Friday, March 29, 2024

సోనియా, స్మృతి ఇరానీ మధ్య వాక్బాణాలు

పార్లమెంటులో ఏం జరుగుతోంది? గొడవ జరుగుతోంది. అల్లరి జరుగుతోంది. గందరగోళం జరుగుతోంది. చర్చ మాత్రం జరగడం లేదు. నలుగురు లోక్ సభ సభ్యులను సెషన్ అయ్యేంతవరకూ సస్పెండ్ చేశారు. 24 మంది రాజ్యసభ సభ్యులను శనివారం వరకూ సస్పెండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ఎన్డీయే ప్రభుత్వం 129 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. యూపీఏ ప్రభుత్వం పదేళ్ళ కాలంలో సస్పెండ్ చేసిన ఎంపీ ల కంటే ఇది 170 శాతం ఎక్కువ. యూపీఏ హయాంలో పార్లమెంటులో చర్చ జరగకుండా బీజేపీ నిరోధించింది. ఆ విధంగా నిరోధించడం పార్లమెంటరీ విధానంలో భాగమేనంటూ నాటి రాజ్యసభలో బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. ఇప్పుడు అదే బీజేపీ కాంగ్రెస్ నూ, ఇతర ప్రతిపక్షాలనూ తప్పుపడుతోంది. నిత్యావసర ధరల పెరుగుదల మీదా, జీఎస్ టీ విస్తరణ మీదా  చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టి నినాదాలు చేస్తున్నాయి. అధికారపక్షం తన అధికారం ఉపయోగించి నోరెత్తిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నది. సస్పెండ్ అయిన ఎంపీలలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. వారంతా కలసి మహాత్మగాంధీ విగ్రహం దగ్గర 50 గంటల నిరసన ప్రదర్శన చేశారు.

 ఈలోగా సోనియాగాంధీ, స్మృతి ఇరానీ మధ్య గొడవ జరిగింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ చౌధురి నోరుజారి రాష్ట్రపతిని ‘రాష్ట్రపత్ని’ అని అనడంతో బీజేపీ సభ్యులు అరుపులు మెరుపులు మొదలుపెట్టారు. రాష్ట్రపతిని తప్పుగా సంబోధించడం తెలివిమాలినపని. బుద్ధి ఉన్న నాయకుడు ఎవరూ ఆ విధంగా మాట్లాడడు. తరచుగా తప్పులో కాలేస్తూ క్షమాపణ చెప్పుకోవడం అలవాటైన ఈ అధీర్ రంజన్ చౌధురీని లోక్ సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడిగా ఎందుక కొనసాగిస్తున్నారో సోనియాగాందీకీ, రాహుల్ గాంధీకే తెలియాలి. పైగా ఆయనే పశ్చిమబెంగాల్ పీసీసీ అధ్యక్షుడు కూడా. ఆయనలో ఉన్న మహత్తు ఏమిటో వారికే తెలియాలి. మాటమాటకీ నోరు జారే అధీర్ ను తొలగించి మరెవరికైనా అవకాశం ఇస్తే నయం కదా. ఇంత అధ్వానంగా ఎవ్వరూ మాట్లాడరు. నాయకత్వానికి తలనొప్పులు తీసుకొని రారు.  నోరు జారాననీ, తనకు హిందీ భాష మీద పట్టులేకపోవడం వల్ల పొరబాటు జరిగిందనీ అధీర్ రంజన్ చౌధురి మొత్తుకుంటున్నా వినే నాధుడు లేదు. రాష్ట్రపతిని అవమానం చేస్తారా అంటూ అధికారపక్షానికి చెందిన మహిళా సభ్యులు చెలరేగిపోయారు. మాటల యుద్దంలో ఈటలు దూసే అలవాటున్న వాగ్యుద్ధప్రవీణ స్మృతి ఇరానీ అదేపనిగా సోనియాగాంధీని క్షమాపణ చెప్పాలని  కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా సోనియా క్షమాపణ చెప్పాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. మొత్తం మీద సభ పెద్ద చర్చ లేకుండానే వాయిదా పడింది. అప్పుడు సోనియాగాంధీ తన దారిన తాను ఇంటికి వెడితే గొడవ ఉండేది కాదు. ఆమె సీనియర్  బీజేపీ సభ్యురాలు రమాదేవి దగ్గరికి నడిచారు. ‘‘తప్పుగా మాట్లాడినందుకు అధీర్ రంజన్ చౌధురి క్షమాపణలు చెప్పారు కదా ఇందులో నా ప్రమేయం ఏమున్నది? నా తప్పు ఏమున్నది?’’ అని అడిగారు. ‘కెన్ ఐ హెల్ప్ యూ మేడమ్’ అనుకుంటూ వారిద్దరి మధ్యా స్మృతి ఇరానీ దూరారు. ‘నేను రమాదేవితో మాట్లాడుతున్నాను. మీతో కాదు,’ అని సోనియాగాంధీ అన్నారు. దాంతో స్మృతి ఇరానీ మరో మాట అన్నారు.  ఇద్దరూ ఈటెల చూపులతో చూసుకున్నారు. సోనియా తనను అవమానపరిచినట్టు ఇరానీ చెప్పారు. తక్కిన బీజేపీ సభ్యులు కూడా ఆమెను సమర్థించారు. డీఎంకె సభ్యులూ, ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సోనియాగాంధీని వెంటబెట్టుకొని ఆమె కారుదాకా వెళ్ళి ఇంటికి పంపించివేశారు. స్మృతి ఇరానీ, సోనియాగాంధీ మధ్య జరిగిన సంభాషణపైన బీజేపీ సభ్యుల ఒక రకంగానూ, కాంగ్రెస్ సభ్యులు అందుకు పూర్తి విరుద్ధంగానూ చెబుతున్నారు. సోనియాగాంధీ ముర్దాబాద్ అంటూ మహిళా సభ్యులు నినాదాలు చేశారని గౌరవ్ గొగోయ్ అంటున్నారు. సోనియాను తర్జని చూపుతూ స్మృతి ఇరానీ బెదిరించారనీ, నేనెవరో తెలుసా? అంటూ  మీదిమీదికి వచ్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.  ఏది ఏమైనా 75 సంవత్సరాల వయస్సు ఉండి, కాంగ్రెస్ పార్టీకి రెండు దశాబ్దాలకు పైగా అధ్యక్షురాలిగా పని చేస్తున్న సోనియాగాంధీపైన స్మృతి ఇరానీ అంత దూకుడు ప్రదర్శించడం బాగోలేదు.

ఒక పేద, ఆదివాసీ మహిళను ప్రదాని నరేంద్రమోదీ రాష్ట్రపతిని చేయడం కాంగ్రెస్ సహించలేకపోతోందంటూ స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్య నూతన రాష్ట్రపతికి గౌరవ ప్రదంగా లేదు. ఆమె పేదరికాన్ని, ఆదివాసీ అనే వాస్తవాన్ని పదేపదే ప్రస్తావించి రాజకీయలబ్ధి పొందాలని స్మృతి ఇరానీ వంటి బీజేపీ నాయకులు పదేపదే ప్రయత్నించడం రాష్ట్రపతిని అగౌరవ పరచడమే. అధీర్ రంజన్  చౌధురిని సభాపతి ఓంబిర్లా పిలిచి క్షమాపణ సభాముఖంగా చెప్పటానికి అవకాశం ఇచ్చి ఉంటే గొడవ ఉండేది కాదు. కానీ గొడవ ఉండటం బీజేపీకి అవసరం. ధరల పెరుగుదల పైన చర్చ  ఇష్టం లేదు. ఇదే అంశంపైన 27రోజులు జరిగిన బడ్జెట్ సెషన్ లోనూ, ఇప్పుడు జరిగిన పదిరోజులలోనూ చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు.

రాష్ట్రపతి అనే మాట మీద ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో చర్చ జరిగింది. రాష్ట్రపతి అంటే పురుషులకూ, స్త్రీలకూ వర్తిస్తుందని ప్రణబ్ దా వాదించారు. చైర్మన్ ను చైర్ పర్సన్ గా మార్చినట్టుగానే రాష్ట్రపతిని కూడా పురుషలకూ, స్త్రీలకూ వర్తించే విధంగా మరేదైనా మాటతో సంబోధించవచ్చునేమో అనే విషయంపైన చర్చ జరిగింది. చర్చ జరగవచ్చును కానీ దాని మీద ఇంత రచ్చ అవసరం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles