Sunday, April 28, 2024

డిండి నిర్వాసితులకు గౌరవ ప్రదమైన ఆర్ అండ్ ఆర్ కల్పించాలి

మానవ హక్కుల వేదిక డిమాండ్

నల్లగొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న శివన్నగూడె, కిష్టరాయనిపల్లి జలాశయాల కింద ముంపునకు గురి అవుతున్ననివాసాలలో ఉంటున్న ప్రజలను మానవ హక్కుల వేదిక సభ్యులు కలుసుకున్నారు. ఆ తర్వాత నిజనిర్థారణ సంఘం 20 సెప్టెంబర్ 2023న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పత్రికాప్రకటన పూర్తి పాఠం ఇది:

‘‘డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణమవుతున్న శివన్న గూడెం, కిష్టరాయనిపల్లి రిజర్వాయర్లలో ముంపునకు గురౌతున్న ప్రజలను మానవ హక్కుల వేదిక బృందం కలిసి నిజ నిర్ధారణ జరిపింది. మా విచారణలో మేము లక్ష్మణాపూర్, ఈదులగండి, చర్లగూడెం, నర్సిరెడ్డి గూడెం గ్రామాల ప్రజలతో కలిసి మాట్లాడాము. అన్ని గ్రామాల్లోని ప్రజలందరూ నిన్నటిదాకా ఎంతో కొంత వ్యవసాయ భూమిని కలిగి తరతరాలుగా వ్యవసాయమూ, పశుపోషణే జీవనాధారంగా చుట్టూ గుట్టలూ, కొండలతో నిండిన సహజ సౌందర్యం మధ్య ప్రకృతితో మమేకమై సంతోషంగా జీవించేవారు. పరిమితి లేని ఉమ్మడి సహజ వనరులు పేద, సామాన్యుల ప్రధాన ఆస్తి.

‘‘డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణమయ్యే ఐదు రిజర్వాయర్లలో నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం, కిష్టరాయని పల్లి రిజర్వాయర్లు అతి పెద్దవి. ఈ రెండు రిజర్వాయర్లూ మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు తాగునీటితో పాటు, ప్రధానంగా నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలోని మూడు లక్షల అరవై ఒక్క వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టు కోసం  ముంపుకు గురయ్యే ప్రజల భూములు గుంజుకోవటం, అక్కడక్కడా కొన్ని కట్టలు పోయటం మినహా పెద్దగా పనే  జరగలేదు. నీళ్ళు వస్తాయో, రావో నమ్మకం లేని ఈ ప్రాజెక్టు డ్యాములు ఇప్పుడు సర్వం కోల్పోయి, వీధిన పడ్డ వేలాది కుటుంబాల కన్నీళ్ళతో తడుస్తున్నాయి. పేద, సామాన్య ప్రజలంతా కట్టుబట్టలతో గమ్యం తెలియకుండా నిలబడి ఉన్నారు.

‘‘శివన్న గూడెం రిజర్వాయర్ కోసం 3567 ఎకరాలూ, కిష్టరాంపల్లి రిజర్వాయర్ కోసం 2047 ఎకరాలూ  మొత్తంగా డిండి ఎత్తిపోతల పథకం కోసం 16,345 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రజల వినియోగం నుండి సేకరించింది. శివన్న గూడెం రిజర్వాయర్లో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెలుగుపల్లి, వెలుగు పల్లి తండా అనే నాలుగు గ్రామాలు పూర్తిగా, రామిరెడ్డిపల్లి, శివన్న గూడెం, కుదాబక్షిపల్లి అనే మూడు గ్రామాలు పాక్షికంగా మునిగి పోతున్నాయి. కిష్టరాంపల్లి రిజర్వాయర్లో నాంపల్లి మండలానికి చెందిన లక్ష్మణపూర్ గ్రామం, చింతపల్లి మండలానికి చెందిన ఈదులగండి గ్రామాలు మునుగుతున్నాయి.

‘‘శివన్నగూడెంలో మునిగిపోయే చర్లగూడెం గ్రామంలో 250 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో నూటాయభై వరకు గౌడ కుటుంబాలూ, యాభైకి పైన యాదవ కుటుంబాలు కాగా వడ్డెర, మాల మరియు పది దాకా రెడ్ల కుటుంబాలున్నాయి. రెడ్లకు సరాసరిన 20 ఎకరాల భూమి ఉండగా మిగతా అన్ని కుటుంబాలకూ కనీసం రెండు, మూడు ఎకరాల భూమి ఉండేది. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం తమ వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని, అందులో పనులు చేస్తుండడంతో ఈ కుటుంబాలన్నీ భూములు చేజార్చుకుని రిక్త హస్తాలతో మిగిలాయి. వ్యవసాయ భూములకు ప్రభుత్వం ఎకరా ఐదు లక్షల పదిహేను వేల రూపాయలతో కట్టించిన పరిహారపు సొమ్ముతో పరిసర గ్రామాల్లో అందులో పది శాతం  భూమి కూడా కొనుక్కోలేకపోయారు. లక్ష్మణపూర్, చర్లగూడెం గ్రామాల్లోని వ్యవసాయ భూమిని పోగొట్టుకున్న 97% రైతులు తిరిగి తాము ఏ మాత్రం భూమిని కూడా కొనుక్కోలేకపోయామని చెప్పారు. ఈ ఈ విషయంలో అణగారిన కులాల ప్రజలు దారుణంగా దెబ్బతిన్నారు.

‘‘గౌడ కుటుంబాలకు కల్లుగీత వృత్తి కూడా జీవనాధారంగా ఉండేది. యాదవుల్లోని ప్రతీ కుటుంబం కనీసం 100 నుండి 200 గొర్రెలను పెంచుతూ, పెద్ద పెట్టుబడి లేకుండానే ఏటా రెండు నుండి నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని  సంపాదించుకునేది. ఇప్పుడు, తామే ఎక్కడుంటామో తెలియని ఆ కుటుంబాలన్నీ క్రమంగా పశువులను అమ్ముకుంటున్నాయి. రైతులూ, గొల్ల కురుమ కుటుంబాలన్నీ ప్రధాన ఆదాయం పోయిన కారణంగా పని వెతుక్కుంటూ, కొంత వయస్సులో ఉన్నవారైతే హైదరాబాద్ నగరానికి వలసపనులకు వెళ్తున్నారు. అంత శక్తి కూడా లేని వారు ఆటోలల్లో పరిసర గ్రామాలకు కూలీ పనులకు వెళ్తున్నారు.  తాము నివసిస్తున్న ఇళ్లు డ్యామ్ లో మునిగి పోబోతుండగా ప్రభుత్వం వారికి ఇంతవరకు ప్రత్యామ్నాయంగా ఇంటి జాగా చూపించలేదు. ఇళ్ళు కట్టి ఇవ్వలేదు. నిర్వాసితులకు సాధారణంగా ఇచ్చే అరకొర పునరావాస ప్యాకేజీల కోసం ప్రజలు నిరంతరం ధర్నాలు చేయవలసి వస్తున్నది. భూములు లేవు, పనులు లేవు, ఇళ్లు లేవు. రేపు ప్రభుత్వం ఇండ్లు ఇచ్చినా చేయటానికి స్వతంత్రమైన ఉత్పత్తి జీవనం ఉండదు. భవిష్యత్తులో రోజూవారి కూలీలుగా మారటం తప్ప మరో రకంగా బ్రతికే పరిస్థితే లేదు. డిండీ ప్రాజెక్టుకు సంభందించి అన్ని గ్రామాలదీ ఇదే పరిస్థితి. ఇక తరతరాల మానవ సంబంధాలూ, మనిషికి ప్రకృతితో గల అనుబంధాలన్నీ అర్థం లేనివి అయిపోయాయి. గౌరవ ప్రదమైన జీవన విధానం ఎటువంటి విలువ లేనిదయిపోయింది. ఆస్తికి మాత్రమే కొంత పరిహారం. మిగతా దేనికీ ఏ విలువా లేదు. అభివృద్ధి పేరు మీద నిర్మాణమౌతున్న ప్రాజెక్టులన్నిటికీ నాగరిక ప్రభుత్వాలు లక్షలాది మంది ప్రజలను అనాగరికంగా బలి ఇస్తున్నాయి.’’

 మా డిమాండ్లు:

1. నిర్వాసిత కుటుంబాలన్నిటికీ వారి నివాసాలకు దగ్గరగా కొత్త ఆయకట్టులో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వమే కొని, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.

2. ఇంకా నిర్వాసితులెవరికీ ఇంటి స్థలాల కేటాయింపే జరగలేదు. వెంటనే వారందరికీ వారికి అనువైన చోట ఇళ్లు నిర్మించి అందించాలి. ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలకు అనుబంధంగా ఉమ్మడి సహజ వనరులు కూడా విధిగా ఉండాలి. ఇది వారి హక్కుగా గుర్తించాలి.

3. చాలా మందికి ఇంకా ఆర్థిక ప్యాకేజీలు రాలేదు. తక్షణమే వాటిని అందించాలి.

4. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని నిర్వాసితుల విషయంలో ఖచ్చితంగా అమలు చేయాలి.

5. నిర్వాసిత గ్రామాల్లోని గొర్రెల పెంపకంపై ఆధారపడాలనుకునే గొల్ల కురుమలకు వారి వృత్తి పునరుద్ధరించే ఏర్పాట్లు చేయాలి.

6. మహిళలకు ఇంటిదగ్గర చేయగల ఉత్పత్తి పనుల విషయంలో నైపుణ్యాలను అందించి ప్రోత్సహించాలి. స్వయం సహాయక గ్రూపులను తక్షణమే పునరుద్ధరించాలి.

7. నిర్వాసిత కుటుంబాల్లోని చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయాలి.

8. రాష్ట్రవ్యాప్తంగా నిర్వాసితుల స్థితిగతుల అధ్యయనం కోసం వెంటనే ఒక కమీషన్ ను నియమించాలి.

‘‘మా నిజ నిర్ధారణ బృందంలో ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ జీవన్ కుమార్, వి వసంత లక్ష్మి, రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గురవయ్య,  వీరస్వామి మరియు హరేందర్, సులోచన, దశరథం, నగర కమిటీ సభ్యులు రోహిత్, మట్టి మనుషులు పాండురంగ రావు గారూ ఉన్నారు.’’

మానవ హక్కుల వేదిక, తెలంగాణ

1. ఎస్. జీవన్ కుమార్

2. వి. వసంత లక్ష్మి

3. డాక్టర్ ఎస్ తిరుపతయ్య

4. గురువయ్య

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles