Tuesday, June 25, 2024

త్వరలో మరిన్ని పోలీసు నియామకాలు: హోం మంత్రి

  • పోలీసు చరిత్రలోనే అత్యధిక మంది 1162 మంది ఎస్.ఐ.ల పాసింగ్ ఔట్ పరేడ్
  • సీసీ కెమేరాల ఏర్పాటులో ప్రపంచంలోనే అగ్రస్థానం
  • ప్రభుత్వానికి మంచి పేరు తెవాలి : డీజీపీ

హైదరాబాద్, అక్టోబర్ 23 : రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్టు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారంనాడు తెలంగాణా పోలీస్ అకాడమీ లో కన్నుల పండుగగా జరిగిన 12 వ బ్యాచ్ 1162 మంది సబ్- ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా హోమ్ మంత్రి హాజరయ్యారు.  డీ.జీ.పీ. ఎం. మహేందర్ రెడ్డి, పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి, పలువురు సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాంతి, భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చిన సి.ఎం. కేసీఆర్ పెద్ద ఎత్తున పోలీసు కాళీలను భర్తీ చేయడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ, వాహనాల కొనుగోలుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరెన్నడూ లేనివిధంగా 18428 మంది ఎస్.ఐ, కానిస్టేబుళ్ల నియామకం జరిపామనీ, ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా త్వరలోనే నియమించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

సమయోచితంగా, రాజ్యాంగబద్ధంగా…

సమాజంలో  రోజు రోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు. పనిచేయాలని పిలుపునిచ్చారు.  సమాజంలో అన్ని వర్గాల అవసరాలను, సమస్యలను ఓర్పుతో పరిష్కరించి సామరస్యాన్ని, సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.  శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశం లొనే ఆదర్శంగా ఉందని, ముఖ్యంగా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. సీ.సీ. కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ ప్రపంచంలోనే ముందంజలో ఉందనీ, త్వరలో ఏర్పాటు కానున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్ తో నేరాలను మరింత బాగా నియంత్రిస్తామని భరోసా వ్యక్తం చేశారు. కరోనా, భారీ వర్షాలలోనూ పోలీసులు అందించిన సేవలు ఆమోఘమైనవని ప్రశంసించారు.

పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన ఎస్.ఐలు

డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన యువ ఎస్.ఐ లు ప్రభుత్వ సేవలోకి ప్రవేశించడం గర్వకారణమని అన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖకు తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే.సి.ఆర్  పోలీస్ శాఖకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి పెద్దఎత్తున నిధులు, నియామకాలు జరిగెందుకు దోహదపడ్డారని అన్నారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ మేరకు నేరరహిత సమాజ స్థాపనకై  చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యమని, పోలీసింగ్ తో పాటు హరిత హారం, ఇతర ప్రభుత్వ పథకాల అమలులోనూ బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించడం ద్వారా స్మార్ట్ పోలీసింగ్ కు ప్రాధాన్యతనివ్వాలని, ఇందుకుగాను ఆధునిక సాంకేతికత, చట్టాలలో వచ్చే మార్పులకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ అందుకనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

వివిధ ర్యాంకులవారికి శిక్షణ

తెలంగాణా పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణ నిచ్చామని తెలిపారు. నేడు జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో సివిల్ కు చెందిన 661, ఐ.టీ.కమ్యూనికేషన్ కు చెందిన 28, 448 ఆర్.ఎస్.ఐ.లు, ఫింగర్ ప్రింట్ కు చెందిన 25 ఏ.ఎస్.ఐ లున్నారని తెలియచేసారు. కాగా, ఈ పాసింగ్ ఔట్ పరేడ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 14 కాంటిజెంట్ల ఎస్.ఐ. లు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. వీరిలో,  మూడు మహిళా ఎస్.ఐ. కాంటిజెంట్లు ఉన్నాయి. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన ఎస్.ఐ. లకు పురస్కారాలను మంత్రి మహమూద్ అలీ, డీ.జీ.పీ మహేందర్ రెడ్డి  లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయుడు,డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. కాగా, నేడు శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్,ఐ లలో 68 ఇంజనీర్లు, 37 మంది ఎం.బీ.ఏ గ్రాడ్యుయెట్లున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles