Sunday, December 8, 2024

భారాస భవిష్యత్తు ఏమిటి?

  • ఇల్లు అలకగానే పండగ కాదుగా!
  • రైతు సంఘం స్థాపించడం మంచి పని

‘భారత రాష్ట్ర సమితి’ జెండాను దిల్లీ వీధుల్లో ఎగరేసి, కొత్త యుద్ధాన్ని కెసీఆర్ మొదలెట్టారు. కార్యక్షేత్రాన్ని కురుక్షేత్రానికి తీసుకెళ్లారు. బిజెపి వ్యతిరేక పార్టీల మిత్రనేతలు కొందరు ఆయనకు జతకలిసి జేజేలు కొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి నచ్చినట్లు వారు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. స్వక్షేత్రం కాబట్టి తెలంగాణలో సందడి కాస్త ఎక్కువైంది. జాతీయ స్థాయిలో గొప్ప చర్చలు జరిగిన ఊసులు బయటకు పెద్దగా పొక్కలేదు. జాతీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పూర్తిగా తెలిసిన వ్యక్తి కెసీఆర్ మాత్రమే. మిగిలినవన్నీ ఊహాగానాలే. టీఆర్ఎస్ రూపు మార్చుకొని బీఆర్ఎస్ గా జాతీయ యవనికపై తన విన్యాసం ప్రారంభించింది. అనుబంధ రైతు సంఘం స్థాపించి తను రైతుపక్షపాతియని, తమ పార్టీ రైతు పక్షమని కేసీఆర్ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గుర్మామ్ సింగ్ చడూనీ నియమించి తొలిరోజునే తన ముద్ర వేసుకున్నారు బీఆర్ఎస్ అధినేత. ఉత్తరాది నుంచి అఖిలేష్, దక్షిణాది నుంచి కుమారస్వామి హాజరై తాము కెసీఆర్ పక్షమేనని మరోమారు రుజువు చేసుకున్నారు. వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రులే కావడం విశేషం. దిల్లీ కేంద్రంగా ప్రారంభమైన కేంద్ర కార్యాలయం ఎప్పుడు చూసినా కిక్కిరిసిగా ఉండాలని కెసీఆర్ ఆకాంక్ష.

Also read: సువర్ణాక్షరాలతో లేపాక్షి

ఉద్యమ సంస్థ నుంచి జాతీయ పార్టీ దాకా…

తెలంగాణ ఉద్యమ సంస్థ తొలుత ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు జాతీయ పార్టీగా కొత్త రూపురేఖలు దాల్చుకుంది. దశాబ్దాల నుంచి ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ఉన్నప్పటికీ, ఎందరో నాయకత్వాన ఉద్యమాలు జరిగినప్పటికీ, కేవలం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సమయంలోనే ఆ సంకల్పం సిద్ధించింది. అందుకే ఆ ఘనత, గౌరవం కెసీఆర్ కే దక్కుతాయి. ఈ సంకల్పసిద్ధితో ఎన్నికలబరిలోకి దిగి వరుసగా రెండు పర్యాయల ఎన్నికల్లోనూ గెలిచి కెసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇది గతం. మరి కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. మళ్ళీ గెలిస్తే  ఈసారి కుమారుడు కెటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి కేసీఆర్ దిల్లీ రాజకీయాలపై దృష్టి పెడతారని అర్థమవుతూనే ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కెసీఆర్ పక్షమే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంటగెలుపుకే పరిమితం కావాల్సివస్తుందని ఎక్కువమంది వెల్లడిస్తున్న అభిప్రాయం. బీఆర్ఎస్ పుంజుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుందని కెసీఆర్ పార్టీకి చెందినవారే కొందరు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ వంటి వ్యవస్థలున్న బిజెపికే అధికారంలోకి రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇక బీఆర్ఎస్ కు ఎంత కాలం పడుతుందో ఊహించలేం. ఏదో సునామీ వస్తే తప్ప అంత దృశ్యం ఏర్పడదు.

Also read: సరిహద్దుల్లో మళ్ళీ ఘర్షణ

ఇంట గెలుపు ప్రధానం

రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వినపడుతున్నప్పటికీ అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తే అంతే సంగతులు. రచ్చ గెలవడానికి ఇంకా చాలా సమయం వుంది. ముందు ఇంట గెలిచి చూపించాల్సివుంది. రేపటి అసెంబ్లీ ఫలితాల ప్రభావం కూడా కెసీఆర్ చేయబోయే రేపటి జాతీయ ప్రయాణంపై ఉంటుంది. ఉద్యమనేతగా, ప్రాంతీయ పార్టీ అధినేతగా, రెండు పర్యాయాల ముఖ్యమంత్రిగా, మాజీ కేంద్రమంత్రిగా అనుభవం ఉండి ఉండవచ్చు గాక. ఉర్దూ, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంటే ఉండవచ్చు గాక. కేవలం ఈ శక్తియుక్తులు సరిపోవు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షించ గలగాలి. మిగిలిన పార్టీల నుంచి విశ్వాసాన్ని పొంద గలగాలి. బీఆర్ఎస్ ఇంకా శైశవదశ కూడా దాట లేదు. కనీసం ఆమ్ ఆద్మీ పార్టీ వలె ఫలితాలను పొందిన చరిత్రకు కూడా నోచుకోలేదు. నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయ నాయకత్వంలో బిజెపి ఇంకా బలంగానే ఉంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎంతోకొంత బలంతో సజీవంగానే ఉంది.  కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే రంగంలోకి దిగారు. జోడో యాత్రతో కొత్త నెత్తురు ఎక్కించే పనిలో రాహుల్ గాంధీ ఉన్నాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ గెలుపుతో కాంగ్రెస్ కాస్త ధైర్యం టానిక్కు ఎక్కించుకొని ఉంది. నితీశ్ కుమార్, మమతా బెనర్జీ వంటి హేమాహేమీలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తిప్పలు పడుతున్నారు. ఇంకోపక్క కేజ్రీవాల్ అంబులు సిద్ధం చేసుకుంటున్నాడు.

Also read: అందరి చూపూ ఆయుర్వేదం వైపు

ఆట మొదలైంది

వీళ్లందరూ కెసీఆర్ వెంట నడుస్తారని చెప్పగలమా? కొన్ని రైతు సంఘాలు, కాసిన్ని ఇతర పార్టీలు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ తో ఉన్నాయి. కెసీఆర్ పదేళ్ల పాలనలో కొన్ని మంచి పథకాలు లేకపోలేదు. ఎంతోకొంత అభివృద్ధి జరగకపోలేదు. కానీ, దేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసేంత తెలంగాణ మోడల్ ఏముందనే ప్రశ్నలే ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. మంచో,చెడో ఒక తెలుగు నాయకుడు జాతీయ పార్టీని స్థాపించాడు. అభినందనలు అందించడంలో తప్పు లేదు. గొప్ప ఆలోచనలతో, సహృదయంతో ముందుకు సాగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? రాజకీయాల్లో ఎలా రాణించాలో బాగా ఎరిగిన నాయకుల్లో కెసీఆర్ స్థానం కెసీఆర్ కు ఉంది. బీఆర్ఎస్ ప్రస్థానం, దేశరాజధానిలో స్థానం తేలాల్సివుంది. మొన్న దిల్లీలో  కేసీఆర్ జాతీయ పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ గడ్డ కరీంనగర్ లో కలియ తిరిగి కెసీఆర్ పై కారాలు మిరియాలు నూరారు. ఆట మొదలైంది.

Also read: భవిష్యత్తు డిజిటల్ మీడియాదేనా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles