Friday, April 26, 2024

ప్రజాసంఘాలపై ఉక్కుపాదం అప్రజాస్వామికం

హైదరాబాద్: తెలంగాణలో 16 ప్రజాసంస్థలపైన ఒక ఏడాది పాటు నిషేధం విధించడం అప్రజాస్వామిక చర్య. ఇది అవనసరంగా ప్రజలను పురిగొల్పే చర్య. పౌరహక్కులను ఉద్యమకారుడిగా సమర్థించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పౌరహక్కుల సంస్థలను కూడా నిషేధిత పదహారు సంస్థల జాబితాలో చేర్చడం వింతగా ఉన్నది.

దాదాపుగా అన్నీ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచినవే

తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఈ 16 ప్రజాసంఘాలు మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంగ పరిధిలో ఉంటూ ప్రజలకోసం, ప్రజల తరఫున పనిచేస్తున్నవే. దాదాపు ఆ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కి బాసటగా నిలిచినవే. నిజానికి కొంతకాలంగా తెలంగాణలో మావోయిస్టు కార్యక్రమాలు లేనేలేవు. మావోయిస్టు సంస్థలలో యువతీయువకులు చేరడం మానివేశారు. రాష్ట్రం ఆ విషయంలో ప్రశాంతంగా ఉంది. అటువంటి తరుణంలో ఇన్ని ప్రజాసంఘాలపైన విరుచుకుపడటం, నిషేధం విధించడం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రతి ప్రజాసంఘానికి నిర్దిష్టమైన లక్ష్యాలూ, ఆశయాలూ ఉన్నాయి. వాటి పనులు అవి చేసుకుపోతున్నాయి. ఈ సంస్థల కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ఇబ్బంది కలిగిన సందర్భం లేదు. కమిటీ ఆఫ్ కన్సర్న్డ్ సిటిజన్స్ సమావేశంలో కేసీఆర్ స్వయంగా పాల్గొని మాట్లాడారు. పౌరహక్కుల సంఘం సేవలను ప్రశంసించారు. 2005లో విరసం సంస్థను నిషేధించినప్పుడు అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని ప్రకటించారు. తానే పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉంటానని కూడా అన్నారు.

ఏ ప్రజాస్వామ్య హక్కులు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగడానికి దోహదం చేశాయో వాటిని కాలరాయడానికి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 73వ నంబర్ జీవో ప్రయత్నిస్తున్నది. ఈ పదహారు సంస్థల వల్ల తెలంగాణలో ప్రజాభద్రతకు వాటిల్లిన ముప్పు లేదు.  తెలంగాణ ప్రజలు అమితంగా అభిమానించే ప్రశ్నించే తత్త్వమే లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి లేదు. మార్చి 30వ తేదీన జారీ చేసిన ఈ జీవోను మూడు వారాల పాటు గోప్యంగా ఉంచి ఏప్రిల్ 23న పత్రికలకు విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటో ఏ మాత్రం అర్థం కావడం లేదు.

నేదురుమల్లినాటి చట్టం

రాజీవ్ గాంధీ హత్య దరిమిలా ఆయన ప్రథమ వర్థంతి రోజున అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఒక బహిరంగ సభలో పీపుల్స్ వార్ పైనా, ఇతర ఆరు సంస్థలపైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం విధించేందుకు ప్రాతిపదికగా చూపించిన రెండు చట్టాలనూ (క్రిమినల్ అమెండ్ మెంట్ యాక్ట్, 1908, ఫసలీ 1348 ప్రజారక్షణ చట్టం) సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టివేసిందని ప్రముఖ పౌరహక్కుల నాయకుడు కన్నబిరాన్ వ్యాఖ్యానించారు. అప్పుడు ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ ను  తీసుకొని వచ్చింది. 1992 మే 1 నుంచి ఈ నిషేధం అమలులో ఉన్నది కానీ ఎవ్వరూ దీనిని పట్టించుకోలేదు. ప్రభుత్వం కూడా చూసీచూడనట్టగానే ఉంది. ఈ నిషేధం అమలులో ఉండగానే నక్సలైట్ పార్టీ నాయకులతో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఈ నిషేదం అమలులో ఉండగానే ఈ చర్చలకు ప్రాతిపదికగా పొత్తూరి వెంకటేశ్వరరావు, ఇతర కన్సర్న్డ్ కమిటీ సభ్యుల నల్లమల అడవులకు వెళ్ళి నక్సలైట్ నాయకులతో సమాలోచనలు జరిపారు.

రాజ్యాంగం 19వ అధికరణ కింద భావప్రకటన స్వేచ్ఛ, సంఘాలు నిర్మించుకునే స్వేచ్చ, సభలు నిర్వహించుకునే స్వేచ్ఛ పౌరులకు ప్రాథమిక హక్కు కింద దఖలు పడినాయి. ఆత్యయిక పరిస్థితి వంటి అసాధారణ వాతావరణంలోనే ఈ స్వేచ్ఛపైన పరిమితులు విధించారు. ప్రభుత్వం నిషేధించిన పదహారు సంఘాలలో నాలుగు విద్యార్థి సంఘాలు. రైతాంగ సంస్థ, మహిళా సంఘం, అసంఘటిత కార్మిక సంఘం, రెండు తెలంగాణ ఉద్యమ సంస్థలు, ఒక కళా సంస్థ, ఒక ఆదివాసీ సంస్థ ఉన్నాయి. రాజ్యహింసలో అసువులుబాసిన తమ బంధుమిత్రులను స్మరించుకోవడానికి పెట్టుకున్న ఒక సంస్థను కూడా నిషేధించారు. హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే సంస్థ కూడా నిషేధానికి గురైన సంస్థలలో ఉన్నది.

లేనిపోని ఆరోపణలు

పట్టణ గెరిల్లా కార్యక్రమాలకు దోహదం చేస్తున్నారనీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చర్యలను విమర్శిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారనీ, మావోయిస్టుల మార్గదర్శనంతో బీడు భూముల ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారనీ, వరవరరావు, సాయిబాబా, రోనా విల్సన్ వంటి బందీల విడుదల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకూ, సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారనీ , కొందరు మావోయిస్టుల అజ్ఞాత కార్యకర్తలుగా మారారనీ ఆరోపణలతో ఈ కారణాల వల్ల సదరు జీవోను విడుదల చేయవలసి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. వీటిలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ లేకుండా చేయడానికి ఉద్దేశించిన కారణాలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ పరోక్షంగా కేంద్రానికి మద్దతుగా ఈ జీవో తెచ్చినట్టు భావించవలసి వస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి తోడ్పడిన సంఘాలనూ, తెలంగాణ ఉద్యమానికి పాటల సహకారం అందించిన కళా సంఘాన్నీ నిషేధించడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే, తన ప్రభుత్వాన్ని విమర్శించేవారి నోరు మూయించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ జీవోను వినియోగించుకోవచ్చ. ఈ జీవో రాకముందే ప్రభుత్వం దగ్గర విమర్శకుల నోళ్ళు మూయించేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. అంతగా ప్రయోజనం లేని ఈ చట్టాలను తెచ్చి రాజ్యాంగపరిధిలో పని చేస్తున్న సంఘాలపైన ప్రతాపం చూపించడం వెనుక ఉద్దేశం ఏమిటి? తెలంగాణలో ప్రశ్నించేవారిని అనుమతించబోమనీ, ఏ చట్టం కావాలనుకుంటే ఆ చట్టాన్ని అమలు చేయగలమని, ఏ సంస్థను కావాలనుకుంటే ఆ సంస్థను నిషేధించగలమని ప్రపంచానికి చాటడమేనా? తెలంగాణలో ప్రజలు చేవచచ్చినవారని నిరూపించదలచుకున్నారా? అధికారం ఒక వ్యక్తిలో ఇంత మార్పు తెస్తుందా? ప్రజాస్వామ్య స్ఫూర్తి కారణంగానే ఉద్యమం నిర్మించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి అదే స్ఫూర్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించడం సమంజసమా? తనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించని సంస్థలపైన నిషేధం విధించడం ఎవరిని మెప్పించేందుకో తెలియదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles