Tuesday, May 7, 2024

శాస్త్రాధ్యయనం, తర్కం వెకటాద్రి అస్త్రాలు: ఇన్నయ్య

ఫొటో రైటప్: ఇన్నయ్య, బాలసుబ్రహ్మణ్యం

రావిపూడి వెంకటాద్రి ఎంఎన్ రాయ్ తో ప్రభావితుడై, సైన్సు పుస్తకాలు చదువుకొని, రాయ్ ధోరణిని ఆకళింపు చేసుకొని ఆ శాస్త్రీయ దృక్పథాన్నీ అన్వయిస్తూ అనేక పుస్తకాలు పుంఖానుపుంఖంగా రాశారనీ, అందులో ముఖ్యమైనది విశ్వాన్వేషణ అనీ ప్రముఖ జర్నలిస్టు, హేతువాది, ఎంఎన్ రాయ్ అనుచరుడు ఎన్ ఇన్నయ్య అన్నారు.

‘‘ఖగోళశాస్త్రాన్నీ, జీవశాస్త్రాన్నీ, భౌతికశాస్త్రాన్నీఅధ్యయనం చేసి, అనేక విషయాలను అతి సులభంగా, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు బాగా చెప్పేవారు. ఆ చెప్పడంలో కూడా విమర్శలు బాగా జొప్పించేవారు. ఉదాహరణకి ఖగోళ శాస్త్రాన్ని పోల్చుతూ జ్యోతిష్యాన్ని ఖండిస్తూ చెప్పదలచుకున్నప్పుడు ఆయన చాలా సూటిగా, జనానికి నచ్చే విధంగా, చాకచక్యంగా చెప్పేవారు. ఆంధ్ర దేశంలో చాలామంది సైన్స్ పట్ల కళ్ళు తెరవని రోజుల్లో వెంకటాద్రి విశేషమైన కృషి చేసి పుస్తకాలందించారు. అది సాధారణమైన విషయం కాదు. కవి రాజు త్రిపురనేని రామస్వామి ప్రభావంతో సాహిత్యంలోనూ, ఉద్యమాలలోనూ ఆయన కృషి చేయడం వినూత్నమైన ధోరణిగా నేను భావించాను. ముఖ్యంగా పాశ్చాత్యదేశాలలో ఒక గొప్ప ఉద్యమకారుడు ఉండేవాడు. ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా విమర్శలు చేస్తూ, బైబిల్ ని చీల్చిచెండాడి, అందులో ఉన్న లోపాలను బయటపెట్టి, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. చివరికి ఆయనకు ప్రత్యక్షంగా, శారీరకంగా హాని చేయాలని తలపెట్టిన ఘట్టాలను కూడా ఎదుర్కొని చలించకుండా నిలిచి పుస్తకాలు రాశాడు. వ్యాసాలు రాశాడు. వాటి ప్రభావం వెంకటాద్రిమీద చాలా ఉంది. వెంకటాద్రి చెప్పే ధోరణి ఘాటుగా, సూటిగా ఉన్నా అందులో తర్కం ఉంటుంది. రుజువు చేసే పద్ధతిలోనే మాట్లాడినా, ఉపన్యాసం ఇచ్చిన ఉండటం నాకు ఆయనలో బాగా నచ్చినఅంశం అని అమెరికామేరీల్యాండ్ నుంచిమాట్లాడుతూ ప్రముఖ హేతువాది, రాయిస్టు, జర్నలిస్టు ఎన్ ఇన్నయ్య అన్నారు.

వెంకటాద్రి కాలంలోనే ఉండటం మనకి గర్వకారణం: బాలసుబ్రహ్మణ్యం

దురదృష్టవశాత్తు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే వందేళ్ళ కిందట నిజం అనుకున్నది కూడా అబద్ధమని చెప్పగలిగిన వాతావరణమూ, ధీమంతులూ, మీడియా…ఇవన్నీవచ్చేసినాయి. ప్రతిచిన్నదాన్నీ మార్పికత్వంలోకి నెట్టడం, దాని చుట్టూ రకరకాలైన అతీతశక్తులనూ కూడగట్టడం, మనిషికి ఒక వ్యక్తిత్వం అన్నది లేకుండా పరాయీకరణ చెందించే విధంగా చేయడమనేది మనుషుల్నిమనుషులలాగా కాకుండా వారిని గాలిలో తేలేటటువంటి అస్థిపంజారలాగా మార్చేటటువంటి రాజ్యం ఈ రోజు వచ్చింది. చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది. అయినా, భారత దేశానికి చార్వాకుడి దగ్గరి నుంచి ఈ రోజు దాకా చాలా సుదీర్ఘమైన హేతువాద సిద్ధాంత చరిత్ర ఉంది. ఆ చరిత్రను మొత్తం తోసిరాజనీ, దాని స్థానంలో దుర్మార్గమైన మతతత్త్వవాదాన్నీ, అశాస్త్రీయవాదాన్నీ ప్రచారం చేయడం అనేది ఒక ఉద్యమంగా రాజ్యమే పట్టుపట్టి చేస్తున్నటువంటి ఒకానొక దౌర్భాగ్యస్థితిలో మనం ఉన్నాం.

ఇదీ రావపూడి వెంకటాద్రిగారికి ఉన్న ప్రాసంగికత. ఈ పరిస్థితులలో కూడా హేతువాదుల కానీ నాస్తికవాదులు కానీ పట్టుబట్టి ఎంత త్యాగానికైనా సిద్ధపడి, ఎదురొడ్డి పోరాడటమే కాకుండా ఇది మానవులంతా విశ్వసించే సిద్ధాంతం అవుతుందన్ననమ్మకాన్ని ముందు పెట్టగలుగుతున్నారు. వెంకటాద్రి ఆ పాత్రని పోషించారు. వ్యక్తిగా ఒక వంద పుస్తకాలు రాయడమే కాదు ఒక పెద్ద సమూహాన్ని కూడగట్టి మొత్తం భారత దేశ వ్యాప్తంగా మేము కూడా ఉన్నాము, మాదే రాబోయే కాలంలో ప్రపంచం అని చెప్పడానికి సిద్దపడ్డారు, చెప్పారు, చేశారు, చూపించారు. మానవుడు సహజంగా భౌతికవాదే. అన్నం తినకుండా సిద్ధాంతాలేవీ చెప్పలేదు. కాబట్టి భౌతికవాదం జయించిననాడు వెంకటాద్రిలాంటివాళ్ళు ఇప్పుడున్నఏ గాంధీ గారి స్థానంలోనో, నెహ్రూగారి స్థానంలోనూ, మరొకరి స్థానంలోనో ఉంటారు. అలాంటి వ్యక్తి మనకాలంలోనే జీవించడం, మనం కూడా ఆయనతో ఎంతోకొంత సంబంధం కలిగి ఉండటమనేది మనొకు ఒక గొప్ప అవకాశం. ఐన్ స్టీన్ అన్నట్టు గాంధీ లాంటి వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే భవిష్యత్తరాలు నమ్మలేవు అన్నట్టు వెంకటాద్రిలాంటి వ్యక్తి మనతోపాటు జీవించారంటే నమ్మడం కష్టమే’’ అని మాజీ ఎంఎల్ సీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles