Tuesday, November 5, 2024

‘మహాకవి’ గురజాడ

  • గిరీశం, మధురవాణి చిరంజీవులు
  • నేటి మన భాష గురజాడ, గిడుగుల చలవే

రససిద్ధులైన కవీశ్వరులు జననమరణాలకు అతీతులని పూర్వపు పెద్దలు చెప్పారు. ఇంగ్లిష్ లెక్కల ప్రకారం నేడు గురజాడ వర్ధంతి. వర్ధంతి… అంటే వర్ధిల్లడం. ప్రజల హృదయాలలో కాలానికి అతీతంగా వర్ధిల్లే మహాకవుల వరుసలో తప్పక కూర్చో గలిగిన సత్తా ఉన్నవాడు మన గురజాడ. దేశమంటే మట్టి కాదోయ్! మనుషులోయ్! అన్నాడు గురజాడ. ఈ నాలుగు పదాలు చాలు గురజాడను మహాకవి అనడానికి. ‘కన్యాశుల్కం’  సంప్రదాయం ఇప్పుడు లేకపోయినా, అది వెళ్లిపోయి చాలా ఏళ్ళైనా, గురజాడ రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం సజీవంగా ఇప్పటికీ తళుకులీనుతోంది. ఉత్తరాంధ్ర, విజయనగరం మాండలీకంలో ఈ రచన సాగినా, అన్ని మాండలీకాలవారు అర్ధం చేసుకున్నారు. అర్ధం చేసుకోవడమే కాదు, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు, అక్కున చేర్చుకోవడమే కాదు,సాంఘిక నాటకాలలో అగ్రస్థానం ఇచ్చారు. 1955లో సినిమాగానూ వచ్చింది. వందలసార్లు వేదికలపై ప్రదర్శనలు జరుపుకుంది. సమాజంలో ఇప్పటికీ గిరీశం వంటివారు అడుగడుగునా తగులుతూనే వుంటారు. లుబ్దావధానుల వంటి లుబ్ధులు మాటిమాటికీ ఎదురుపడుతూ ఉంటారు. అంతటి మధురవాణిలు దొరకక పోయినా.. ఆ వాణి, ఆ వాణిజ్యం తెలిసిన మధురవాణిలు తారసపడుతుంటారు. ఇంతటి నాటకీయ సృష్టి గురజాడకే చెల్లు. భారతీయ సాహిత్యంలో ‘మృచ్ఛకటికం’ తర్వాత అంతటి గొప్ప నాటకం కన్యాశుల్కం, అంటూ మరో  ‘మహాకవి’ శ్రీశ్రీ కితాబు ఇచ్చాడు. శ్రీశ్రీ దృష్టిలో ఆధునిక యుగంలో గురజాడ ఒక్కడే మహాకవి.

ధ్వని ఉన్నవాడే మహాకవి

బహుశా! గురజాడ సాహిత్యంలో శ్రీశ్రీ ధ్వనిదర్శనం చేసుకొని ఉంటాడు. ఎవని పలుకులో, కవిత్వంలో ధ్వని ఉందో వాడే మహాకవి అన్నాడు శ్రీ శ్రీ. ధ్వని సిద్ధాంతాన్ని పుష్కలంగా పండించినవాడు తిక్కన మహాకవి అని శ్రీశ్రీ సిద్ధాంతీకరించాడు. అందుకే గురజాడను కూడా ఆధునిక యుగంలో మహాకవిగా శ్రీశ్రీ సంభావించాడు. 1915 లో గురజాడ చనిపోయాడు. గురజాడ చనిపోలేదు, అప్పటి నుంచే జీవించడం ప్రారంభించాడని మరో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నాడు. ప్రజల భాషలో రాయాలి, కవిత్వం చెప్పాలి, సాహిత్య సృష్టి జరగాలని బలంగా నమ్మి, అంతకంటే బలంగా ఆచరణలో పెట్టినవాడు గురజాడ. గురజాడకు        తోడునీడగా గిడుగు కూడా నిల్చున్నాడు. వీరిద్దరూ ఒకప్పుడు సహాధ్యాయులు, సమభావాలు ఉన్నవారు. వీరిద్దరూ కలిసి ఆధునిక భాషను అద్భుతంగా నడిపించారు. ఇప్పుడు మనం చదివే, రాసే భాషంతా వీరి చలువే. మాటను తూటాగా పేల్చి చెప్పడం బాగా తెలిసిన ఆధునిక కవులకు అడుగుజాడ గురజాడ. ఆయనేమీ 150 ఏళ్ళు జీవించలేదు. 53 ఏళ్లకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూడా చాలాకాలమైంది. అయినప్పటికీ, ఆయనను మరువలేక పోతున్నాం. గురజాడ ఎవరికీ చుట్టం కాదు. అతను చేసిన భాషాసేవ మనల్నందరినీ అతని చుట్టూ తిప్పుకుంటోంది. ‘ఎవడు బతికాడు నూట యాభై ఏళ్ళు’ అని ఉత్తరాంధ్రలో ఒక సామెత వుంది. కానీ,గురజాడ బతికాడు, శ్రీశ్రీ బతుకుతాడు. ఉత్తరాంధ్రలోనే కాదు,మన మాటల్లో,రాతల్లో యావత్తు తెలుగు సాహిత్యలోకంలో,భాషా సామాజిక సీమల్లో అక్షరాలా జీవించి వున్నారు, వుంటారు.

గుండె నిండా కన్నీళ్ళు నింపిన కవిత్వం

తిండి కలిగితే కండ కలదోయ్: కండకలవాడే మనిషోయ్ అనే మాటలు… మనం నిత్యం చదివే వార్తాపత్రికల్లో వస్తూనే ఉంటాయి. ఇట్లాంటి పదబంధాలు మనల్ని ఎన్నటికీ వీడవు. వీటిని వీడి పత్రికలు ముందుకు సాగలేవు. అంతలా అక్షరాల్లో చొచ్చుకుపోయినవారు ఒకరు శ్రీశ్రీ, ఇంకొకరు గురజాడ. అప్పటి సామాజిక దురాచారాలను కథావస్తువులుగా తీసుకొని, జనంభాషలో రాసి జేజేలు కొట్టించుకున్న జగజ్జట్టి గురజాడ. తను రాసిన ‘పుత్తడి బొమ్మా పూర్ణమ్మా’ గేయంలో పండించిన కవిత్వం గుండెనిండా కన్నీళ్లు నింపుతాయి. ‘‘కన్నుల కాంతులు కలువల చేరెను… మేలిమి చేరెను మేని పసల్… హంసలు చేరెను నడకల బెడుగులు.. దుర్గను చేరెను పూర్ణమ్మా…’’ అన్నాడు. ఈ పంక్తులు చాలు ఇతనిలోని కవిత్వాన్ని కొలవడానికి. కవిత్వమొక ఆల్కెమీ అయితే, ఆ రహస్యం గురజాడకు కూడా తెలుసు. తెలియకపోతే, ఇనుము వంటి పదాలను  బంగారంగా మార్చే  కవితాశక్తి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పదాలను పట్టుకొని రాయివంటి కసాయిలతోనూ కన్నీళ్లు ఎలా పెట్టిస్తాడు? నవ్వుల పువ్వులు ఎలా పూయిస్తాడు? ఆలోచనామృతాలు ఎలా కురిపిస్తాడు?

కృష్ణాతీరం గురజాడే

కృష్ణాతీరంలోని గురజాడ  నుంచి ఉత్తరాంధ్రలోని విజయనగరంకు వలస వెళ్లిన ఈ కుటుంబం ‘గురజాడ’ అనే గొప్ప కానుకను తెలుగుభాషకు ఇచ్చింది. అద్భుతమైన నాటకీయత, పరమ రమణీయమైన పదసంపద, కల్పనాశక్తి,వర్ణనా నిపుణత కలిగిన కవివిలుకాడు గురజాడ. కండపుష్టి కలిగిన కవిత్వం రాశాడు.  షేక్స్పియ్సర్, మిల్టన్ కు ఏమాత్రం తీసిపోని ఆధునిక  కవిరాయడు మన అప్పరాయడు (అప్పారావు). రాజు, రాయ శబ్దాల నుంచే రావు అనే శబ్దం కూడా వచ్చింది. ‘రావు’ మన పదం కాదు, మరాఠీ నుంచి మనం తెచ్చుకున్నది. అలా,అప్పరాయడు అప్పారావు అయ్యాడు. ప్రారంభంలో, గురజాడ ఇంగ్లీష్ లో కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. సొంత భాషలో రాస్తే, ఇంకా పదునుగా, పసందుగా ఉంటుందని శంభుచంద్ర ముఖర్జీ వంటి కొందరు పెద్దలు గురజాడకు సూచించారు. అప్పటి నుంచి అప్పారావు కమ్మని అమ్మభాషలో, వాడుకభాషలో రాయడం మొదలు పెట్టి మనకు వేడుక చేశాడు. గురజాడ ఎప్పటికీ తెలుగువాడి గుండెల్లో గుడికట్టుకొనే ఉంటాడు. గురజాడ మన ‘గురుజాడ.’

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles