Friday, May 3, 2024

గిడుగు రామ్మూర్తి పంతులు

గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాషలో విప్లవాత్మక మార్పు తెచ్చిన వాడు గిడుగు. ఆదికవి నన్నయ భాష 60 శాతం సంస్కృత పదాలతో ఉండేది. సాహిత్యం పండితులకు మాత్రమే తెలిసిన గ్రాంధిక తెలుగులోనే ఉండేది. జనం భాష ప్రాంతీయ యాసలతో కూడిన గ్రామ్యం. రెండిటికి ఎక్కడా పొంతన లేదు. ఈ పరిస్థితి నుండి మార్పు రావడానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కొన్ని మార్పులు కారణ మయ్యాయి.

Also read: “దొంగ”

 పోరాడి గెలిచిన పిడుగు గిడుగు

18 వ శతాబ్దంలో యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అనేక యంత్రాలు కనుగొన్నారు. మనిషికి సౌకర్యంతో పాటు తీరిక దొరికింది. కాలాక్షేపానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా వారి గ్రాంధిక భాషలో రాస్తున్న అక్కడి కవులు గ్రాంధిక భాష వదలి సామాన్యుడి కోసం సామాన్యుడి భాషలో రాయడం మొదలు పెట్టారు. దీనికి ఆద్యుడు విలియం వర్డ్స్ వర్త్. అక్కడ సామాన్యుడి భాషకు లభించిన ఆ గౌరవం ఇక్కడి సామాన్యుడి భాషకు కలిగించిన వాడు గిడుగు. దేశంలోని పండితులందరు ఏకమై కాదన్నా పోరాడి గెలిచిన వాడు గిడుగు. ఆయనకు తోడు నిలిచిన వాడు గురజాడ. ఛందోబద్ధ కవిత్వాన్ని కాదని సరళమైన మాత్రా ఛందస్సుతో  సామాన్యుడి భాషలో రచనలు చేశాడు. ఆ తరువాత అనేక మంది కవులు, రచయితలు, పాత్రికేయులు దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. కాని  ఒక కొత్త సమస్య వచ్చింది. జనం భాష (గ్రామ్యం) ప్రాంతానికో యాసతో ఉంది. ఒకడి యాస మరొకడికి అర్థం కాదు. అందుకని గ్రాంధికానికి, గ్రామ్యానికి మధ్యే మార్గంగా చదువుకున్న సామాన్యుడి భాషను ‘శిష్టవ్యవహారికం’ అన్న పేరుతో అందరూ అలవాటు చేసుకున్నారు. (ఇలాంటిది మరే భాషలోనూ లేదు. తెలుగుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత.) అప్పటినుండి వచనం ప్రాచుర్యంలోకి వచ్చింది. కవితలు, వ్యాసాలు, నాటకాలు, కథలు, నవలలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. చదువుకునేవారి సంఖ్య పెరిగింది. సామాన్యుల పిల్లలందరూ కుల వృత్తులు వదిలి పాఠశాలలకు వెళ్ళి చదువుకో గలిగిన పరిస్థితి వచ్చింది. అది గిడుగు వ్యవహారిక భాషా వాదంతో సాహిత్యానికి, సమాజానికి కలిగిన  ప్రయోజనం.   

Also read: “నేత”

అమ్మను కాదనడం అపరాథం

రామాయణం, భారతం తేట తెలుగులో చదవకపోతే రాముడిలా గుణవంతుడు కావాలని, కృష్ణుడిలా ధర్మంగా నడవాలనే జీవిత విలువలు ఎలా తెలుస్తాయి మనకు? అది పండితులకు మాత్రమే అర్థమయ్యే గ్రాంధిక భాషలో ఉంటే సామాన్యం జనం బాగుపడడం ఎలా? ఈనాడు మనం తెలుగు అవసరం లేదని, ఇంగ్లీషు, సైన్స్ చాలని అనుకుంటున్నాం. ఇంగ్లీషు మీడియం ద్వారానే ఇంగ్లీషు వస్తుందనే భ్రాంతిలో ఉన్నాం. నిన్నటి తరం ఆరవ తరగతిలో ఏబీసీడీ నేర్చుకొని తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీషులో ప్రవీణులైన విషయం మర్చిపోయాం. ఇంగ్లీషు మీడియం పేరుతో తెలుగును తొక్కేస్తున్నాం. అమ్మను వద్దని సవతి తల్లిని కావలించుకుంటున్నాం. కళ్ళు, కల్లు ఒకటేగా పలికే  స్థితిలో ఉన్నాం. పైగా భాషోన్మాదంతో వేరుపడిన తెలంగాణా మాండలికం టీవీల్లో, సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూంది. మరికొన్ని రోజుల్లో ఆంధ్ర ప్రాంత మాడలికం కనుమరుగవుతుందేమో మన నిర్లక్ష్యం వల్ల. నేడు గిడుగు బ్రతికి ఉంటే తన శ్రమ వృధా అయిందని బాధ పడేవాడేమో. ఆయన అలా బాధ పడకుండా తెలుగును బతికించగలమా మనం. ఆలోచించండి.  

Also read: “స్వాతంత్ర్య భారత చిత్రం”

త్రిలింగ దేశంలో హత్య”

అచ్చ తెనుగు

సగానికి పైగా సంస్కృత పదాలతో

సంస్కరించబడి

అందంగా మారి

గ్రాంధిక, గ్రామ్యాలే కాక

సొగసైన శిష్టవ్యవహారికంగా రూపు దిద్దుకుని

తేట తెలుగుగా

రెండు మాండలికాలతో

ప్రాంతానికొక రీతిగా

పట్టణానికొక తీరుగా

విలసిల్లిన తెలుగు భాష

కొన ఊపిరితో మూల్గుతోంది.

కళ్ళు, కల్లు ఒకటిగా పలికే నవతరం

తెలుగును గొంతు నులిమి చంపేస్తోంది.

తెనుగు తేనెఅన్న రాయలు ఆత్మ క్షోభిస్తూంది.

రక్షించండి. జాతి ప్రతీకను కాపాడండి

స్వచ్ఛ ఆంద్రలో స్వచ్ఛ తెలుగును బతికించండి.

Also read: విశ్వరాధరికం

(గిడుగు రామమూర్తి పంతులు జయంతి తెలుగు భాషాదినోత్సవం)

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles