Wednesday, September 18, 2024

నటనకే నటన నేర్పిన మహా నటుడు …ఎస్‌.వి.రంగారావు

S V Ranga Rao @ 100 : A golden standard for the craft - The Hindu
ఉమ్మడి కుటుంబంలో నటరత్న ఎన్ టి రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో నటచక్రవర్తి ఎస్ వి రంగారావు

తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచి ఉండే విశ్వ నట చక్రవర్తి సామ‌ర్ల వెంక‌ట రంగారావు… ఎస్‌.వి. రంగారావుగా పిలుచుకునే ఆయ‌నను  ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.. ఆయ‌న వేసిన పాత్ర‌లు, చెప్పిన డైలాగులు  తెలుగు వాడి గుండెల్లో  ప‌దిలంగా ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయి..

ప్రతినాయకుని పాత్రల‌తో పాటు అనేక  కుటుంబకథా చిత్రాలలో అత్యత్భుతంగా నటించి, తన నటనా చాతుర్యంతో  మెప్పించిన మహానటుడాయ‌న‌. 

తన నట విశ్వరూపంతో కథానాయకుల కన్నా  ఎక్కువగా పేరు సంపాదించిన ఎస్.వి. రంగారావు  కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 03 జూలై 1918న  జన్మించారు.  రంగారావుకు చిన్న‌త‌నం నుంచీ న‌ట‌నంటే ప్రాణం. అందువ‌ల్ల త‌న డిగ్రీ విద్య పూర్త‌యిన త‌రువాత  వరూధిని చిత్రంతో చిత్రరంగంలోకి  ప్రవేశించారు. అయితే ఆయ‌న ఊహించిన‌ట్లు మొదటి చిత్రం  తరువాత ఆయనకు సినిమాలలో వేషాలు వేసే అవకాశం రాలేదు.  దాంతో ఆయ‌న కొంత కాలం  టాటా వారి సంస్థలో  ప‌ని చేశారు. అయిన‌ప్ప‌టికీ న‌టుడు కావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో  తిరిగి  పాతాళ భైరవి చిత్రంలో నేపాలి మాంత్రికుడి వేషం ద్వారా ప్రవేశించారు. ఆ చిత్రంలోని నేపాలి మాంత్రికుడి పాత్ర ఆయ‌న‌కు విశేష‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. పండిత, పామ‌రుల ప్ర‌శంస‌ల‌కు పాత్రుల‌ను చేసింది.   ఆ  పాత్రే ఆయ‌న‌కు విజ‌య సంస్థ‌లో శాశ్వ‌త న‌టుడిగా  స్థానాన్ని క‌ల్పించింది. 

ఈ క్ర‌మంలోనే పింగళి, సముద్రాల.. ఇంకా అనేకమంది గొప్ప రచయితలు ఆయనలోని నట విరాట్ రూపాన్ని త‌మ డైలాగుల‌తో ఆవిష్కరింపచేశారు.

పాతాళభైరవి చిత్రంలో ‘మహాజనానికి మరదలు పిల్ల’, ‘శృంగారం శాయవే బుల్‌బుల్’, ‘సాహసం శాయరా డింభకా’.. ఇలా ఆయన నోట పలికిన ప్రతీ మాటా ప్ర‌సిద్ధ‌మై ప్రేక్ష‌కుల‌ను అమితంగా రంజింప చేశాయి.

ఇలా దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా ఆయ‌న నటించారు.  రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు.

Remembering SV Ranga Rao on his 101th birth anniversary | Telugu Movie News  - Times of India
బాంధవ్యాలు చిత్రంలో రైతు పాత్రలో…

‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ అంటూ మాయాబజార్ లో , భక్త ప్రహ్లాద లో హిరణ్యకశిపుడు గా ఆయన చూపిన పద్య వాచక పటిమ, కీచకుడిగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మ గా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పౌరాణిక ప్రతినాయక పాత్రలు…అన్నింటా ఆయ‌న న‌ట‌న అన‌న్య సామాన్యం. , ‘నటనకే నటనను నేర్పిన న‌టుడాయ‌న‌. ఆయన న‌ట‌న‌లోని ప్ర‌తీ అంశ‌మూ ఓ వైవిధ్య‌మే. తనదైన శైలిలో ఆయన చేసే సంభాషణల ఉచ్చారణ, ఆ విరుపు, హావ భావాలు ఆయనకు మాత్రమే సొంతం.

పెళ్లి చేసి చూడు చిత్రంలో ఆయ‌న‌ పోషించిన ‘వియ్యన్న’ పాత్ర కూడా  తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

అలాగే, దీపావళి, అనార్కలి, మహాకవి కాళిదాసు, భట్టివిక్రమార్క, బొబ్బిలియుద్ధం, చరణదాసి, లక్ష్మీ నివాసం, జయభేరి ఇలా ఒక పాత్రకు మరో పాత్రకూ సంబంధం లేకుండా జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన అభినయంలో ప్రదర్శిస్తూ, తన గొంతులో ధ్వనింపచేసిన నటవిరాట్టు రంగారావు.

నాదీ ఆడజన్మే, సుఖదు:ఖాలు వంటి గొప్ప చిత్రాల‌ను నిర్మించి సామాజిక చిత్రాలపై తనదైన సరళిని ప్రేక్ష‌కుల‌కు  పరిచయం చేశారు. దర్శకత్వం మీది ఆసక్తితో చదరంగం, బాంధవ్యాలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. బతుకుతెరువు, బంగారుపాప, బందిపోటుదొంగలు, తాతామనవడు, రాజు పేద, గుండమ్మ కథ,  ఇలా అనేక  ఆణిముత్యాలైన చిత్రాలు ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తిని సంపాదించిపెట్టాయి.   చార్లీ చాప్లిన్ వంటి మహా నటుని ప్రశంసలు అందుకున్న గొప్ప న‌టుడాయ‌న‌.

నర్తనశాలలో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. చదరంగంలో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి పాత్ర, తోడికోడళ్లులో మతిమరుపు లాయరు కుటుంబరావు పాత్ర, కత్తుల రత్తయ్యలో రౌడీపాత్ర, అనార్కలిలో అక్బర్ పాత్ర, పాండవ వనవాసంలో దుర్యోధనుడిపాత్ర… ఒకటేమిటి… తెలుగువారి గుండెల్లో  కలకాలం నిలిచిపోయే పాత్రలెన్నో ఆయన  చేశారు. అలాగే,  భక్తప్రహ్లాద, చెంచులక్ష్మి, దీపావళి.. ఇలా ఒకటేమిటి ఆయన నటించిన ప్రతీ చిత్రమూ ఒక మహాద్భుత రససాగరమే.

 అలాగే,గుండమ్మకథ, దేవుడు చేసిన మనుషులు, దసరాబుల్లోడు చిత్రాల్లో ఆయన నటన అనితరసాధ్యం . ఆయన ఎంత గొప్ప  నటుడో .. అంతటి మంచి కథా  రచయిత కూడా . ఆయ‌న రాసిన క‌థ‌లు అనేకం ఆ రోజుల్లో  ఆంధ్ర సచిత్ర వారపత్రిక, యువ, వెండితెర తదితర పత్రికల్లో ప్ర‌చుర‌ణ‌కు నోచుకోవ‌డం విశేషం.

Chiranjeevi to unveil SV Ranga Rao's statue - Movies News
ఎస్ వి రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మెగా స్తార్ చిరంజీవి

నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాకుండా  ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ లాంటి బిరుదులు ఆయ‌న‌ను వ‌రించాయి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన గొప్ప న‌టుడాయ‌న‌.

ఇలా ఎన్నో మ‌ర‌పురాని చిత్రాల‌కు, పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన ఎస్.వి.ఆర్‌.  1974 జూలై 18న  క‌న్నుమూశారు.

ఎన్నో మహత్తర పాత్రలకు జీవం పోసిన ఎస్. వి. రంగా రావు తెలుగు గడ్డ మీద పుట్టడం తెలుగు నేల చేసుకున్న పుణ్య ఫలం. ఎస్. వి. ఆర్. మరణించినా కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో బతికే ఉంటారు.

(జూలై 3న ఎస్.వి.రంగారావు జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేకం)

-దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌

  మొబైల్: 77940 96169

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles