Tuesday, April 30, 2024

కిడ్నాప్‌ చేసిన రెండు గంటల్లోనే బాలుడి హత్య

  • ఇంటర్నెట్ కాల్స్ ద్వారా డబ్బు డిమాండ్
  • బాలుడిని చంపిన తర్వాతా డబ్బుకోసం ఫోన్లు
  • గొంతు నులిమి చంపి, తగులబెట్టిన కిరాతకుడు
  • పోలీసుల అదుపులో నిందితుడు మంద సాగర్‌

జల్సాలకు అలవాటుపడ్డ వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించేందుకు కుయుక్తులు పన్నాడు. ఈ దురాశతో అభం శుభం తెలియని బాలుడ్ని కిడ్నాప్ చేసి హతమార్చాడు. దీంతో అతను జైలు పాలవడమే కాకుండా ఓ తల్లికి తీరని పుత్రశోకాన్ని మిగిల్చాడు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్ కు చెందిన దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా ముందు  హాజరు పరిచారు. నిందితుడు దీక్షిత్ ను ఆదివారమే కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డాడని కోటిరెడ్డి గురువారంనాడు తెలిపారు. నిందితుడు మంద సాగర్ స్థానికుడు కావడంతో సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవగాహన ఉందన్నారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.  

ప్రాణం తీసిన పరిచయం

ఓ టీవీ ఛానల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న కుసుమ రంజిత్‌రెడ్డి, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. శనిగపురంలోని రంజిత్‌ కుటుంబానికి తమ ఇంటి సమీపంలో ఉండే మంద సాగర్‌తో పరిచయం ఉంది. బైక్‌ మెకానిక్‌గా పనిచేసే సాగర్‌ సులభంగా డబ్బు సంపాదించి జల్సాగా తిరగడానికి అలవాటు పడ్డాడు.  ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు బైక్ పై వచ్చి బాలుడిని తీసుకెళ్లాడు. ఎంతసేపటికి దీక్షిత్ జాడ తెలియకపోవడంతో అతడి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. తోటివారిని ఆరా తీయగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్‌ను తీసుకెళ్లాడని చెప్పారు.

Mahabubabad SP Koti Reddy

కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే బాలుడి హత్య

అయితే ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు దీక్షిత్ ను కిడ్నాప్ చేసిన నిందితుడు కేసముద్రం మండలం అన్నారం వద్ద దానమయ్య గుట్టలపైకి తీసుకెళ్లాడు. బాలుడు భయంగా ఉందని ఏడవడంతో తన వద్ద ఉన్న నిద్రమాత్రలను మింగించాడు. దీక్షిత్‌ని వదిలిపెడితే తన బండారం బయటపడుతుందని   మంద సాగర్ భయపడ్డాడు. స్పృహ కోల్పోయిన తరువాత చేతులు కట్టేసి టీషర్ట్ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మహబూబాబాద్ వచ్చి బాటిల్ లో పెట్రోల్ తీసుకుని వెళ్లి మృత దేహాన్ని తగులబెట్టాడు. డబ్బు సంపాదించాలన్న దురాశతో మంద సాగర్ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే చంపడం వల్ల బాలుడిని కాపాడలేకపోయామన్నారు.

బాలుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

బాలుడిని హతమార్చిన తర్వాత కూడా నిందితుడు డబ్బులు డిమాండ్ చేశాడు. రాత్రి 9.15 గంటలకు దీక్షిత్‌రెడ్డి తల్లి వసంతకు ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం. 45 లక్షలు ఇస్తే వదిలిపెడతా మంటూ ఫోన్‌ కాల్‌ కట్‌ చేశాడు. వెంటనే దీక్షిత్‌రెడ్డి తల్లిదండ్రులు మహబూబాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ  కోటిరెడ్డి ఆదేశాలతో రాత్రికి రాత్రే వంద మంది పోలీసులు రంగంలో దిగారు. పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే.. సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా డబ్బు డిమాండ్‌తో కిడ్నాపర్‌ బాలుడి తల్లికి ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. అతను వీవోఐపీ ద్వారా ఫోన్‌ చేస్తుండడంతో.. ఆ కాల్‌ ఎక్కడి నుంచి వస్తోందో గుర్తించడం పోలీసులకు సాధ్యపడలేదు. 

Accused Manda Sagar

కిడ్నాపర్‌ డిమాండ్‌ మేరకు 45 లక్షల్లో నగదు 35 లక్షలు, 15 తులాల బంగారం సిద్ధం చేసిన వీడియోను రికార్డు చేసి సోషల్‌మీడియా గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేశారు. ఆపై పట్టణంలోని మూడుకొట్ల సెంటర్‌లో నగదు, బంగారాన్ని బైక్‌లో పెట్టి కిడ్నాపర్‌ కోసం వేచి చూశారు. సాయంత్రం వరకు జాడ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. రాత్రి పొద్దుపోయే సమయానికి మరో ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా బాలుడి తండ్రిని ఆ డబ్బు తీసుకుని తాళ్లపూసపల్లి రోడ్డులోని స్టోన్‌ క్రషర్‌ సమీపానికి రమ్మని ఆదేశించారు. పక్కా స్కెచ్‌తో మాటువేసి ఉన్న పోలీసులు ఆ ప్రదేశానికి వచ్చిన మంద సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

డింగ్ టాక్ యాప్ ద్వారా ఫోన్లు చేసిన కిడ్నాపర్

ఏడాది నుండి నిందితుడు డింగ్ టాక్ అనే యాప్ ను వాడుతున్నట్లు తెలిసింది. ఈ యాప్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులకు మంద సాగర్ ఫోన్చేసి డబ్బులు డిమాండ్ చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా కాల్ చేయడంతో ఎక్కడి నుంచి కాల్ వస్తుందో గుర్తించడంలో జాప్యం నెలకొంది. కేసును త్వరగా ఛేదించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. హాంకాంగ్, అమెరికా నుంచి జనరేట్ కాల్స్  వచ్చాయన్నారు. ఆ ఐపీ అడ్రస్ లతో ఏ అప్లికేషన్ ఎక్కువగా వాడుతున్నారో పరిశీలించడంద్వారా మూడు రోజుల్లో నిందితుడిని గుర్తించామన్నారు. అయితే కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే బాలుడిని హతమార్చడంతో కాపాడలేకపోయామని ఎస్పీ తెలిపారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles