Thursday, September 28, 2023

బీజేపీ నియామకాల ఆంతర్యం ఏమిటి?

కె. రామచంద్రమూర్తి

ఎట్టకేలకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా తన కార్యవర్గాన్ని ప్రకటించారు. కడచిన జనవరిలో పార్టీ పగ్గాలను హోంమంత్రి అమిత్ షా చేతులలో నుంచి స్వీకరించిన తర్వాత జె.పి. నడ్డా చేసిన పెద్ద సాహసం ఇది. అమిత్ షా టీంలో ఉండిన నలుగురు ప్రధాన కార్యదర్శులకు ఉద్వాసన చెప్పారు. వారిలో ఇద్దరు తెలుగువారు – రాంమాధవ్, మురళీధరరావు. మరో ఇద్దరు సరోజ్ పాండే, అనిల్ జైన్. కొత్తగా పదవులు వచ్చినవారిలో ముగ్గురు తెలుగువారు ఉన్నారు. పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవినీ, డాక్టర్ కె. లక్మణ్ కు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవినీ, డీ.కే. అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవినీ ఇచ్చారు. మొత్తం మీదికి 70 మంది సభ్యులున్న బీజేపీ బృందంలో సమర్థులూ, అనుభవజ్ఞులూ ఉన్నారు. కొత్తవారికి కూడా అవకాశం ఇచ్చారు.

రాంమాధవ్, మురళీధరరావులకు ఉద్వాసన

రాంమాధవ్ ఇంతవరకూ పార్టీ తరఫున జమ్మూ- కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలనూ పర్యవేక్షించేవారు. జమ్మూ-కశ్మీర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, 370వ అధికరణను తుంగలో తొక్కి, గవర్నర్ పాలన ప్రకటించిన తర్వాత అక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం తగ్గింది. మురళీధరరావు దక్షిణాది రాష్ట్రాలలోనూ, రాజస్థాన్ లోనూ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తేవడంలో విఫలమైనారనే ఒక అసంతృప్తి మినహా ఆయన వ్యవహారంలో మరే లోపమూ లేదు. తెరవెనుకకు పోయిన మూడో తెలుగు ప్రముఖుడు జీవీఎల్ నరసింహారావు. ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో పార్టీ ప్రతినిధిగా ఉండేవారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. త్వరలోనే కేంద్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనీ, ఇప్పుడు స్వస్తి చెప్పినవారిలో కొందరికి మంత్రులుగా అవకాశం లభించవచ్చుననీ అభిజ్ఞవర్గాల భోగట్టా. మహారాష్ట్రలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన సరోజ్ పాండేనూ, హరియాణా పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు అనిల్ జైన్ నూ ఎందుకు తప్పించారో తెలియడం లేదు. అక్టోబర్ – నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ లో పార్టీని పర్యవేక్షిస్తున్న భూపేంద్ర యాదవ్ నూ, వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్ లో పార్టీని పర్యవేక్షిస్తున్న కైలాస్ విజయవర్గీయానూ, ఒడిశాలో పార్టీ పనులు చూస్తున్న అరుణ్ సింగ్ నీ మార్చకుండా వారి పదవులలోనే కొనసాగించారు. పీయూష్ గోయెల్ కేంద్ర మంత్రిమండలిలో 2014లో చేరినప్పటి నుంచీ ఖాళీగా ఉండిన పార్టీ కోశాధికారి పదవిని ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి రాజేష్ అగర్వాల్ తో భర్తీ చేశారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా పురందేశ్వరితోపాటు సీ.టీ. రవి, అస్సాంకు చెందిన ఎంపి తరుణ్ చుగ్ దిలీప్ సైకియా, రాజ్యసభ సభ్యుడు దుష్యంత్ గౌతమ్ లను నియమించారు. పార్టీ ఉపాధ్యక్షులుగా అరుణ, ముకుల్ రాయ్, రేఖా వర్మ, భారతీ సియాల్, అబ్దుల్లాకుట్టీలను నియమించారు.

దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి మొదటి సారి లోక్ సభకు ఎన్నికైన తేజశ్వి సూర్యను భారతీయ జనతా యువమోర్చా అద్యక్షుడిగా నియమించడం విశేషం. సూర్య మంచి వక్త. విజ్ఞానవంతుడు. యువకుడు. పూనమ్ మహాజన్ స్థానంలో సూర్యను నియమించారు.

అంధ్రప్రదేశ్, తెలంగాణలో సమతౌల్యత

తెలంగాణలో కులాలపరంగా సమతౌల్యత సాధించే ప్రయత్నం జరిగింది. కొంతకాలం కిందట డీ.కే. అరుణను తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా నియమిస్తారని రాజకీయ వర్గాలు కోడైకూశాయి. కానీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడూ, వెనుకబడినవర్గానికి చెందిన నాయకుడూ బండి సంజయ్ ని ఆ పదవిలో నియమించారు. అప్పుడే రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిలో అసంతృప్తి ప్రారంభమైనదనే మాట వినిపించింది. అరుణ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. అంతకు ముందు జనార్దనరెడ్డి కూడా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచీ, టీడీపీ నుంచీ బీజేపీ లో చేరినవారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే మాట ప్రబలింది. బీజేపీలో చేరిన రెడ్డి కులంవారు అందరూ కట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా చేరతారనే వదంతి వినిపించింది. అటువంటి ప్రమాదాన్ని నివారించే ఉద్దేశంతోనే అరుణను అందలం ఎక్కించారు. లక్మణ్ కు అనుభవజ్ఞుడైన నాయకుడిగా మంచి పేరు ఉన్నది. బీజేపీ ఓబీసీ మోర్చాకు అధ్యక్షుడిగా నియమించడం వల్ల బీసీల పట్ల బీజేపీకి సానుభూతి ఉన్నదని చెప్పడానికి వీలుంటుంది. 2019 లోక్ సభ ఎన్నికలలో మున్నూరు కాపులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా విజయాలు సాధించిన బీజేపీ ఒక వైపు మున్నూరు కాపులనూ, మరో వైపు బీసీలనూ, ఇంకోవైపు కిషన్ రెడ్డికి మంత్రిపదవి ఇవ్వడం, అరుణకు పార్టీ పదవి ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజికవర్గాన్నీ అక్కున చేర్చుకున్నదనే అభిప్రాయం కలగడానికి ఈ మార్పులు తోడ్పడతాయి.

ఇక ఆంధ్రలో బీజేపీ సమీప లక్ష్యం ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ స్థానంలో తాను ఉండాలన్నది. టీడీపీ నేత చంద్రబాబునాయుడు వయస్సు మీదపడిన కారణంగా కానీ, ఘోరపరాజయం వల్ల కానీ అంత సమర్థంగా పార్టీ వ్యవహారాలను నిర్వహించలేకపోతున్నారనే అభిప్రాయం బీజేపీ నాయకులలో ఉన్నది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి విఫలం చెందుతున్నారనీ, మత వివాదాలు రెచ్చగొట్టి క్రైస్తవ మతస్తుడైన జగన్ మోహన్ రెడ్డిని బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఉత్తరాదిలో లాగా దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, మత వివాదాలకు ప్రజల రెచ్చిపోరని బీజేపీ నాయకుల అంచనా. చంద్రబాబునాయుడి శక్తియుక్తులు ఉడిగిపోయాయనీ, ఆయన తనయుడు లోకేష్ పార్టీని నడిపించే సామర్థ్యం  కలవాడు కాదనే బీజేపీ నేతల అభిప్రాయం. అందుకని క్రమంగా టీడీపీ నుంచి పలుకున్న నాయకులను బీజేపీలో చేరేందుకు ప్రోత్సహిచాలని బీజేపీ అధిష్ఠానం సంకల్పించిట్టు వినికిడి. ఈ పని జరగాలంటే టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్. టి. రామారావు ద్వితీయ పుత్రిక, యూపీఏ ప్రభుత్వంలో మంత్రి దగ్గుబాటి పురందేశ్శరి కంటే తగినవారు ఎవ్వరూ లేరు. పైగా పార్టీ అధ్యక్షుడుగా ఇటీవల నియమించిన సోంవీర్రాజూ, మిత్రపక్షమైన జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇద్దరూ కాపుకులంవారే కావడంతో కమ్మ కులానికి చెందిన ప్రముఖ నాయకురాలిని వేదికపైకి తీసుకురావడం మంచి నిర్ణయం.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్మీనారాయణకు జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారనే అనుకుంటున్నారు. ఆంధ్రలో ఇద్దరు బ్రాహ్మలకు – రాంమాధవ్, జీవీఎల్ నరసింహారావు – ఉద్వాసన చెప్పి కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకురాలికి ఉన్నత పదవి ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో బ్రాహ్మలు గతంలో ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆ సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. రేపు జరిగే మంత్రిమండలి విస్తరణలో రాంమాధవ్ కు లేదా నరసింహారావుకు అవకాశం వస్తే ఈ అభిప్రాయం మారుతుంది. కడప జిల్లాకు చెందిన వెనకబడిన కులాల ప్రతినిధి సత్య పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాలు చూసుకునే కార్యదర్శిగా కొనసాగుతారు. అంటే, తెలంగాణలో వలె ఆంధ్రప్రదేశ్ లో సైతం కాపులకూ, కమ్మవారికీ, బీసీలకూ ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకోవాలి. ఇది ఇతర పార్టీలు అనుసరిస్తున్న వైఖరికి అనుగుణంగానే ఉన్నది.

వచ్చే సంవత్సరం తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు నుంచి కార్యవర్గంలో ఎవ్వరినీ నియమించలేదు. పశ్చిమబెంగాల్ లో ముకుల్ రాయ్ కి పట్టం కడుతూ ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అంతే కాకుండా ఆయనతో సరిపడని పశ్చిమబెంగాల్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సిన్హాకు జాతీయ కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసన చెప్పారు. ముకుల్ రాయ్ కి సన్నిహితుడైన మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అనుపమ్ హజారే ను రాహుల్ సిన్హా స్థానంలో జాతీయ కార్యదర్శిగా నియమించారు. అంటే, ఇక మీదట బెంగాల్ బీజేపీలో ముకుల్ రాయ్ మాటే చెల్లుతుందని పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది.

ఈశాన్య రాష్ట్రాలపైన బీజేపీ పట్టు సడలించలేదు. నాగాల్యాండ్ కు చెందిన చుబా ఆవో ను జాతీయ ఉపాధ్యక్షుడిగానూ, అదే రాష్ట్రానికి చెందిన ఎంఎల్ ఏ మొహన్లుమో కికోన్ ని జాతీయ ప్రతినిధిగా నియమించడం గమనార్హం. అంతర్గత విభేదాలతో తీసుకుంటున్న మహారాష్ట్ర యూనిట్ లో నడ్డా చేయగలిగింది తక్కువ. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాధాన్యం తగ్గించారు. ఆయనను ఎన్నికలు జరిగే వరకూ బిహార్ లో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించమని చెప్పారు. ఆయనతో పడని పంకజ్ ముండేనూ, మాజీ మంత్రి వినోద్ తావ్డేనూ జాతీయ కార్యదర్శులుగా నియమించారు. మొత్తం మీద వెనుకబడిన కులాలకు పెద్దపీట వేశారని భావించాలి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles