Friday, April 26, 2024

అణగారిన వర్గాల ఆశాదీపం అంబేడ్కర్: కేసీఆర్

  • 125 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణః
  • అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇకపై అవార్డులు
  • అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్యఅతిథి

అంబేడ్కర్ జయంతులు జరుపుకుంటూ పోతే సరిపోదనీ, అంబేడ్కర్ చూపిన బాటలో నడవడం అవసరమనీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) 125అడుగుల ఎత్తైన అంబేడ్కర్ మహావిగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో అన్నారు. శుక్రవారం అట్టహాసంగా పీవీ మార్గ్ లో జరిగిన ఈ బహిరంగ సభకు ప్రత్యేక అతిథిగా బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరైనారు. సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నామనీ, ఇది ఎవరో చెబితే చేసిన పని కాదనీ, అంబేడ్కర్ ఆదర్శాలను పాటించే ప్రభుత్వంగా  ఈ విగ్రహాన్ని నెలకొల్పామని కేసీఆర్ చెప్పారు. విగ్రహ నిర్మాణం పనులు కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైతే ఇప్పుడు దళిత, ఆదివాసీ, బలహీనవర్గాల సంక్షేమమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పూర్తయిందనీ చెబుతూ ఈ విగ్రహ నిర్మాణంలో ప్రమేయం ఉన్న నిర్మాణ సంస్థకూ, ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంతరెడ్డికీ అభినందనలు తెలిపారు.

అంబేడ్కర్ మహారాష్ట్రకో,  భారత దేశానికో పరిమితమైన మనిషి కారనీ, ఆయన ప్రపంచంలోని అణగారిన వర్గాలన్నిటికీ ఆశాదీపమనీ కేసీఆర్ అన్నారు. కత్తి పద్మారావు సూచించినట్టు వచ్చు సంవత్సరం నుంచి అంబేడ్కర్ జయంతి రోజుల దళితుల సంక్షేమంకోసం పాటుపడినవారికి అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘జైభీమ్!’ అనే నినాదంతో కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు.

దళితబంధు పథకం రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి అందరి తరఫునా ధన్యవాదాలూ, అభినందనలూ తెలుపుతున్నానని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటినా అంబేడ్కర్ కలలు కన్న స్వాతంత్ర్యం ఇప్పటికీ సిద్ధించలేదనీ, దళితుల, ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి ఇతోధికంగా జరగవలసి ఉన్నదని ప్రకాశ్ చెప్పారు. చిన్న రాష్ట్రాలకోసం బలిదానాలు చేయవలసి వస్తున్నదనీ, లోగడ పొట్టి శ్రీరాములు బలిదానం చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కూడా ఎంతో మంది యువకులు బలిదానం చేశారని ప్రకాశ్ అన్నారు. చిన్నరాష్ట్రాలు ఉండాలని బాబాసాహెచ్ కోరుకున్నారనీ, చిన్న రాష్ట్రాలైతే ఆర్థిక అసమానతలు త్వరగా తొలిగిపోతాయని అంబేడ్కర్ భావించారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి స్వాగతోపన్యాసం చేశారు. అంతకు ముందు బౌద్ధ భిక్షువులు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రార్థనలు చేశారు. వారిని ముఖ్యమంత్రి సన్మానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles