Monday, May 6, 2024

రాజమహేంద్రవరంనకు ఎంపి అభ్యర్థులు కావలెను!

వోలేటి దివాకర్‌

కపిలేశ్వరపురం జమిందారు పస్‌బిపిబికె సత్యనారాయణరావు, సినీనటులు జమున, మురళీమోహన్‌, రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్‌కుమార్‌, దాట్ల సత్యనారాయణరాజు  లాంటి వారు ప్రాతినిధ్యం వహించిన రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదా? అంటే  ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. సాంస్కృతిక రాజధాని, ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నుంచి ఎంపిగా పోటీ చేసేందుకు ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అధికార వైసిపికి చెందిన సిట్టింగ్‌ ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ రాజమహేంద్రవరం అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధం కావడంతో ఆ పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సినీదర్శకుడు వివి వినాయక్‌ పేరు వినిపించినా.. ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టిడిపి కార్పొరేటర్‌గా సేవలందించిన  వైద్యురాలు అనసూరి పద్మలత పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా ఆమె అభ్యర్థిత్వంపై వైసిపి అధిష్ఠానం ఎంత వరకు మొగ్గు చూపిస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటికే రాజమహేంద్రవరం, సిటీ నియోజకవర్గాలను అదే సామాజికవర్గాలకు కేటాయించడంతో ఎంపి అభ్యర్థిని కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపితే సామాజిక సమీకరణల్లో తేడాలు వస్తాయని తద్వారా పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, యువ టిడిపి నాయకుడు శిష్ట్లా లోహిత్‌ రాజమహేంద్రం ఎంపి అభ్యర్థిగా మహానాడుకు ముందు విస్తృతంగా ప్రచారం పొందారు. మహానాడు నిర్వహణలో కూడా ఆయన ఆర్థికంగా పాలుపంచుకున్నట్లు చెబుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, నగర టిడిపి ఇన్‌చార్జి ఆదిరెడ్డి వాసుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మహానాడు తరువాత లోహిత్‌ రాజమహేంద్రవరంలో ముఖమే చూపించడం లేదు. దీన్ని బట్టి ఆయన రాజమహేంద్రవరం అభ్యర్థిత్వం పట్ల పెద్ద ఆసక్తిగా లేరన్న విషయం స్పష్టమవుతోంది. ఆదిరెడ్డి వాసు, రూరల్‌ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్లమెంటుకు పోటీ చేసేందుకు బహిరంగంగానే నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. 2014 పన్నికల్లో వైసిపి నుంచి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రస్తుతం రాజానగరం టిడిపి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఎంపిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన తరుపున టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేరు కూడా గతంలో ప్రచారంలోకి వచ్చినా ఆయనను పిఠాపురం పంపారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ టిడిపి ఒత్తిడి తెచ్చినా రూరల్ నుంచే పోటీ చేస్తానని పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంతీయ పార్టీల నుంచి బలమైన పార్లమెంటు అభ్యర్థులు కనిపించడం లేదన్నది స్పష్టమవుతోంది.

రానున్న పన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడూ పెద్దగా ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.  కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో పార్లమెంటుకు వెళ్లినా ఊడబొడిచేది ఏమీ ఉండదన్నది నాయకుల అభిప్రాయం. దీంతో 2024 పన్నికల్లో అధికార వైఎస్సార్‌సిపి, టిడిపి, జనసేన కూటమికి చెందిన నాయకులు అసెంబ్లీకి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈఎన్నికల్లో తమ పార్టీలు గెలిస్తే కనీసం మంత్రి పదవినైనా దక్కించుకోవచ్చన్నది వారి ఆశ.

మరోవైపు మొన్నటి విలేఖర్ల సమావేశంలో బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఎంపిగానా…ఎమ్మెల్యేగానా అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వకపోయినా ఎంపిగానే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆమె విశాఖపట్నం నుంచి పోటీ చేశారు.  రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు విశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో ఈసారి ఆయనే అక్కడి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ పార్లమెంటుకు పోటీ చేస్తానని బహిరంగంగా ఆసక్తిని కనపరచలేదు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles