Wednesday, December 8, 2021

సంపాదక శిరోమణి ముట్నూరి కృష్ణారావు

  • ఆత్మవిశ్వాసం, వజ్రసంకల్పం మూర్తీభవించిన వ్యక్తి
  • కర్మయోగి, విరాగి కాదు, గుండె తడి ఉన్నవాడు
  • సంపాదకీయాలకు కావ్యగౌరవం తెచ్చిన సృజనశీలి

పత్రికా రంగానికి తలమానికమైన పత్రికలలో ‘కృష్ణాపత్రిక’ స్థానం చిరస్మరణీయం, రమణీయం. ఆ పత్రికకు అంతటి ఖ్యాతిని దక్కించి పెట్టిన ముట్నూరి కృష్ణారావు నిత్యస్మరణీయుడు. కృష్ణాపత్రికను,కృష్ణారావును వేరుచేసి చూడలేం. అది అభేద్యమైన స్వరూపం. ఆ పత్రికను నడిపిన విధానం, ఆ మహనీయుడు నడచిన త్రోవ తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడవక మానదు. అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు, అననుకూల వాతావరణం, దినగండం నూరేళ్ళ ఆయుష్షు చందం. అచంచలమైన దేశభక్తి, అనుపమానమైన ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, పవిత్రత,నిష్కామకర్మ ఆయనను నడిపించాయి. అవే అస్త్రశస్త్రాలై ఆ పత్రికనూ నడిపించాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఒకే పత్రికకు సంపాదకుడుగా పనిచేసినవారు ప్రపంచ పత్రికా రంగంలోనే చాలా అరుదుగా ఉంటారు. సహాయ సంపాదకుడుగా ప్రారంభమైన అనుబంధం దినదిన ప్రవర్ధమానమై, సంపాదకుడిని, అధిపతిని కూడా చేసింది.

Also read: అఫ్ఘాన్ లో భారత్ చొరవ

కృష్ణాపత్రికకు పర్యాయపదం

కృష్ణాపత్రిక అంటే ముట్నూరి కృష్ణారావు -కృష్ణారావు అంటే కృష్ణాపత్రికగా మారిపోయింది. ఇవ్వేమీ అలవోకగా రాలేదు. కొండా వెంకటప్పయ్యపంతులు వంటి ధీమంతులు వేసిన మొక్కను మహావృక్షం చేసిన ఘనత నూటికి నూరుపాళ్ళు ముట్నూరివారిదే. కష్టాలే కాదు, అనేక ఆకర్షణలు ఆయనను చుట్టుముట్టాయి. అన్నింటినీ సమానంగా తీసుకున్న కర్మయోగి. మహాత్మాగాంధీ స్వయంగా రాజకీయాల్లోకి స్వాగతించాడు. ఎటువంటి పదవిని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. అధికమొత్తంలో జీతం ఇచ్చి తీసుకుంటానని ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాథుని నాగేశ్వరావుపంతులు స్వాగతం పలికాడు. ప్రభుత్వానికి డిపాజిట్ సొమ్ములు కట్టలేదని బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు పంపింది. ఇలా ఒకటి కాదు ఇటువంటి ప్రలోభాలు, సంకటాలు ఎన్ని ఎదురైనా, ఆయన కృష్ణాపత్రికా కార్యదీక్షను ఇసుమంత కూడా వంచలేక పొయ్యాయి.

Also read: మితిమీరుతున్న మధుమేహం

కర్మయోగియే కానీ విరాగి కాదు. గుండెనిండా తడి, కళ్ళ నిండా ప్రేమ ఉన్నవాడే. అఖండుడైన భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆత్మీయ మిత్రుడు, సహాధ్యాయి కూడా. అయినా, సందర్భం వచ్చినప్పుడు ఆయననూ వదిలి పెట్టలేదు. తేడా వస్తే ఎవరినైనా పత్రికాముఖంగా చీల్చి చెండాడేవాడు.’తలపాగా ఉన్నంత సేపు నేను సంపాదకుడిని.. అది తీసిన తర్వాత పట్టాభికి అనుంగుమిత్రుడిని’ అంటూ వృత్తిపరమైన నిబద్ధతను చాటుకున్న నిరంకుశ సంపాదకుడు. ‘కవయః నిరంకుశః’ అన్నట్లు, సంపాదకుడు కూడా నిరంకుశుడేనని అర్థం చేసుకోవాలి. ఒక సందర్భంలో భోగరాజును ఘాటుగా విమర్శిస్తూ  సంపాదకీయం రాశాడు. అది చూసిన భోగరాజు తన బాధను గొట్టిపాటి బ్రహ్మయ్య దగ్గర వెల్లబుచ్చాడు. దానిపై, ముట్నూరివారు ఆ విధంగా ప్రతిస్పందించారు. గొట్టిపాటి వీరిరువురికీ ప్రియశిష్యుడు. కృష్ణాజిల్లా రాజకీయాలలో అంతటా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రభావశీలంగా ఉన్న క్రమంలో, మిగిలిన సామాజిక వర్గాలను స్వాగతించాలనే సదాశయంతో అప్పటికి విద్యార్థిగా ఉన్న గొట్టిపాటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఘనత భోగరాజువారిది.  దానిని సమర్ధించిన హృదయం ముట్నూరివారిది. కాంగ్రెస్ చరిత్రలో, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్షుడిని నియమించడం కృష్ణాజిల్లాతోనే ప్రారంభమైంది. తొలి అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, రెండో అధ్యక్షుడు గొట్టిపాటి బ్రహ్మయ్య. గొట్టిపాటి నియామకం వెనకాల ప్రధాన పాత్రను పోషించినవారు ముట్నూరి కృష్ణారావు. సంస్కరణలు రాజకీయ పదవుల నియామకంలోనూ ఉండాలని నమ్మినవాడు ఆయన. రఘుపతి వెంకటరత్నంనాయుడు ప్రభావంతో ఆధునిక భావాలను అలవరచుకున్నాడు. అహింసాతత్త్వానికి గాంధీని ప్రేరణగా నిలుపుకున్నాడు. బిపిన్ చంద్రపాల్, అరవిందుడు, రవీంద్రుడు కూడా ఆయనపై గొప్ప ప్రభావాన్ని చూపారు. కృష్ణాపత్రిక నిర్వహణలో బిపిన్ చంద్రపాల్ ‘న్యూ ఇండియా ‘ నుంచి ఎంతో ప్రేరణ పొందారు. వందేమాతరం ఉద్యమం ఆయనను ఆణువణువునా కదిలించింది. స్వాతంత్ర్య సంగ్రామ రంగంలో పత్రికా సంపాదకుడిగా ఆయన పోషించిన పాత్ర అనిర్వచనీయం.

Also read: చైనాలో శాశ్వత నియంత షీ జిన్ పింగ్

ఆయన సంపాదకీయాలు వెలకట్టలేని ఆణిముత్యాలు

ముట్నూరివారి సంపాదకీయాలు తెలుగు పత్రికా రంగంలో వెలకట్టలేని ఆణిముత్యాలు. పల్లెవాసులు, పండితులు, కవులు, మేధావులు, కళాకారులు, యువత.. ఒకరేమిటి? ప్రతి తెలుగువాడిని కదిలించి, కరిగించి,పెనునిద్దుర వదిలించిన అక్షరతూణీరాలు. మొదట్లో గ్రాంథికంగా మొదలుపెట్టి తర్వాత అతి తక్కువ కాలంలోనే వ్యావహారిక భాషలో రాసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కసారి సంస్కృత పద చాలనంతో ఖేలనం చేస్తాయి, ఒక్కొక్కమారు అచ్చతెలుగులో అచ్చపు జుంటితేనియలను మరిపింపచేస్తాయి. మరియొక్క మారు ఉభయభాషల సంగమంగా మురిపింపచేస్తాయి.  ప్రచండమై, ప్రభంజనమై దుర్మార్గులను భయకంపితం చేస్తాయి. చల్లని చిరుజల్లులై పులకింపచేస్తాయి. ఆ యా సందర్భాలను బట్టి సాగే ఆ సంపాదకీయాలు సర్వవిజ్ఞాన భాండాగారాలు. సంపాదకీయాలకు కావ్యగౌరవం తెచ్చిన సృజనశీలి ముట్నూరి. సాహిత్యం, పాత్రికేయం కలగలసి సాగిన స్వర్ణయుగంలో విజృంభించిన పాత్రికేయవీరుడు, గొప్ప బుద్ధిజీవి. దూరాలోచన, సూక్ష్మాలోచన, సమాలోచన, విజ్ఞత, సౌందర్యం కలిగిన వ్యక్తిత్వం సొంతం చేసుకున్న సంపాదకుడిగా అందరి మన్ననలు పొందిన ధన్యజీవి. ఆయన గుండె సిరాబుడ్డి… వారి కలంలో పదిపాళీలు ఉన్నాయేమో!.. అని ప్రాజ్నులందరూ వేనోళ్ల పొగిడారు. ఇక ‘కృష్ణారావు దర్బారు’ గురించి చెప్పాలంటే ఒక కావ్యమవుతుంది. బందరు ‘కృష్ణాపత్రిక’ కార్యాలయంలో నడిచే ఆ దర్బారుకు రాని ప్రసిద్ధుడు ఆనాడు లేడు. అది ఆధునిక భువనవిజయం. దానికి కృష్ణారావే కృష్ణరాయడు. సమాజానికి అక్షర చికిత్స చేసిన అటువంటి మహనీయులను ఇక చూడలేం. అంతటి కార్యశూరుడు మితభాషి, హితభాషి. అంతటి ప్రచండుడు  స్ఫురద్రూపి, సౌందర్యపిపాసి. నవంబర్ 17 ఈ మహామనీషి పుట్టినరోజు. ప్రతితెలుగువాడు, ప్రతి పాత్రికేయుడూ నిత్యం తలపుల్లో నిలుపుకోవాల్సిన ముట్నూరి కృష్ణారావు మహోదయుడు.

Also read: పద్యాన్ని పరుగులు పెట్టించిన కొప్పరపు సోదర కవులు

(నవంబర్ 18 ముట్నూరి కృష్ణారావు జయంతి)

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles