Monday, June 24, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు-వాగ్దానాలు-అమలు

ఈ మధ్య మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తను సుప్రీంకోర్టులో వేసిన కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరైన కౌంటర్ను వేయటం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఉండవల్లి అరుణకుమార్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనైతికంగా చట్ట వ్యతిరేకంగా జరిగిందనేది ఆయన వాదన. తాను నమ్మిన ఈ విషయాన్ని కోర్టుల ద్వారా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఎటువంటి అవకాశవాద రాజకీయానికి తావు లేకుండా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో కేసును గత ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. తిరిగి రాష్ట్రం ఒకటి అయ్యే అవకాశం లేదనేది ఆయన కూడా అంగీకరిస్తున్నారు. కోర్టులో తన మనవిలో రాష్ట్రాన్ని తిరిగి కలపాలనేది తన విన్నపం కాదని కేవలం ఈ కేసు ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర విభజనలకు సరైన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగలిగితే తన కృషి ఫలించినట్టుగా భావిస్తానని ఆయన ప్రకటించారు.

Also read: హిందూ ధర్మ ప్రచారంలో తప్పటడుగులు

ఆంధ్రప్రదేశ్ లాగా మరో రాష్ట్రాన్ని విభజించే అవకాశం లేదు

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన విధంగా మరి ఇంకే రాష్ట్ర విభజన భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. దీని ప్రత్యేకత రాజధాని ఉన్న ప్రాంత ప్రజలు విభజనను కోరుకోవడం. ఈనాడు అక్కడక్కడ అప్పుడప్పుడు వినిపిస్తున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు రాజధాని లేని ప్రాంతం నుంచి వస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ గాని, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక ప్రాంతం కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విధానం భవిష్యత్తులో ఇతర ప్రాంతాల విభజనకు మార్గదర్శకంగా ఉంటుందని అనుకోవటానికి అవకాశం లేదు.

భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో భారతదేశాన్ని 50 ,60 రాష్ట్రాలుగా విభజించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విభజనను సుప్రీంకోర్టు పరిశీలించి కొన్ని మార్గదర్శకాలు ఏర్పాటు చేయగలిగితే అవి ఆ సమయంలో ఉపయోగపడతాయనేది ఆయన మరొక వాదన. భవిష్యత్తులో అటువంటి విభజన జరిగేటట్లయితే 1956 లో ఏర్పాటు చేసినట్లు ఫజులాలి కమిషన్ లాంటి కమీషన్ ను నియమించి కొన్ని మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకొని విభజన జరుగుతుంది కానీ ఏకపక్షంగా అటువంటి విభజన జరిగే అవకాశం లేదు. ఆ విధంగా కూడా ఈ కేసు ద్వారా ఏర్పడే మార్గదర్శకాలు భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తాయి అనుకోవటానికి అవకాశం లేదు. ఏది ఏమైనా జరిగిన విభజనను ఆమోదిస్తూనే జరిగిన ప్రక్రియ సరిగా లేదని కోర్టు వారు భావించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఉండవల్లి విజయం సాధించినట్లే.

Also read: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయంగా బిజెపి-జనసేన కూటమి

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు విషయంలో సరైన వాదనలు వినిపించటం లేదన్న ఉండవల్లి ఆరోపణలకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ సమైక్య ఆంధ్ర నినాదానికి కట్టుబడి ఉన్నదని, దానికోసం వీలైతే కృషి చేస్తుందని తెలిపారు. ఇది కప్పదాటు వ్యవహారంగా ఉంది కానీ ఉండవల్లి గారి ఆరోపణలకు సరైన సమాధానం గాలేదు. 2014వ సంవత్సరంలో బాహాటంగా ఏం చెప్పినా అంతర్గతంగా ఎంత త్వరగా రాష్ట్రం విడిపోతే అంత మంచిదని భావించిన పార్టీ వైఎస్ఆర్సిపి. దానికి కారణాలు లేకపోలేదు. తెలంగాణలో తమకు పట్టులేదని ఆంధ్ర రాష్ట్రం విడిపోతేనే తాము అధికారంలోకి రాగలమని వైఎస్ఆర్సిపి వారు ఆరోజు గట్టిగా భావించారు. ఆ పార్టీ వారు ఈ రోజు మేము సమైక్యాంధ్రాకు కట్టుబడి ఉన్నాం అనటం హాస్యాస్పదం.

ఇక ఉండవల్లి విభజన హామీలు అమలు కాలేదని, లక్ష నలభై వేల కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉండిపోయినాయని ఆరోపించారు. ఈ ఆరోపణలో ఉన్న వాస్తవ అవాస్తవాలను పరిశీలిద్దాం.

విభజన అంశాలను స్థూలంగా మూడు ప్రత్యేక అంశాలుగా విభజించవచ్చు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వనరులు సిబ్బంది పంపిణీ అంశాలు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు

పునర్విభజన చట్టంలో భాగం కానీ కేంద్ర ప్రభుత్వ హామీలు.

వనరుల పంపిణీ

ముందు తెలంగాణబ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వనరులు సిబ్బంది పంపిణీ పరిశీలిద్దాం. సిబ్బంది వరకు రాష్ట్రం ఏర్పడిన కొన్ని నెలలకే చాలా వరకు పంపిణీ జరిగి ఏ ప్రాంతానికి కేటాయింపబడిన సిబ్బంది ఆ ప్రాంతంలో పనిచేయడం మొదలుపెట్టారు. చివరి వరకు జటిలంగా మారిన ఒకే ఒక సమస్య విద్యుత్ సంస్థలలోని సిబ్బంది పంపిణీ. యూనియన్ల జోక్యంతో ఇది జటిలమైంది. మొదటినుంచి ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్ర వైఖరి సహితుకంగా లేదు. చివరికి కోర్టుల జోక్యంతో ధర్మాధికారి కమిషన్ ఉత్తర్వులతో ఈ సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చింది. సిబ్బందికి సంబంధించి ఈనాడు పెద్దగా మిగిలిపోయిన విభజన అంశాలు ఏమీ లేవు.

Also read: మూడు రాజధానులు-మూడు రాష్ట్రాలు

రెండవ ప్రధానమైన అంశం షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో పేర్కొనబడిన ప్రభుత్వ సంస్థలు. షెడ్యూల్ తొమ్మిదిలోని సంస్థలన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. స్థానికంగా ఉన్న ఈ సంస్థల ఆఫీసులు విభజన జరిగిన వెంటనే రెండు రాష్ట్రాల పరిధిలో పనిచేయటం ప్రారంభించాయి. విభజన కేంద్ర కార్యాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులకు మాత్రమే పరిమితమైంది. వీటి విభజనకు కూడా మార్గదర్శకాలు విభజన చట్టంలో ఉన్నాయి. దానికి అనుగుణంగానే షీలాబీ డే కమిషన్ వేయడం జరిగింది. వారి నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సిఫార్సులను అమలు చేయటానికి సుముఖంగా లేకపోవడంతో ఈ అంశం ఈనాడు పరిష్కారానికి కోర్టు ముందు ఉన్నది.

షెడ్యూల్ 10 సంస్థలు హైదరాబాద్ లోనే

ఇక షెడ్యూల్ 10 సంస్థలు చాలావరకు హైదరాబాదులోనే ఉండిపోయాయి. వీటి విభజనకు సంబంధించి కూడా చాలా ప్రక్రియ అనంతరం ప్రస్తుతం ఈ అంశం కూడా నిర్ణయం కోసం కోర్టుల పరిధిలో ఉన్నది. ఈ కేంద్ర కార్యాలయ విభజనతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని పరిపాలన నిర్వహిస్తున్నది. వీటి ఆస్తుల విలువ ఉండవల్లి  అన్న విధంగా లక్ష 40 వేల కోట్లు ఉంటే అవకాశం లేదు. కేవలం కేంద్ర కార్యాలయాల వరకే విభజన పరిమితమై ఉన్నది కాబట్టి, చాలా వరకు ఈ సంస్థలు ప్రభుత్వ భూమి మీదనే ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి, ఆ భూమి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే చెందుతుంది కాబట్టి వీటి విలువ అంతా కలిపి 30 వేల కోట్లకు మించి ఉండే అవకాశం లేదు. ఏదైనా ఈ అంశం ప్రధానంగా ఈరోజు న్యాయస్థానంలోనే పరిష్కరించ బడాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ కూడా విభజన అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో పరిష్కారం కోర్టుల ద్వారానే తేలవలసి ఉంది.

సెక్రటేరియట్ విభజించబడి మన వాటా మనకు కేటాయించబడిన జగన్మోహన్ రెడ్డి  పళ్లెంలో పెట్టి దానిని కేసీఆర్ గారికి సమర్పించడం జరిగింది. 

రెండు రాష్ట్రాల మధ్య మరొక ప్రధానమైన పరిష్కారం కాని విభజన అంశం నదీ జలాల వాటాలు. సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాలు ఎగువ దిగువ ప్రాంతాలుగా రాష్ట్రాల మధ్య సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఇది ఎగువ దిగువ ప్రాంతాల సమస్య కాదు. నదికి ఒక్కవైపు వేరొక వైపు ఉన్న రాష్ట్రాల సమస్య. అందుకని ఈనాడు కృష్ణా నది పైన ఉన్న హెడ్ వర్క్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్నది. అట్లా జరగని నాడు దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు కూడా తల ఎత్తాయి. నదీ జలాల పంపకం అన్నిటికన్నా చాలా జటిలమైన సమస్య. దీని పరిష్కారం కావటానికి సమయం పట్టవచ్చు. నదీ జలాల ట్రిబ్యునల్సు కోర్టులలో రెండు రాష్ట్రాల వాదోపవాదాలు విన్న తర్వాత ఇచ్చే అవార్డులు తీర్పుల ద్వారానే ఇది పరిష్కరింపబడాల్సి ఉంటుంది. అంతవరకు తాత్కాలిక సర్దుబాటు విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో రెండు రాష్ట్రాలు నదీ జలాలను వాడుకోవలసి ఉంటుంది.

వాగ్దానాల అమలు తీరుతెన్నులు

ఇక విభజన చట్టానికి సంబంధించిన రెండవ అంశం విభజన చట్టంలో పొందుపరచబడిన వాగ్దానాలు, వాటి ఆమాలు.

అప్పటికే 14 ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడింది కాబట్టి 2015-20 సంవత్సరాల ద్రవ్య లోటు అంశాలను 14 ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం నివేదించటం జరిగింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత 14 ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రంగా పరిగణించి వారికి ఎటువంటి రెవెన్యూ లోటు గ్రాంటులను సిఫారసు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం రెవెన్యూ లోటు రాష్ట్రంగా పరిగణించి ఐదు సంవత్సరాలకు దాదాపు 25 వేల కోట్ల రూపాయల రెవిన్యూ లోటు భర్తీ గ్రాంటులను సిఫారసు చేయడం జరిగింది.

ఇక 2014 -15 సంవత్సరం రెవెన్యూ లోటు గ్రాంటులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా భర్తీ చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటు 16 వేల కోట్ల దాకా ఉన్నదని నిర్ధారించి కేంద్ర ప్రభుత్వానికి భర్తీ చేయటానికి నివేదించింది. ఈ పద్దుల నన్నింటిని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన లోటు 5000 కోట్లకు మించి లేదని మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణ మాఫీ లాంటి కార్యక్రమాల వలన ఏర్పడిన లోటని మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆ మొత్తాలు చెల్లించటం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించే అవకాశం లేదని తేల్చి చెప్పి అంతవరకు రెవెన్యూ లోటు గ్రాంటులను చెల్లించటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 16 వేల కోట్లు రెవెన్యూ లోటని ఇప్పటికీ ఇది ఒక పరిష్కరించవలసిన అంశంగా చూపెడుతూ ఉన్నది. రాష్ట్ర విభజన వలన కలిగిన లోటు వరకు మదింపు చేసి ఇవ్వటం జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వినతిని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం లేదు. ఇది ఒక పరిష్కారం కాని అంశంగా చూపెట్టుకోవటం వలన వచ్చే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు.

నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా ఇచ్చే నిధులలో భాగంగా ఆనాటి రాయలసీమ నాలుగు జిల్లాలకు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు జిల్లాకు 50 కోట్ల చొప్పున ఆరు సంవత్సరాలకు 300 కోట్ల రూపాయలు అన్నిటికీ కలిపి 2100 కోట్ల రూపాయలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో 1750 కోట్ల రూపాయలు విడుదల చేయటం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తానికి వినియోగ పత్రాలు సమర్పిస్తే మిగిలిన 350 కోట్లు ఇవ్వటానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. వాస్తవానికి బుందేల్ఖండ్ ప్యాకేజీ కి ఇది ఏ విధంగాను తక్కువ కాదు. అక్కడ కూడా జిల్లాకు 60 కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలకు గ్రాంట్ ఇస్తూ ఆ జిల్లాలలో అమలవుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉద్యోగ పథకం మొదలైన కేంద్ర పథకాల మొత్తాలన్నిటిని కలిపి ఒక ప్యాకేజీగా చూపించారు. ఈ ఏడు జిల్లాలలో అమలు అవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల మొత్తాలను కలిపి చూస్తే ఈ ప్యాకేజీ దానికి సమానమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు మీడియా ప్రతినిధులు, ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న మేధావి వర్గం బుందేల్ఖండ్ విషయంలో ఈ మొత్తాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ఆ మొత్తాలను తీసివేసి పోల్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఈ వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ విషయంలో వక్ర భాష్యాన్ని చేస్తున్నారు.

Also read: ఏకపక్ష నిర్ణయాలతోనే రాజధాని విషాదం

పదేళ్ళలో కాదు ఐదేళ్ళలోనే విద్యాసంస్థలు

ఇక విభజన చట్టంలోని ఇంకొక వాగ్దానం పది సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పది కేంద్ర ప్రభుత్వ విద్య సంస్థలను ఏర్పాటు చేయడం. విభజన చట్టంలో పేర్కొన్న కాలం పది సంవత్సరాలైనా ఐదు సంవత్సరాల్లోనే ఈ సంస్థలను చాలా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయబడ్డాయి. విశాఖలో ఐఐఎం తిరుపతిలో ఐఐటి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఇంకా పలు సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. పెట్రోలియం పరిశోధనా సంస్థ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపెట్టలేకపోవడంతో ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ అంశాన్ని కూడా మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక వర్గం మీడియా ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న మేధావి వర్గం ఒక సమస్యగా సృష్టించి ప్రజల ముందు ఉంచారు. పది సంవత్సరాల్లో ఖర్చు పెట్టాల్సిన మొత్తం మొదటి సంవత్సరం ఖర్చు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వని ప్రాంతాల్లో కూడా సంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తప్పుగా వక్రీకరించటం మొదలెట్టారు. ఈరోజు వారి దుష్ప్రచారానికి తెరబడే విధంగా అన్ని సంస్థలు ఏర్పాటై పని చేస్తూ ఉన్నాయి. ఇంకా అదనంగా పరోక్ష పన్నుల శిక్షణ సంస్థను అనంతపూర్ జిల్లాలో ఏర్పాటు చేశారు.

బ్రహ్మపదార్థం ప్రత్యేక హోదా

విభజన చట్టంలో పేర్కొనకపోయినా ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయి ఇప్పటికీ ఆవేశాలను రెచ్చగొట్టటానికి ఉపయోగపడుతున్న ప్రధాన అంశము ప్రత్యేక హోదా. పార్లమెంట్లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలో ఈ ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా కేంద్ర సహాయం చేయడానికి వెసులబాటు గా ప్రత్యేక హోదాను ప్రకటించటం జరిగింది. దీనిలో ఎక్కడ పరిశ్రమలకు రాయితీలను గురించి ప్రస్తావించలేదు. ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఏనాడు పరిశ్రమలకు రాయితీలు ప్రత్యేక హోదాలో భాగంగా లేవు. పరిశ్రమ రాయితీలను వేరే స్కీం కింద ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేయడం జరిగింది. కానీ మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని అసత్య ప్రచారం ఒకటి చేయటం జరిగింది. ప్రజలు కూడా దానిని నమ్మడం జరిగింది. ప్రత్యేక హోదా కింద ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 90 శాతం నిధులను ఇవ్వటం జరుగుతుంది. అదే ఇతర రాష్ట్రాలకు 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే ఈ పథకాల కింద కేంద్ర నిధులు వస్తాయి. ప్రత్యేక హోదా వర్తించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఐదు సంవత్సరాలకు 90% నిధులు ఇవ్వడం జరుగుతుంది. 14 ఆర్థిక సంఘం తన సిఫార్సులలో ఒక ప్రధానమైన సిఫార్సుగా ప్రత్యేక హోదా రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తీసేసింది. దీని కారణంగా ప్రత్యేక హోదా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా వచ్చే వెసులుబాటును ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పించడం జరిగింది. దాదాపు 15 వేల కోట్ల రూపాయల దాకా అదనపు సహాయాన్ని అందించటానికి కేంద్రం సిద్ధి పడింది. ముందు ఈ ప్యాకేజీ ఆమోదించిన నాటి రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ కారణాలతో వెంటనే యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఆవేశపూరితమైన అంశంగా మారటంతో రెండు ప్రాంతీయ పార్టీలు రాదని తెలిసినా తెస్తామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఆ వచ్చే 16 వేల కోట్లు కూడా రాకుండా ఆగిపోయినాయి. ఈ రకంగా రాష్ట్రం నష్టపోతూ ఉన్నది.

మౌలిక సదుపాయాల పెంపు

ఇక ఇవి కాక విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయ కల్పనకు కేంద్ర సహాయం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. దీనిలో భాగంగా మూడు ప్రధాన విమానాశ్రయాలు విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఆధునీకీకరణ చేయడం జరిగింది. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయడం జరిగింది. విభజన చట్టంలో విశాఖ విజయవాడలో మెట్రో రైల్ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉన్న ఇంతవరకు దీనికి సంబంధించిన డిపిఆర్లు రూపొందింపబడలేదు. కొంత ఆలస్యంగా ఈ మధ్యనే రైల్వే జోన్ మంజూరై ఏర్పాటు చేయడం జరుగుతున్నది. విభజన చట్టంలో దుగరాజపట్నం నౌకాశ్రయం ప్రస్తావించబడిన ఇక్కడ పర్యావరణ సమస్యలు ఉన్నందున దీనికి బదులుగా రామాయపట్నం అభివృద్ధి చేయటానికి కేంద్రం మొగ్గుచూపింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేజర్ పోర్టుగా ఉండాల్సిన రామాయపట్నం ను మైనర్ పోర్టుగా వర్గీకరించి దాని నిర్మాణం రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. దీనికి గల కారణాలు వారికి తెలియాలి. ఇక పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే చేపట్టి నిర్మించాల్సి ఉన్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానే తీసుకున్నాడు. ఈనాడు సాంకేతికపరమైన సమస్యలతో ప్రాజెక్టు నిర్మాణం మందకొడిగా సాగుతున్నది. ఈనాడు పోలవరం ప్రాజెక్టు సమస్య సాంకేతికమే గాని నిధుల కొరత కాదు.

విభజన చట్టానికి సంబంధాలు లేకుండా అనేక స్కీముల క్రింద మౌలిక సదుపాయాల కల్పన లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను మంజూరు చేయటం అమలు చేయడం జరిగింది. జరుగుతూ ఉన్నది.

ఇక ఇవి కాక పరిశ్రమలకు సంబంధించి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కాకినాడలో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసిందిగా విభజన చట్టం పేర్కొన్నది. ఈ రెండు ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాణిజ్యపరంగా లాభసాటి కాదు అని తెలిసింది. కాకినాడ రిఫైనరీకి బదులు విశాఖలోని రిఫైనరీ విస్తృత పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వం విస్తరించడం జరిగింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో కొత్తగా ఏ ప్రాజెక్ట్ మొదలెట్టటం లేదు. అటువంటి అప్పుడు వాణిజ్యపరంగా లాభ సాటిగా లేని కడప ఉక్కు కర్మాగారం, కాకినాడ పెట్రోలియం రిఫైనరీ ప్రారంభించే అవకాశం లేదు. విభజన చట్టం కూడా ఈ కర్మాగారాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని పేర్కొన్నదే కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేయమని చెప్పలేదు.

చిత్తశుద్ధి ఉంటే పరిష్కరించుకోవచ్చు

ఈ సమస్యకు గాని ప్రత్యేక హోదా అంశంలో కానీ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరిష్కరించుకోవడం పెద్ద అంశం కాదు. ఈనాడు దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన పై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది. ఈ రెండు ఫ్యాక్టరీల ఏర్పాటులో రాష్ట్రానికి వచ్చే నిధులను అదనపు రైల్వే లైన్లు రోడ్లు మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీస్ ఇటువంటి స్కీమ్స్ కింద ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అదనపు నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సమస్య పరిష్కారానికి మార్గం వెతుక్కునే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు వైఎస్సార్ సీపీ గాని వారి దృష్టి అంతా ఈ అంశాలను సమస్యలుగా చూపించి రాజకీయ లబ్ధి పొందటం. సమస్యలను పరిష్కరించి అదనపు నిధులు తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడటం కాదు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఈ ఆలోచన విధానంతో ఉన్నంతకాలం ఈ సమస్యలకు పరిష్కారానికి అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకుని రాష్ట్రానికి మేలు చేసే అవకాశం లేదు.

Also read: వ్యవసాయ చట్టాలు – రైతులు

IYR Krishna Rao
IYR Krishna Rao
రచయిత ఐఏఎస్ విశ్రాంత అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. సుప్రసిద్ధ పుస్తక, వ్యాస రచయిత. బీజేపీ నాయకులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles