Friday, April 26, 2024

‘గోవులొస్తున్నాయి జాగ్రత్త!’ సినిమా ప్రయత్నం

రావి శాస్త్రి, పురాణంతో  ఉమామహేశ్వరరావు అనుభవాలు

‘చావు’ కథకు సంభాషణలు రాసిన కాళీపట్నం రామారావు

నా యవ్వనంలో నన్ను తన రచనలతో ఆకట్టుకొని, నన్నూ, నా భావజాలాన్నీ తీర్చిదిద్దడంలో రావి శాస్త్రిగారు ముఖ్యులు. ఆయన రచనల్లో ఉన్న క్లుప్తత, తీక్ష్ణత,  ఎగతాళి, కచ్చితత్త్వం నన్ను ఆయన అభిమానిగా పూర్తిగా మార్చివేశాయి. ఆయనను కలుసుకోవడం,మాట్లాడటం నేను మద్రాసులో అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ గా పని చేసి విజయవాడ వచ్చిన తర్వాత సాధ్యమైంది. విజయవాడలో అప్పటికి పునాదిరాళ్ళు సినిమా దిగ్విజయంగా నిర్మించిన  చందన సిగార్స్ వాళ్ళు నన్ను డెరెక్టర్ గా పెట్టాలనుకున్నారు. అప్పుడు రావి శాస్త్రిగారు రాసిన ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త!’ కథ చెప్పాను. అర్ధశతాబ్దం కిందట రాసిన ఆ నవలలో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న మ్యాజిక్ రియలిజం లక్షణాలు కనిపిస్తాయి.

ఆ సందర్భంలో నాకు సహాయం చేసింది పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు. ఆయనకు రావి శాస్త్రిగారితో బ్రహ్మాండమైన స్నేహం ఉంది. రైలులో ఇద్దరం వైజాగ్ వెళ్ళాం. రావి శాస్త్రిగారితో రెండురోజుల పైగానే వైజాగ్ లో గడిపాం.సాయంత్రాలు జగదాంబ థియేటర్ ఎదురుగా ఒక డాబాపైన ఆయన ఇష్టాగోష్ఠులు. రావిశాస్త్రిగారు పినిమాలూ, వాటి కంటెంట్, ఉద్దేశాలు మొదలైన వాటికంటే ఆయనకు నచ్చిన ఒక దృశ్యం (సినిమాలోది), అది చిన్నదే కావచ్చు. చాలా తన్మయత్వంతో ఊరిస్తూ చెప్పేవారు. అది ఒక హిందీ సినిమాలో హీరోయిన్ నీళ్ళలో కాళ్ళాడించడం. దాని గురించి ఆయన అంతసేపు గుర్తు తెచ్చుకొని ఆనందపడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన మిన్ను విరిగి మీద పడుతున్నా ఏమీ చలించే వ్యక్తి కాదు. అలాగే ఎవరన్నా కన్నీరు పెట్టుకుంటే అసలు భరించేవారు కాదు.

రావి శాస్త్రిగారికి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఫుట్ బాల్ ఆటగాళ్ళందరూ ఆయనకి పేరుపేరునా తెలుసు. ఎవరు ఎట్లా ఆడుతారో విపులంగా చెప్పేవారు. పురాణంగారితో ఉన్న ఆ రెండ్రోజుల్లో ఒక రోజు వైజాగ్ లోజరుగుతున్న ఒక ఫుట్ బాల్ టోర్నమెంటుకు వెళ్ళాం. అక్కడ పురాణంగారిని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మైదానంలోకి తీసుకొని వెళ్ళి ఆటగాళ్ళకి పరిచయం చేశారు.

సరే, గోవులొస్తున్నాయి జాగ్రత్త సినిమా తీయడానికి చాలా పెద్ద బడ్జెట్ అవుతుందని గ్రహించిన నిర్మాతలు వెనక్కి తగ్గారు. నిజం చెప్పాలంటే రావి శాస్త్రిగారు ఆ సినిమా ప్రపోజల్ నే సీరియస్ గా తీసుకోలేదు. ఆయనలో రచయితగా గొప్ప లక్షణం ఉంది. తను ఏదైనా రాసినప్పుడు దానికి సంబంధించి మథన ఉంటుందేమో కానీ రాసేసిన తర్వాత దానికి సంబంధించిన చర్చలూ, పొగడ్తలూ అసలు ఇష్టపడేవారు కాదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఒక్కోసారి ‘నేనలా రాశానా?’ అనేవారు.

‘అలా…జాగ్రత్త!’ అని పులుల్ని హెచ్చరించడానికి అవకాశం రాకపోయినా నేను ఆయన్ను వదలలేదు. ఆయన విజయవాడ వచ్చినప్పుడల్లా ఆయన స్నేహితులూ, అభిమానుల బృందంతో ఆయన గది నిండిపోయేది. పురాణంగారు సరేసరి. జగన్నాథరావుగారూ, పతంజలి, వాసుదేవరావు గార్లు తరచూ ఆ సమావేశాల్లో కనిపించేవారు.

పరిచయం అయిన ఏ వ్యక్తినైనా పూర్తిగా చదివేవారు ఆయన. వాళ్ళు మాట్లాడే తీరునూ, భావాల వరుసనూ గమనించి కులం, ప్రాంతానికి సంబంధించిన వివరాలు అడిగేవారు. ఇది నాకు రుచించేది కాదు. ఒక  సారి అడిగాను. ఆయన వివరణ: ‘‘ఉమామహేశ్వరరావ్, వాళ్ళు, వాళ్ళ పరిస్థితులనూ, మనసులనూ అర్థం చేసుకోవడానికి ఇవి తెలుసుకుంటే ఉపయోగపడతాయి.’’ ఆయనలోని రుషిత్వం కష్టాలు పడేవారిని అక్కున చేర్చుకోవడం, కన్నీళ్ళు తుడవడం, పెత్తందారీతనం, దాష్టీకాన్ని తెగించి ఖండించడంలో తెలుస్తుంది.

తర్వాత నేను కాళీపట్నం రామారావుగారి ‘చావు’ కథను సినిమా తీయాలని ప్రయత్నించాను. దానికి మాష్టారుని పరిచయం చేయడం నుంచి మాష్టారు విజయవాడ వచ్చి సంభాషణలు రాయడం వరకూ రావి శాస్త్రిగారే మధ్యవర్తిత్వం వహించారు. అయితే, దాన్ని సినిమా తీయడంలో నా ఫెయిల్యూర్ కి సాక్షి రావి శాస్త్రిగారే!

ఆయన తనకు సంబంధించిన విషయాల్లో ఎంత ఉదాసీనంగా ఉంటారో అన్యాయాన్ని గమనిస్తే అంత ఉద్రేకపడతారు. పళ్ళ పటపటలాడిస్తూ ఆయన పాడే పాట ‘నెర్రంగ సెట్టుకింద నరుడో భాస్కరుడా…’ దానికి ఉదాహరణ.

ఆయన చాలామందికి ‘ఆయన ఎవర్నీ లక్ష్యపెట్టే మనిషి కాదు’  అన్నట్లుగానే కనిపిస్తారు. అయితే, దానికి కాళీపట్నం రామారావు మాష్టారుగారు భిన్నంగా ఒక విషయం చెప్పారు. తెన్నేటి విశ్వనాథం గారితో మాట్లాడేటప్పుడు ఎంత దీక్షగా చూస్తూ రావి శాస్త్రిగారు నిలబడి ఉండేవారో కారా మాష్టారు చెప్పారు. ప్రజలకి అనుసంధానమైన ఏ భావజాలమైనా తను నమ్మకపోయినా కాళ్ళలో నిజాయితీ ఉంటే రావి శాస్త్రిగారు గౌరవించేవారు.

రావి శాస్త్రిగారి ‘నిజం’ నాటకం మొదలుకొని సాహిత్యం గురించి ఎంతైనా తెలుగునాట చర్చ జరగవలసింది చాలా ఉంది. అది చాలా ప్రారంభ దశలోనే ఉన్నదని నా భావన. దానికి తగినవాళ్ళు ఉద్యమించాలి.

(రావి  శాస్త్రి శతజయంతి ఉత్సవసంవత్సరం సందర్భంగా)

C. Umamaheswara Rao
C. Umamaheswara Rao
సి. ఉమామహేశ్వరరావు ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు. అంకురం సినిమా దర్శకుడుగా ప్రఖ్యాతిగాంచారు. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండు నంది అవార్డులూ, ఒక జాతీయ ఫిలిం అవార్డూ గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన ‘ఇట్లు అమ్మ’ చిత్రానికి దర్వకత్వం వహించారు. విద్యాధికులు. వామపక్ష భావజాలం కలిగిన ప్రజాస్వామ్యవాది, సౌమ్యవాది.

Related Articles

1 COMMENT

  1. రావిశాస్త్రి గారి రచనల మీదా, ఆయన వ్యక్తిత్వం గురించి మంచి స్పందన చదవగలొగాను. నెనరులు.
    ఉమామహేశ్వర్రావు గారి శ్రీకారం చిత్రానికి మాటలు రాసినపుడు, రావిశాస్త్రి గారి ‘నిజం’ నాటకం నాకు ఎంతో వుత్సాహాన్నిచ్చింది. కోర్టు తీరుని సహజంగా చూపించగలగటానికి చాలా సహాయపడింది.
    కె.ఎల్.ప్రసాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles