Saturday, May 4, 2024

విన్నకోట రామన్నపంతులు శతజయంతి

“విన్నకోట” అన్నమాట విని చాలా కాలమైంది. విన్నకోట అనే ఇంటిపేరుకు విశిష్టమైన పేరు తీసుకువచ్చినవారు విన్నకోట రామన్నపంతులు. వారు కన్నుమూసి కూడా చాలా ఏళ్ళు (1982) కావస్తోంది. వారు కన్నుతెరచి (1920)ఇప్పటికి వందేళ్లు పూర్తయింది. ఇది విన్నకోటవారి శతజయంతి సంవత్సరం. ఆ మహనీయుడ్ని తలచుకోవడం ఎంతో అవసరం. మహాకవి  గురజాడ అప్పారావు రాసిన ” కన్యాశుల్కం” నాటకంలో రామన్నపంతులు పోషించిన పాత్రలు  చిరంజీవిగా ఎప్పటికీ ఉంటాయి. మరో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు రచించిన “వరవిక్రయం” నాటకం ద్వారానూ విన్నకోటవారు తెలుగునాట సుప్రసిద్ధులు.

బహుముఖీనుడు

నటుడు, దర్శకుడు,న్యాయనిర్ణేత, రేడియో కళాకారుడుగా కళారంగంలో చిరయశస్సును ఆర్జించారు. విజయవాడలోనే జన్మించారు, ఐక్కడ విన్నకోటవారి వీధి కూడా ఉంది. న్యాయవాదిగా ధర్మమార్గంలో ఆర్జించిన సంపదను నాటకరంగ అభివృద్ధికి సద్వినియోగం చేసిన దానశీలి, త్యాగశీలి. గొప్ప మేధావి. నటనారంగానికి సంబంధించిన అనేక అంగాలు, రంగాలపై పరిశోధన చేసి, ఆ జ్ఞానాన్ని పదిమందికి పంచిపెట్టి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దిన ఆచార్యతుల్యులు. నటశిక్షణ, రూపం, ఆంగిక, వాచిక, సాత్విక,మూకాభినయం, ఆహార్యం,రంగస్థల నిర్మాణం, రససిద్ధాంతం, నాటక ప్రయోగం, లైటింగ్ మొదలైన అనేక అంశాలపై అద్భుతమైన పుస్తకాలు రచించి లోకానికి అందించారు.వీటిపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి, ఎందరినో ప్రభావితం చేశారు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయశర్మ వంటివారు విన్నకోటవారి దగ్గర సుశిక్షితులై, లబ్ధప్రతిష్ఠులయ్యారు.

కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు

వీరి కుమారుడు విజయరాం నటుడుగా అన్ని తెరలపై అందరికీ పరిచయమైనవారే. ముద్దమందారం ఫేమ్ గా చెప్పుకునే నటుడు ప్రదీప్ వీరి మనుమడు. గురజాడవారి “కన్యాశుల్కం” నాటకంలో అగ్నిహోత్రావధానుల పాత్రపోషణలో విన్నకోటవారికి మించినవారు ఇంతవరకూ ఎవ్వరూ లేరు. ఆయనే అగ్నిహోత్రావధానులేమో అనుకునేవారు.ఆ పాత్రకు అంతటి జీవం పోశారు. డివినరసరాజు రాసిన “నాటకం”అనే నాటకంలో ముఖ్యభూమిక పోషించి ఎంతో కీర్తిని గడించారు. ఎన్ జి ఓ, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు మొదలైనవి వీరి  దర్శకత్వంలో  పేరుతెచ్చుకున్న నాటకాలు. సినిమా రంగంలో వీరి నటనా ప్రతిభను బాగా వాడుకున్నవారు బి ఎన్ రెడ్డి, బాపు అనిచెప్పాలి. బంగారుపాపలో వేసిన జమిందార్ పాత్ర చాలా ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. తడిగుడ్డతో గొంతులు కోసే మునసబు పాత్రలో వీరి విన్యాసం చూసి తీరాల్సిందే. వీరిని ఆ పాత్రలో చూసిన వారందరికీ మొన్నటి దాకా పల్లెల్లో హడావిడి చేసిన కొందరు మునసబులు తప్పక గుర్తుకువచ్చి తీరుతారు.

జంధ్యాలతో అనుబంధం

సాక్షి సినిమాలో బాపురమణలు ఆ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల కూడా విన్నకోటవారితో తన సినిమాల్లో నటింపచేసి, గురుఋణం తీర్చుకున్నారు. వీరితో    ముద్దమందారంలో కీలక పాత్ర వేయించారు. దర్శకుడిగా జంధ్యాలకు ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా నటించింది విన్నకోటవారి కంపెనీలోనే కావడం విశేషం. రామన్నపంతులుకు  ఆకాశవాణితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి తుది శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు. సీతాపతి సంసారం ధారావాహికంగా వచ్చింది,ఇందులో లీడ్ రోల్ వీరిదే. ఇది కూడా ఎంతో మంచిపేరు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పరచారు.దాని పేరు “నటరాజ కళామండలి”.

ఉద్దండులతో సావాసం

 ప్రసిద్ధ రాఘవ కళాకేంద్రం కార్యదర్శిగా వీరు పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ సంస్థ ప్రదర్శించిన ఇనుపతెరలు, విశ్వంపెళ్లి మొదలైన నాటకాల్లో నటుడుగానూ విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విన్నకోటవారి ప్రతిభ విలక్షణం. తెలుగునాటక రంగానికి ఊపిరిలూదినవారిలో విన్నకోట వారి స్థానం గణనీయం, స్తవనీయం. కొప్పరపు సుబ్బారావు, డివి నరసరాజు, నిర్మలమ్మ, సుంకర కనకారావు,కెవిఎస్ శర్మ మొదలైన ఉద్దండులతో వీరి సావాసం అపురూపం. కన్యాశుల్కం నాటక విజయంలో వీరందరి పాత్ర మరువలేనిది. విన్నకోటవారు సుమారు పదహారుకు పైగా సినిమాల్లో నటించారు. విద్యావంతుడైన విలక్షణమూర్తి విన్నకోట రామన్నపంతులును ఎన్నటికీ మరువలేం. ఇటువంటి వారి జీవితాలే కళారంగాలకు స్ఫూర్తిదీప్తులు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles