Tuesday, April 30, 2024

రాజధాని రైతుల గోడు

అమరావతి ప్రాంత రైతులు రాజధాని విషయంలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి బుధవారంనాటికి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయి. ఇది అసాధారణమైన ఉద్యమం. ఎవరు ఏమన్నా తమ ఆశలు అడియాసలు అవుతున్న సమయంలో రైతులు ఉద్యమించడాన్ని తప్పుపట్టడం అన్యాయం. అమరావతి రాజధాని నిర్మాణం వ్యవహారంలో స్థానిక రైతులది తప్పు ఏ మాత్రం లేదు. తప్పందా రాజకీయ నాయకులదే. ‘మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను’ అని రైతులతో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడం అందరూ విన్నారు. ఎకరం పది లక్షల విలువ కూడా చేయని సమయంలో కోట్లు కురిపిస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పుడు దానిని నమ్మడం, ఆశపడటంలో రైతుల నేరం ఏమీ లేదు.

ఒక సారి నేపథ్యం పరిశీలిద్దాం. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మిగిలినవి అప్పులే. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తామని చట్టంలో చెప్పారు. రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తామని కూడా వాగ్దానం చేశారు. వాస్తవానికి కొత్త రాజధాని నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక  చేసేందుకు శివరామకృష్ణన్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. అందులో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రవీణులను సభ్యులుగా నియమించారు. ఆ కమిటీ కొన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు స్వయంగా ఒక సమాంతర కమిటీని నియమించారు. అందులో నారాయణ, గల్లాజయదేవ్ వంటి వ్యాపారమర్మం తెలిసిన  రాజకీయ నాయకులే సభ్యులు. అంటే, కేంద్రం నియమించిన సంఘం ఏమి చెప్పినా తాను ఎక్కడ రాజధాని నిర్మించాలని నిర్ణయించుకున్నారో అక్కడే నిర్మించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ విధంగానే ఆయన నియమించిన కమిటీ సిఫార్సు చేసింది.

శివరామకృష్ణన్ కమిటీతో ప్రభుత్వం సహకరించలేదు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను మన్నించలేదు. శాసనసభలో చర్చకు పెట్టలేదు. అసలు కమిటీ ఉనికిని కానీ అది ఇచ్చిన నివేదికను కానీ పట్టించుకోలేదు. తాను నయమించిన కమిటీ సమర్పించిన, తనకు నచ్చిన నివేదికను అనుసరించి సంవత్సరాంతంలో ఫలానా చోట అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబునాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏమీ లేదు. యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీ సమర్పించిన సిఫార్సును కృష్ణలో తొక్కినా అదేమంటూ ప్రశ్నించలేదు. చంద్రబాబునాయుడి ఇష్టానికే ఎన్ డీఏ ప్రభుత్వం వదిలివేసింది. పైగా ఎన్ డీఏలో టీడీపీ భాగస్వామి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభత్వం ఏమి చేసినా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు.

రాజధానిని మహానగరంగా, హైదరాబాద్ కు దీటైన నగరంగా నిర్మించాలనే స్వప్నం చంద్రబాబునాయుడిది. కానీ డబ్బులేదు. రాజధాని నగరానికి అవసరమైన భూములు కొని పెక్కంతస్తుల భవనాలు నిర్మించే స్తోమత లేదు. అందుకని మార్కెట్ సంస్కరణలకు మద్దతు తెలిపే చంద్రబాబునాయుడు ఒక ప్రణాళిక రచించారు. రైతులను కోటీశ్వరులను చేస్తానంటూ వాగ్దానం చేసి వారి భూములను ఉచితంగా సేకరించి, వారు నష్టపోకుండా ప్రతిసంవత్సరం కొంత కౌలు సొమ్ము చెల్లించడం, రాజధాని నిర్మాణం క్రమంలో భూములను అభివృద్ధి చేయడం, అభివృద్ధి చేసిన భూములలో ఎకరాకు 1200 గజాల చొప్పున, అంటే నాలుగోవంతు, భూమిని రైతులకు ఉచితంగా ఇవ్వడం, అందులో 200 గజాలు వ్యాపారం అభవృద్ధి చెందిన ప్రాంతంలో కేటాయించడం చంద్రబాబునాయుడు రచించిన ప్రణాళిక. ఆ విధంగా సేకరించిన సుమారు నలభై వేల ఎకరాలలో పెద్ద పెద్ద విద్యాసంస్థలకూ, వ్యాపారసంస్థలకూ తక్కువ ధరకు విక్రయించి పెద్ద సంస్థలు నెలకొల్పడాన్ని ప్రోత్సహించడం ద్వారా అక్కడ భూముల విలువలు పెంచడం. ఆ తర్వాత భూములను రైతులకు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం సైతం కొంత భూమిని విక్రయించి డబ్బు సంపాదించి దానితో అంతర్జాతీయ స్థాయిలో అందమైన రాజధానిని నిర్మించడం మాజీ ముఖ్యమంత్రి పథకం. ప్రణాళికారచన  పక్కాగా జరిగింది. ఊహలు హద్దులు మీరాయి. శక్తికి మించిన ఆలోచనలు చేశారు. సింగపూర్ వంటి నగరాన్ని నిర్మించాలని కలలు కన్నారు. కలల బేహారిగా ఆ కలలను ప్రజల సొంతం చేయడానికి ప్రయత్నించారు. జేబులో నయాపైసా లేకుండా రైతుల దగ్గరనుంచి ఉచితంగా భూములు సేకరించి వాటిని అభృవృద్ధి చేసి, ఆ భూములలో రాజధాని నిర్మించి, అక్కడి భూములను విక్రయించడం ద్వారా మహానగరం నిర్మించి, అటువంటి మహానగరం నిర్మించిన కీర్తి దక్కించుకోవాలన్న తాపత్రయం చంద్రబాబునాయుడిని ఐదేళ్ళపాటు ఉరుకులు పెట్టించింది. నేలవిడిచి సాము చేయించింది. స్వప్నసాకారానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేయించింది.

మొత్తం పథకం ఆశాజనకంగా ఉంది. ఒక్కటే పొరబాటు జరిగింది. వచ్చే ఎన్నికలలో కూడా తానే గెలుస్తారు కనుక పదేళ్ల ప్రణాళికతో రాజధాని నిర్మాణం చేయవచ్చునని భావించారు. సచివాలయం, శాసనసభ, శాసనమండలి సభకోసం తాత్కాలిక నిర్మాణాలు చేయించారు. శాశ్వత నిర్మాణాల ప్రణాళికలు డిజైన్ల స్థాయిలో ఉండగానే ఎన్నికలు వచ్చాయి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఎన్నికలు వచ్చే వరకూ శాశ్వత భవన నిర్మాణం ఆరంభం కాలేదు. ఒక్క హైకోర్టు భవన సముదాయం నిర్మాణం మాత్రం కొంతవరకూ పూర్తయింది. రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పలేదు. తాను సైతం తన నివాసాన్ని అమరావతికి సమీపంలోనే తాడేపల్లిలో శాశ్వత ప్రాతిపదికపైనే నిర్మించుకున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనీ కానీ, తన రాజధాని నిర్ణయాన్ని తిరగతోడుతారని కానీ చంద్రబాబునాయుడూ, ఆయన సమర్థకులూ, అమరావతి రైతులూ ఊహించలేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విధానం ప్రకటిస్తారని వైఎస్ఆర్ సీపీ నేతలు సైతం ఊహించలేదు. మొదటి నుంచీ మూడు రాజధానులూ, సమభావన, మూడు ప్రాంతాల సమానాభివృద్ధి అనే నినాదం చేసి, దానికి కట్టుబడి ఉంటే జగన్ మోహన్ రెడ్డిని ఎవ్వరూ తప్పుపట్టేవారు కాదు. ఎన్నికలకు మందు కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ మాట్లాడని మూడు రాజధానుల ముచ్చట అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మాసాలకు వెల్లడించడంతో ముఖ్యమంత్రి మదిలో  ఏ ఆలోచన మెదిలిందోనని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకున్నారు. ఎవరి ఊహలు ఎట్లా ఉన్నా అమరావతి నుంచి హైకోర్టు, సచివాలయం తరలిపోతున్నాయనే వార్త స్థానిక రైతులకు పిడుగుపాటుగా పరిణమించింది. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, గవర్నర్ కార్యాలయం, హైకోర్టు లేకుండా కేవలం శాసనసభ సముదాయం మాత్రం ఉంటే అమరావతి చంద్రబాబునాయుడు హయాంలో ఊహించినట్టు అభివద్ధి చెందదనేది నిర్వివాదాంశం. రైతుల ఆశలు అడియాసలు అవుతాయన్న మాట యదార్థం. అందుకని వారు ఉద్యమం చేపట్టడంలో వింత లేదు.

మూడు ప్రాంతాల మధ్య వైరుధ్యం ఉన్నమాట వాస్తవం. మూడు ప్రాంతాలకూ ప్రత్యేక ప్రతిపత్తి కావాలనే కోరిక ఉన్నమాట నిజం. అందుకని రాజధానిలో మూడు విభాగాలైన శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పరిపాలనావ్యవస్థలను ఒక్కొక్క ప్రాంతంలో ఒకదానిని నెలకొల్పడం అనే వాదనకు సమర్థన ఎక్కువ లభిస్తుంది. అమరావతిలోనే రాజధాని కొనసాగాలంటే విశాఖవాసులకూ, రాయలసీమ ప్రజలకూ అసంతృప్తి కలుగుతుంది. అమరావతి ప్రాంత ప్రజలు సంతోషిస్తారు. కనుక మూడు రాజధానులు అన్న వాదన తెలివైన ప్రతిపాదన. కానీ ప్రభుత్వాలు మారినంత మాత్రాన కీలకమైన నిర్ణయాలు మారకూడదనీ, ప్రధాని స్వయంగా వచ్చి, దేశంలోని పవిత్ర నదుల నీటిని తెచ్చి శంకుస్థాపన చేసిన అమరావతిని శాసనవ్యవస్థకే కేంద్రంగా కుదించడం న్యాయమా అన్న ప్రశ్నకు కాదనే జవాబు వస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరి కలలైతే కల్లలు కాబోతున్నాయో వారిని పిలిపించి లేదా వారి దగ్గరికి వెళ్ళి వారికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించి ఒప్పించి ఉంటే మరో విధంగా ఉండేది. అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. రాజధాని అనేది జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య వివాదంలాగా, ఆధిక్యప్రదర్శనగా తయారయింది.

ఇప్పుడు బీజేపీ సైతం రాజధాని అమరావతిలోనే ఉంటుందంటూ ఉద్ఘాటిస్తున్నది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మాట ఘంటాపథంగా చెబుతున్నారు. నూటికి నూరు పాళ్ళు అమరావతే రాజధానిగా ఉంటుందనీ, 2024లో అమరావతి నుంచి బీజేపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందనీ నమ్మబలుకుతున్నారు. ఈ లోగా ఒక దేశం, ఒక ఎన్నిక ప్రతిపాదన మేరకు 2022లోనే ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరిగితే అది వేరే విషయం.  దుబ్బాక ఉపఎన్నిక, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయాలు నమోదు చేసుకున్న తర్వాత బీజేపీ నాయకుల స్వరం మారింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం లు కూడా అమరావతిలోనే రాజధాని కొనసాగాలని పట్టుపడుతున్నాయి. జనసేనాధిపతి అమరావతి రైతులను కలుసుకొని వారికి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం హైకోర్టు విజయవాడలోనే సాగాలని కోరుతున్నట్టు కనిపిస్తున్నది. న్యాయస్థానం వైసీపీ వ్యతిరేక దృక్పథం ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలో నిజం ఉంటే దానికి కారణం అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలిపోవాలనే ప్రతిపాదనే.

సుమారు ఇరవై మాసాల కింద జరిగిన ఎన్నికలలో అపూర్వమైన మెజారిటీతో గెలిచిన వైఎస్ ఆర్ సీపీకి రాజధాని విషయంలో ఒక అభిప్రాయం ఉండటం తప్పని అనడం సరికాదు. పాత అభిప్రాయాలను మార్చుకోవడంలో సైతం దోషం లేదు. కానీ అందుకు కారణాలు వివరించాలి. ప్రజలకు నచ్చజెప్పాలి. రైతు ఉద్యమం కిరాయిదారుల ఉద్యమం అంటూ విమర్శించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని అవసరమైతే మార్చుకున్నా పరువునష్టం ఏమీ లేదు. రాజధాని నిర్ణయం బహుళార్థప్రయోజనకారి అని ప్రజలకు నచ్చజెప్పినా పరవాలేదు. ఇక్కడ రాష్ట్రప్రజలందరూ ఒక ఎత్తు. అమరావతి ప్రాంత ప్రజలు ఒక ఎత్తు. వారిలోనూ భూములు ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చి ప్రతిఫలం ఆశిస్తున్నవారి విషయం ప్రత్యేక శ్రద్ధతో, చిత్తశుద్ధితో, రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన సంగతి. తెలుగుదేశంపైన లేదా చంద్రబాబునాయుడిపైన వ్యతిరేకభావంతో తీసుకోవలసిన నిర్ణయం కాదు. చంద్రబాబునాయుడు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, అయినవారికి భూములు తక్కువ ధరకే కట్టబెట్టారనీ ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం అక్రమాలు చేసినవారిని బోనులో నిలబెట్టాలి. దర్యాప్తు జరిపించి న్యాయస్థానంలో నిలదీయాలి. వారిని శిక్షించాలి. కొంతమంది అక్రమాలు చేశారనే కారణంగా రాజధానిని అక్కడి నుంచి తరలిస్తామనడం సమంజసంగా లేదు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు సంతోషం కలిగించే మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించే పరిస్థితులూ లేవు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ప్రభుత్వమే అన్ని ప్రాంతాల ప్రజలకు సంతృప్తి కలిగించే విధానాన్ని ప్రతిపాదించాలి. అఖిలపక్ష సమావేశాలు జరిపి, చర్చలు నిర్వహించి, నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్య సంప్రదాయానికి ప్రభుత్వాలు స్వస్తి చెప్పి చాలా కాలమైంది. ఇప్పటికైనా అటువంటి సత్సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తే జగన్ మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యవాదిగా మంచి పేరు వస్తుంది. అమరావతి రైతుల ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఊరట కలిగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రజాస్వామ్యవాదులు ఆమోదిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles