచ్చటి శరీరఛాయతో, నవ్వుతో వెలిగే ముఖంతో హాయిగా కనిపించేవారు. వ్యక్తిగత సమస్యలు కానీ ఆరోగ్య విషయాలు కానీ మిత్రులతో సైతం చర్చించేవారు కాదు. ఎప్పుడూ ప్రపంచం గురించే చర్చ. మధ్యమధ్య చక్రధర్, తుమ్మల చౌదరి, డాక్టర్ యలమంచిలి శివాజీ, డాక్టర్ ఎన్ భాస్కరరావు, డాక్టర్ ఇన్నయ్య, అండవిల్లి సత్యనారాయణ, ‘అంకురం’ సినిమా దర్వకుడు ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తుమ్మల గోపాలరావు, వెంకయ్య, ఇస్మాయిల్, నాగేశ్వరరావు (ఇప్పుడు ‘ఈనాడు’ సంపాదకులు), సి. ధర్మారావు, నవోదయ రామమోహన్ రావు వంటి అనేక మంది మిత్రులు ఫోన్ చేసి పలకరించేవారు. గంటలు నిముషాల్లాగా గడిచిపోయేవి.

నందమూరి తారకరామారావుని విమర్శనాత్మకంగా పరిశీలించేవారు. 1989లో ఎన్నికల ముందు ఎన్ టి ఆర్ మనో విశ్లేషణతో ముప్పయ్ వ్యాసాలు రాశారు. ముప్పయ్ రోజులు వరుసగా ‘ఉదయం’లో ప్రచురించాం. వాటికి పాఠకాదరణ బాగా ఉండేది. ఎన్ టి ఆర్ ఏ పని ఎందుకు చేశారో, దాని నేపథ్యం ఏమిటో, ఆయన మనసు ఎట్లా పని చేస్తుందో, ఆలోచనలు ఎట్లా ఎందుకు సాగుతాయో విశ్లేషించి రాశారు. ఎవ్వరినీ పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలకు సంస్కృత భూయిష్టమైన పేర్లు పెట్టడం, పేదవాడి పట్ల జాలి ఉండటం, రెండు రూపాయల కిలో బియ్యం పథకం  వంటి అనేక లక్షణాలనూ, కార్యక్రమాలనూ అన్ని కోణాల నుంచి పరిశీలించి విశ్లేషించారు. దాన్ని పుస్తకంగా వేశారు. దాన్నినేను ఇంగ్లీషులోకి అనువదించాను. ఇంగ్లీషు అనువాదాన్నికూడా ప్రచురించారు. నేను దిల్లీ వెళ్ళినప్పుడు రెండు కాపీలు ప్రఖ్యాత సంపాదకుడు కుష్వంత్ సింగ్ కు ఇచ్చాను. ఆయన అంతా చదివి పుస్తకాన్ని ప్రశంసించారు. ఎన్ టి రామారావు వ్యక్తిత్వాన్నిఅధ్యయనం చేసిన తీరునూ, మనోవైజ్ఞానిక విశ్లేషణ చేసిన పద్ధతినీ, వ్యాసాలు రాసిన రీతినీ మెచ్చుకున్నారు.

‘ఉదయం’ సంపాదకుడిగా ప్రమోషన్ పైన నేను హైదరాబాద్ కు 1989లో వచ్చాను. నరసింహారావు కూడా హైదరాబాద్ కి మకాం మార్చారు. మహావీర్ ఆస్పత్రికి ఎదురుగా శాంతినగర్ లో చాలాకాలం నివాసం ఉన్నారు. కమ్యూనికేషన్స్ లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన కుమారుడు హర్ష టీవీ5లో ఉద్యోగం. విజయవాడలో జరిగినట్టు దర్బార్ లేకపోయినా ఎప్పుడూ మిత్రులు వస్తూపోతూ ఉండటం రివాజు. అదే అపార్ట్ మెంట్స్ లో మిత్రడు పెద్దిరెడ్డి చంగల్రెడ్డి (మాజీ మంత్రి తిమ్మారెడ్డి తనయుడు) కూడా నివసించేవారు (ఇటీవలనే నరసింహారావు కాజాగూడాకు మారారు).  ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో, దేశంలో పరిస్థితి గురించి గంటల తరబడి చర్చించుకునేవాళ్ళం. ఎవరు గెలుస్తారో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఘంటాపథంగా చెప్పేవారు. చాలా సందర్భాలలో ఆయన చెప్పిన పార్టీ గెలిచేది. అంచనా తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంచనా ఎందుకు తప్పిందనే అంశంపైన మరో చర్చ. హేతువాద దృక్పథం ప్రధానం.

పదిహేను సంవత్సరాలకు పైగా నరసింహారావు టీవీ చర్చాగోష్ఠులలో, టీవీ5లో ప్రధానంగా వార్తావ్యాఖ్య కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. తన నిశ్చితాభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దానికి మనోవైజ్ఞానిక విశ్లేషణ జోడించేవారు. నరసింహారావుకు భార్య జ్యోతి, కుమారుడు హర్ష, కోడలు పద్మజ, మనుమడు విశిష్ట ఉన్నారు. ఇటీవల మనుమడికి పంచెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

నరసింహారావు ఉద్యోగాలు చేసిన వ్యక్తి కాదు. వ్యాపారం పెద్దగా తెలియదు. రచనలపై సంపాదనతోనే దర్జాగా బతికిన వ్యక్తి. ఒకటి,రెండు వ్యాపారాలలో ప్రమేయం ఉన్నా కానీ మౌలికంగా ఆయన ప్రజామేధావి (పబ్లిక్ ఇంటలెక్చువల్) పాత్రనే పోషించారు. అనువైన అర్థాంగి, ఏకైక కుమారుడి సహకారంతో ఆయన జీవితం తాను కోరుకున్న విధంగా జీవించారు. గురువారం తెల్లవారుజామున లోకం విడిచిపెట్టిన తర్వాత ఆయన అభీష్టానికి తగినట్టే అంత్యక్రియలు జరిగాయి. అది చాలా అరుదైన, అసాధారణమైన విషయం. మనోవైజ్ఞానికశాస్త్ర ప్రపంచానికీ, రాజకీయరంగానికీ, హేతువాదానికీ ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.  

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles