Monday, April 29, 2024

శ్రీరమణలాగా కథలు చెప్పేవారు మరొకరు దొరకడం కష్టం

ఫొటో రైటప్: శ్రీరమణ, మిథునం సినిమాలో లక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం

ఆంధ్ర జ్యోతి వీక్లీలో 1976  ప్రాంతాలలో “ప్రేమ పల్లకీ” అనే సీరియల్ వస్తూ వుండేది. అది కొంచెం తమాషాగా, హాస్యంగా, విభిన్నంగా వుండేది. చదివే వాళ్లం గానీ రచయితెవరో పెద్దగా పట్టించుకోలా. మెడికల్ కాలేజ్ లో చేరాక 1980 ప్రాంతాలలో శ్రీరమణ పేరడీలు అనే పుస్తకం వచ్చింది. ఇక చదువుతూ నవ్వులతో కిందా మీదా అయిపోయే వాళ్లం. ఆ రచయిత ప్రతిభకి ఆశ్చర్యపోయేవాళ్లం. ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణనీ, శ్రీశ్రీనీ ఆయన వెక్కిరించిన తీరు చూసి ఈయన సామాన్యుడు కాడు అనుకున్నాం.

ఇక “రంగుల రాట్నం,”  “మిథునం మరికొన్ని కథలు” చదివాక ఆయనంటే ఆషామాషీ కాదని తెలిసింది.

అలాంటి ఆయనతో నా పరిచయం విచిత్రంగా కాదు గానీ అనుకోకుండా జరిగింది. అవి నేను వి.ఎ.కె. రంగారావుగారి పుస్తకం “ఆలాపన” ప్రచురించిన కొత్త రోజులు. ఒక రోజు నవోదయా రామ్మోహన్రావు గారింట్లో నేను వారితో మాట్లాడుతూ వుండగా ,రామ్మోహన్రావు గారికి శ్రీరమణ గారు ఫోన్ చేశారు. (అప్పట్లో వారిద్దరి మధ్యా హాట్ లైన్ నడుస్తూ వుండేది). నేనక్కడ వున్నానని రామ్మోహన్రావు గారు చెప్పారు. అప్పుడు శ్రీరమణ గారు నాతో మాట్లాడతానంటే  ఫోన్ నాకు ఇచ్చారు రామ్మోహన్రావు గారు. శ్రీ రమణ గారు”ఆలాపన” పుస్తకం బాగుందనీ, నా ఇంటర్వ్యూ బాగుందనీ అన్నారు. ఇంకా యేవో కబుర్లు చెప్పారు.

ఆ తర్వాత తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ ఫోన్ చేసేవారు. చాలా కబుర్లు చెప్పేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా నలభై అయిదు నిముషాలకి తక్కువ మాట్లాడే వారుకాదు. ఫోన్ ఆయన పెట్టేయాలిసిందే మనకా ఛాన్స్ ఇవ్వరు. బాపూ, రమణ, బాలూ దగ్గరనుండీ  మొదలు పెట్టి యెంతో మంది గురించి, ఎన్నో విశేషాలు చెప్పే వారు. నాకు కూడా ఆయనతో మాట్లాడ్డమే ఒక ఎడ్యుకేషన్లా వుండేది. అందుకే సైలెంట్ గా వినేదాన్ని. ఆయన్ని అంచనా వెయ్యడం కష్టం. ఆయన అభిప్రాయాలు తరచూ మారిపోతూ వుండేవి. ఒకసారి ఒక మనిషి గురించి మంచిగా చెప్పే వారు. రెండో సారి మనం ఆయన భలే మంచి వాడండీ అన్నామా “ఏం మంచితనం పోనిస్తురూ. ఆయన ఫలానా ఫలానా వెధవ పనులు చేశాడు ఇంకేం మంచితనం” అని చప్పరించేవారు. అందుకే నేను ఆయనతో చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడే దాన్ని.

మూత పడిన ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఎడిటర్ గా  మళ్లీ మొదలు పెట్టినప్పుడు భరాగో గారు రాసిన ఆలాపన పుస్తకం  రివ్యూ  మొదటి సంచికలోనే వేసుకున్నారు. అదే పుస్తకానికి వచ్చిన మొదటి రివ్యూ కూడా. నన్ను పత్రికకి యేమైనా రాయమనే వారు. నేను నాకేం రాదండీ అని తప్పించుకునేదాన్ని.

ప్రఖ్యాత రచయిత నక్కా విజయరామరాజు మొదటి కథ “పరమాన్నం,” మొదటి సీరియల్ “భట్టిప్రోలు కథలు”  వేసేముందు నేను ఫోన్ చేసి చెబితే “అయ్యో భలే వారండీ, తప్పకుండా వేద్దాం డాక్టర్ గారు. బాగా రాస్తున్నారు” అన్నారు. అలాగే డా.”గురవారెడ్డి “గురవాయణం” కూడా. “డాక్టర్ గారు బాగా మాట్లాడుతారండీ. నేను విన్నాను. రాయడం కూడా బాగుంటుంది లెండి”అని పత్రికలో వేయడం అది బాగా పాప్యులర్ అవడం జరిగింది. విజయరామరాజు గారూ గురవారెడ్డిగారూ స్వయానా శ్రీరమణ గారితో మాట్లాడుకోవచ్చు కానీ యెందుకో నాకా అవకాశం ఇచ్చారు.

రెండు సార్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కూడా ఆయనతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. మొదటి సారి పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారూ, ముంజులూరి కృష్ణకుమారి గారూ నడిపిన హాస్య ప్రసంగాల సభలో. రెండో సారి నక్కా విజయరామరాజు రాసిన “నాగమ్మ” నవల విడుదల సందర్భంగా. ఒక సారి బుక్ ఫెస్టివల్ కి వచ్చినప్పుడే పామర్రు మాఇంటికి భోజనానికి వచ్చారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో కలిసి. అప్పుడు మా అమ్మ కందాబచ్చలి కలగలుపు కూర చేస్తే శ్రీకాంత శర్మగారు” కందా బచ్చలీ, పనసపొట్టు కూరా ప్రశస్తమైన వంటకాలు–పనసకాయ  దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు”అని చమత్కరించారు. వారిద్దరినీ చూసిన సంతోషంలో ఆరోజు నేను అన్నమే తినలేదు.

2014లో నా పుస్తకం “గీతాంజలి”ఆవిష్కరణ సందర్భంగా సన్ షైన్ హాస్పిటల్లో జరిగిన సభకు వచ్చి నన్నాశీర్వదించడమే కాక టాగూర్ గీతాంజలి గురించి విశ్వనాథయితే యేం మాట్లాడేవారు, శ్రీశ్రీ యేం మాట్లాడేవారు, వి.ఎ.కె. రంగారావయితే యేం మాట్లాడేవారు అంటూ పేరడీలు రాసుకువచ్చి చదివి ప్రేక్షకులందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు.

వారి పెద్దకొడుకు వివాహ సందర్భంగా కార్డు పంపడమే కాకుండా స్వయంగా ఫోన్ చేసి “ఏమండీ చాలా తక్కువ మందినీ, ఆత్మీయులు అనుకున్న వారినే పిలుస్తున్నాను. మీరొస్తే సంతోషిస్తాను” అన్నారు. అంతకంటే భాగ్యమా అనుకుని పనిగట్టుకుని పెళ్లికనే హైద్రాబాద్ వెళ్లాను. నిజంగానే పెళ్లికి వచ్చిన వారు రెండువందలమంది కంటే యెక్కువ లేరు. నన్ను సోమరాజు సుశీల గారికీ, జయప్రభ గారికీ, పొత్తూరి విజయలక్ష్మి గారికీ, కె.రామచంద్రమూర్తి గారికీ పరిచయం చేశారు. ఆ దిగ్గజాల ముందు నేను సిగ్గుతో కుచించుకు పోయాను. రెండో అబ్బాయి పెళ్లికి కూడా పిలిచారు కానీ ఇంకేదో ముఖ్యమైన పెళ్లి అడ్డం వచ్చి పోలేక పోయాను.

ఈ మధ్య  కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగుండటం లేదనీ ,ఫోన్లో కూడా మాట్లాడటం లేదనీ కబుర్లు తెలుస్తున్నాయి.ఇంతలోనే ఇలా….

తెలుగు సాహితీ ప్రపంచంలో ఆయనస్థానం ప్రత్యేకమైనది. ఆయన లాగా కథ చెప్పేవారు మరొకరు దొరకడం కష్టం

శ్రీ రమణ గారికి నా నివాళి.

-భార్గవి

Bhargavi
Bhargavi
భార్గవి గారు వృత్తి రీత్యా వైద్యులు. ప్రవృత్తి రీత్త్యా సంగీత సాహిత్యాభిమాని. వ్యక్తుల పైనా, స్నేహం పైనా, సందర్శించిన ప్రాంతాల గురించి అనేక వ్యాసాలూ వ్రాసారు. ఆలాపన, గీతాంజలి, ఒక భార్గవి, డాక్టర్ కథ, రెండు ప్రయాణాలు తదితర ఉత్తమ స్థాయి పుస్తకాలను ప్రచురించారు. నివాసం పామర్రు- కృష్ణా జిల్లా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles