Saturday, May 4, 2024

జీహెచ్ఎంసీ పోరులో మాటల చిటపటలు

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ  ప్రధాన పక్షాలు – ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల పోరు జోరందుకుంటోంది. హైదరాబాద్ ను నిజమైన భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక ఛాన్స్  ఇవ్వండంటూ  బీజేపీ కోరితే, అలా చేస్తే నగరాన్ని అమ్మేస్తారని  టీఆర్ఎస్  వ్యాఖ్యలు చేసింది. పాతబస్తీలో సర్జికల్ దాడులు చేస్తామన్న బీజేపీని ఎంఐఎం తప్పు పడితే, బీజేపీ, ఎంఐఎం లోపాయికరీ ఒప్పందం కుదుర్చకున్నాయని కాంగ్రెస్ అంటోంది.

విశ్వనగరమా?విషాదనగరమా?: కిషన్

హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామంటూ ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం విషాదనగరంగా మార్చిందని, వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినా, రాజ్ భవన్, శాసనసభ సయితం నీళ్లలో తేలియాడుతున్నాయని, అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ కే పరిమితమని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి  విమర్శించారు. రాష్ట్ర ఆదాయంలో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ నుంచే వస్తుండగా అభివృద్ధి ఆ స్థాయిలో ఉందా?అని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలు నడుపుతున్న  టీఆర్ఎస్,  ఎంఐఎం జట్టుకట్టాయని, మార్పు కోరుకుంటున్న ప్రజలు వారి  ప్రయత్నాలను  సాగనీయరని విశ్వాసం వ్యక్తం చేశారు.

సేల్ ఇండియా:కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్  ఇండియా అనే నినాదం  ప్రారంభిస్తే,   ఆ పార్టీ  నినాదం `సేల్ ఇండియా`గా మారిందని, వరుసగా అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారని  టీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు  కె. తారక రామారావు ఆరోపించారు. బీజీపీ ఆరోపిస్తున్నట్లు ఎంఐఎంతో తమకు పొత్తులేదని, పైగా దానితోనే తమకు పోటీ అనీ అన్నారు. ఆ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందని, తరువాతి  స్థానాలు ఎవరెవరివో ఆ రెండు జాతీయ పార్టీలు తేల్చుకోవాలని అన్నారు.

పేదల తరపున  పోరాటం : ఒవైసీ

తాము పేదల తరపున పోరాడుతున్నామని, ఇందుకోసం  ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ పక్కన మరో కుర్చీలో (మేయర్ పీఠం) తాము కూర్చుంటామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ నాయకుడు ఒకరన్నారని, అక్కడంతా భారతీయులే ఉంటే ఎవరి మీద దాడి చేస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే చైనా పైన సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. పాతబస్తీలో పాకిస్థానీయులు ఉన్నా,  ఓటర్ల జాబితాలో రహింగ్యాలు పేర్లున్నా చూపాలని  ఆయన సవాల్ విసిరారు.

అవకాశం ఇస్తే ఇంకాచేస్తాం : ఉత్తమ్

హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో చేశాయని, అవకాశం  ఇస్తే ఇంకా చేస్తామని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రతి ఎన్నికలోనూ చెప్పిందే చెబుతూ  ఒకే మేనిఫెస్టో పెడుతోందని, అది చిత్తుకాగితంతో  సమానమని వ్యాఖ్యనించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల నాయకులను తెస్తూ హైదరాబాద్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందనీ,  మేయర్ పీఠం ఎక్కాలనుకుంటున్న పార్టీ  అన్ని డివిజన్లలో  ఎందుకు పోటీ చేయడంలేదనీ ప్రశ్నించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles