Friday, April 26, 2024

కాళన్నతో కాకతీయం

వ్యంగ్యం

పేపర్లలో ఈ సారి కాలంలో ఏం రాయాల్నోఏమీ తోచడం లేదు. వారం కాంగనె ఏదో ఒకటి రాయాలె కదా.  వరంగల్లు హన్మకొండలో కాళన్నను కలిస్తే బాగుంటుందేమో. అనుకున్నడు సిరీశం. ఇంటి ముందు ఎండకు అరుగుమీద కూచుని పేపర్ తిప్పుతున్నడు కాళన్న.

కాళన్నా నమస్తే.

కాళన్న: ఒరివారి నువ్వార సిరీశం, రా రా, నాయిన బాగున్నాడ్ర. నాలుగైదు వారాలనుంచి జనధర్మ వీక్లీ కనబడుతులేదు. పేపర్ రావట్లేదా? లేకపోతే ఎం ఎస్ ఆచార్యకు జ్వరంగాని వచ్చిందా?

సిరీశం: అదేం లేదన్నా. పేపర్లకు అడ్వర్టయిజ్ మెంట్లు రావడం లేదు. వర్కర్లు సమ్మె జేస్తున్నరు. జీతం బెంచాలని. కనుక నాన్న రెండు వారాలనుంచి పేపర్ తియ్యడం లేదు.

కా: అరెరె ఎంత పనాయె. అది సరే నువ్వేందో పొద్దున్నే బయల్దేరినవ్ . ఏం సంగతి జెప్పు.

సి: మీరంతా ఉండే ఈ ఏరియాకు నక్కల గుట్ట అని పేరొట్లొచ్చిందో…

కా: అనుకుంటునే ఉన్న నువ్వేదో కొంటె ప్రశ్న వేస్తవని.

సి: కాదన్నా… ఇదివరకు నక్కలుండేవా అని అనుమానం.

కా: అది నాకు తెలవదురా. ఇప్పుడు మాత్రం ఇక్కడ వకీళ్లుంటున్నరు.

సి: అన్యాయం కాళన్నా. వకీళ్లను అట్లనడం …

కా: ఇక్కడ వకీళ్లు ఎక్కువమంది ఉన్నరన్నా. నిజమే గద. నిజం జెప్పడం అన్యాయమా. ఈ ముచ్చట బాగనే ఉన్నది.

సి: మీరు కూడా వకీలే కదన్నా.

కా: ఎప్పుడన్న జూసినావురా నల్లకోటు వేసిరాంగ. కవిత్వం జెప్పుకుంటున్నాగూడా వకీలనే అంటవా?

సి: సరే ఇగ పంచాయతెందుకుగ్గాని, మీ అన్న వకీలే గదనే…

కా: నేను కాదన్ననా. అయినా ఇదేం పంచాయతి రా. వస్తివి. నక్కల గురించి కథ మొదలు బెడితివి.

సి: కాళన్నా అంత బాగనే ఉన్నది గాని ఆదాని అనెటాయనకు రోజు వెయ్యి కోట్లు ఆమ్దనీ వస్తదట. ఇంత డబ్బెట్ల వస్తదంటవు.

కా: ఒరేయ్ సిరీశం నీకెక్కడ పొద్దు బోతలేదుర… వాడెవడికో కోట్లొస్తే నాకెట్ల దెలుస్తది. అయినా ఈ సంగతి నీకెట్ల దెలిసె.

సి: ఇవ్వాళ పేపర్లలో వచ్చింది.

కా: పోయి వాణ్ణడుగు. పేపర్ల వేసినోణ్టి. నన్నడుగుతవేంది. ఇన్నేళ్లయింది పత్రికలల్లో పనిచేసుకుంటు. ఇంక ఏ ప్రశ్న ఎవర్నడగాల్నొ దెలియకపాయె. ఎట్ల బతుకుతర్రా మీరంతా?

సి: అది సరె గానీ నీకు దెలిస్తే జర చెప్పరాదు. మనం ఇంత కష్టపడుతున్నం. నెలకో వెయ్యి వెనకెయ్యాల్నంటే కష్టం అయితున్నది గద. వాడెట్ల సంపాయిస్తడా అని.

కా: నువ్వేంకష్టపడుతున్నవురా. నీకు మంది సొమ్ము వసూలు చేయడం వచ్చా. మంది సొమ్ము మీద పెత్తనం జేసుడొచ్చా? ఏం తోచకపోతే నా తలకాయదినుడు తప్ప నీకు సంపాదించడం వస్తాదిరా?

సి: నిజమే కాళన్నా.

కా: కంపినీలు బెట్టడం వచ్చునా?

సి: రాదు. ఇప్పుడు కంపినీల కథ కాదన్నా, సూట్ కేసు కంపినీలంటున్నరు.

కా: సూట్ కేసు అంటే మనం కుట్టించుకునే సూట్లు ఒకటి,రెండు పెట్టుకునే పెట్టె. మనకు లాల్చీలు ధోతులేనాయో. మనకు లాల్చీకేసు ధోతికేసు ఉండాలె గానీ సూట్ కేసులు మనకెందుకురా?

సి: అయినా మన వరంగల్లులో హైదరాబాద్లో సూట్ లు ఎవరేసుకుంటరు, వాటికి సూట్ కేసులు ఎవరు కొనుక్కుంటరు?

కా: మరి సూట్ కేసుల కంపినీ అంటున్నవేందిరా.

సి: అదిగాదన్నా..  ఓ పెట్టె, దాన్నిండా కాయితాలు. అంతే గదే కంపినీ. అందులోనే షేర్లు ఉంటయి. అవి కొనుక్కుంటరు. అమ్ముకుంటరు. స్టాక్ ఎక్స్ చేంజిలో వాళ్లకు బ్రోకర్లుంటరు. ఆ కంపినీ ని ఇంకోడు కొంటడు. లేకపోతే ఆ కంపినీ లో షేర్లు ఇంకో కంపినీ కొనుక్కుంటుంది.

కా: అయితే

సి: ఈ కంపినీలనే సూట్ కేసు కంపినీలంటరట గద.

కా: వీళ్లు సూట్ కేసులు తయారు చేసి అమ్ముతార్రా?

సి:  లేదన్నా, వీళ్లేమీ తయారు జేయరు. ఫాక్టరీలుండవు. గోదాములుండవు. అసలు దుకాణమే ఉండదే.

కా:  ఏం జేయండానికి, వాటాలు కొనుడేంది, వాడెవడో అమ్ముడేందిరా?

సి:  మరదే సంగతి. అందుకే అనేది. ఒక్క సూట్ కేసే ఉంటుంది. దాన్నే కంపినీ అంటరు. కనుక అటువంటి వాటిని సూట్ కేసు కంపినీలంటరు.

కా.: మరినువ్వు రెండో మూడో బెట్టకపోయినవ్ రా వారి.  ఒక్క సూట్ కేసులో రెండో మూడో ఎన్ని బడితే అన్ని కంపినీల కాయిదాలు పెట్టుకోవచ్చు గదరా..

సి:  అవునన్నా.

కా: మరినువ్వే మన్నా పిచ్చోడివా… వారానికో కాలంరాస్తనని జెప్పి నన్ను పీక్కతినుడెందుకురా.

సి: రోజుకు వెయ్యి కోట్లురావడమేంది… మన జనం ఆకలి తీరకపోవుడేంది అని ఆలోచిస్తుంటే కడుపులో దిప్పినట్టయితున్నది.

కా:  ఈ కత బాగనే ఉన్నది. నీ కెందుకురా కడుపులో దిప్పుడు. మీ పేపరోళ్లకు జనం ఆకలి ఎప్పుడన్న బట్టినాది, వాడికి కోట్లొచ్చినయి, వీడికి సీట్లొచ్చినయి. దానికి అందాల రాణి కిరీటం బెట్టింరు. కిరీటం బెడుతుంటే అది ఏడ్చింది, మీకివే గదరా వార్తలంటే.  జనం ఘోష మీకు పట్టనే పట్టదు కదరా.  ఎప్పుడన్న ఆకలి గురించి రాసినార్ర. అసలు ఆకలంటే ఏందో తెలుసార మీకు.

సి: సర్కారోళ్లు కూడా ఆకలి గురించి జెప్తలేరు కదన్న. ఏడినుంచి రాసేది, ఆకలి గురించి. పోనీ జనం అన్న అడుగుతరా అంటే అదీ లేకపాయె.

కా: ఏమిర, మీకు కళ్లు గనపడవా. ఆకలి గురించి సర్కారు జెప్పడం గాదురా. ఆకలి ఉన్నదని మీరు చూసి సర్కారుకు జెప్పాలె గదరా? దేశంలో ఆకలున్నదని మోడీ నీకు ప్రెస్ కాన్ఫరెన్సుజేసి జెప్తడా? మన్ కీ బాత్ ల జెప్తడా? నీ కత గమ్మతుగనే ఉందిరో.

మాడభూషి శ్రీధర్, 1.10.2021

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

2 COMMENTS

  1. ఆడ మోదీ ఏ గాదు. ఈడ సారూ గూడ చెప్తాలేడు గదనే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles