Thursday, May 16, 2024

లక్ష్మణుడు రామానుజుడై జగద్గురువై

మాడభూషి శ్రీధర్

తమిళనాడులో దక్షిణ భారతదేశంలోని శ్రీపెరుంబుదూరు, అనీ భూతపురమనీ, అరుణారణ్యము అనీ అంటారు. శంకరుడు దిగంబరుడై నాట్యం చేస్తూ ఉంటే భూతములు పరిహాసాస్పదంగా నవ్వినారట. శివుడు కోపించి అధోలోకంలోకి వారిని శాపగ్రస్తుల్నిచేసి తోసేసారట. శాపం నుంచి విముక్తి కోసం ఆ భూతములు ఈ అరుణారణ్య క్షేత్రంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మిమ్మల్ని శివుడు అనుగ్రహిస్తాడని వరమిచ్చాడు. ‘‘నేను ఇక్కడ నివసిస్తాను, ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యమైన పురంగా నిర్మించండి’’అని ఆ భూతాలను శ్రీహరి ఆదేశిస్తారు. భూతములు నిర్మించిన పురమంటూ  దీనికి భూతపురం అనే పేరు వచ్చింది.

శ్రీ పెరుంబూదూరు కంచీపురం జిల్లాలో  చెన్నయ్ కి సమీపంలో ఉన్న పురాతన మైన ఆలయం. రామానుజుని అవతార స్థలం. (ఇక్కడ రాజీవ్ గాంధీని టెర్రరిస్ట్ చంపిన స్థలంలోనే స్మారక నిర్మించారు. ఆ ప్రాంతంలోనే రామానుజుని దేవస్థానం స్థలాన్ని కూడా కేటాయించారు) రామానుజులు ప్రధాన ఆలయం ఎదుట విశాలంగా ఉన్న మండపంలో 1017లో జన్మించారు. ఆయన జన్మించిన చిత్రా నక్షత్రాన (ఏప్రిల్ మే నెలల కాలంలో) చిత్తిరై ఉత్సవం చేస్తారు.                                                                                                                                                     

ఆసూరి కేశవసోమయాజి అనే శ్రీవైష్ణవస్వామి. యామునా చార్యుల శిష్యుడు శ్రీశైలపూర్ణుడు (తిరుమలనంబి), వీరి చెల్లెలు కాంతిమతిని ఆయన వివాహం చేసుకున్నారు. స్థిరమైన బుధ్ది, మితభాషణము, నిత్యానుసంధాన లక్షణాలతో కూడిన అత్యంత నిష్ఠాగరిష్ఠులు కేశవ సోమయాజి. నీతిమంతుడు. అసత్యమాడడు. ఆయన నిరంతరం హరి నామస్మరణమే సాగిస్తూ ఉంటారు. కాని ఆ జంట సంతానంలేక పరితపిస్తున్నారు. నోములు వ్రతాలు నిర్వహిస్తున్నారు. జపాలు తపాలు చేస్తున్నారు. పెద్దలు సూచిస్తే చంద్రగ్రహణసమయంలో సముద్ర స్నానం కూడా చేశారు. ఆ తరువాత అనేక దానధర్మాలు చేశారు.

పుత్రకామేష్టి

చెన్నై(మద్రాస్) నగరంలో దివ్యదేశమైన తిరువళ్లికేన్ ఉంది. అక్కడ కైరవిణి పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడ వెలసిన పార్థసారథి పెరుమాళ్ కు పూజలు చేశారు. అక్కడే పుత్రకామేష్ఠి యాగాన్ని కూడా చేసినారు. పార్థుడికి గీత బోధించి జగద్గురువైన పార్థసారథి కరుణతో కేశవసోమయాజి కాంతిమతీ దంపతుల సంతానరూపంలో మరొక జగద్గురువు రాబోతున్న శుభ ఘడియలు అవి.

దశరథుడి తరువాత పుత్రకామేష్ఠి యాగాన్ని కేశవసోమయాజులే చేసినట్టు కనిపిస్తుంది.  పుత్రకామేష్ఠి యాగం తరువాత రాముడు జన్మించినట్టే, కాంతిమతీ కేశవులకు రామానుజుడు పింగళ నామ సంవత్సరం వైశాఖ మాసం శుధ్ద పంచమి, గురువారం కర్కాటక లగ్నం మధ్యాహ్నం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినాడు. అది నవవసంతం. శ్లోకం: మేషార్ద్ర సంభవం, విష్ణోర్దర్శన స్థాపనోత్సుకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే (అర్థం: మేషం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టి, విష్ణువును చేరే మతాన్ని నిర్ధారించిన వాడైన రామానుజుడినే భజిస్తాను)

శ్రీ కృష్ణుడి అవతారం ముగిసి, ద్వాపరయుగం అంతరించింది. కలియుగం ఆరంభమైంది. కలియుగంలో అధర్మం విజృంభిస్తున్నది. పరీక్షిత్తు, జనమేజయుల తరువాత ధర్మపాలన కరువైపోయింది. వేదాలను పరిహసించి వ్యతిరేకించి ధర్మం తప్పి చరించే వితండ వాదాలు, మతాలు పెరిగిపోయాయి. విచ్చలవిడి జీవనం సామాన్యమైంది. నాస్తికుల ఆగడాలకు అంతులేదు. ఆస్తికులు అవమానాలపాలవుతున్నారు. నైతిక విలువలు సన్నగిల్లి కలికాలపు పోకడలు వీరవిహారం చేస్తున్నాయి. శ్రీమన్నారాయణుడు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాడు.

మనకు కనిపించే దృశ్యమానమైన జగత్తు మాత్రమే సర్వం కాదు. ఈ పృథ్వీ ప్రకృతి మండలానికి ఆవల సప్తావరణల మీదట, అప్రాకృతమైన, విలక్షణమైన పరమపావనమైన ప్రదేశం ఒకటుంది.  ఆ దివ్యప్రదేశాన్ని శ్రీవైకుంఠమని అంటారు. అది క్షతిలేని నిత్యవిభూతి.  అక్కడికి చేరిన జీవులకు మళ్లీ పుట్టుక ఉండదు. వారిని ముక్తులని అంటారు. అక్కడ నారాయణుని ప్రేమ వలె విరజానది అనునిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ముక్తజీవి ఆ నదిలోస్నానం చేస్తే ఆత్మకు అంటియున్న సూక్ష్మశరీరపు వాసనలన్నీ తొలగిపోయి దివ్యశరీరం వస్తుంది. అక్కడ ఇరమ్మదమనే సరస్సు, దాని ప్రక్కన అశ్వత్థ (రావి) వృక్షం కూడా ఉన్నాయి.

అక్కడ ముక్తులతో పాటు నిత్యసూరులు ఉంటారు. నిత్యులు (నిత్యసూరులు) అంటే- నిరంతరం నారాయణుని సేవించే అనంతుడనే మహాసర్పము, గరుడుడు, విష్వక్సేనుడు మొదలైన వారు అక్కడ నివసిస్తుంటారు. నారాయణుడు  శయనించినపుడు మెత్తని పరుపుగానూ, కూర్చున్నపుడు  మంచి ఆసనంగానూ,  హరి ప్రతికదలికకు అనుగుణంగా  తనను తాను అనుగుణంగామార్చుకుంటూ  ఉండే ఆ అనంతుడు అత్యంత ప్రియసేవకుడు. అంతులేనంతగా విస్తరించగల శక్తిమంతుడు కనుక ఆమహాసర్పాన్ని అనంతుడని అంటారు. మొట్టమొదటి శేషుడు కనుక ఆదిశేషుడనీ అంటారు. 

త్రిలోకాలలో స్వామిని ఎక్కడికైనా తీసుకుని వెళ్లగల అద్భుతమైన సజీవ వాహనం గరుత్మంతుడు. అపారమైన విష్ణు గణాల సేనలకు సేనానాయకుడు, సేనానాథుడు విష్వక్సేనుడు.  జీవులై సంసారబంధాల్లో చిక్కుకున్నా, భగవంతుడిని ఆరాధించి, హరి దివ్యానుభూతిని అనుభవించి, నారాయణుని అనుగ్రహంతో ముక్తిపొంది పరమపదం చేరి పరంధాముని సేవలో మునిగిపోయే అనేకమంది ముక్తులు వైకుంఠ వాసులు.

చింతాక్రాంతుడైన శ్రీహరి

ఆ వైకుంఠనగరిలో ఏముంటాయో, ఏ విధంగా ఉంటాయో చెప్పడం కష్టం. అదొక ఆనందవనం, ఆనంద నిలయం. అమృత సరస్సులు, మనోహరమైన ఉద్యానవనాలు, కాంతి పుంజాల తోరణాలు, నిర్మలమైన సుగంధ వాయువులు, అపురూపమైన ఫలవృక్షాలు, బంగారు మేడలు, రత్న ఖచిత ప్రాకారాలు, ఆలయాలు మంటపాలు గోపురాలతో అలరారే సువిశాల ప్రదేశం. ఆ వైకుంఠంలో మణిమయమైన వేయి స్తంభాల మంటపంలో దివ్యచందన సుగంధాల మధ్య తనకు పరుపుగా అమరిన అనంతునిపై హరి శయనించి ఉన్నాడు.  ఆ హరి పసుపుపచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు (పీతాంబరుడు), ఓ పక్కన భూదేవి, మరో పక్క శ్రీదేవీ ఉన్నారు. అతను నాలుగు చేతులలో శంఖ చక్ర గదాయుధాలు ధరించి మరో చేత పద్మం పట్టుకుని ఉంటాడని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి.  

ఆనందం తప్పమరేదీ ఉండని ఆ మహాలోకంలో నారాయణుడు ఉన్నా మనసులో విచారం హరి వదనంలో ప్రతిఫలిస్తున్నది. విచారవదనాన్ని గమనించి అనంతుడు. ఏమిటి స్వామీ చింతాక్రాంతులైనారు? అనడిగాడు.

ఈ మానవులకు మంచికోసం ఇచ్చిన శరీరాన్ని బుధ్దిని మంచికి ఉపయోగించడం లేదే, ఇతరుల స్త్రీలను, సంపదలను హరించడానికి వినియోగిస్తున్నారే, పరమ స్వార్థపరులై పరమపదాన్నే మరిచారే అని హరి ఆలోచిస్తున్నాడు.  ఆ విషయమే అనంతుడికి వివరించారు.

హరి:దేహమే ఆత్మఅనుకునే అజ్ఞానులకు,  బుద్ధి వక్రీకరించి దుర్మార్గంలో జీవించే మూఢులకు జ్ఞానోదయం కలించడం ఎలా అని మధనపడుతున్నాను.

అనంత:సంభవామియుగేయుగే అంటూ ధర్మసంస్థాపనకు సంభవిస్తారు కదా స్వామీ, మళ్లీ అవతరించే సమయం ఆసన్నమయినట్టున్నది కదా

హరి: ఈసారి నేను కాదు, నీవు పుడమిలో అవతరించాలి. ఓ రెండొందల సంవత్సరాలు జీవులను ఉద్ధరించి మరలి రావాలి.

అనంత: స్వామీ…మిమ్మల్ని విడిచి రెండు శతాబ్దాలా? అయినే నేనేం చేయగలను? రామావతారంలో లక్ష్మణుడిగా మీ వెంటే ఉన్నాను. మీరు శ్రీకృష్ణుడైనపుడు బలరాముడిగా కాపాడుకున్నాను. మీరు లేకుండా నేను భూమిపై నిలువలేను. మీరు లేకుండా మీవలె మహాయుద్ధాలు చేయగలనా?  మీరు శంఖ చక్రగదాశార్ఞ ధరులు. నాకా ఏ ఆయుధాలూ లేవు.

హరి:అనంతా, ఇప్పుడు యుద్ధాలతో పనిలేదు. ఆయుధాల అవసరమే లేదు. నీవు వేనోళ్లతో విజ్ఞానం పంచాలి. నీ వేయిపడగలతో ఆధ్యాత్మిక జ్ఞాన కాంతులు విరజిమ్మాలి, వైకుంఠానికి నిచ్చెనలు వేయాలి.  పాపాత్ములను కడిగి పరమాత్మునివైపు నడిపించాలి. నీవే ఆచార్యుడివై వెళ్లాలి. బోధకుడవై సాధించాలి. నీకు జ్ఞానమే ఆయుధం. జీవులను పంచ సంస్కారములతో సంస్కరించు నాయనా. నారాయణుడికన్న గురువే గొప్పయని నీవు జీవించి చూపాలి. యాగాలు చేయాలని, కఠినమైన తపస్సులు చేయాలని కష్టాలు పెట్టకూడదు. భూరి దానాలు చేయాలనే సంక్లిష్ఠమైన నిర్బంధాలు, బాధలు ఏమీ లేకుండా శరణుతో సులభమైన తరుణోపాయములు నీవు చెప్పవలసి ఉంటుంది. ఆచార్యుని సేవతోనే జ్ఞాన సముపార్జనతోనే హరి లభిస్తాడని నీవు వివరించాల్సి ఉంటుంది. నా నిత్యవిభూతికి నీవెవరిని పంపినా కాదనను. నన్ను కాదని నిన్నాశ్రయించినా నాకు ఆనందమే. బద్దుడైన జీవిని బాగుచేయడానికి నీ మాట ఏదయినా నామాటే. నిన్ను కాదని నేనెవరకీ మోక్షమీయను, నీకిష్ఠుడే నాకిష్ఠుడు, నీ మాటే నామాట, నీమతమే నా మతము, నీ మంత్రమే నా మంత్రము, నీ ధ్యానమే నాధ్యానము. నీకు నాకు మధ్య భేధమే లేదు. నిన్ను ఆశ్రయించిన వారి పక్షాన నీవు శరణాగతి చేసినా నాకు సమ్మతమే. నీవారు నావారనే భేదం చూపను. భవబంధాలలో చిక్కుకున్న ఈ బద్దుడు ఏ విధంగానైనా బాగుపడితే ఇక నాకు కావలసిందేముంది?  అని నారాయణుడు వివరించాడు.

ఇది చాలా విశేషం. మోక్షాధికార ముద్రను హరి అనంతుడికి ఇచ్చారన్నమాట. అంటే అనంతుడి ఆజ్ఞలేకుండా మోక్షం ఎవరికీ దొరకదు. దీన్నిఉభయ విభూతి నిర్వహణాధికారం అంటారు.  విభూతి ద్వయాధిపత్యంతో రామానుజుడై ఆదిశేషుడు అవతరించడానికి హరి ఆదేశించాడు.

హరి ఆజ్ఞను అనంతుడు వేయిపడగలు వంచి శిరసావహించాడు.

Statue Of Equality: రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం  చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి? - BBC News తెలుగుకుమారుడు ఉదయించాడని కేశవ సోమయాజి ఆనందించి భూతపురములో ఇంటింటికీ చెరుకు ముక్కలు పంపించినాడు. తిరుమలలో నున్న తన బావమరిది శ్రీ శైల పూర్ణులకు (పెరియ తిరుమలై నంబి) పుత్రోదయ శుభవార్త పంపినాడు. మేనల్లుడిని పరికించాడు. అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు…ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం. ఈతనెవరు? నమ్మాళ్వార్ చెప్పిన భవిష్యదాచార్యుడు ఇతడేనా? కన్నులు అశ్రుపూరితములైనాయి.

లక్ష్మణుడి జన్మించిన లగ్నంలో పుట్టినవాడు కనుక లక్ష్మణుడనీ, రామానుజడనీ (రాముని తమ్ముడు) నామకరణం చేశారు.  అదే సమయంలో మధురమంగళంలోని కాంతిమతి చెల్లెలు దీప్తిమతి, కమలనయనభట్టులకు పుత్రుడు జన్మించాడు. అతనికి మేనమామ గోవిందుడని నామకరణం చేశారు.

ఆ తరువాత లక్ష్మణుడు రామానుజుడై జగద్గురువై ఈ ప్రపంచానికి ఆచార్యుడైనాడు.

(

  22.4.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles