Friday, April 26, 2024

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు

అది 1966వ సంవత్సరం. అప్పుడే ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకుని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతిలో అడుగుపెట్టాము. కొద్ది రోజులకే విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభమైంది. అమృత రావు గారు విశాఖ ఉక్కు కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించటంతో రాష్ట్రమంతా అట్టుడికి పోయింది. మా చిన్న గ్రామంలోనే విద్యార్థులు పాఠశాలలు బహిష్కరించి “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అని నినదించారు. కొన్ని రోజులు ఈ సమ్మె నడిచిన తర్వాత ఒక రోజు సాయంత్రం ప్రాంతీయ వార్తలలో నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అమృత రావు గారికి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత తాను స్వీకరిస్తానని చెప్పి నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింప చేశాడని వార్త వచ్చింది. దానితో ఉద్యమం చప్పబడింది. కానీ ఈ లోపల జరిగిన పోలీస్ కాల్పుల్లో దాదాపు 30 మంది చనిపోయారు.

Also read: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు-వాగ్దానాలు-అమలు

ఎక్కువ కాలం నష్టాలలోనే…

ఈ ఉద్యమ ఫలితమో లేక సాధారణమైన నిర్ణయంలో భాగంగానో 1970 సంవత్సరంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రకటించారు. 70లో ప్రకటించబడిన ఫ్యాక్టరీ పనులు మొదలు కావడానికి ఇంకొక దశాబ్దం పట్టింది. 1980లో ప్రారంభమైన పనులు 1990 ముగిసి ఫ్యాక్టరీని ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా మిగిలిన అన్ని ప్రభుత్వారంగ సంస్థల లాగానే విశాఖ ఉక్కు చాలా సంవత్సరాలు నష్టాల్లో, కొన్ని సంవత్సరాలు లాభాల తో పనిచేస్తూ ఉన్నది. ఈనాడు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం ఫ్యాక్టరీలో కూడా పెట్టుబడులు ఉపసంహరించే ప్రక్రియను ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల త్యాగాలకు ఫలితంగా వచ్చిందనీ, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అనీ,‌ అందువలన ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వరంగం లోనే కొనసాగాలి అనీ కొందరి వాదన.

Also read: హిందూ ధర్మ ప్రచారంలో తప్పటడుగులు

విశాఖలోనే ఉంటుంది ఉక్కు ఫ్యాక్టరీ

ఈ పైవాదన చేసేవారు విస్మరిస్తున్న ఒక ముఖ్య అంశం ఏమిటంటే “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అంటే ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాత్రం కాదు. పెట్టుబడులు ఉపసంహరించిన తర్వాత కూడా విశాఖ ఉక్కు విశాఖ నుంచి తరలి ఎక్కడికో వెళ్లి పోదు. అక్కడనే ఉంటుంది. ఇంకా విస్తరించబడి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు  కలిగే అవకాశం ఉంది.

1970 సంవత్సరంలో విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రకటించే సమయానికి భారతదేశంలో 1956 పారిశ్రామిక విధానం అమలులో ఉన్నది. ఈ విధానం ప్రకారం మౌలిక రంగంలో పెట్టుబడులు ఎక్కువగా కావాల్సిన పరిశ్రమలు కేవలం ప్రభుత్వ రంగంలోనే వస్తాయి. దానికి అనుగుణంగానే బీహెచ్ఈఎల్, హెచ్ఎంటి, రూర్కేలా, భిలాయి, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వరంగంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ రంగంలో 60 ,70 దశకాలలో ఏర్పాటుచేసిన పరిశ్రమలు సరైన లాభాలను ఆర్జించలేదు. పైపెచ్చు వీటి నష్టాలను భర్తీ చేయడానికి పన్నుల ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఆదాయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పీవీ నాటి విధానాల కొనసాగింపే

ఇటువంటి పరిస్థితులలో 1990 దశకంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయటానికి ఆనాటి ప్రభుత్వం మొదలెట్టిన వివిధ సంస్కరణలలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించటం ఒక ప్రధానమైన అంశమైంది. పీవీ నరసింహారావు  ప్రధానమంత్రిగా ప్రారంభించిన ఈ విధానాన్ని ఆపైన ప్రధాన మంత్రులు వాజ్ పేయ్, మనోహన్ సింగ్ లు కొనసాగించారు. నరేంద్ర మోడీ కూడా ఆవిధానాన్నే కొనసాగిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. కీలకం కానీ సంస్థలలో పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించాలని, కీలకమైన రంగాలలో కొన్ని సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ మిగిలిన వాటిలో పెట్టుబడును ఉపసంహరించాలని నిర్ణయించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లోని ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ఈ ప్రక్రియలో భాగంగా జరుగుతున్నది మాత్రమే. నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మొదలుపెట్టిన ప్రక్రియ కాదు. అదే విధంగా కేవలం విశాఖ ఉక్కుకు పరిమితమైన ప్రక్రియ కాదు. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించడం జరిగింది. ఉక్కురంగంలోనే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న నీలాంచల్ ఉక్కు ఫ్యాక్టరీలోని ప్రభుత్వ పెట్టుబడులను ఈ మధ్యనే ఉపసంహరించటం జరిగింది. ఆ ఫ్యాక్టరీ టాటా కంపెనీ వారి పరమైంది.

Also read: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయంగా బిజెపి-జనసేన కూటమి

కాప్టివ్ మైన్స్ కేటాయించడం సాధ్యం కాదు

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కొందరు ప్రస్తావించే అంశం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఫ్యాక్టరీ నష్టాలలో పోయేది కాదనేది వారి వాదన. క్యాప్టివ్ మైన్స్ సాధించుకోటానికి అవకాశం ఉన్న సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం ఏ కారణాల వలననో దృష్టి పెట్టలేదు. ఈరోజు బొగ్గు  కుంభకోణం తర్వాత అన్ని  గనులను జాతీయ వనరులను కేవలం వేలం విధానం ద్వారా మాత్రమే కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఆ విధానానికి ప్రతికూలంగా ప్రత్యేకించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించే అవకాశం లేదు. ఈనాడు పెట్టుబడులను ఉపసంహరించిన తర్వాత ఈ ఫ్యాక్టరీని తీసుకునే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏదైనా గాని ఫ్యాక్టరీని క్యాప్టివ్     మైన్స్    లేకుండానే నడపాల్సి ఉంటుంది. అది వారికి లాభసాటి అయినప్పుడు అవి లేకపోబట్టే ఈనాడు విశాఖ ఉక్కు నష్టాలలో ఉంది అనడం సరైన వాదన కాకపోవచ్చు.

ఈనాడు లాభసాటిగా నడవాలి అంటే ఏ ఉక్కు ఫ్యాక్టరీ సామర్థ్యం కనీసం 20 మిలియన్ టన్నులు ఉండాలి. విశాఖ ఉక్కు సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. దీనిని 20 మిలియన్ టన్నుల వరకు విస్తరించాలి అంటే ఒక 50 లేదా 60 వేల కోట్ల పెట్టుబడి కావాల్సి ఉంటుంది. అంతస్థాయిలో పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని విస్తరించే పరిస్థితి ఈనాడు ప్రభుత్వంలో లేదు. ఈనాడు పెట్టుబడులను ఉపసంహరించకపోతే నష్టాల బాటలో నడుస్తూ కొన్నాళ్లకు ఫ్యాక్టరీయే మూతబడి పోవచ్చు.

Also read: మూడు రాజధానులు-మూడు రాష్ట్రాలు

గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు విశాఖ ఉక్కు ప్రయోజనాలు ఆకాంక్షించే వారు గుడ్డిగా, ఆవేశపూరితంగా పెట్టుబడుల ఉపసంహరణ వ్యతిరేకించే బదులు కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగైదు అంశాలలో ప్రశ్నించి హామీలు రాబట్టుకుంటే రాష్ట్రానికి విశాఖ ఉక్కుకు మేలు జరుగుతుంది.

అడగవలసిన వివరణలు ఇవి:

1. పెట్టుబడులను ఉపసంహరించటానికి పిలిచిన టెండర్లలో ఒక నిర్దిష్ట కాల పరిమితిలో విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని 7 మిలియన్ టన్నుల నుంచి కనీసం 20 మిలియన్ టన్నులు ఇంకా ఎక్కువ పెంచాలి అనే హామీ పొందుపరచబడి ఉందా లేదా?

2. ఈనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పని చేస్తున్న అందరు ఉద్యోగుల భద్రత వారికి ఇచ్చే సౌకర్యాలు వారి సర్వీస్ కాలంలో కొనసాగించే విధంగా హామీ పొందుపరచబడి ఉన్నదా లేదా?

3. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ అవసరాలను మించి పది, పదిహేను వేల ఎకరాల దాకా ల్యాండ్ బ్యాంకు ఉన్నది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఫ్యాక్టరీకి అవసరమైన భూమిని మాత్రమే ప్రైవేటు కంపెనీకి కేటాయిస్తూ మిగిలిన భూమిని అంతా ఒక ప్రత్యేక ప్రభుత్వ సంస్థ అధీనంలో వాణిజ్యపరంగా అభివృద్ధి పరచటానికి విధానం రూపొందించబడినదా లేదా?  ఈ మిగులు భూములు నిర్వహించే ప్రత్యేక ప్రభుత్వ సంస్థ భూములు  కోల్పోయి ఇంతవరకు ఎటువంటి పరిహారం పొందని వారిని భాగస్వామ్యులు చేయటం ద్వారా వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది.

ఈ పై హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం  అంగీకరిస్తే  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించటం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకీ, రాష్ట్రానికీ మంచిదే. భవిష్యత్తులో ఫ్యాక్టరీ విస్తరించబడి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉన్నది.

విభజన సమయంలో చేసిన పొరబాటు ఇప్పుడు చేయవద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులు, మీడియా, రాజకీయ నాయకులు ఆలోచన కన్నా ఆవేశానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి రాష్ట్రానికి చేటు చేకూర్చుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే జరిగింది. విభజన తథ్యమనీ, జరిగిపోతుందనీ అందరికీ తెలుసు. కానీ మొండిగా వ్యతిరేకిస్తూ విభజన జరిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి హామీలు తీసుకోవాలనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితం విభజన ఆగలేదు. జరిగిపోయింది. విభజన ప్రక్రియలో రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం విస్మరించబడ్డాయి. ఆరోజు గట్టిగా ఆ అంశాలపై దృష్టి పెట్టి ఉంటే హైదరాబాద్ నగరంలో హక్కులతో పాటు చాలా విషయాలను మనం రక్షించుకోగలిగి ఉండేవాళ్ళం. విశాఖ ఉక్కు విషయంలో కూడా అది జరగకుండా జాగ్రత్తపడాలి.

Also read: ఏకపక్ష నిర్ణయాలతోనే రాజధాని విషాదం

IYR Krishna Rao
IYR Krishna Rao
రచయిత ఐఏఎస్ విశ్రాంత అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. సుప్రసిద్ధ పుస్తక, వ్యాస రచయిత. బీజేపీ నాయకులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles