Saturday, April 27, 2024

అగ్నిపథం: నిరసన ఫలితంగా రాయితీలు

  • మంచి చేయడానికి ప్రయత్నించినా చెడు ఎదురవుతోంది
  • ప్రజలకు నచ్చజెప్పడంలో ప్రభుత్వ వైఫల్యం
  • పెద్దనోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, అగ్నిపథ్: మొదీకి వరుసగా ఎదురుదెబ్బలు

పెద్ద నోట్ల రద్దు నుంచి అగ్నిపథ్ వరకూ మోదీ ప్రభుత్వ నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ముందుగా తగినంతగా సంప్రతింపులు జరపకపోవడం, దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్న తాపత్రయం ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనకా, నిర్ణయాలను ప్రకటించడం వెనకా ఉన్నాయి. ‘భారత్ మాతా కీ జై, అగ్నిపథ్ వాపస్ లో’ (‘భారత మాతా కీ జై. అగ్నిపథ్ ను వాపసు తీసుకోండి’) అనే నినాదాలు దేశవ్యాప్తంగా మింటినంటాయి.

ఈ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించింది. కోస్ట్ గార్డ్, ప్రభుత్వ నిర్వహణలోని రక్షణ సంస్థలన్నిటిలో ఉద్యోగులను నియమించే క్రమంలో పదిశాతం ఉద్యోగాలు సైన్యం నుంచి వైదొలిగిన తర్వాత అగ్నివీరులకు ప్రత్యేకించుతారు. కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు సంస్థలలో ఖాళీలలో పది శాతం అగ్నివీరులతో నింపుతారు. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ లో ఉద్యోగాల నియామకాలలో అగ్నివీరులకోసం వయోపరిమితిని మూడేళ్ళు పెంచుతారు. మర్చంట్ నేవీలో భారత నేవీ నుంచి బయటకు వచ్చిన అగ్నివీరులకు రిజర్వేషన్లు ఉంటాయి. కోవిద్ కారణంగా రెండేళ్ళు రిక్రూట్ మెంట్లు జరగలేదు కనుక అగ్నిఫథ్ లో రిక్రూట్ మెంట్ లో వయోపరిమితిని 21 ఏటి నుంచి 23 ఏళ్ళకు పొడిగించారు. ఈ రాయితీ ఈ సంవత్సరం మాత్రమే పని చేస్తుంది. టెన్త్ క్లాస్ పాసైన తర్వాత సైన్యంలో చేరే అగ్నివీరుల కోసం ఓపెన్ స్కూలు వ్యవస్థను ఆరంభించి వారికి పన్నెండోతరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

అగ్నిపథ్ పథకానికి ఇంత నిరసన వెల్లువెత్తుతుందని ప్రభుత్వం కానీ, ఇతరులు కానీ ఊహించలేదు. నిరసనకారులతో గొంతు కలపడమే కానీ ప్రతిపక్షాలకు సైతం ఈ పథకం పట్ల ఇంత వ్యతిరేకత ఉంటుందనే ఊహ లేదు. నిరసనకారులు రాళ్ళు రువ్వారు. రైల్వే కోచ్ లు తగులపెట్టారు. బస్సులకు నిప్పు పెట్టారు. పోలీసులు లాఠీ చార్జి చేశారు. గాలిలో కాల్పులు జరిపారు. సికిందరాబాద్ లో మనుషులపైన కాల్పులు జరిపి వరంగల్లు జిల్లా దబ్బీర్ పేటకు చెందిన యువకుడు దామెర రాకేష్ (21) మృతికి కారకులైనారు. పదమూడుమంది గాయపడ్డారు. రాకేష్ కుటుంబానికి పాతిక లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రకటించారు. మంత్రులు దయాకరరావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ కి చెందిన ఎంపీలూ, ఎంఎల్ఏలూ రాకేష్ పాడె మోసి సాధ్యమైన సుహృద్భావం సంపాదించే ప్రయత్నం చేశారు. విధ్వంసానికి కుట్ర టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోనే రచించారని బీజేేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

నిరుద్యోగం భారీగా ఉన్న బిహార్ లో ఎక్కువ నిరసన వ్యక్తమైంది. సైన్యంలో యువతీయువకులు ఎక్కువగా చేరే రాష్ట్రాలైన రాజస్థాన్ లో, హరియాణాలో, పంజాబ్ లో, ఉత్తర ప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో ఆగ్రహజ్వాలలు ఎగసి పడినాయి. ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది. కోవిద్ కారణంగా రెండేళ్ళ నుంచీ సైన్యంలో ఉద్యోగుల నియామకాలు జరగలేదు.

ఇంతకీ అసలు అగ్నిపథ్ పథకం అంతరార్థం ఏమిటి? ఆఫీసర్లు కానివారిని అగ్నివీరులని పిలవాలనీ, పదిహేడున్నర నుంచి 21 ఏళ్ళలోపు యువతీయువకులను సైన్యంలోకి తీసుకోవాలనీ, వారికి నాలుగేళ్ళ కాంట్రాక్టు ఉండాలనీ, వారిలో బాగా ప్రతిభ ప్రదర్శించినవారిని మొత్తం చేరినవారిలో నాలుగింట ఒక వంతుమందిని సైన్యంలోని త్రివిధ దళాలలో – పదాతి దళం,వాయుసేన, నౌకాదళం – ఉద్యోగాలలో ఖరారు చేయాలనీ, మిగిలినవారిని రిటైర్ చేయాలనీ ఆలోచన. ఈ విధానం వల్ల సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనే సంకల్పం బలంగా ఉన్నవారు చేరే బదులు నాలుగేళ్ళు సైన్యంలో సరదాగా పని చేద్దామని చేరేవారు ఎక్కువ అవుతారనీ, సైన్యంలో ఉండవలసిన క్రమశిక్షణ, ఏకాగ్రత, చిత్తశుద్ధి లోపిస్తాయనీ ప్రవీణులు అంటున్నారు.

అగ్నిపథ్ పథకం కింద చేరిన యువతీయువకులలో నాలుగేళ్ళు కాగానే నూటికి 75 మంది వైదొలగాలి. ప్రస్తుతం అయితే జవాన్లు 17 ఏళ్ళు పని చేసిన తర్వాత స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుకోవచ్చు. నాలుగింట ఒక వంతు మందిని సైన్యంలో కొనసాగనిస్తారు. తక్కినవారికి పింఛను సౌకర్యం కానీ గ్రాట్యూటీ కానీ ఉండవు. రెండేళ్ళుగా సైన్యంలో ప్రవేశం కోసం పరీక్షలకు శిక్షణ పొందుతున్న యువతీయువకులు, ముఖ్యంగా 21 ఏళ్ళు దాటినవారు ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో ఆగ్రహోదగ్రులైనారు.

ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ పథకాన్ని ఎందుకు ప్రకటించింది? ఇది అకస్మాత్తుగా చేసిన పని కాదు. కొంతకాలంగా సైన్యాధికారులతోనూ, రక్షణకు సంబంధించిన ప్రవీణులతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సైన్యంలో సగటు వయస్సు ప్రస్తుతం 32 ఏళ్ళు ఉంది. దాన్ని 25 ఏళ్ళు చేయాలని ప్రభుత్వ సంకల్పం. మోదీ ప్రధాని అయిన కొత్తల్లో సైనికాధికారులకూ, జవాన్లకూ జీతిభత్యాలు పెంచారు. అది పెనుభారమై పోయింది. అందువల్ల జీతభత్యాలు తగ్గించి ఆధునికాయుధాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

నిరుద్యోగం దేశంలో ఎంత భయంకరంగా ఉన్నదో ప్రధానికి కానీ, ఇతర మంత్రులకు కానీ అంచనా ఉన్నట్టు కనిపించడం లేదు. 1970 తర్వాత నిరుద్యోగం ఇంత దారుణంగా ఎన్నడూ లేదు.  రైల్వే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ కొన్ని మాసాల కిందటే బిహార్ లో వేలాదిమందినిరుద్యోగులు ప్రధాని దిష్టిబొమ్మను తగులపెట్టారు. విధ్వంసం సృష్టించారు. నిరుద్యోగం కారణంగా ప్రజలలో  ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతున్నట్టు గ్రహించిన ప్రధాని ఇటీవల కొత్తగా లక్ష ఉద్యోగ నియామకాలపైన ప్రకటన చేశారు.

సైన్యాధిపతి వ్యాఖ్యానించినట్టు దేశానికి సైన్యంలో చేరడం ద్వారా సేవలు అందించాలని కోరుకునే యువకులు అల్లరిమూకలాగా ప్రవర్తించకూడదు. రైళ్ళకు నిప్పుపెట్టడం, బస్సులను తగులపెట్టడం సైన్యంలో చేరగోరే వారు చేయవలసిన పనులు కావు. వయోపరిమితిని 23 ఏళ్లకు ఈ ఒక్కసారీ పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 75శాతంమంది రిటైరు అయినప్పుడు వారికి సర్టిఫికేట్లు ఇస్తామనీ, వ్యాపారం చేసుకునేవారికి రుణాలు ఇప్పిస్తామనీ, సెంట్రల్ ఆర్మ్  డ్ ఫోర్సెస్ లో ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యం ఇస్తామనీ కేంద్ర ప్రభుత్వం అంటున్నది.

కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలలో లోపం ఉన్నది. నిర్ణయాలను అమలు చేసే విధానం కూడా లోపభూయిష్టంగా ఉన్నది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో ప్రధాని గంభీరంగా ప్రకటించి చిన్న పరిశ్రమల ఉసురు తీశారు. చలామణిలో ఉన్న సొమ్ములో 86 శాతం రద్దయితే వ్యాపారాలు కుదేలైనాయి. వలస కార్మికులు వందల మైళ్ళ దూరంలో ఉన్న స్వగ్రామాలకు వెళ్ళాలని ఇంటిదారి పట్టి కొందరు ఇంటికి చేరకుండా తిండిలేక మాడి, నడవలేక కూలబడి మరణించారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు బ్యాంకుల ఎదుట క్యూలలో గంటలకొద్దీ నిలబడ్డారు. ఇంత చేసినా నల్లధనం అదుపు చేయలేకపోయారు. అవినీతిని అరికట్టలేకపోయారు. ఉగ్రవాదులకు నిధులు అందుతూనే ఉన్నాయి.

నేషనల్ జుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ లో కూడా ప్రభుత్వం వెనుకంజ వేయవలసి వచ్చింది. న్యాయస్థానాలలో నియామకాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలోని బృందమే నిర్ణయిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం వెనకడుగు వేసింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం కూడా మోదీకి ఎదురుదెబ్బే. ఎన్నికలలో విజయాలు సాధించడం వేరు ప్రజలకు నచ్చే విధంగా ప్రభుత్వాన్ని నడపడం వేరు. ఈ సత్యాన్ని మోదీ గ్రహించాలి. ప్రజల మంచి కోరి చేసిన విధానాలైనా సరే ప్రజలకు నచ్చజెప్పకపోతే వారు వ్యతిరేకిస్తారు.  ఈ విషయం అర్థం చేసుకోలేకనా, అర్థం చేసుకున్నా నిర్లక్ష్యం వల్లనా మోదీ మాటిమాటికీ ఎదురు దెబ్బలు తింటున్నారు?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles