Saturday, April 27, 2024

‘సీన్’ ఇండియా మ్యాప్ క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

జాన్ సన్ చోరగుడి

చూస్తుంటే, జరక్కుండా ఉంటే బాగుణ్ణు, అనుకున్నదే జరుగుతున్నట్టుగా ఉంది. అక్టోబర్ మొదటి వారంలోనే  ఇక్కడ- ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యత గురించి రాశాను. మన రాష్ట్రం వైపు ఢిల్లీ ‘అటెన్షన్’ పెరగడానికి సమయం ఆసన్నమయింది అని రాసాను. కొంతకాలంగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలను కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్ట్యా చూడ్డం, నాకు కనిపిస్తున్న దానిపై వ్యాఖ్యానించడం చేస్తున్నాను. అయితే, చూడ్డం వేరు, కనిపించడం వేరు. రెండు ఒకటి కాదు. అందరికీ అన్నీ ఒకేలా కనిపించాలి అని ఏమీ ఉండదు. ఇలా చూస్తూ రాస్తున్నది, కేవలం పౌరస్పృహ పరిశీలనతో తప్ప, ఈ విషయాల్లో నాకు నిపుణత ఉండి కాదు. ఇప్పుడీ-‘కన్ఫెషన్’ ఎందుకంటే, ఒకటిన్నర దశాబ్దకాలంగా-తూర్పుతీరం కేంద్రంగా   జరుగుతున్న పరిణామాలపై, అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత (Commentator)గా-‘కావొచ్చు..’‘కావొచ్చు…’ అంటూ భవిష్యద్దర్శనంతో రాస్తున్నది, ఇప్పుడు నిజమై, సమస్య మన సమీపానికి వచ్చి మరీ తలుపు తడుతున్నప్పుడు, ముందుగా ఈ మాట చెప్పడం అవసరం అనిపించింది. 

అరవై ఏళ్ళ కిందట 1962లో చైనా యుద్ధం తర్వాత సరిహద్దులో సైనికులతో మాట్లాడుతున్న నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రక్షణ మంత్రి వైబీ చవాన్

మిస్ మ్యాచ్

ఇన్నాళ్లుగా ‘కావొచ్చు’ అనుకుంటున్న ఆగ్నేయ-ఆసియా రాజకీయ పరిణామాల తాకిడి నేరుగా దక్షిణాది రాష్ట్రాలను తాకిన తర్వాత, మదింపు అవసరమైన ఘట్టంలోకి మనం వచ్చినట్టుగా ఉంది. దక్షణాన- తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ పరిస్థితి వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ బాలారిష్టాల దశ దాటలేదు. ఇది ఏర్పడి ఏడేళ్లు అయినా, రాష్ట్ర సరిహద్దుల భౌగోళిక స్పృహతో- ‘ప్రాంతము-ప్రజలు’ అనే దృష్టి నుంచి పరిపాలన మొదలయింది నిజానికిమూడేళ్ళ క్రితమే. ఇంతలోనే మన సమీపాన ఉపద్రవం అనేసరికి, అందుకే ‘మదింపు’ అవసరం అంటున్నది. ఎవరికి అనే ప్రశ్నకు-అందరికి అనేదే క్లుప్తమైన జవాబు. అవును రాజ్యం ‘చట్రం’ బయట పనిచేస్తున్న- రాజకీయ పక్షాలు, మీడియా, పౌరసమాజం చేతిలోఉన్న-‘సోషల్ మీడియా’ అందరం, ఇప్పుడు మనంఎదుర్కొంటున్న పరిస్థితికి తగని – ‘మిస్ మ్యాచ్’ అని అంగీకరించక తప్పదు. మారుతున్న పరిణామాలతో పాటుగా మనలో మార్పు లేనప్పుడు, ఇక్కడ ఇది తప్ప వాడడానికి మరో పదం లేదు మరి.

Also read: ఏ. పి.లో మొదలైన ‘గ్రీన్ పాలిటిక్స్’

మీ నష్టం కంటే…

గుజరాత్ తర్వాత రెండవ పొడవైన సముద్ర తీరం ఉన్నది మనకే కావడంతో, మన అంతర్జాతీయ వ్యవహారాల్లో- ‘ఇండో-ఫసిఫిక్’ సముద్ర తీరం కీలకమైన నేపథ్యంలో, ఢిల్లీ ప్రాధాన్యతలలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం కావలసి ఉంది. అంతే కాదు, విభజన తర్వాత కూడా ఇక్కడి రాజకీయ పక్షాలు, మారిన ‘స్టేట్ మ్యాప్’ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు మనం వున్నది ఎక్కడ, ఆ పరిసరాల్లో జరుగుతున్నది ఏమిటి? అనే విషయంలో పౌర సమాజంలో- ‘సెన్సిటివిటీ’ పెంచలేని నిస్సహాయ  స్థితిలో మన ప్రసార మాధ్యమాలు మిగిలాయి.

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర ఏ. పి. నుంచి తెలంగాణలోకి ప్రవేస్తున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రాష్ట్ర విభజన గురించి ఒక టి.వి. జర్నలిస్టుతో సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ మాట్లాడుతూ- ‘వేర్వేరు సమయాల్లో రెండు ప్రాంతాలనుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా చివరికి విభజన జరిగింది, అయితే అందుకు రాజకీయంగా మేము మూల్యం చెల్లించాము’ అన్నారు.

మన దేశానికి ఆగ్నేయ తీరాన 2022 అక్టోబర్ నాటికి చోటుచేసుకున్న పరిస్థితుల్లో, విభజన జరగకుండా రాష్ట్రం కలిసి ఉంటే, తీరాంధ్రలో-సూక్ష్మ స్థాయిలో పరిపాలనా యంత్రాంగం ఇప్పుడున్నంత పటిష్టంగా ఉండే అవకాశం ఉండేది కాదు. ఇటీవలి అనూహ్యంగా వచ్చిన గోదావరి వరదల సమయంలోనూ అది రుజువయింది. కనుక, విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి కలిగిన నష్టం కంటే, దేశానికి ప్రజలకు కలిగిన మేలు గొప్పది, ముఖ్యమైంది, అవసరమైంది కూడా.

పడకకుర్చీ రాజకీయం

ఈ దృష్టి మరింతగా లోతుగా విస్తరించాలి. అంతర్జాతీయ సముద్ర జలాలకు అభిముఖంగా 970 కి.మీ. మేర మన రాష్ట్ర సరిహద్దు విస్తరించి ఉన్నప్పుడు, ఇక్కడి- ‘స్టేట్ క్రాఫ్ట్’లోనూ, దాన్ని ప్రభావితం చేసే ప్రసార మాధ్యమాల్లోనూమొదటి నుంచి మనం అలవాటు పడిన ‘పడకకుర్చీ (కబుర్ల) రాజకీయాల’ ధోరణి ఇప్పుడిక అస్సలు కుదరదు. కేవలం దేశసరిహద్దున ఉన్నకారణంగానూ, మన దేశం ప్రమేయం లేని పరిణామాల వల్ల కూడా ఇప్పుడు మనం సంక్లిష్టతలను ఎదుర్కోవలసి రావొచ్చు. కొత్తగా ఎందుకీ అప్రమత్తత అనే సందేహానికి కొంత నేపధ్యం చెప్పడం అవసరం.

Also read: ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యతతోనైనా ఏపీ పట్ల ఢిల్లీ వైఖరి మారేనా?

భరోసా కోసం…

కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని బోర్డర్ మేనేజ్మెంట్ విభాగం 2020మార్చి 11 న ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాలకు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.మన దేశ సరిహద్దుల్ని మన పక్కనున్న దేశాలతో పంచుకుంటున్న- అరుణాచల ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచలప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చమ బెంగాల్, కేంద్రపాలిత ఏప్రెల్ 2020 నుంచి అమలులోకి వచ్చేట్టుగా ‘బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం’ పేరుతో వెలువడిన ఆ 13 పేజీల ఉత్తర్వుల్లో కేంద్రప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఇలా ఉంది– “ఈ దేశం మా మంచిచెడులు  పట్టించుకుంటున్నది అనే నమ్మకం మనం ముందుగా అక్కడ జీవించే ప్రజల్లో కలిగించాలి. అటువంటి వొక భరోసాతో వాళ్ళు దేశ సరిహద్దుల్లో నివాసం ఉంటున్నప్పుడు; భద్రత, రక్షణ కలిగిన సరిహద్దులు దేశానికీ ఉంటాయి. అందుకొరకు అంతర్జాతీయ సరిహద్దుల్లో మారుమూల, దుర్భేద్యమైన  ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి, ఆ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలి”

అందులో 9వ పేజీలో ఉన్న ఎనెగ్జర్ 1 లో వరసగా అభివృద్ధి చేయవలసిన రంగాల జాబితా ఉంది. ఇదీ దాని వరస – 1. రోడ్లు బ్రిడ్జిల నిర్మాణం, 2. ఆరోగ్య రంగంలో మౌలికవసతుల కల్పనకు ఆసుపత్రుల స్థాయి పెంచడం, ఆధునీకరణ, డాక్టర్లు సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం, మొబైల్ ఆస్పత్రులు, అంబులెన్స్ అందుబాటు, వైద్య పరికరాల కొనుగోలు. 3. విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు స్కూలు భవనాల నిర్మాణం, మరమ్మత్తులు, అదనపు క్లాసు గదులు, కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్. టీచర్లు సిబ్బంది క్వార్టర్లు, హాస్టళ్ళు, డార్మేట్రీల నిర్మాణం, 4. వ్యవసాయ రంగ మౌలికవసతుల కల్పనకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, జల సంరక్షణ. 5. సామాజిక రంగ మౌలిక వసతుల కల్పన కొరకు అంగన్వాడీ భవన నిర్మాణంఇదీ వరస…

Also read: యూనివర్సిటీ పేరులో- ‘నేముంది’?

సంసిద్ధతఏది?

ఈ పనుల జాబితా చదివినప్పుడు, ఏ. పి. ప్రజలకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తున్న పనులు గుర్తుకు వస్తే, రావొచ్చు. ఇక్కడ విషయం అది కాదు. హోంశాఖ ఆదేశాల్లోని రాష్ట్రాల జాబితాలో ఏ. పి. లేనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు వల్ల జాబితాలోనివి అన్నీ ఇక్కడ అమలు అవుతున్నప్పుడు; విభజన జరిగిన 2014 నుంచి కేంద్రంలో ‘పెండింగ్’ ఉన్న అంశాల పరిష్కారం సంగతి ఏమిటి? అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం అవసరం.

అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా 2015-16 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు- ‘డెడికేటెడ్  ఫ్రైయిట్ కారిడార్లు’ నిర్మాణం చేపడుతుందని, వేగవంతమైన గూడ్స్ రైళ్ల వ్యవస్థ ఏర్పడితే, రవాణా పెరిగి ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి అన్నారు. వాటిలో ఒకటి- ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఉంటుంది అన్నారు. అయితే, మిగతా రెండు రూట్లలో పని జరుగుతున్నది కానీ,ఖరగ్ పూర్-విజయవాడమధ్య రైళ్ల రాకపోకల రద్దీ ఎక్కువని కొత్త రాష్ట్రానికి మేలు జరిగే రూట్లో మాత్రం పని వెంటనేమొదలు కాలేదు.

కేంద్ర-రాష్ట్రాలు మధ్య సంబంధాలు అన్నప్పుడు, రెండు చోట్ల ఒకే పార్టీ ఉంటే అదొక తీరు, కాకుంటే మరొక తీరు ఉండడం తెలిసిందే. అయితే, ఈ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ విషయం కాదు. మనకు సంబంధం లేని పొరుగు దేశాలు కారణంగా,మనకు సంబంధం లేని పొరుగు రాష్ట్రాల ద్వారా కేవలం అంతర్జాతీయ సముద్ర జలాలకు అభిముఖంగా 970 కి.మీ. మేర రాష్ట్ర సరిహద్దు విస్తరించి వున్నఒకే ఒక్క కారణంగా మన ప్రశాంతత దెబ్బ తింటే, అప్పుడుమనకు ఎటువంటి సంసిద్ధత అవసరం?

శ్రీలంకలో చైనా రీసెర్చ్ నౌక

ఇప్పుడు ఏమైంది?

అనుకున్నంత అయింది. ఆగస్టు 15 నాటికి శ్రీలంక హంబన్ తోట పోర్టులో లంగరు వేయాలని బయలుదేరిన చైనాకు చెందిన  కమ్యూనికేషన్-నిఘా చర్యల రీసెర్చినౌక- ‘యువాన్ వాంగ్-5’ భారత్ అభ్యంతరంతో కొన్నాళ్లు ఆగి 16 తర్వాత శ్రీలంక రావడం ఒక వారం తర్వాత అది తిరిగి వెళ్లడం జరిగింది.

ఇది జరిగిన రెండు నెలలకు అక్టోబర్ 16న ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక- ‘Tamil Nadu worried over increased presence of Chinese Army in Sri Lanka’ శీర్షికతో ఒక వార్త రాసింది. ఉత్తర శ్రీలంకలో- ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ దళాల కదలికలు, అక్కడ వారు వాడుతున్న శక్తివంతమైన శాటిలైట్స్, డ్రోన్స్ వంటి ‘హై-టెక్’ కమ్యూనికేషన్ సిస్టమ్స్ దృష్ట్యా మన దేశ భద్రత విషయంలో అప్రమత్తత అవసరమని తమిళనాడు రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఏజెన్సీ కొద్ది రోజుల క్రితం  తీర ప్రాంత జిల్లాలు/పట్టణాలకు సమాచారం పంపింది.

Also read: దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?

ఆ ఉత్తర్వుల్లో సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (CIA) చేసిన హెచ్చరికలను అది ఉటంకించింది. అందులో- శ్రీలంక హంబన్ తోట పోర్టు నుంచి చైనా నౌకలు శాటిలైట్ల మోనిటరింగ్ ద్వారా రాకెట్లు, ఇంటర్ కాన్టినెంటల్ మిస్సైల్స్ ఉపయోగించే అవకాశం ఉందని, కనుక తమిళనాడు సముద్ర తీరంలో ఉన్న మన న్యూక్లియర్ స్టేషన్లు, పోర్టుల భద్రత కోసం అవసరమైన నిఘా,  రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.  

అరవై ఏళ్ళు

అయితే, తమిళుల భయాందోళనలు మరోలాగా ఉన్నాయి. ఉత్తర శ్రీలంకలోని ఐదు దీవుల్లో సముద్ర గర్భ శిలాజాల అభివృద్ధి పేరుతో చైనా పౌరులు ఇప్పటికే ఇక్కడ స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. అటువంటప్పుడు ఈశాన్య శ్రీలంకలో స్థానికులు కొందరు రేపు చైనా ప్రభావం క్రిందికి కనుక చేరితే, అప్పుడు శ్రీలంక తమిళుల భద్రత విషయంలో ఇండియా మాట చెల్లుబడి కాదని ఆందోళన చెందుతున్నారు.  శ్రీలంకలోని ఒక రాజకీయ పార్టీ శ్రేణుల సహకారంతో చైనా పౌరులు రహస్యంగా సముద్ర మార్గంలో మన దేశంలోనికి ప్రవేశించిన సమాచారం మన ఇంటిలిజెన్స్ వర్గాల వద్ద ఉన్నదని, తమిళనాడు కోస్ట్ గార్డ్ అడిషనల్ డైరక్టర్ జనరల్ సందీప్ మిట్టల్ ఈ అనుమానాలను కొట్టివేయలేమని అన్నట్టు ‘హిందూ’ రాసింది. చైనా దౌత్య ప్రతినిధులు తరుచు శ్రీలంక వస్తున్నారని శ్రీలంకలో చైనీయుల సంఖ్య పెరగడం కూడా నిజమే అని ఆయన అన్నారు.

ఇండో-చైనా యుద్దానికి (1962) ఈ ఏడాది దీపావళి సీజన్ నాటికి అరవై ఏళ్ళు. యుద్ధం ఆరంభం అయిన అక్టోబర్ 20 తేదీని పురస్కరించుకుని చైనాలోకొన్ని జ్ఞాపకార్ధ కార్యక్రమాలు జరిగినట్టుగా బీజింగ్ నుంచి వస్తున్న వార్తలు ద్వారా తెలుస్తున్నది. మన దేశం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు 11 అక్టోబర్ 2019న ఎర్ర తివాచీ పరిచి మరీ తమిళనాడులోని మహాబలిపురం వద్ద ఆతిధ్యం ఇచ్చింది. ఈ మురిపెం ముగిసిన మూడేళ్ళ తర్వాత,ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలోని దేశాలు మధ్య మారిన సంబంధాలు వల్ల, ఇప్పుడు చైనా కదలికల’సీన్’ మన దేశం పటం క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

Also read: ‘అభివృద్ధి’ పట్ల తెలుగు సమాజం వైఖరి ఎటువంటిది?

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles