Friday, May 17, 2024

అందుకే పోలవరం నిధులు ఆపేశారు: పురందేశ్వరి వ్యాఖ్య

వోలేటి దివాకర్

‘‘జాతీయ ప్రాజెక్టు పోలవరం పునరావాస ప్యాకేజీ, పెరిగిన అంచనా వ్యయాలకు సంబంధించిన గణాంకాలు గందరగోళంగా ఉన్నాయి… అందుకే పునరావాస ప్యాకేజీకి నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది’’ అని  నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. అయితే నిర్వాసితుల పునరావాసం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని,  పునరావస ప్యాకేజీ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖామంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.  అయితే, పెరిగిన అంచనాలపై స్పందిస్తూ…2013 నాటి ధరలకే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎలా సంతకాలు చేశారో వారినే అడగాలని సలహా ఇచ్చారు. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల బీజేపీ జోనల్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె రాజమహేంద్రవరం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా జోన్ల వారీగా పర్యటిస్తున్నామనీ, జనసేనతో కలిసే ఎన్నికలకు వెళతామనీ, ఎవరు సీఎం, మిగిలిన పొత్తుల విషయాలు పార్టీ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందనీ  చెప్పారు.

రాజమహేంద్రవరంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరికి స్వాగతం చెబుతున్న బీజేపీ నాయకులు,కార్యకర్తలు

ఇళ్ళు.. నిధులు ఏవీ?

దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనిరీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకూ ఎన్ని గృహాలు నిర్మించారో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  పార్లమెంటు వేదికగా సంబంధిత శాఖామంత్రి తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఐదు గృహాలను మాత్రమే నిర్మించినట్లు ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్నిరాష్ట్ర ప్రభుత్వం ఏం  చేసిందో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌పైనే ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన అనేక హామీలను నాలుగేళ్లలోపే పూర్తి చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాకారాన్ని అందిస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.  రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెచ్చు మీరిపోయాయని, ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలు తోందని ఆరోపించారు. ఆవ భూముల సేకరణలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శంచారు. రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు ముందుగానే కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అధిక ధరలకు ఆ భూములను అమ్మి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వర్షం వస్తే నాలుగైదు మీటర్ల లోతున నీరు నిల్వవుండే ప్రాంతంలో గృహాలు ఏ విధంగా నిర్మిస్తారని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు సుమారు రూ.71 వేల కోట్లు బకాయిలకు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సి ఉందనీ, అవి చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి తాగునీటిని అందించాలన్నా లక్ష్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తే ఒక్క రూపాయిని కూడా వినియోగించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. కేంద్ర  ప్రభుత్వం పంచాయతీలకు జమ చేస్తున్న 14, 15 ఆర్థిక సంఘం నిధుల్ని పక్కదారి పట్టించడంపై తనను అనేక మంది సర్పంచులు కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. తాను ఒత్తిడి చేయడంతో ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.338 కోట్లను మాత్రమే విడుదల చేసిందని, మిగిలిన నిధులు 600 కోట్లను విద్యుత్‌ బిల్లుల కింద మినహాయించుకుందని ఆరోపించారు. మిగిలిన నిధుల్ని కూడా వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో సర్పంచుల ఆందోళనకు మద్ధతుగా ఆగస్టు 10న అన్ని జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. ఆగస్టు 17న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. జగన్‌ రైతులకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా రైతు బాంధవుడిగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి నేరవేర్చలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి రైతు ఉద్ధారకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. దీనిపై రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, పోర్టులు, జాతీయ రహదారుల అభివృద్ధికి వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. వాటిలో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా పనులు ముందుకు సాగుతున్నాయని గణాంకాలతో సహా వివరించారు.

Also read: పిల్లికి పెద్ద పీట సరిపోలేదట!…కొడుకు కోసం పిల్లి రాజకీయ గిల్లుడు!

          పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాజమహేంద్రవరం నగరానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పురందేశ్వరి మీడియా సమావేశానికి  మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడుగా పనిచేసిన నగరానికి చెందిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

అయితే రివర్‌ బే హోటల్లో జరిగిన బిజేపీ ఉమ్మడి గోదావరి జిల్లాల జోనల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Also read: వలంటీర్ల వ్యవస్థ పై పవన్ ను సమర్ధించిన సోము

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles